Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ : చెల్లెలిపెళ్ళిపనుల్లో హడావుడిగా ఉన్న ఏకాంబర్.. ఎమ్మెల్యే ఫోన్ కాల్ రావడంతో అతడింటికి వెళతాడు...

ఆ తర్వాత


" చెప్పండి సార్ ! ఇంత అర్జెంటుగా రమ్మన్నారు " నిలబడే అడిగాడు ఏకాంబర్.

" ముందు సోఫాలో కూలబడండి. నిన్న చనిపోయాడుగా మా బండోడు. అదిగో ఆడి పెళ్ళాం బిడ్డలు. మీ ఇన్స్యూరెన్స్ కంపెనీవోళ్ళకి ఏం కాగితాలు కావాలో రాయించి సంతకాలు తీసుకోండి. " ఆర్డర్ వేస్తున్నట్టే అన్నాడు ఎమ్మెల్ల్యే.ఇక ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదని తన దగ్గరున్న క్లైం ఫారాలు ఇచ్చి దగ్గరుండి వివరాలు అడిగి ఎమ్మెల్ల్యే గారి పి.ఏ. తో నింపించాడు ఏకాంబర్.

కాగితాలన్నింటి మీద మౌనంగా తలవంచుకుని వచ్చి సంతకాలు చేసింది ఆమె. బాగా చదువుకున్నదానికిమల్లే ఇంగ్లీషులో సంతకాలు చేసింది. సంతకం చూసి ఆశ్చర్యం కలిగింది ఏకాంబరానికి.

" ఏం చదువుకున్నారమ్మా? " అప్రయత్నంగా ఆమెని అడిగాడు ఏకాంబర్.

" ఇంటర్ వరకూ నండీ.." ఎంతో వినయంగా అంది ఆ అమ్మాయి.

'పాపం, పాతికేళ్ళు కూడా ఉండవు. ఈ బండోడికి బంతిపువ్వులాంటి అమ్మాయి ఎలా బలయిపోయిందో ' మనసులోనే అనుకున్నాడు ఏకాంబర్.

" చూస్కోండి సంతకాల కోసం మళ్ళా మళ్ళా ఆ పిల్లని ఇసిగించకండి. " అంటూ పి. ఏ. కేసి చూసాడు ఎమ్మెల్యే. 

అతను వెంటనే తన గదిలోకి వెళ్ళి బండోడి మరణ దృవీకరణ పత్రం, పోస్టుమార్టం రిపోర్ట్, ఎఫ్.ఐ.ఆర్ కాపీలు తెచ్చి ఏకాంబర్ చేతికి ఇచ్చాడు. వాటితోబాటే బండోడి పాలసీ బాండులు రెండూ ఇచ్చాడు.

క్షణం ఆశ్చర్యం గా వాటికేసి చూస్తూండి పోయాడుఏకాంబర్.

సామాన్యులకైతే నెలరోజులైనా దొరకని సర్టిఫికెట్లు, ఎమ్మెల్యే గారి పరపతి, పలుకుబడి మూలంగా రెండోరోజుకే ఎగురుకుంటూ వచ్చాయని అనుకున్నాడు మనసులోనే.

" నువ్వెళ్ళమ్మా...పి.ఏగారు! బయట ఉన్న మనోళ్ళని దీన్ని, పిల్లల్ని తీసుకుని ఇంటికాడ ఇడిచిపెట్టి రమ్మనండి.." అంటూ పి.ఏ. నికూడా బయటకు పంపించేశాడు ఎమ్మెల్యే అబద్ధాలరావు.

" క్లైం ఫారాలు, సర్టిఫికెట్లు సర్దుకుని బ్యాగ్ లో పెట్టుకున్నాడు ఏకాంబర్.

" ఏజెంట్ గారు..మా బండోడికి ఎంతొస్తుందో చెప్పలేదు" ఏకాంబర్. చెవి దగ్గర గుసగుసగా అన్నాడు ఎమ్మెల్యే.

"రెండు పాలసీలు పదిలక్షలకు చేసాం కదా సార్. ఈ పాలసీ మొత్తం ఎంతో దానికి మూడు రెట్లు వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ కదా ! " అన్నాడు ఏకాంబర్.

" నాకర్థం కాలేదు." ఏకాంబర్ దగ్గరికి జరిగి అన్నాడు ఎమ్మెల్యే.

"ముప్పై లక్షలు వస్తుంది సార్. " చెప్పాడు ఏకాంబర్.

" వారంలో వస్తుందా? " అడిగాడు ఎమ్మెల్యే.

"అన్నీ కరెక్టుగానే ఇస్తున్నాం కదా సార్.వారంలోపే చెక్కు వచ్చేస్తుంది. " చెప్పాడు ఏకాంబర్. " చెక్కు మీరే నా దగ్గరకు తేవాలి. నా ముందే ఆ పిల్ల చేతిలో పెట్టండి " హుందాగా అన్నాడు ఎమ్మెల్ల్యే.

అతను చెప్పింది విన్నాడే కానీ ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏకాంబరానికి. అల్లాగేనన్నట్టు తలవూపి లేచి నిలబడ్డాడు.

" సార్ ఇక నేను వెళ్తాను. ఇవి రేపే ఆఫీసులో ఇస్తాను. వస్తాను." అంటూ హాల్లోనుంచి రాబోయిన ఏకాంబర్ చటుక్కున ఆగి తిరిగి వెనక్కి వెళ్ళాడు.

"ఏందయ్యా ఏదైనా మర్చిపోయావా?" ఎమ్మెల్ల్యే నవ్వుతూ అడిగాడు.

" లేదు సార్! వచ్చేవారంలో మా చెల్లెలి పెళ్ళి..మీకు కార్డు ఇద్దామని." అంటూనే బ్యాగ్ లో పెళ్ళి కార్డు తీసి ఆయన చేతికి ఇచ్చాడు." శుభం.తప్పకుండా వస్తాను. మీ చెల్లెలి పెళ్ళి పనుల్లో పడి ఆ కాగితాలు మర్చిపోయేవు జాగ్రత్త వారంలో చెక్కు నా చేతిలో పెడితే నీకు దిమ్మతిరిగిపోయే బహుమతి ఒకటి ఇస్తానయ్యా" అన్నాడు ఎమ్మెల్యే.

"అలాగే సార్. వస్తాను. పెళ్ళికి తప్పకుండా రావాలి." చెప్పాడు ఏకాంబర్.

" నా పని కూడా ఈ వారంలోగావాల" గదమాయించాడు ఎమ్మెల్యే.

తలవూపుతూ అక్కడినుండి బయటపడ్డాడు ఏకాంబర్.

అప్పటికే రాత్రి ఎనిమిది కావస్తోంది. ఇంకా చాలామందికి పెళ్ళికార్డులు పంచాల్సి ఉంది. మనసులోనే కార్డులు ఇవ్వాల్సిన వారిల్లు గుర్తు చేసుకుంటూ పోర్టికోలోకి వచ్చాడు ఏకాంబర్.

బైక్ డ్రైవ్ చేస్తున్నాడు ఏకాంబర్. బీచ్ రోడ్డంతా వీధిలైట్లు వెలగక చీకటిగా ఉంది.ఎదురుగా ఏమీ కనిపించడంలేదు.

అతడి మనసంతా చికాగ్గా వుంది. ఏర్పాట్లన్నీ ఎక్కడివక్కడే వున్నాయి. ఇప్పటికింకా కార్డులే పంపకం జరగలేదు.బైక్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడో  తిరుగుతున్నాయి.ఎదురుగా రాక్షసిలా భయంకరంగా కళ్ళను మసకబరుస్తూ మిరుమిట్లుగొలిపే లైట్లతో లారీ దూసుకువస్తోంది.

లారీ మీదమీదకు వచ్చేసరికి హఠాత్తుగా ఎదురున్న లారీని చూసాడు ఏకాంబర్. అప్పటికే ఆలస్యమైపోయింది. లారీని తప్పించబోయి ప్రక్కనున్న డివైడర్ ని గుద్దేసాడు.

అంతే....బైక్ ఓమూల....ఏకాంబర్ ఓ మూల ఎగిరి పడ్డారు. లారీ మాత్రం క్షణం ఆగకుండా రయ్ మంటూ ముందుకు దూసుకుపోయింది.

********************               ************                     ******************

ప్రాంచైజీ ఆఫీసు మూసేసి ఇల్లు చేరుకుంది నూకరత్నం. ఆ రోజు కలెక్షనంతా ఆఫీసు లాకర్ లో పెట్టిందే గానీ భయంభయంగానే ఇల్లు చేరుకుంది.
 

రోజూ సాయంత్రం  ఏకాంబర్ వస్తే అప్పగించేసేది, లేదా,తానే బ్యాగ్ లో,భద్రపరచుకునేది, ఈ రోజెందుకో బ్యాగులో పట్టలేదని ధైర్యం గా గోడ్రెజ్ బీరువాలో వున్న లాకర్ లో దాచిపెట్టి వచ్చేసింది. తీరా ఇంటికి వచ్చాక ధ్యాసం తా ఆ డబ్బు మీదేవుంటోంది. తప్పు చేసానా? అన్న దిగులు పీడిస్తోంది.

అన్య మనస్కంగానే బ్యాగ్ మంచం మీద పడేసి బాత్రూం లోకి వెళ్ళింది. స్నానం చేసి వచ్చింది.ఆలోచనలు ఇంకా వదలటంలేదు.నైటీ ధరించి వంట గది దగ్గరకు వచ్చింది నూకరత్నం. చెల్లెలు, తమ్ముడు ఓ  మూల కూర్చుని బుద్దిగా చదువుకుంటుంన్నారు

ఏకాంబర్ చెల్లెలి పెళ్ళి ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి రత్నం? తల్లి అడిగింది.

ఏమో నమ్మా  ఈ రోజు ఆయన కలవనే లేదు. ఇంకా కార్డులు పంచుతూ ఊరి మీద తిరుగుతున్నారేమో అంది నూకరత్నం.

ఆకలి దంచేస్తోదమ్మా,... అన్నం పెట్టవూ... నీరసం గా అంది నూకరత్నం.

అంతలో గదిలో వదిలేసిన సెల్ ఫోన్ మోగింది.

అదిగో ఆ మహానుభావుడే అయి వుంటాడు.... ఉదయం నుండి కలవలేదు కదా! అంటూ హుషారుగా పరుగున వచ్చి సెల్ తీసింది.

హలో ......ఆనందం గా అంది...

హలో ...రత్నం...  ఒక్కసారి గోపాలపట్నం రాగలవా... అవతలనుండి ఏకాంబర్ లోగొంతుతో మాట్లాడేసరికి అదిరిపడింది నూకరత్నం.

ఏమైంది?...అలా మాట్లాడుతున్నారేమిటీ? ఎక్కడున్నారు? ఆతృతగా అడిగింది నూకరత్నం.

శర్మ హాస్పిటల్లో వున్నాను. చిన్న ఆక్సిడెంట్... నువ్వు వెంటనే రా? ప్లీజ్ అట్నుంచి ఫోన్ కట్ అయిందని గ్రహించి సెల్ పట్టుకుని అచేతనం గా మంచం మీద కూలబడిపోయింది నూకరత్నం.

ఏమైందే? అటునుంచి ఏకాంబరేనా మాట్లాడేది? ఆతృతగా అడిగింది నూకరత్నం తల్లి.

నేను గోపాలపట్నం వెళ్ళాలమ్మా! అర్జెంటూ గాబరాగా నైటీ విప్పేసి చీర కట్టుకుంది.

ఈ సమయం లో ఒక్కదానివే ఎలా వెళ్తావే? నీతో తమ్ముడ్ని తోడు తీసుకెళ్ళు. అంది తల్లి.

అలాగే అంటూ తమ్ముడ్ని తోడు తీసుకుని బయలుదేరింది నూకరత్నం.

రోడ్డు మీదకు రావడంతోనే ఖాళీగా వెళ్తున్న ఆటో ఆపి ఎక్కి కూర్చుని శర్మ హాస్పిటల్ కి వెళ్ళమంది నూకరత్నం.

ఆటో లో కూర్చుని తమ ఫ్రాంచైజీ లో పనిచేస్తున్న యువకులందరికీ ఫోన్ చేసి శర్మ హాస్పిటల్ కి అర్జెంటుగా రమ్మని చెప్పింది.

అర్ధగంటలో శర్మ హాస్పిటల్ ముందు ఆటోదిగి పరుగుపరుగున హాస్పిటల్ రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళింది.

రత్నం... ఎవరో తననే పిలిచేసరికి రిసెప్షన్ దగ్గర నిలబడి ఏకాంబర్ కోసం వాకబు చేయబోతున్న నూకరత్నం గబుక్కున పిలుపు వినిపించి తల త్రిప్పి చూసింది.

రిసెప్షన్ ప్రక్కనే ఒక బల్ల మీద కూర్చుని వున్నాడు ఏకాంబర్.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్