Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
o college drop out gadi prema katha

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

బిందెని నీటిలో బోర్లించి, దానిపై ఛాతీ ఆనించి, తేలుతూ, కాళ్లు డబ... డబా కొడుతూ ముందుకు వెళ్ళేవాడు. బిందెని నీళ్ళల్లో బోర్లిస్తే, నీళ్ళు లోపలికి వెళ్లవు. బిందె లోపల శూన్యం ఏర్పడి, బిందె పైకి తేలుతుంది. అయితే, ఎప్పుడైనా బిందెని కొంచెం ఏటవాలుగా పట్టుకుంటే మాత్రం, ఖాళీ ఏర్పడి, నీళ్లు లోపలికి పోతాయి.

బిందెతో ఈత నేర్చుకునేటప్పుడు నడుంలోతు నీళ్లలోనే సాధన చేసేవాడు కిట్టు.

ఎందుకంటే... లోతుకు వెళ్లినప్పుడు పొరపాటున బిందె ఏటవాలుగా వస్తే, నీళ్లు బిందెలోకి వెళ్లి, దానిపై ఉన్నవాడు నీళ్ళల్లో మునగడం ఖాయం.

గేదెల చెరువులో ఒకటి, రెండు దిబ్బలు ఉన్నాయి. వాటి స్థానాన్ని గుర్తుపెట్టుకుని, ధైర్యంగా ఒక దిబ్బమీద నుండి ఈత మొదలుపెట్టి, ఇంకొక దిబ్బను క్షేమంగా చేరుకుని దానిపై నిలబడాలి.

ఈతలో కొంచెం ప్రావీణ్యత వచ్చిన తర్వాత చేయాల్సిన సాహసమిది.

ఇలా ఒక దిబ్బ మీద నుండి ఇంకొక దిబ్బ మీదకు ఈత కొడుతూ, ఈతపై పట్టు సాధించాడు కిట్టు.

ఈ రోజుల్లో పిల్లలకు ఈత నేర్పించాలంటే...

ఈత కొలను... దాని ఫీజు... కోచ్... వాళ్ల ఫీజు... వాళ్లని కాకా పట్టడం... కళ్ళజోళ్లు(గాగుల్స్)... స్విమ్మింగ్ డ్రెస్ లు... సమ్మర్ క్యాంపులు... డబ్బులు... గోల... గందరగోళం... వీటన్నిటికీ ఒకటే పరిష్కారం.

స్విమ్మింగ్ పూల్ లోకి గేదెల్ని, బిందెల్ని ప్రవేశపెట్టడం. అప్పుడు 'స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్లి నీటమునిగిన విద్యార్ధి' అనే న్యూస్ పేపర్ వార్తలు రావు...

ఎందుకంటే కోచ్ లను నమ్మలేము. వాళ్లు తల్లిదండ్రులతో ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు.

మీ అబ్బాయినో, అమ్మాయినో ప్రపంచ ఛాంపియన్ గా చేసేస్తాం. మా మీద నమ్మకముంచి వెళ్లండి. అంటారు. తర్వాత... పూర్తి శ్రద్ధ పెట్టరు...

అదే గేదె అయితే... గేదెను పూర్తిగా నమ్మవచ్చు... అది మోసపూరిత మాటలు చెప్పదు.

'స్మూత్'గా తనదారిన తాను స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టుకుంటూ తిరుగుతుంది.

కొద్దిగా ఎదిగిన పిల్లలు, దాని తోక పట్టుకుని, తమను తాము రక్షించుకుంటూ ఈత నేర్చుకోగలరు.

బాగా చిన్న పిల్లలకు బిందె ఇచ్చి, అతి తక్కువ లోతు నీళ్ళల్లో ప్రాక్టీసు చేయిస్తే, వాళ్లు నెమ్మదిగా ఈతలో ఒక స్టేజీ దాటతారు.

తరువాత "గేదె స్టేజీ" కి చేరుకుంటారు...

గేదెల్ని ప్రవేశపెట్టడం వలన పిల్లలకు... గేదెలు, ఆవులంటే ఏమిటి? అవి మనకు ఎలా సహాయం చేస్తాయి? మనం వాటిని ఎలా చూసుకోవాలి? అనే గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటారు. విజ్ఞానం పెంచుకుంటారు. ప్రకృతికి దగ్గరగా వస్తారు.

'కురియన్ ఎవరు? ఏమో తెలియదు... పాలు ఎలా వస్తాయి? పాలిథీన్ ప్యాకెట్లలో వస్తాయి.' డబ్బులు ఎలా వస్తాయి? ఏటీయమ్ కు వెళ్లి తెచ్చుకోవాలి.

ఇదీ ఈనాటి పిల్లల అవగాహన...

పిల్లల అవగాహన, జ్ఞానం పెంచాలంటే పైన చెప్పిన వ్యూహాన్ని పాటిస్తే పిల్లలకు ఆ రెండూ లభిస్తాయి.

కారు చౌకగా...

***

కిట్టు 10వ తరగతి పాసయ్యాడు. తరువాత... కాలేజీలో చేరాలి... కాలేజీ అంటే భీమవరమే.

భీమవరం పట్టణం...

"ఆ పట్టణంలోని దంతులూరి నారాయణ రాజు గారి కళాశాల, సింపుల్ గా డియ్యన్నార్ కాలేజీ, భీమవరం పట్టణానికే తలమానికం. "ఈ కళాశాలకి ఘనమైన చరిత్ర ఉంది. దీని అసలు పేరు 'డబ్ల్యు జీబీ కళాశాల'. అనగా 'వెస్ట్ గోదావరి, భీమవరం కళాశాల'.

ఎప్పుడు ఎన్నో రంగాలలో, దేశ విదేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా వైద్య, విద్య, వైజ్ఞానిక, సామాజిక, న్యాయ, కళ... ఇలా అనేక రంగాల్లో పేరు ప్రఖ్యాతలతో అలలారుతున్న ఎంతోమంది మేధో సంపన్నులు ఈ సరస్వతీ దేవి పుత్రులే... ఆమె ముద్దుబిడ్డలే...

కిట్టుని కళాశాలలో చేర్చడానికి తీసుకువెళ్లారు కిట్టు నాన్నగారు. 'కిట్టూ, నీవు లెక్కల్లో వీక్ కాబట్టి. "బైపిసి" గ్రూపు తీసుకో అన్నారు కిట్టు నాన్నగారు.' సరేనన్నాడు కిట్టు.

అడ్మిషన్ అయ్యాక, అక్కడున్న వాళ్లు ఇలా అన్నారు. 'రేపట్నుంచి కాలేజికి ఫ్యాంటులు వేసుకునిరావాలి. ... ఇలా నిక్కరు వేసుకొస్తే కుదరదు...' కిట్టుకి ఆశ్చర్యం, కోపం కలిగాయి. "ఏం? ఎందుకు ఫ్యాంట్ వేసుకోవాలి? నాకు నిక్కర్లే అలవాటు... నేను నిక్కర్ తోటే కాలేజికి వస్తాను" అన్నాడు.

అక్కడున్న వాళ్లలో కొందరు నవ్వారు. కిట్టుకి వాళ్ల నాన్నగారు నచ్చజెప్పారు...

"అందరూ పాటించే పద్ధతులే మనమూ పాటించాలి. నలుగురితోనూ నారాయణా అనాలి" సరేనా.? కిట్టు అసంతృప్తిగా తలాడించాడు. కిట్టుని హాస్టల్ లో కూడా చేర్పించారు.

ఓన్లీ ఫుడ్... నో బెడ్...

***

డియ్యన్నార్ కాలేజ్...

అదో పెద్ద ప్రపంచం...

ఇంటర్ స్టూడెంట్స్ లో చాలామంది కిట్టు కంటే ఎత్తుగా, లావుగా ఉన్నారు. వాళ్ల ముందు చిన్నగా ఫీల్ అయ్యేవాడు కిట్టు.

చిత్ర విచిత్రమైన ఫ్యాషన్లు...

హిప్పి కటింగ్...

'జుట్టు ఎక్కువగా పెంచుకుని, చెవుల పైన, తల వెనకాల ఎక్కువ జుట్టు పెంచడమే హిప్పీ కటింగ్'... చొక్కా కాలర్లు పెద్దగా ఉండి, రకరకాల షేపుల్లో ఉండేవి. చొక్కా జేబులు కూడా ఒకడిది ఒక రకంగా, ఇంకొకడిది ఇంకో రకంగానూ, వివిధ రకాల షేపుల్లో ఉండేవి. హృదయం (హార్ట్) షేపు, గుండ్రని షేపు, డైమండ్ షేపుల్లో ఎన్నోరకాల జేబులు...

బెల్ బాటమ్ ఫ్యాంట్లు...

ఈ ప్యాంట్ లు తొడ దగ్గర సన్నగా ఉండి, మోకాలి కింద నుండి వెడల్పుగా ఉంటాయి. ఈ వెడల్పు ఒక మాదిరి 28 అంగుళాలతో మొదలై 35,40,45... ఎంత ఎక్కువ వెడల్పు ఉంటే అంత గొప్ప ఫ్యాషన్. ఈ ప్యాంటు నడుము దగ్గర టైటుగా ఉండాలి. కనీసం నాలుగంగుళాల వెడల్పు ఉండే బెల్టు పెట్టుకోవాలి. పెట్టుకునే బెల్ట్ లెదర్ తో చేయబడి, దాని బకిల్ నక్షత్రాకారంలోనో, హార్ట్ షేపులోనో ఇంకేదో షేపులోనో ఉంటుంది.

బూట్లు కనీసం నాలుగంగుళాల ఎత్తుతో ఉండాలి. హై హీల్స్ అంటారు వాటిని. ఈ హైహీల్స్ మీదుగా బెల్ బాటమ్ ఫ్యాంటు, నేలమీద జీరాడుతూ ఉంటుంది. ఇలా నేలకు రాసుకునేటప్పుడు ఫ్యాంటు అడుగుభాగం పాడవకుండా దానికి జిప్పు కుట్టేవారు.

ఫ్యాంటు వెనక జేబులు కూడా చొక్కా జేబుల్లాగే చిత్ర విచిత్రమైన షేపుల్లో ఉండేవి.

ఎంత ఎక్కువ బెల్ బాటమ్ ఉన్న ఫ్యాంటులు వేసుకొంటే అంత గొప్ప. పెద్దగా ఉన్న బెల్ బాటమ్ ని "ఎలిఫెంట్ బెల్" అనేవారు. మళ్లీ ఈ బెల్ బాటమ్ ని మధ్యలో 'వి' షేపుతో కత్తిరించి, అక్కడ వేరే రంగు గుడ్డని ఆ 'వి' షేప్ లో ఇరికించి కుట్టేవారు. అది ఇంకో ఫ్యాషన్...

ఫ్యాంటు ఎక్కడన్నా చినిగితే దాన్ని మూసేసి, మళ్ళీ అందంగా కనబడడానికి రంగు రంగుల గుడ్డ స్టిక్కర్ లు వేసి కుట్టించేవారు.

ఇక ఫ్యాంట్ వెనకవైపు జేబుకు పైన ఆ ప్యాంట్ కుట్టిన టైలర్ పేరు రాసిన స్టిక్కర్ కుట్టేవారు.

బాలాజీ టైలర్స్...
ప్రిన్స్ టైలర్స్...
స్టిచ్ వెల్ టైలర్స్...
మెన్స్ టచ్ టైలర్స్...
యాక్స్ టైలర్స్...

ఇలా పేరుగాంచిన టైలర్స్ ఉండేవారు...

రెడీ మేడ్ బట్టలు ఎవరూ వేసుకునేవారు కాదు...

టైలర్లు తమతమ సృజనాత్మకతను ఉపయోగించి, రకరకాల డిజైన్లు తయారు చేసేవారు.

టైలర్లకు స్టూడెంట్స్ సర్కిల్ లో చాలా గౌరవముండేది.

టైలర్లకు చేతినిండా పని...

ప్రిన్స్ టైలర్, కాస్ట్లీ టైలర్... యాక్స్ టైలర్ చాలా కాస్ట్లీ ఎందుకంటే ఎన్టీఆర్, ఏ ఎన్నార్ ల దుస్తులు కుట్టేవాడు కదా... అని మాట్లాడుకునేవారు స్టూడెంట్స్... ఆడపిల్లలు మాత్రం చక్కగా లంగావోణీలతో కాలేజికి వచ్చేవారు... పంజాబీ డ్రెస్సులున్నాయి... కానీ తక్కువగానే కనబడేవి... జీన్ ఫ్యాంట్లకు అమ్మాయిలు దూరంగానే ఉండేవారు. పొడవాటి మిడ్డీ, దానిపైన షర్టు లాంటిది వేసుకుని వచ్చేవాళ్లున్నారు... వాళ్ల సంఖ్య బాగా తక్కువ...

అలాంటి వాళ్లు కనబడితే అబ్బాయిలు...

మోడ్రన్ డ్రెస్సు... మోడ్రన్ డ్రెస్సు... అనుకునేవారు.

కొంతమంది అమ్మాయిలు సైకిళ్ళపై వచ్చేవాళ్లు...

అమ్మాయిల దుస్తుల్లో ప్రశస్తమయినవీ చెప్పుకొదగ్గవీ "లంగా వోణీలే"...

'ఆ రోజుల్లో ప్రేమసాగరం' అనే డబ్బింగ్ సినిమా పదకొండు గంటల సినిమాగా ప్రసిద్ధికెక్కి ఏకంగా 365 రోజులకు పైగా ఏకదాటిగా నటరాజ్ సినిమా థియేటర్ లో ప్రదర్శించబడి రికార్డ్ సృష్టించింది.

ఆ సినిమాలోని ఒక పాట నామం పెట్టు... నామం పెట్టు కాలేజికి... అంటూ మొదలై...

'ఆదివారం నలుపు'
'సోమవారం ఎరుపు'
'మంగళవారం పసుపు'
'బుధవారం తెలుపు'

నువ్వేసుకొచ్చే ఓణీలన్నీ చూశానే... అంటూ నడుస్తుంది.

చాలామంది అబ్బాయిలు ఆ పాటను తెగపాడేవారు. వినసొంపుగా ఉండేపాట కాదది. ఏదో టైం పాస్ పాట... అయినా సరే... ఎక్కడన్నా పాటల పోటీ జరుగుతున్నప్పుడు కొంతమంది వీరాభిమానులు ఈ పాటనెంచుకుని మరీ పాడేవారు.

'ఓణీ' లకు ఉన్న ప్రాశస్త్యం అంత గొప్పది.

కాలేజికి సైకిళ్ళపై వచ్చేవాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇంటర్, డిగ్రీ, పీజీ, విద్యార్ధుల్లో తొంభై తొమ్మిది శాతం వాడేది సైకిల్.

***

కిట్టుకి వాళ్ల నాన్నగారు రెండు జతల బట్టలు కుట్టించారు.

బెల్ బాటమ్ లేదు. చిత్ర విచిత్రమైన కాలర్, జేబులు లేవు. లెదర్ బాటా చెప్పులు కొనిచ్చారు.

కిట్టు నాన్నగారి అభిప్రాయమేమిటంటే... "ఎంత ఎక్కువగా ఫ్యాషన్ చేస్తే అంతగా చదువు కొండెక్కుతుంది, ఎంత తక్కువగా ఫ్యాషన్ చేస్తే అంతగా చదువు అబ్బుతుంది."

కిట్టు హెయిర్ స్టైల్...

డిప్ప కటింగ్...

డిప్ప అంటే తల వెనకవైపు కింద భాగం. డిప్పకాయ్ కొట్టడం అంటే ఈ ప్రదేశంలో వేళ్లతో చరచడం.

డిప్పమీద అరచేతితో కొడితే, కళ్ళు బైర్లు కమ్ముతాయి... డిప్ప కటింగ్ పేరెందుకొచ్చిందంటే... కటింగ్ చేసినప్పుడు, ఆ డిప్ప మీద ఉన్న జుట్టు మొత్తం చిన్నగా కట్ చేసేయగా, డిప్ప చక్కగా మెరుస్తూ కనబడుతుంది... అందుకని, డిప్ప కటింగ్ లోని డిప్పని, ఇంకా చెవుల దగ్గర, తల చుట్టూ ఉన్న వెంట్రుకలు చిన్నగా కత్తిరిస్తారు. నడినెత్తిన మాత్రం కొంచెం జుట్టు వదులుతారు.

పెద్ద వయసు వాళ్ళందరూ ఈ డిప్పకటింగ్ ను ఇష్టపడతారు. ఎందుకంటే జుట్టు చెవుల మీద, మెడమీద పడకుండా, చిరాకు లేకుండా హాయిగా ఉంటుంది. జుట్టు ఎక్కువుంటే 'కోడి మెడ' వస్తుంది.

అందరికీ చిరపరిచితమైన బీహార్ ముఖ్యమంత్రి 'లల్లూ ప్రసాద్ యాదవ్' గారిని షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ చేస్తూ...

సార్... మీ కటింగ్ చాలా స్పెషల్ గా అందరికంటే భిన్నంగా ఉంటుంది సార్ అన్నాడు...

షారుఖ్ ఖాన్ ఉద్దేశమేమిటంటే... 'నీ డిప్ప కటింగూ... నువ్వూ... భలేవిచిత్రమైనవాడివి నువ్వు అని'. సరిగ్గా... షారుఖ్ ఖాన్ మనసులోని మాట లల్లూ గారికి తెలుసు... కోపగించుకోకుండా ఇలా చెప్పాడాయన...

'జుట్టు ఎక్కువగా ఉండి మెడమీద పడుతూ ఉంటే, ఇబ్బందిగా ఉండి, జుట్టును చేత్తో సవరించుకుంటూ మెడను అటూ, ఇటూ తిప్పుతూ ఉంటే, మెడకు బలం తగ్గి కోడిమెడలాగా సన్నగా అయిపోతుంది'.

జుట్టు తక్కువగా ఉంటే మెడ స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఈ డిప్పకటింగ్ కు "చిప్ప కటింగ్" అనీ, "మూకుడు కటింగ్" అనీ ముద్దుపేర్లున్నాయి. నెత్తిమీద చిప్పగానీ, మూకుడు గానీ బోర్లించి, బోర్లించగా కనబడని జుట్టు వదిలి, ఆ తర్వాత కనబడే జుట్టంతా కత్తిరించి, చిప్పని గానీ, మూకుడుని గానీ తీసేస్తే... అదే చిప్పకటింగ్ లేదా మూకుడు కటింగ్.

ఈ డిప్ప కటింగ్ కు ఇంకోపేరు "మిలిటరీ కటింగ్" సైనికులకు వ్యాయామానికి అడ్డురాకుండా ఈ డిప్పకటింగ్ వేసేస్తారు.

కిట్టు తన బైపిసి క్లాస్ రూం నుండి వచ్చి బయట నిలబడ్డాడు.

ఒక క్లాస్ అయ్యింది... ఇంకో మాస్టారు రావాలి...

ఆ మాస్టారు రావడం చూసి బయటనిలబడ్డ విద్యార్ధులందరూ లోపలికి పరిగెడతారు... బైపిసి లో 60 మంది విద్యార్ధులు ఉంటే అందులో సగం కంటే ఎక్కువమంది అమ్మాయిలే ఉంటారు.

"ఇంటర్ లో వేరే గ్రూపులు చదివే అబ్బాయిలు, బియ్యెస్సీ చదివే అబ్బాయిలు, డిగ్రీలో వేరే గ్రూపులు చదివే అబ్బాయిలు, ఈ ఇంటర్ బైపీసీ క్లాస్ చుట్టే తిరుగుతుంటారు."

ఎందుకంటే ఇక్కడ ఎక్కువ 'కలరింగ్' ఉంటుంది కనుక. కలర్ లేదా కలరింగ్ అంటే అమ్మాయిలు, ఏవో కామెంట్లు చేసి, ఏదో హంగామా చేసి, అమ్మాయిలను ఆకర్షించడానికి అబ్బాయిలు ప్రయత్నం చేస్తుండేవాళ్లు.

అబ్బాయిలు అమ్మాయిలను టీజ్ చేస్తారు, కిట్టు విషయంలో అది రివర్స్.. .

క్లాస్ బయట నిలబడ్డ కిట్టుకి... ఏయ్... డిప్పకటింగ్ అనేమాట వినబడింది...

ఏం అర్ధం కాక దిక్కులు చూస్తున్నాడు... ఏయ్... డిప్పకటింగ్, నిన్నే... అని మళ్ళీ వినబడింది... అటూ ఇటూ చూడగా... కొంచెం దూరంలో కొంతమంది అమ్మాయిలు దూరంగా గ్రూపుగా నిలబడి ఉన్నారు.

కిట్టుని చూసి నవ్వుకుంటూ... జోకులేసుకుంటున్నారు...

వాళ్లవైపు గుర్రుమని ఒకసారి చూసి, క్లాస్ రూంలోకి వెళ్లిపోయాడు కిట్టు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్