Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

''మీరు నన్ను ట్రాప్‌ చేసారు. మీలో ఇంత టాలెంట్‌ వుందని తెలిస్తే పందెం కాసేదాన్ని కాను. మీరే నెగ్గారు'' అంటూ తన వేనిటీబేగ్‌ లోంచి వంద తీసిచ్చింది.

మీరు ఫీలయ్యేట్టయితే ఇవ్వద్దు. ఉంచుకోండి... ఫరవాలేదంటే మరో పందెం.''

''వద్దు... వద్దు. నా పాకెట్‌ మనీ మీకె యిచ్చేస్తాను'' అంటూ వంద యిచ్చేసింది.

డబ్బులు తీసుకుని జేబులో వేసుకున్నాడు త్రివిక్రమ్‌.

నూటయాభై రూపాయలు గెయిన్‌!

''థాంక్స్‌ మిస్‌ అలేఖ్యా! ఈసారి మనం మీట్‌ అయినప్పుడు నన్ను చిక్కుల్లో పడేసే బెస్ట్‌ క్వశ్చన్‌ రెడీ చేసుకోండి. పందెం ఎంతయినా ఫర్వాలేదు. మీరు నన్ను ఓడించాలి. అదే నా ఆశ'' అంటూ లేవబోయాడు.

''అంతకుమించి ఆశలేదా?'' కొంటెగా అడిగిందామె.

''లేదు... అస్సల్లేదు. భై'' అంటూ లేచి వచ్చేసాడు త్రివిక్రమ్‌. ఇంకా అక్కడే వుంటే టాపిక్‌ ఎటుపోతుందో అతడికి తెలుసు. అది నిజం కూడా.

వెళుతున్న అతన్ని చూస్తూ భారంగా నిట్టూర్చింది అలేఖ్య.

అంతవరకూ చనువుగా ఇంత సేపు తన సమీపంలో కూర్చుని సరదాగా మాట్లాడిన మగాడేలేడు. సాధారణంగా కుర్రాళ్ళు అమ్మాయిలతో ఎందుకు స్నేహం చెయ్యాలని చూస్తారో తెలీని విషయం కాదు. ఆడపిల్ల ఓరచూపులకే పులకించి మెలికలు తిరిగిపోతారు.

అలాంటిది ఇతను యింతసేపు తనతో కూర్చున్నా, తన గురించి తన అందం గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోవటం చూస్తే ఏమనుకోవాలో అర్ధం కాలేదు.

'అరె త్రివిక్రమ్‌... దొరక్కపోవు. ఈసారి పందెం కాసేది డబ్బు కాదు. నన్ను పెళ్ళిచేసుకునే షరతుమీదే పందెం కాస్తాచూడు...' అనుకుంటూ అక్కడినుంచి లేచి వెళ్ళిపోయిందామె.

''ఓరే... నీకు బుద్దుందా?'' తిరిగి వచ్చిన విక్రమ్‌ని చూస్తు కోపడ్డాడు శివా.

''ఉందని నీతో ఎవడు చెప్పాడురా? మీరు ఓడిపోయారు. పందెం డబ్బు ఎగనామం పెట్టాలని చూడకండి. చంపేస్తాను. ఎల్లుండి ఇచ్చేయాలి'' వార్నింగిచ్చాడు త్రివిక్రమ్‌.

''డబ్బు సర్లేరా. కాని నువ్వేమిట్రా బాబు, ఎవడన్నా ఆడపిల్లను చూస్తే సరదా పడతాడు. లవ్‌లో దించాలని చూస్తాడు మగాడంటే పురుగులా చూసే అలేఖ్యను అంత సులువుగా ఎలా పడగొట్టావో అర్ధం కావడంలేదు. ఆ పిల్ల నిన్నంత యిదిగా చూస్తోంది. పందెంలో ఓడించి, ఆ పిల్ల పాకెట్‌ మనీ కొట్టేయడానికి సిగ్గులేదూ?''

''కాస్త నోరు మూస్తావా? డబ్బుకి ఆడా మగా తేడాలేదు... మీతో పందెం కాసాను గాబట్టి ఆ పిల్ల దగ్గరకెళ్ళి మాట్లాడాను గాని, లవ్‌ చేయటానిక్కాదు. నాకంటూ ఓ లవర్‌ ఎక్కడో పుట్టే వుంటుంది. అది అలేఖ్య కాదు. అర్ధమైందా? పదండి. టీలకి, సిగరెట్లకి కలవరిస్తున్నారుగా'' అంటూ పార్కు బయటకు దారి తీసాడు త్రివిక్రమ్‌.

అతడ్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక ముఖముఖాలు చూసుకుంటూ అతడి వెనకే బయలుదేరారంతా.

***

ఆ రోజు ఆదివారం ఉదయం.

గోవిందరావుగారిల్లు ప్రశాంతంగా వుంది.

అంతా ఇంట్లోనే వున్నారు.

''ఓరే పెద్దోడా... ఏం చేస్తున్నావ్‌రా...? పెద్దకొడుకు త్రివిక్రమ్‌ని పిలిచింది ప్రశాంతి.

''ఏం చేయటం లేదు మమ్మీ! ఏం కావాలి?'' తన గదిలోంచే బదులిచ్చాడు త్రివిక్రమ్‌.

పేపర్‌ చూస్తున్న గోవిందరావు ఆ సమాధానం విని నొసలు విరిచి సన్నగా నవ్వాడు.

ఆ నవ్వు ప్రశాంతికి నచ్చలేదు.

''ఎందుకు నవ్వుతున్నారు? వాడంటే మీకస్సలు గిట్టడంలేదు. చూస్తున్నాగా?'' అంది కోపంగా.

''బాగుంది. నువ్వు అడగటం, వాడు సమాధానం చెప్పటం... విన్నావ్‌గా, ఏమీచేయటంలేదు, పనివుంటేగా చేయటానికి తినటం, తిరిగిరావటం. హు'' అంటూ పేపర్‌లోకి చూపులు తిప్పుకున్నాడాయన.

ఆ మాటలు వింటూనే తన గదిలోంచి బయటకొచ్చాడు త్రివిక్రమ్‌. కాని తండ్రి మాటలకి తనేం కామెంట్‌ చేయలేదు.

''ఏమిటి మమ్మీ?'' అనడిగాడు మామూలుగా.

''ఇంట్లో అంతా బిజీగా, పనీపాటా లేకుండా తిని తిరుగుతోంది నువ్వేగదా వెళ్ళు ఈ రెండువేలు తీసుకెళ్ళి పచారి సరుకులు పట్రా. లిస్టు రాసాను....'' అంటూ ఒక పొడవాటి స్లిప్పు, డబ్బు అతడి చేతిలో పెట్టింది.

అప్పటికి అసలు విషయం తెలుసుకున్న గోవిందరావు మరోసారి తల్లి కొడుకునుచూస్తూ'' ''రామార్పణం'' అన్నాడు.

భర్త ఎగతాళికి బాగా ఉడుక్కుంది ఆవిడ.

''ఏది రామార్పణం? సరుకులు తీసుకురావటం కూడా వాడికి తెలీదనా? ప్రతిసారి వాడేగా తెస్తున్నాడు. చిన్న కొడుకుగాని, మీరుగాని పట్టించుకున్నారా? మీరు చేయరు. చేసేవాడికి వంకలు చెప్తారు'' అంటూ కోప్పడింది.

''హలో భార్యామణిగారూ, ఇవి వంకలు కాదు, అనుభవాలు వాడు తెచ్చి పెడుతున్నాడనే చెపుతున్నావుగాని, అప్పుడప్పుపడూ పాడుచేసిన డబ్బుల గురించి చెప్పవే? ఇచ్చిన డబ్బుకు సరిపడా సరుకులు వస్తాయంటావా?'' అడిగాడాయన వ్యంగ్యంగా.

ఇక వింటూ వూరుకోలేకపోయాడు త్రివిక్రమ్‌.

''డాడీ! మీకు తెలీదు. నేను తల్చుకుంటే మీరిచ్చిన రెండువేలకి నాలుగువేలకు సరిపడా సరుకులు తేగలను'' అన్నాడు రోషంగా.

''తీసుకురా చూద్దాం. దొంగతనం చేస్తావా, అప్పుచేస్తావా?''

''అంత అక్కరలేదు. పద్దతిగానే పట్టుకొస్తాను.''

''అలాగా! అయితే పట్రా చూస్తాను. నీ టాలెంట్‌ని గుర్తిస్తాను.''

''థాంక్స్‌ డాడీ! తెచ్చి చూపిస్తాను. అప్పుడు చెప్పండి'' అంటూ అప్పటికప్పుడు రెడీఅయి, డబ్బు తీసుకొని వీధిలోకి బయలుదేరాడు త్రివిక్రమ్‌.

''ఒరే. డబ్బు జాగ్రత్త...'' అంటూ వెనకనుంచి హెచ్చరించింది ప్రశాంతి.

***

తను మేధావి గాకపోవచ్చు.

కాని తెలివితక్కువవాడని మాత్రం ఎవరు అనరు. తనకి ఏమీ తెలీదని, తను చేతకానివాడని, ఏమీ చేయలేడని అనుకొనే మనిషి ఉండడు. తనకూ తెలివితేటలున్నాయి. చాలా విషయాలు తనకూ తెలుసు. తలుచుకుంటే ఏమైనా సాధించగలడు అనే భావిస్తాడు.

సహజంగా ప్రతిమనిషిలోనూ వుండే వీక్‌ పాయింటే ఇది.

ఎంతటి అమాయకుడ్నయినా సరే నువ్వు తెలివి తక్కువ దద్దపని అంటే ఒప్పుకోడు. కాబట్టి ఎదుటి వాళ్ళని ఓడించాలంటే మనదగ్గర తెలివితేటలుంటే చాలదు. ఎదుటివారి వీక్‌ పాయింట్లు కూడా తెలియాలి. అలా తెలుసుకున్నవాడే నిజమైన మేధావి.

వాడుకగా గోవిందరావుగారింటికి పచారీ సరుకులు అందించే కిరాణాషాపు ఓనర్‌ పేరు రామారావు వీధి కార్నర్‌లో చాలా పెద్దషాపు ఆయనది. అక్కడ దొరని వస్తువంటూ వుండదు. చేతికింద ముగ్గురు పనివాళ్ళు ఎప్పుడూ బిజీగా వుంటారు. హోమ్‌ డెలివరీకి ఒక రిక్షా కూడా ఎప్పుడూ సిద్దంగా వుంటుంది.

రామారావుగారి వయస్సు సుమారు ఏభైసంవత్సరాలు, నల్లగా లావుగా ఎత్తుగా వుంటాడు మనిషి ఎప్పుడూ వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్‌లో కన్పిస్తాడు చాలా తెలివైనవాడు. ఓ పట్టాన ఆయన్ని ముగ్గులోకి లాగడం చాలా కష్టం.

అదే ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్‌

ఎవరుబడితే వాళ్ళు డబ్బులుపెట్టి పందాలు కాయటానికి యిష్టపడరు. రామారావు లాంటి పెద్దవ్యాపారస్తుడు అస్సలు లొంగడు బెట్‌ కట్టడం తన హాబీకావచ్చు. ఆయన లొంగిరావాలిగదా. తనంతట తాను బెట్‌ కట్టడు. కట్టేలా తనే ఏదో ఒకటి చేయాలి?'' ఏం చేయాలి?

ఇదే ఆలోచిస్తూ షాపు వద్దకి చేరుకున్నాడు త్రివిక్రమ్‌. సరిగ్గా అదే టైంలో టి.వి.లో క్రికెట్‌ వస్తోంది. ఇండియా శ్రీలంక ఒన్‌ డే మ్యాచ్‌ ప్రత్యక్షప్రసారం. రామారావుకి క్రికెట్‌ పిచ్చివుంది. ఎదురుగా టి.వి. చూస్తూ కూర్చున్నాడాయన. పనివాళ్ళు ఎవరిపనిలో వాళ్ళున్నారు. అప్పటి కప్పుడు త్రివిక్రమ్‌ మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవటం ఎలాగో అతడికి బాగా తెలుసు.

''ఏమిటి సార్‌?  స్కోర్‌ ఎంత? మన వాళ్ళు ఈసారయినా సీరిస్‌ దక్కించుకుంటారంటారా?'' అంటూ ఏమీ తెలీనట్టు రామారావుని అడిగాడు చిన్నగా పక్కనచేరి.

''భలేవాడివోయ్‌ త్రివిక్రమ్‌. ఎక్కడున్నావింకానువ్వు? ఈ మేచ్‌ నెగ్గినా ఓడినా నో ప్రాబ్లమ్‌. ఆల్రెడీ మనవాళ్ళు నాలుగుమేచ్‌లు కొట్టిఫోర్‌ జీరోలో వున్నారు. ఈ మేచ్‌ అయినా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని పాపం తెగ కష్టపడుతున్నారు శ్రీలంకవాళ్ళు'' అన్నాడు నవ్వుతూ ఆయన.

''పరువు నిలబెట్టుకుంటారా ఈ సారయినా?'' తిరిగి అడిగాడు.

''నాకో డౌట్‌.. మనవాళ్ళు వదిలేలాలేరు. మనవాళ్ళు కొట్టే సిక్స్‌లు. ఆపటం చేతగాక గ్రౌండ్‌లో ఎలా పరుగులు పెడుతున్నారో చూడు. ఈ దూకుడు మనవాళ్ళు ఇలాగే కంటిన్యూచేస్తే వచ్చే వరల్డ్‌కప్‌ మనదే.''

ఆయన మాట్లాడుతుండగానే సచిన్‌ సిక్సర్‌ కొట్టాడు.

సంతోషం పట్టలేక చప్పట్లు కొడుతూ సీట్లో లేచి కూర్చున్నాడాయన. త్రివిక్రమ్‌ కూడా చప్పట్లు కొట్టి విజిల్‌ వేశాడు.

''సూపర్‌ షాట్‌ సార్‌. ఏమైనా సచిన్‌ సచినే  అప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించటం నాకు నచ్చలేదు సార్‌'' అంటూ పొగిడాడు.

''అవునోయ్‌, అప్పట్లో లిటిల్‌ మాస్టర్‌ గవాస్కర్‌ కూడా అంతే. ఎలాంటి బౌన్సర్‌నయినా సరే సింపుల్‌గా  బేట్‌ అడ్డంవేసి బౌండర్‌కి పరిగెత్తించేవాడు. అసలు క్రికెట్‌ సంబంధించి వరల్డ్‌ రికార్డ్‌లు చాలా మనదగ్గరే వున్నాయి తెలుసా?''

''మనకి అంత వుందని  నేననుకోనుసార్‌''

''ఉందయ్యా. క్రికెట్‌ గురించి నీకేం తెలుసు. కావాలంటే చెప్పు బెట్‌కడతాను.''

అదే... అదే తనకు కావలసింది.

దొరికిపోయాడు పాపం రామారావు.

తనంతట తానే బెట్‌ కడతానన్నాడు. కాదు అనేలా చేశాడు త్రివిక్రమ్‌. అదే అతడిలోని టాలెంట్‌.

''ఒ.కే. సార్‌ నాకు క్రికెట్‌ గురించి పెద్దగా తెలీదు. అయినా ఓ ప్రశ్న అడుగుతాను, బెట్‌ కడదామా?'' అనడిగాడు.

''నేను రెడీనోయ్‌. కాని మీవాళ్ళు ఏవోతీసుకురమ్మని నీకు డబ్బులిచ్చివుంటారు. అనవసరంగా పోగొట్టుకుంటావ్‌. వద్దులే'' నచ్చచెప్పబోయాడాయన.

''వద్దంటే ఎలా సార్‌? డబ్బు గురించి ప్రాబ్లమ్‌ లేదు, పందెం ఎంత చెప్పండి''.

''ప్రశ్న... ఒకే ఒక్క ప్రశ్న నేను అడుగుతాను, మీరు సరైన జవాబు చెప్పాలి. మీరు నెగ్గితే నేను మీకు రెండు వేలిస్తాను. కాని వెయ్యిరూపాయల సరుకే నాకు ఇవ్వండి చాలు, మీకు వెయ్యి ప్రాఫిట్‌. నేను నెగ్గానే అనుకుందాం. అప్పుడు నేను మీకిచ్చిన రెండువేలకి నాలుగువేల రూపాయలకు సరుకులివ్వాలి. అన్నీ డబుల్‌ డబుల్‌. ఒకేనా?''

''నాకు ఒ.కే. అబ్బాయ్‌, నువ్వు ఇంకోసారి ఆలోచించుకో''

''మాటంటే మాటేసార్‌. టాపిక్‌ వచ్చింది గాబట్టి క్రికెట్‌లో మన నాలెడ్జిని పరీక్షించుకుందాం. సరేనా? బెట్‌ ఒ.కేనా?''

''ఒ.కే... అడుగు. నువ్వు అడిగే ఆ ఒక్క ప్రశ్న ఏమిటో అడుగు.''

''చాలా చిన్న ప్రశ్న సార్‌. ఒకప్పుడు కపిల్‌దేవ్‌ కెప్టెన్సీలో ఒక్క రన్‌ కూడా ఇవ్వకుండా వరసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసుకొని ఒక బౌలర్‌ హేట్రిక్‌ సాధించాడు. ఆ బౌలర్‌ ఎవరో చెప్పండి చాలు. మీరు గెలిచినట్లే.''

త్రివిక్రమ్‌ ప్రశ్నవిని ఆశ్చర్యంగా చూసాడు రామారావు.

''ఏమోయ్‌ త్రివిక్రమ్‌ ఇది ఏమీ తెలీని వాళ్ళు అడిగే ప్రశ్నకాదే. నీకు చాలా విషయాలు తెలిసివుండాలి'' అన్నాడు.

''చాలా తక్కువే తెలుసుసార్‌. మీరు చెప్పేయగలరు. ఆ బౌలర్‌ ఎవరో చెప్పండి.''

కాసేపు నుదురు రుద్దుకున్నాడాయన

ఏదో గుర్తుకు వచ్చినట్లు ముఖం పైకెత్తాడు.

''చెప్పమంటావా?'' అడిగాడు.   

''అర్జంటేమీలేదుసార్‌! మీకింకా మూడు నిముషాల టైముంది. ఆలోచించే చెప్పండి ఈ లోపల ఓ దమ్ముకొట్టుకుని వస్తాను'' అంటూ షాపులోంచి ఇవతలకొచ్చి సిగరెట్‌ ముట్టించుకున్నాడు త్రివిక్రమ్‌''.

టి.వి. లో వస్తున్న క్రికెట్‌మీద ఇంట్రస్ట్‌పోయింది రామారావుగారికి.

త్రివిక్రమ్‌ ప్రశ్నకు ఆన్సర్‌కోసం బుర్ర చించుకుంటూ ఆలోచిస్తున్నాడు.

ఆయన అవస్థచూస్తే నవ్వొచ్చింది త్రివిక్రమ్‌కి.

ఇంతలో అటుగా వస్తున్న యువతినిచూసి ఉలిక్కిపడ్డాడు ఆమె ఎవరోకాదు.

నిర్మల్‌గాడి అక్క అలేఖ్య.

ఇప్పుడు చీర, జాకెట్టు లక్షణంగా మరింత అందంగా వుంది.

ఆ రోజు పార్క్‌లో మాట్లాడాక నాలుగయిదుసార్లు తనకి ఆమె ఎదురుపడింది. తనతో ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో వుందని పసిగట్టి  ఎలాగో తప్పించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు బుక్కయిపోయాడు. ఉండలేడు, వెళ్ళలేడు అదీ పరిస్థితి. గబగబా సిగరెట్‌ వూది అవతలపారేసాడు. అంతలో రానే వచ్చిందామె.

''హలో!'' అంటూ అందంగా నవ్వుతూ పలకరించింది.

''హలో! బాగున్నారా?'' తనూ ఓ పిచ్చినవ్వు నవ్వి పలకరించాడు.

''నేను బాగానే వున్నాను. పాపం మీరే బాగున్నట్టులేరు. చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు'' అంటూ చురక వేసిందామె.

ఆ మాటలకి తనెంతో ఆశ్చర్యపోతున్నట్టు చూసాడు త్రివిక్రమ్‌ చిన్నగా నవ్వేసాడు పైగా.

''మీరలా అనుకుంటున్నారా? ఛ ఛ! అదేంలేదండి, ఈ మధ్య కొంచెం చూపు మందగించింది. బహుశ చత్వారమను కుంటాను. పక్కవాళ్ళనికూడా గుర్తుపట్టలేకపోతున్నాను. మీరు పలకరించేవరకూ మీరనుకోలేదు తెలుసా?'' అన్నాడు.

''తెలుసు, మీరు అబద్దాలు కూడా చెప్తారని తెలుసు'' అంది తనూ నవ్వేస్తూ.

ఇంతలో షాపులోంచి రామారావు అరిచాడు.

''తెలిసిపోయింది... రావయ్యా రారా. నీ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పేస్తాను'' అంటూ పిలిచాడు.

''పాపం! రామారావుగారు ఇవాళ నీకు బుక్కయిపోయాడా?'' చిలిపి కళ్ళతో చిన్నగా అడిగింది అలేఖ్య.

''అంతా దేవుడి దయ, ఉండండి ఇప్పుడే వస్తా'' అంటూ లోనకు వెళ్ళాడు త్రివిక్రమ్‌.

అతడి వెనకే తనూ రామారావు వద్దకి వచ్చేసిందామె.

''చెప్పండి సార్‌! నాకు తెలుసు, గెలుపు మీదే! ఎవరా బౌలర్‌?'' వస్తూనే అడిగాడు త్రివిక్రమ్‌.

''ఇంకెవరు, కెప్టెన్‌ కపిల్‌దేవ్‌...'' ఉత్సాహంగా చెప్పాడు రామారావు.

''సారీసార్‌! మీరు ఓడిపోయారు. మీకంతా తెలుసు. అయినా చెప్పలేకపోయారు. అదే ఆశ్చర్యంగా వుంది ఆ బౌలర్‌ పేరు ఛేతన్‌శర్మ అప్పట్లో అతను బౌలరేకాదు వికెట్‌కీపర్‌ కూడా''

''కాదు కాదు కపిల్‌దేవ్‌.''

''ఓ.కె... నా ఆన్సరు కరక్టో కాదో మీకు తెలిసినవాళ్ళకు ఫోన్‌చేసి కనుక్కున్నాకే నాకు సరుకులివ్వండి. ఇదిగో రెండువేలు, ఇదిగో స్లిప్పు ఇక్కడే వుంటాను'' అంటూ బయటికొచ్చేసాడు త్రివిక్రమ్‌.

పాపం షాపు ఓనరు

ప్యూజు మాడిపోయిన బల్బులా అతడి ముఖం మరింత నల్లగా మాడిపోయింది.

త్రివిక్రమ్‌ బయటికొచ్చిన కాసేపటికి అలేఖ్య కూడా బయటికొచ్చింది.

''మీరు కూడా సరుకులకోసమే వచ్చారా?'' అడిగాడు.

''అవును, లిస్ట్‌ ఇచ్చి వచ్చాను చాలా టైం పడుతుంది. కాఫీ తాగుదాం పదండి'' అంది చొరవగా.

''ఓ.కె. బిల్లు నేనిస్తాను.''

''పిలిచింది నేను. బిల్లు నేనే ఇవ్వాలి.''

''ఓ.కె. చిన్నపందెం ఓడినవాళ్ళు బిల్లు కట్టాలి.''

''కాఫీకూడా పందెం కట్టాలా? ఈ బెట్టింగ్‌ని ఎవడు కనిపెట్టాడో గానీ వాడ్ని చంపాలి''.

''చంపటానికి వాడు దొరకడుగానీ ప్రశ్న అడగనా?''

''అడగండి.''

''కోడిగాని కోడి, అదేమికోడి?''

''పకోడి.''

''కరెక్ట్‌! బిల్లు నేనుకడతాను పదండి.''

''ఓడిపోవాలనే కోడిప్రశ్న వేసారు. నాకు తెలుసు'' అంది అతడ్ని అనుసరిస్తూ.

''ఎప్పుడూ మనమే గెలవకూడదు మేడం! అప్పుడప్పుడూ ఓడిపోతూ వుండాలి.   

ఇద్దరూ కాస్త దూరంలోని హోటల్‌ దిశగా నడుస్తున్నారు.

''నేన్నీతో పెద్ద పందెం కాయాలనుకుంటున్నాను'' దారిలో చెప్పింది అలేఖ్య.

''ఏమిటా పందెం?'' అడిగాడు.

''ఏంలేదు. నేను ఓడితో నిన్ను పెళ్ళిచేసుకుంటాను. నువ్వుఓడితే నన్ను పెళ్ళిచేసుకోవాలి. చెప్పు ఎప్పుడు వేసుకుందాం పందెం.''

''అరరే...... ఈ మాటేదో కాస్తముందు చెప్పకూడదు?''

''ఏమైందేమిటి?''

''ఇంతక్రితమే గట్టిగా ఒట్టేసుకున్నాను. ఇక నీతో పందెం వేయకూడదని.''

భారంగా నిట్టూర్చింది అలేఖ్య.

తన మనసులో ఏముందో అతడికి అర్ధమైపోయింది. అతడి ఉద్దేశం ఏమిటో తనకి అర్ధమైపోయింది. తనంటే ఇంట్రస్ట్‌లేదు. సో... ఇక ఆ విషయంగా నో అర్గ్యుమెంట్స్‌. ప్రేమయినా, పెళ్ళయినా రెండు మనసులు కలవందే సాధ్యంకాదు.

ఇద్దరూ హోటల్లో కాఫీ తాగారు

బిల్లు తనే ఇచ్చాడు త్రివిక్రమ్‌.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugadu inter fail ias pass