Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు...... చాక్లెట్లు తింటుంటే.....

- హ‌రిప్రియ‌

త‌కిట త‌కిట‌.. పిల్ల‌జ‌మిందార్‌, అబ్బాయి క్లాస్ , అమ్మాయి మాస్‌... ఇలా క‌నీసం యేడాదికి ఒక్క సినిమా చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ట‌చ్‌లో ఉంటోన్న నాయిక హ‌రిప్రియ‌. ఈ క‌న్న‌డ సోయ‌గం.. సౌతిండియాలోని అన్ని భాష‌ల్లోనూ న‌టిస్తోంది. ఆఖ‌రికి తుళునీ వ‌దిలిపెట్ట‌లేదు. ''న‌ట‌న‌కు భాష‌తో ప‌నిలేదు..'' అనే మాట చెప్ప‌డ‌మే కాదు.. చేత‌ల్లోనూ నిరూపించేసింది. ఇప్పుడు 'ఈ వ‌ర్షం సాక్షిగా' సినిమాలో వ‌రుణ్ సందేశ్‌తో జోడీ క‌ట్టింది. ఈ చిత్రం ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ''ఎడా పెడా సినిమాలు చేసేయాల‌న్న ఆత్రుత లేదు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో మంచివే ఎంచుకొంటున్నా... కాస్త ఆల‌స్య‌మైనా ఫ‌ర్లేదు మంచి సినిమా చేస్తే అందులో వ‌చ్చే కిక్కే వేరు..'' అంటోంది హ‌రిప్రియ‌.  గో తెలుగు డాట్‌కామ్‌తో స‌ర‌దాగా మాట్లాడుతూ చెప్పిన సంగ‌తులు ఇవీ...

* తెలుగులో క‌నిపించి చాలాకాల‌మైంది.. ఏంటి కార‌ణం?
- క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళం... ఇలా అన్ని చోట్లా సినిమాలు చేస్తున్నా. తెలుగులో ఖాళీ దొర‌క‌డం లేదు. మంచి పాత్ర‌, నాకూ, నా కెరీర్‌కీ ఉప‌యోగ‌ప‌డుతుంది అనుకొంటేనే తెలుగులో న‌టిస్తున్నా..

* తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం... సౌత్ ఇండియా మొత్తం చుట్టేస్తున్నార‌న్న‌మాట‌..
- మ‌ధ్య‌లో తుళులో కూడా న‌టించా.. తెల్సా..

* అంటే ఈ భాష‌ల‌న్నీ మీకొచ్చా..
- మాతృభాష క‌న్న‌డ పూర్తిగా వ‌చ్చు. తెలుగు మాట్లాడ‌తా. త‌మిళం, మ‌ల‌యాళం కొంచెం కొంచెం వ‌చ్చు... ఫ‌ర్లేదు మేనేజ్ చేసేస్తా.

* ఇంత‌కీ ఎక్క‌డ బాగుంది..?
- క‌న్న‌డ‌లో చేస్తుంటే క‌ష్టం తెలీదు. సొంత భాష క‌దా..??  తెలుగులో క‌మ‌ర్షియాలిటీ ఎక్కువ‌. మ‌ల‌యాళంలో కథ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తారు. ఇక న‌టించే ప‌ద్థతంటారా  అన్ని చోట్లా ఒకేలా ఉంటుంది.

*  తెలుగులో క‌థానాయిక పాత్ర‌ల‌కు అంత ప్రాధాన్యం ఉండ‌దంటారు. మరి మిగిలిన చోట్ల ఎలా ఉంటుంది?
-  అదంతా క‌థ‌ని బ‌ట్టే. క‌థ‌లో క‌థానాయిక పాత్ర‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సంద‌ర్భాలు ఎక్క‌డైనా త‌క్కువ‌గానే ఉన్నాయి.

* ఇంత‌కీ తెలుగులో కావ‌ల్సినంత గుర్తింపు తెచ్చుకొన్న‌ట్టేనా?
- హ‌రి ప్రియ అంటే గుర్తుప‌డ‌తారు క‌దా.. అది చాలు..

* ఇంత‌కీ ఈ వ‌ర్షం సాక్షిగా మీకెలాంటి సంతృప్తినిచ్చింది..
- ఈ సినిమాలో నేను మ‌హాల‌క్ష్మిగా న‌టించా. సినిమాలో హీరో హీరోయిన్ల పాత్ర‌లు రెండూ పోటాపోటీగా ఉంటాయి. న‌టించే ఛాన్స్ ద‌క్కింది. అటు ట్రెడీష‌న‌ల్‌గా, ఇటు మోడ్ర‌న్‌గా క‌నిపించే అవ‌కాశం చిక్కింది. ఇలాంటి అవ‌కాశాలు అరుదుగా ఉంటాయి. ఉంటే ట్రెడిష‌న్ అంటారు, లేదంటే మోడ్ర‌న్‌గా క‌నిపించ‌మంటారు. ఇది టూ ఇన్ వ‌న్‌..

*  ఈ సినిమా థియేట‌ర్లో చూశారా?
- చూశా. సినిమా విడుద‌లైన రెండోరోజే హైద‌రాబాద్‌లో చూశా.

* ఇంత‌కీ వ‌ర్షం అంటే ఇష్ట‌మేనా?
- చాలా. అదొ రొమాంటిక్ ఫీలింగ్‌. వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు చాక్లెట్లు తిన‌డం అంటే మ‌హా స‌ర‌దా..

* అదేంటి... కాస్త డిఫ‌రెంట్‌గా ఉంది..
- ఔను మ‌రి వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు వేడి వేడి బ‌జ్జీలూ, ప‌కోడీలు అంద‌రూ తింటారు. నేను కాస్త వెరైటీ..

* లావైపోతాన‌న్న భ‌యం లేదా?
- లేదులెండి.. నా జాగ్ర‌త్త‌లో నేనుంటా.

* సాస‌సోపేత‌మైన పాత్ర‌లు చేయ‌డానికి సిద్ధ‌మైనా?
- అలాంటి పాత్ర‌లు వ‌స్తే.. అస్స‌లు వ‌దులుకోను. అబ్బాయి క్లాస్‌, అమ్మాయి మాస్‌లో వేశ్య‌గా క‌నిపించా.  నిజానికి అదీ ఓ సాహ‌స‌మే క‌దా. ఈ వ‌య‌సులో ఇలాంటి పాత్ర‌లేంటి??  అని అడిగిన‌వాళ్లూ ఉన్నారు. ఛాలెంజ్ అంటే స‌ర‌దా నాకు. అందుకే ఒప్పుకొన్నా..

* అవార్డు ప్ర‌య‌త్నాలేమైనా చేస్తున్నారా?
- అబ్బే.. అలాంటివేం లేదు. అవార్డుల కోసం సినిమాలు చేసేవాళ్లు ఎవ‌రున్నారిప్పుడు.. చేతులు కాలిపోతాయ్‌.

* మ‌రి ఎలాంటి పాత్ర‌లంటే ఇష్టం..?
- ఫ‌లానా అని చెప్ప‌లేను. ఈ పాత్ర‌కు నేను సూట‌వుతా అనుకొంటే త‌ప్ప‌కుండా చేస్తా, లేదంటే నాకు ఛాలెంజ్ విసిరిన పాత్ర అయినా స‌రే.. వ‌దులుకోను.

* క‌న్న‌డ‌లో మీరు బాగా బిజీఅట క‌దా..
- అవును. అక్క‌డ ప‌ది సినిమాలు చేశా. ఇప్పుడు నాలుగు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

* మ‌రి తెలుగులో మ‌ళ్లీ ఎప్పుడు క‌నిపిస్తారు?
- మంచి పాత్ర వ‌చ్చిన‌ప్పుడు. ప్ర‌స్తుతానికైతే తెలుగు సినిమా ఏదీ ఒప్పుకోలేదు. ఒప్పుకొన్న‌ప్పుడు చెప్తా..

* ఒకే.. ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌..

- కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka