Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

"నీకెందుకే ముసలీ! ఇంతవరకూ నోరెత్తనిదానివి ఇప్పుడు నా పేరుందుకే చెప్పావు? ఈయనెవరో తెలీదు. ముక్కు మొహం తెలీని పరాయివాళ్ళకి ఇలా ఊరూ, పేరూ చెప్పెయ్యడమేనా?!" పక్కనే కూర్చున్న ఛాయాదేవి మీద విరుచుకుపడింది నూకరత్నం.

"అయ్యయ్యో! మిమ్మల్నెవరూ ఎత్తుకుపోరులెండి నూకరత్నం గారూ! పేరు తెలిస్తే ఏయ్... ఒయ్... ఒరేయ్... ఒసేయ్ అని పిలవక్కర్లేకుండా 'నూకరత్నం' గారూ అని పిలవచ్చని అడిగాను. అంతే" చేతులు రెండు అమ్మలక్కలా ఊపుతూ 'ఆడంగి'లా నటిస్తూ అన్నాడు ఏకాంబరం.

"ఏజెంటు... ఏజెంటులా ఉండాలి. ఏజ్ బార్ అయిన ముసలాడిలా మాట్లాడకండి! నూకరత్నం ఏంటి? నూకరత్నం. కుర్రాడిలా 'రత్నం' అనలేరా? మీ పేరు చూడండి! ఏకాంబర్... ఏం బావుంది?" అంది రుసరుసగా రత్నం.

ఆ అమ్మాయి అలా అనేసరికి ఏకాంబరానికి ఏనుగెక్కినంత సంబరపడిపోయాడు. తనపేరు ఎలా ఉంటే తనకేంటీ?! తనేమైనా ఆమెకి కావలసినవాడా?! పేరు బాగాలేదంది అంటే... తను బాగా... హుందాగా ఉన్నాడనే కదా?! ఆ ఆలోచన మనసులో కలిగేసరికి ఏకాంబర్ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.

"చెప్పండి... చెప్పండి ఎలా ఉంటే బావుంటుంది?" ఆనందంగా అన్నాడు ఏకాంబర్.

"దాని పిచ్చికబుర్లకేం నాయనా. పదండి! పదండి అక్కడ టెంట్ లో భోజనాలు ప్రారంభమయిపోయాయి. మీరిద్దరూ ఇక్కడ ఈ ముసల్దాన్ని ఒదిలేసి సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు" విసుగ్గా లేస్తూ అంది ఛాయాదేవి.

"ఉండవే ముసలీ! మనిషి సహాయం లేంది లేవలేవు. కూర్చోలేవు ఈ 'అంకుల్' గార్ని తోడు తీసుకువెళ్ళు. దగ్గరుండి తినిపిస్తారు" ముసిముసిగా నవ్వుతూ అక్కడనుండి రివ్వురివ్వున తుర్రుమంది రత్నం.

"పిల్లలో పల్లెటూరి వాసన అమ్మాయకత్వం, చలాకీతనం కొట్టొచ్చినట్టూ కనిపిస్తున్నాయి. అందానికి అందం... అంతకు మించిన పెంకితనం చాలా బాగా నచ్చాయి ఏకాంబరానికి. నగరం వాసన... తెలివి అబ్బితే చురుకుదనానికి వన్నె చేకూరుతుంది! అనుకుంటూ ఛాయాదేవి చెయ్యి పట్టుకు నడిపిస్తూ భోజనాల దగ్గరకు తీసుకువెళ్ళాడు ఏకాంబర్.

ఏకాంబర్ అనుకున్నట్టే దశదినకర్మ అయిన మర్నాడు ఏకాంబరాన్ని పిలిచి తన తండ్రి తాలూకా ఇన్స్యూరెన్స్ పాలసీలన్నీ ఇచ్చాడు చనిపోయినతని పెద్ద కొడుకు. ఆ సమయంలో ఇంటిల్లిపాదీ ఏకాంబరం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

"మా నాన్నగారికి రావలసిన పాలసీల సొమ్ము అంతా మీరు ఎంత వేగంగా తెప్పిస్తే ఆ వెంటనే నేనూ, మా తమ్ముడూ మా పేర్ల మీద పాలసీ కడతాం. అంతేకాదు. మా అమ్మగారి పేరు మీద మా భార్యల పేరు మీద కూడా ఇన్స్యూరెన్స్ పాలసీలు కడతాం. ఇక మీదే ఆలస్యం" అన్నాడు ఏకాంబర్ భుజాల మీద చరుస్తూ పెద్ద కొడుకు. దానికి అవునంటూ ఇంటిల్లిపాదీ ఏకాంబరానికి హామీ ఇచ్చారు.

ఆ వారం తిరక్కుండానే చనిపోయినతనికి ఉన్న పాలసీలన్నీ 'డెత్ క్లైమ్' లు పెట్టి ఆగమేఘాల మీద చెక్కులు కూడా దగ్గరుండి రాయించి తీసుకువచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టాడు ఏకాంబరం.

ఏకాంబరం ఊహించలేనంతగా వాళ్ళు అందరూ సంబరపడిపోయారు. ఏకాంబరం చేసిన మేలు మరువకుండా ఖరీదయిన బట్టలు తీసి చేతిలో పెట్టి అనుకున్నట్టే వాళ్ళందరూ 'పాలసీలు' రాయించారు. అంతేకాకుండా వాళ్ళ ఇంటి ప్రక్క వాళ్ళ అడ్రస్ లు, బంధువుల అడ్రస్ లు ఇచ్చి వాళ్ళు కూడా ఇన్స్యూరెన్స్ కడతామన్నారని తప్పకుండా వెళ్ళమని ఏకాంబరానికి చెప్పారు.

ఏకాంబర్ కి పట్టలేనంత ఆనందం కలిగింది. ఆ క్షణం 'సాయిబాబా' ని గుండెల్లో స్మరించుకున్నాడు. అందుకే బాబా అన్నాడనుకున్నాడు. 'నువ్వు నన్ను చూడు. నిన్ను నేను చూస్తాను" అని. ఆయన అన్న జీవన సత్యం ఇదే కదా అనుకుని సంబరపడిపోయాడు ఏకాంబర్. ఆపదలో ఉన్నవారికి ఆశించకుండా సహాయపడితే ఎంత మేలు జరుగుతుందో ఏకాంబరానికి ముందే తెలుసు.

ఆ మధ్యాహ్నం వరకూ వాళ్ళింట్లోనే గడిపి మధ్యాహ్నం భోజనం చేసాక గాని వాళ్ళు వెల్లనివ్వలేదు.

అయితే, అక్కడున్న ప్రతిక్షణం ఏకాంబర్ మనసు, మెదడు అంతా నూకరత్నమే ఆక్రమించేసింది. ఆమె కోసం అనుక్షణం అతని కళ్ళు రెండూ పరితపిస్తూ అన్వేషిస్తూనే ఉండేవి. కానీ, నూకరత్నం కోసం అడగడానికి, ఆరా తియ్యడానికి సంస్కారం అడ్డొచ్చి మౌనంగానే ఉండిపోయాడు ఏకాంబర్.

'నూకరత్నం... ఇప్పుడెక్కడుందో' అనుకుంటూ మనసులోనే ఆమె కోసం పరితపించిపోయాడు ఏకాంబరం.

***

ఓ రోజు -
ఎప్పటిలాగే పాలసీల అన్వేషణకు బయలుదేరాడు ఏకాంబర్. ఉదయం లేస్తూనే ఆ రోజు కలవాల్సిన వాళ్ళ జాబితా తయారు చేసుకుని ఊరు మీదకు బయలుదేరడం అలవాటు. సింహాచలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాలపట్నం బయలుదేరాడు ఏకాంబరం.

రాజమండ్రి సిల్క్ హౌస్ యజమాని ఏకాంబరానికి మంచి మిత్రుడు నమ్మకమైన పాలసీదారుడు. ఎప్పుడు ఏకాంబరం దిగాలుగా ఉన్నా ఒకటో రెండో పాలసీలు రాయించి హుషారు పరుస్తుంటాడు. తను రాయకపోయినా, తన మిత్రులకయినా చెప్పి రాయించి ఏకాంబరాన్ని సంతోషపెడుతూ ఉంటాడు ఆయన.

ఆ బట్టల షాపులో పనిచేస్తున్న పని వాళ్ళందరికీ రాజమండ్రి సిల్క్ హౌస్ యజమానే వాళ్ళ పేర పాలసీలు కట్టి వాళ్ళ జీతాల్లో కొంత, తను కొంత కలిపి పాలసీ మొత్తం చెల్లిస్తుంటాడు. అలాగే, గోపాలపట్నంలో ఉన్న షాపుల వాళ్ళందరిచేత కట్టించాడతను.

ఎవరో కొత్తగా ఆరుగురు అమ్మాయిల్ని ఉద్యోగంలో చేర్చుకున్నానని వారికి ఇన్స్యూరెన్స్ పాలసీలు కట్టాలని రమ్మని పిలిచాడు షాపు యజమాని.

ఉదయాన్నే ఆదరాబాదరాగా బయలుదేరాడు ఏకాంబరం.

తండ్రి పీతాంబరం పిలుస్తున్నా పలక్కుండా బైక్ స్టార్ట్ చేసాడు. మరోప్రక్క నుండి తల్లి కేకవేస్తున్నా పట్టించుకోలేదు. ఏకాంబరం ఏదైనా పనిలో పడితే మరో పని, పిలుపు ఏదీ దరి చేరనివ్వడు.

తమని కూడా పట్టించుకోకుండా పనిలో పడ్డ కొడుకుని చూసి ఆనందపడ్డాడు పీతాంబరం. ఎందుకూ పనికిరాడనుకున్న బడుద్దాయి ఇప్పుడు గడుగ్గాయిగా మారిపోయినందుకు సంబరపడిపోయాడు.

ఉదయం లేస్తూనే స్నానం కూడా చెయ్యకుండా మొహం కడుక్కుని, కనీసం 'టిఫిన్' కూడా తినకుండా... పిలుస్తున్నా వినకుండా పారిపోతున్న చిన్న కొడుకుని చూసి తల్లడిల్లిపోయింది తల్లి మనసు. ఎప్పుడూ అమ్మా ఇది పెట్టు, అమ్మా అది పెట్టు అంటూ వంట గదిలోనే నచ్చాడిన చిన్న కొడుకు ఈ రోజు తిండి ధ్యాసే మర్చిపోయి పారిపోతున్నాడంటే కారణం ఈయనే' అనుకుంటూ కళ్ళనీళ్ళు దించుకుంది పర్వతాలు.

ఏకాంబరం తండ్రి గోపాలపట్నం సెంటర్ లోనే పెద్ద డిపార్ట్ మెంటల్ స్టోర్ నడుపుతున్నాడు. ఒకవేళ ఏకాంబరం కూడా అటువైపు వెళ్తున్నట్లైతే తనని షాపు దగ్గర దించమని అడుగుదాం అనుకున్నాడు పీతాంబరం. కానీ, ఏకాంబరం ఇదేదీ పట్టించుకోలేదు. పరధ్యానంలో పరుగందుకున్నాడు.

కళ్ళముందు అయిదు పాలసీలు... కమీషన్... ఆలస్యమైతే పోతాయేమోనన్నంత కంగారుగా బయలుదేరాడు. అట్నుంచి అటు మిగతా షాపులన్నీ కవర్ చేసుకురావాలన్నది ఏకాంబరం ఆలోచన.

బైక్ మీద నేరుగా రాజమండ్రి సిల్క్ హౌస్ కి చేరుకున్నాడు ఏకాంబరం. అప్పుడే షాపు షట్టర్లు తెరుస్తున్నారు. షాపు యజమాని బట్టల షాపు లోపల అన్ని మూలలా ఉప్పు జల్లుతూ, సాంబ్రాణి పొగ వేస్తూ దేవుడ్ని ప్రార్ధించుకుంటున్నాడు.

ఏకాంబరానికి సిగ్గుగా అనిపించింది. 'లేడికి లేచిందే ప్రయాణం' అన్నట్టూ ఉదయం కళ్ళు నులుముకుంటూనే మొహం కడుక్కుని స్నానం చెయ్యకుండా పరిగెట్టుకు వచ్చేసాడు. ఇంకా ఎవరూ రాలేదు. ఏం చేద్దాం' అనుకుంటూ షాపు బయటే అటూ ఇటూ తచ్చాడుతూ నిలబడ్డాడు ఏకాంబర్.

"రా భయ్యా రా! నీలా ఉండాలయ్యా ఎవరైనా! పనివాళ్ళు వచ్చేవేళ అయ్యింది. నేను ముందుగా వచ్చి పూజా గట్రా చెయ్యాలి కదా!" అన్నాడు యజమాని ఏకాంబరాన్ని లోపలికి పిలుస్తూ.

"లేదన్నా! నీ కార్యక్రమాలు కానివ్వండి. నేను బయటే ఉంటాను' అన్నాడు ఏకాంబరం.

"ఏదన్నా తిన్నావా లేదా భయ్యా?" అడిగాడు షాపు ఓనరు.

"లేదు. లేదు భయ్యా. మీ పని పూర్తయ్యాక తినొచ్చని వచ్చేసా" నెమ్మదిగా చెప్పాడు ఏకాంబర్.

"మా వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకో అరగంట పట్టచ్చు. నువ్వెళ్ళి ఈ పక్కనే ఉన్న హొటల్ లో కాస్త నాస్తా చేసిరా భయ్యా!" అన్నాడు ఓనరు.

"అలాగే భయ్యా!" అంటూ మరి మారుమాట్లాడకుండా బట్టల షాపు మెట్లు దిగి దానికి కొద్ది దూరంలోనే ఉన్న అన్నపూర్ణా హొటల్ కి వెళ్ళాడు ఏకాంబర్.

'అమ్మ టిఫిన్ కోసమే పిలిచినట్టుంది. నాన్న కూడా టిఫిన్ చేయకుండా వెళ్తున్నాననే పిలిచి ఉంటాడు. తనే పాలసీలు ఎక్కడ పోతాయేమోనని ఆతృతలో వచ్చేసాడు. అయినా, ఎప్పుడూ తనకి నెలకి ఒక్క పాలసీ అయినా ఇప్పించే 'మిత్రుడు' తనకి కాక వేరే ఎవరికి ఇచ్చేస్తాడు. తనలోని ఆతృత... ఆశ ఆలోచనలని ప్రక్కదోవ పట్టించేసాయి' అనుకుంటూ టిఫిన్ చేసాడు ఏకాంబర్.

పావుగంటలో టిఫిన్ చేసేసి బట్టల షాపు దగ్గరకు వెళ్ళాడు. దూరం నుండి షాపులోకి చూసి మరో పావుగంట రోడ్డు మీదే గడిపేసాడు. అరగంట దాటాక నెమ్మదిగా షాపు దగ్గరకు వెళ్ళాడు ఏకాంబర్.

షాపంతా పనివాళ్ళతో కళకళలాడుతోంది. షాపు యజమాని కేష్ కౌంటర్ దగ్గర కూర్చుని చిద్విలాసంగా నవ్వుతూ ఏకాంబరాన్ని లోపలకు ఆహ్వానించాడు.

ఏకాంబర్ బట్టలు కొనడానికి వచ్చాడనుకుని కొత్తగా చేరిన పనివాళ్ళలో ఇద్దరు, ముగ్గురు గబగబా ఏకాంబరం దగ్గరకొచ్చి 'రండి సార్! రండి మీకెలాంటి బట్టలు కావాలి. చీరలా, ఫేంట్లూ, షర్ట్ లా" అంటూ హడావిడి చేసారు.

"ఇతను తన మిత్రుడే. కస్టమర్ కాదు" అంటూ ఏకాంబరాన్ని ఓమూలనున్న బల్లమీద కూర్చోమని షాపులో కొత్తగా చేరిన పనివాళ్ళను ఆరుగుర్ని ఏకాంబరం దగ్గరకు పిలిచాడు షాపు ఓనరు.

తన మెళ్ళో ఉన్న బ్యాగ్ తీసి అందులో ఉన్న పాలసీ ప్రపోజల్ ఫారాలు తీస్తూ తన ముందుకొచ్చి నిలబడిన వాళ్ళని ఎవరినీ గమనించలేదు ఏకాంబరం. సంచిలో ఉన్న సరంజామా అంతా తీసి బైట పెట్టుకుంటూ తల ఎత్తి తన ముందున్న వాళ్ళని చూసి ఒక్కసారే అదిరిపడ్డాడు ఏకాంబర్.

ఎదురుగా చేతులు కట్టుకుని వినమ్రంగా నిలబడ్డ ఆరుగురిలో నూకరత్నం తల దించుకుని నిలబడి ఉంది.

నూకరత్నం!

తను నెలరోజులుగా నిద్రాహారాలు లేనివాడిలా నీరసించిపోయి కళ్ళు కాయలు కాచేలా తనలో తనే వెదుక్కుంటూ తిరుగుతున్న తన అభిమాన సుందరి నూకరత్నం.

నూకరత్నం కళ్ళముందే నిలబడి ఉండేసరికి ఒక్కసారే తత్తరపాటుతో... తన కళ్ళను తనే నమ్మలేనంతగా అవాక్కయి చూస్తుండిపోయాడు ఏకాంబర్.

"భయ్యా! వాళ్ళే కొత్తగా చేరినవాళ్ళు. సంతకాలు తీసుకో. నీకు సర్టిఫికెట్లు, ఫ్రూఫ్ లు ఏవికావాలో చెప్తే రేపు తెచ్చి ఇస్తారు. డబ్బు నేను నీకు ఇస్తాను" అంటూనే షాపులోకి వచ్చిన కస్టమర్ ని పలకరిస్తూ ఆహ్వానిస్తున్నాడు షాపు యజమాని.

"అలాగే అన్నా! మీరు రండి..! ఈ ప్రపోజల్ ఫారాల మీద సంతకాలు చేసి ఇవ్వండి" అంటూ ఆరుగురికీ తలో ఒక ఫారం ఇచ్చాడు ఏకాంబర్. తన ఎదురుగా దిష్టిబొమ్మలా అచేతనంగా నిలబడ్డ నూకరత్నాన్ని ఎలా పలకరించాలో అర్ధం కాలేదు ఏకాంబరానికి. చిన్నగా నవ్వుతూ ఆమె చేతికి 'ప్రఫొజల్ ఫారం' ఇచ్చాడు.

నూకరత్నం మారుమాట్లాడకుండా ఏకాంబరం చేతిలో ఫారం తీసుకుని ప్రక్కకు వెళ్ళి ఎక్కడెక్కడ సంతకాలు చెయ్యాలో గబగబా చేసేసింది. ముందు రోజు రాత్రే షాపు యజమాని అందరికీ చెప్పాడు. అందరి పేర ఇన్స్యూరెన్స్ కడతానని. అందులో సగం మీరు, సగం నేను కలిపి ప్రీమియం భరించాలని చెప్పాడు. అందుకే అందరూ మారుమాట్లాడకుండా సంతకాలు చేసి ఏకాంబరం చేతికి ఫారాలు అందించారు.

అందరినీ రెండేసి పాస్ పోర్టు సైజు ఫోటోలతో పాటు వయసు, అడ్రస్ ధృవీకరించే పత్రాలు తెచ్చి షాపు ఓనర్ చేతికి ఇస్తే రేపు వచ్చి తీసుకుంటానని చెప్పాడు ఏకాంబరం. అందరి వివరాలు తన డైరీలో పేరు పేరునా అడిగి రాసుకున్నాడు. తీరిగ్గా ఇంటికెళ్ళి ప్రపోజల్ నింపుకోవచ్చనుకుంటూ.

అందరూ తలలూపి తిరిగి ఎవరి కౌంటర్ దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోయారు. నూకరత్నం నేరుగా చీరలు ఉండే కౌంటర్ దగ్గరకు వెళ్ళి నిలబడి ఓరకంట ఏకాంబరాన్నే గమనిస్తోంది.

షాపులో చేరి రెండు రోజులు కూడా కాలేదు. భయం భయంగా బెరుకు బెరుకుగా ఉంది. షాపు ఓనర్ కి బాగా కావలసినవాడు 'ఏకాంబర్' అని తెలియగానే గుండెల్లో  ఏదో తెలియని భరోసా, నమ్మకం కలుగుతున్నాయి నూకరత్నానికి.

అమ్మని, చెల్లెళ్ళను పోషించుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం తప్పలేదు. ఉన్న ఊర్లో గడవక మేనమామ ఆసరా దొరుకుతుందేమోనని వచ్చేసరికి అతను హఠాత్తుగా చనిపోయేసరికి షాకయిపోయింది నూకరత్నం.

ఎందరి కాళ్ళో పట్టుకుని వారం రోజులు తిరిగితే ఇక్కడ ఈ బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా ఉద్యోగం దొరికింది! మనసులోనే అనుకుంటూ ఏకాంబరాన్ని గమనిస్తోంది నూకరత్నం.

'తెలిసిన వ్యక్తి తారసపడ్డాడు. ఇక ఇక్కడ తన ఉద్యోగానికి ఎలాంటి డోకా లేదు. అమ్మని, చెల్లెళ్ళని పోషించుకోవడానికి ఎలాంటి ఆటంకమూ ఉండదు' అనుకుంది నూకరత్నం.

"రేపు మధ్యాహ్నం వస్తాను భయ్యా. భోజనానికి నువ్వు ఇంటికి వెళ్లేముందే వస్తాను" అంటూ అక్కడి నుండి బయటకు వస్తూ ఓరకంట నూకరత్నాన్ని చూసాడు ఏకాంబరం.

నూకరత్నం కూడా 'ఏకాంబరం' కదలికల్ని గమనిస్తూనే ఉంది. ఆమె కూడా తనని గమనించడం చూసాడు ఏకాంబరం. కానీ, ఏం మాట్లాడలేదు. షాపులో సేల్స్ గర్ల్స్ ని సొంత చెల్లెళ్ళలా చూస్తాడు షాపు ఓనరు. ఎవరైనా పని లేకుండా సొల్లు కబుర్లాడితే వూరుకోడు. అలాంటి వాడ్ని ఆ మర్నాడే పనిలోనుండి తీసేస్తాడు. అమ్మాయిలైనా సరే ఊరికే పళ్ళికిలిస్తూ బాతాఖానీ కొడితే భరించలేడు అతను. 'పోనీలే భయ్యా! ఒక తప్పు కాయమన్నా కాయడు. ఎదిగే మొక్క ఆకుకు పురుగు పడితే పోనీలే అంటే మొక్క నాశనం అవుతుంది కదా భయ్యా! ఇలా వదిలేస్తే ఒక్కరి వలన మిగతా అందరూ భ్రష్టుపడతారు. పనినే దైవంగా భావించే నీలాంటివాళ్ళు నాకందుకే నచ్చుతారు అంటూ చెప్పేవాడు అతను.

అందుకే ఏకాంబరం తన ఎదురుగా నిలబడ్డ నూకరత్నాన్ని చూసి కూడా మాట కలపలేకపోయాడు. నవ్వుతూ పలకరించలేకపోయాడు. ఎవరో తెలీని వ్యక్తిలా ఆమె వివరాలు అడిగి రాసుకున్నాడు. అంతే!

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college drop out gadi prema katha