Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Deepavali

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ: ఏకాంబర్, నూకరత్నం మధ్య సంబంధాన్ని గురించి నీచంగా అభివర్ణిస్తూ నూకరత్నం బావలు ఆమెను నిలదీస్తారు. తల్లి కూడా వాళ్ళ మాటలు విని నిజమేననుకుని అదే సందేహాన్ని వ్యక్తం చేసేసరికి హతాశురాలౌతుంది నూకరత్నం.

.......................................................

 

బావా! మీకు అంతే తెలుసు. ఆ రోజు, ఆయన నాకెంత ఉపకారం చేసాడో తెలుసా?! రోషం గా అంది నూకరత్నం.

ఏం చేసాడు?! ఏం చేసాడు? ఒక మగాడు ఆడదానికి ఏమి ఆశించి  చేస్తాడో? ఏం పొందాలని చూస్తాడో మాకు తెలుసు పెద్ద బావ పచ్చిగా అన్నాడు.

ఆయన ఎలాంటి స్వార్ధపరుడు కాదు. ఇవేళ నేను శ్రీరాం చిట్స్ లో పదిహేను కోట్ల రూపాయల చిట్స్ కట్టించానంటే దానికి కారణం ఆయన. నా కలలో ...కూడా చూడలేనంత కమీషన్ పది లక్షలు... పది లక్షల రూపాయలు సంపాదించేలా సహాయం చేసాడు ఆయన.  కోపంతో ఊగిపోతూ అంది నూకరత్నం.

నూకరత్నం నోట పదిలక్షల రూపాయలు పలికేసరికి నూకరత్నం వాళ్ళ బావలు, వారి భార్యలు అశ్చర్యం గా నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోయారు.

ఏంటీ.. పదిలక్షల ఆదాయం నీకు చూపించి నీ దగ్గర ఏదీ లాభం పొందలేదా? నువ్వే వాడి ఒళ్ళో వాలిపోయాక ఇక పొందడానికి నీ దగ్గర ఏం మిగిలిందని రెండో బావ వ్యంగ్యం గా అన్నాడు.

షటప్... ఆయన అందరిలాంటి వాడు కాదు. ప్రపంచం లో అందరూ బాగుండాలి. అందరూ నా వాళ్ళనుకునే  స్వార్ధం ఆయనది. అంతే కానీ, ఎవరు ఎలా పోతే పోనీ నేను బాగుండాలి అని అనుకునే రాక్షసుడు కాదు, ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి. సూటిగా వాళ్ళకేసి చూస్తూ అంది నూకరత్నం.

అంత కావలిసినవాడయిపోయాడా? అయితే మాతో మీకు పనేముందమ్మా? అత్తా మేం వస్తాం, అత్తా నీ కూతురుకి ఆడెవడో దేవుడట కదా! మేమంతా రాక్షసులం, చూడు అదెలా వాగుతోందో! నీ కూతురు నీ ఇష్టం. మధ్యలో మాకెందుకు, పదండి పోదాం అంటూ భార్యలను తీసుకుని నలుగురు బయలుదేరారు.

నలుగురు కోపం గా గదిలోనుండి బయటకు రావడానికి ద్వారం దగ్గర కొచ్చేసరికి ఎదురుగా నిలబడ్డ వ్యక్తులను చూసి ఆశ్చర్యపోయారు.వాళ్ళు అలా ఆశ్చర్యం గా నిలబడిపోవడంతో నూకరత్నం, వాళ్ళ గుమ్మం కేసి చూసారు.

గుమ్మం దగ్గర తల్లి పర్వతాలుతో పాటే నిలబడి వున్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ ని వాళ్ళమ్మని చూస్తూనే నూకరత్నం గుండెలు పగిలిపోయాయి. ఇంట్లో జరిగిన గొడవం తా వినేసే వుంటారు, అనుకుని మనసులోనే రోదిస్తూ గబాలున తల్లి దగ్గరకు వెళ్ళి నిలబడింది.

అమ్మా! ఏకాంబర్ గారని ఇన్స్యూరెన్స్ ఏజెంట్ ఆయన. వాళ్ళ అమ్మగారు. నేను పని చేస్తోన్న ఫ్రాంచైజీ వీళ్ళ ఆఫీసులోనే వుంది. బావలు చెప్తున్నది ఈయన గురించే...

నూకరత్నం తల్లి ఆశ్చర్యం గా గోడకు చేరగిలబడి వుంది. కూతురి నోట పది లక్షలు వినడమే షాకయి నిలబడిపోయింది.చెల్లిలి తాంబూలాల కోసం నూకరత్నం వాళ్ళని పిలవాలని తల్లిని తోడు తీసుకుని వచ్చాడు ఏకాంబర్. ఇక్కడకొచ్చేసరికి నూకరత్నాన్ని అందరూ తిడుతున్న దృశ్యం కంటపడేసరికి ఏకాంబర్ సిగ్గుతో చితికిపోయాడు. తన వలనే పాపం నూకరత్నం మాటపడుతోందని గ్రహించాడు.

ఆ సమయం లో ఇంట్లోకి వెళ్ళకూడదని ఏకాంబర్ తిరిగి వెనక్కి వెళ్ళిపోదామని తల్లిని వెనక్కి లాగాడు. అయితే అందుకు పర్వతాలు ఒప్పుకోలేదు.

రండి...రండి  ఆంటీ రండి అంబర్ సార్! నూకరత్నం గబాలున వారికి ఎదురొచ్చి ఆహ్వానించింది.

నూకరత్నం పెద్ద బావకి నోటమాట రావటం లేదు. జగదాంబ జంక్షన్ లో కనిపించిన కుర్రాడు నేరుగా తల్లిని తోడు తీసుకుని ఇంటికి రావడంతో షాకయ్యాడు.

అత్తా నేను చెప్పానే! ఈ కుర్రాడితోనే నేను నూకరత్నాన్ని చూసాను. గోపాలపట్నం లో అపార్ట్ మెంట్ లో రోజూ ఇద్దరూ కలుస్తున్నారు. తేరుకుంటూ అన్నాడు నూకరత్నం పెద్దబావ.

అవును సార్! అది మా ఆఫీసు. మా ఆఫీసుకు రండి సార్ ! నవ్వుతూ లోపలికి అడుగుపెట్టి అన్నాడు ఏకాంబర్.

అవునమ్మా! మీ అమ్మాయి మావాడి అఫీసులోనే వుంటూ స్వయం గా తనూ తన కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నిస్తోంది. నా కొడుకు మీ అమ్మాయికి చేయూతనిస్తున్నాడు. చెప్పింది ఏకాంబర్ తల్లి పర్వతాలు.

మీకెవరికి అభ్యంతరం లేకపోతే నేను నూకరత్నాన్ని పెళ్ళిచేసుకుంటాను. నూకరత్నానికి కావలిసిన వాళ్ళంతా ఇక్కడే వున్నారు. మీరు అందరూ అంగీకరిస్తే చిన్నగా నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

ఈ కుర్రాడే కదండీ మామయ్యగారు చనిపోయినప్పుడు మనకి సహాయం చేసింది చటుక్కున అంది నూకరత్నం పెద్దబావ భార్య.

అవునన్నాయ్యా నువ్వు గుర్తు పట్టలేదా ఈయనే మన నాన్నగారి ఫ్రెండ్ ఏజెంటు ఏకాంబర్ ఆనందం గా అన్నాడు చిన్నబావ.అయ్యో నేనింతవరకూ గుర్తుపట్టలేదురా! ఏడాది అయ్యుంటది కదా! మర్చిపోయాను అన్నాడు పెదబావ.

రండమ్మా కూర్చోండీ అంటూ నూకరత్నం ఇద్దరి బావల భార్యలు ఏకాంబర్ తల్లి పర్వతాల్ని ఆదరం గా ఆహ్వానించారు.

వాతావరణం మారుతోందని గ్రహించింది నూకరత్నం. అందరూ ఏకాంబర్ మాటలకు ముగ్దులవుతున్నారు. తనూ సరదాగా మాట్లాడాలి అనుకుంది.

బావా లోపలికి రండి గుమ్మం దగ్గరే మాటలేంటీ అంది నవ్వుతూ...

నూకరత్నం తల్లి కూడా పరిస్థితుల్ని అర్ధం చేసుకుంది. నవ్వుతూ పర్వతాలు దగ్గరకు వెళ్ళింది.

నా కొడుకు ఊరికే అనటం లేదండీ.. మీ అమాయిని మా అబ్బాయికిచ్చి పెళ్ళిచేద్దాం. మా ఇంట్లో అందరం వాడి మాటకు ఎదురుచెప్పం. మీ అందరికీ ఇష్టమేనా నవ్వుతూ అడిగింది పర్వతాలు.

అయ్యో అదెంత మాట మా మరదలు పిల్లకి ఇంత మంచి మొగుడు దొరుకుతుంటే సంతోషం కదండీ అన్నాడు నూకరత్నం  పెద్దబావ...

ఆయన మాటలకు  అందరూ ఆనందం గా వంతపాడారు. అపటికే కిందపడ్డ స్వీట్ బాక్స్ తీసి చేత్తో పట్టుకుంది నూకరత్నం చెల్లెలు.మీ అబ్బాయి వలనే నూకరత్నం ఈ రోజు ఇంత దర్జాగా, ధైర్యం గా అందర్నీ ఎదిరించి మాట్లాడుతోందమ్మా!

దీనికింత ధైర్యం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాను. సొంతం గా వ్యాపారం చేసే స్థాయికి ఎదిగిందంటే అంతా మీ దయ తల్లి.అత్తా మనం ఇంతవరకూ తిట్టింది తూలనాడింది అదెక్కడ రోడ్డున పడుతుందోననే కదా! బంగారం లాంటి కుర్రాడ్ని పెళ్ళాడాలనుకుంటే అంతకంటే మనకి ఆనందం ఏముందత్తా.. మా వలన ఏదైనా తప్పుజరిగితే క్షమించత్తా ! ఇద్దరు బావలు నూకరత్నం తల్లి చేతులు పట్టుకున్నారు.

ఒరేయ్ భడవలూ! నేనున్నా లేకపోయినా నూకరత్నం మంచి చెడ్డలు మీరే కదరా చూసుకోవాలి. అదేమన్నా తప్పుగా మాట్లాడుంటే మీరు కూడా మనసులో పెట్టుకోకుండా దాన్ని ఆశీర్వదించండి ఆనందం గా అంది నూకరత్నం తల్లి.

సరి సరి బంధువుల మధ్య అయిన వాళ్ళ మధ్య క్షమాపణలు ఉండవు. రేపు ఉదయం మా అమ్మాయి అలివేలుమంగకి తాంబూలాలు తీసుకుంటున్నాము. మీరంతా సకుటుంబ సపరివారసమేతం గా విచ్చేసి పెళ్ళికూతుర్ని ఆశీర్వదించండి.

మీరూ తప్పక రావాలి.. ఇదే పిలవడం నూకరత్నం బావలకి కూడా చెప్పింది పర్వతాలు.

అందరూ ఆనందం గా వస్తామంటూ ఏకాంబర్ కి, పర్వతాలుకి చెప్పి బయట రోడ్డు వరకూ వచ్చి సాదరం గా సాగనంపారు తల్లీ కొడుకుల్నీ. .అత్తా  ఇక మేము వెళ్తాం, మరదలు పిల్ల పెద్దింటికి వెళ్తున్నావ్ మమ్మల్ని మర్చిపోకు పెద్దబావ నూకరత్నం తో హాస్యమాడాడు.
మా కంటూ మీరే కదా బావ పెద్ద దిక్కు మీ వలనే కదా మేము ఈ ఊరొచ్చాం కోపంలో నేను ఏమన్నానో తెలీదు. నా మీద కోపం పెట్టుకోకండి ఏడుస్తూ ఇద్దరి బావల కాళ్ళమీద పడింది నూకరత్నం.

ఇవన్నీ కుటుంబ కలహాలు, ఇట్టే మాయమైపోతాయి. లే!లే! నీ దగ్గర మేము చిట్స్ కట్టొచ్చా నూకరత్నాన్ని బుదిరిస్తూ చిన్నగా నవ్వుతూ అడిగాడు చిన్న బావ.

మీరు చిట్స్ కడతారా? వుండండి చిట్స్ లిస్ట్ తీస్తాను అంటూ తన బ్యాగ్ కోసం వెళ్ళబోయింది నూకరత్నం.

టైం వుంది కదా! నీకు తీరికయినప్పుడు మీ అమ్మని తీసుకుని ఇంటికిరా అప్పుడే చిట్స్ రాస్తాం ఇద్దరు బావలు అన్నారు.

అలాగే ఆనందంగా అంది నూకరత్నం.

ఏకాంబర్ వాళ్ళింటి ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో తాంబూలాల కార్యక్రమం ఏర్పాటు చేసారు. పెళ్ళికొడుకు వాళ్ళు వందమంది పై చిలుకు వస్తున్నామని పెళ్ళిళ్ళ పేరయ్యతో కబురుచేసారు.

ఏకాంబర్ వాళ్ళ బంధువులు, మిత్రులు అంతా కలిసి రెండొదలమంది దాటి పోవడంతో తాంబూలాల కార్యక్రమం కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసాడు పీతాంబరం.

ఉదయం నుండి పేరంటాళ్ళు, అమ్మలక్కలు హడావిడి . నూకరత్నం తల్లి, చెల్లి, తమ్ముడ్ని వెంట తీసుకుని ఉదయం తొమ్మిది గంటలకే హాజరయిపోయింది.

ఫ్రాంచైజీ ఆఫీసులో యువతీ యువకులందరూ ముందే వచ్చి ఏర్పాట్లలో ఏకాంబర్ కి తోడుగా నిలిచారు. ఏకాంబర్ మిత్రుడు అనిల్ భార్యను వెంటబెట్టుకు వచ్చాడు. శంకర్రావు, రామక్రిష్ణ, ఆచారి కళ్యాణమండపం లో పని వాళ్ళ దగ్గర నిలబడి పర్యవేక్షిస్తున్నారు.

ఏకాంబర్ అన్న నీలాంబర్ మాత్రం తనకేమీ పట్టనట్టు ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే వుండిపోతున్నాడు.

పీతాంబరం, పర్వతాలు అంతా గమనిస్తూనే వున్నారు. అంతా ఏకాంబర్ ఒక్కడి భుజస్కందాల మీదే వేసుకుని తిరుగుతున్నాడు. నీలాంబర్ చూస్తే సర్వం పోగొట్టుకున్న వాడిలా డీలా పడి కూర్చుంటున్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana