Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Sankranthi

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : విరాట్ , సహస్ర వాదించుకుంటూండగా వంటింట్లో చందూ వడ్డిస్తోన్న టిఫిన్ ని చక్కగా లాగించేస్తుంది దీక్ష. ఇది చూసి కోపం పట్టలేక పేపర్ వెయిట్ విసురుతుంది సహస్ర...ఈలోగా ఏ.ఎస్. పి. ప్రకాష్ నుండి వచ్చిన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటాడు విరాట్......

విరాట్ సహస్ర వంక చూసాడు

ఆమె అచేతనంగా స్పందించటం లేదు

‘‘నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా?  త్యాగరాజన్ లహరికి మరణదండన విధించి చాలా రోజులయింది.  ఆమె కోసం అతని మనుషులు గాలిస్తున్నారు. వాళ్ళ కంటబడితే లహరి ప్రాణాలకే ప్రమాదం.  ఆమెను కాపాడే వారెవన్నా ఉంటే అది నేనే.  సహస్ర ఎక్కడ తప్పిపోయిందో చెప్పు.  దాన్ని నేను కాపాడుకుంటాను.’’

‘‘ఏయ్  ఏ యస్ పి,  నువ్వు చెప్పిన విషయాలు మహదేవనాయకర్  గారికి తెలుసా?’’  ‘‘ఆయనో అమాయకుడు.  ఆయనకేం తెలీదు. ఇప్పటికే తను చూసిన సంబంధం ఇష్టం లేకే సహస్ర ఇల్లొదిలి వెళ్ళిపోయిందనుకుంటున్నాడు’’

‘‘ఆయన చూసిన సంబంధం తాలూకు పెళ్ళికొడుకు నువ్వేనా?’’

‘‘నువ్వు చాలా తెలివైనవాడివిరా.  అన్నీ నాచేతే చెప్పిస్తున్నావ్. ఆ పెళ్ళికొడుకు నేను కాదు.  కాని నా పెళ్ళికూతురు మాత్రం లహరి. దాన్ని చావు నుంచి తప్పించి నేను పెళ్ళి చేసుకుంటాను.’’

‘‘నువ్వు జగన్మోహన్  పెంపుడు కుక్కవని అర్దమవుతోంది. నెలనెలా ముడుపుల రూపంలో ఎంత పడేస్తున్నాడు నీకు?’’

‘‘రేయ్ .............’’  ‘‘అరవక.............. నిజాలు కాస్త చేదుగా వుంటాయి.  నీలా మొరిగే కుక్కల గురించి నాకు బాగా తెలుసు’’

‘‘ఎవడు.............  ఎవడ్రా నువ్వు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావ్,’’

‘‘నీలాంటి వెధవలకి కొరకరాని కొయ్యని. నన్ను కెలికితే నువ్వు తట్టుకోలేవు.  సహస్ర గురించి మర్చిపో.  తననెలా కాపాడుకోవాలో నాకు తెలుసు’’

‘‘అంత మగాడివా?  ఏదో రోజు నాకు దొరక్కపోవురా.  అప్పుడు నీ మగతనం ఏంటో చూస్తాను.  నీ జాయింట్లు తప్పించి నేనేంటో తెలిసేలా చేస్తాను. నాకు మర్యాద నేర్పుతానన్నావ్ గా. రారా మధురైకి రా చూద్దాం.’’

‘‘నీకంత కోరిగ్గా ఉంటే ఎందుక్కాదంటాను?  రేపు తెల్లారే సరికి నీకు మర్యాద నేర్పిస్తాను. కానీ నా కోసం చూడక.  నేను రాక్కర్లేదు చాలా?  ఫోన్ పెట్టెయ్’’

‘‘నాతోనే సవాలా?........  రేయ్  యూ బ్లడీ........ నిన్నూ..........’’

‘‘ఏం చేస్తావ్?  ఎక్కడో చెన్నైలో ఉండే వాడికి మధురై గురించేం తెలుసనుకుంటున్నావా?  నాకు మధురై కొత్త కాదు. అక్కడి మనుషులూ కొత్త కాదు. నీకు ముందు మూడేళ్ళ కిందట అయ్యా సామి అని ఎ యస్ పిగా ఉండేవాడు. నీ కన్నా మూర్ఖుడు. పొగరుబోతు. లంచగొండి. తిరుగుబోతు. ఓ రోజు అర్ధరాత్రి తాగిన మత్తులో నడిరోడ్డు మీద ఓ అమ్మాయిని రేప్  చేయబోతూ నా కంటబడ్డాడు. వాడికే గతి పట్టిందో మీ పోలీస్  కంట్రోల్ రూంలో ఏ పోలీసునడిగినా చెప్తాడు. ఓకే ఈ నెంబరు నీదే కదా? రేపు ఉదయం ఇదే టైంకి ఫోన్ చేస్తాను’’  అంటూ లైన్  కట్  చేసాడు విరాట్.

అక్కడ ప్రకాష్ సంగతెలా వున్నా.....

పక్కన సహస్రకి మతి పోయినట్టు.....

విస్మయంతో అతడ్నే చూస్తోంది.....

ఆమెకు మాట్లాడే అవకాశం యివ్వలేదు విరాట్.  వెంటనే మధురైలోని ఒక నెంబర్ కి ఫోన్ కొట్టాడు.  పది సెకన్ల తర్వాత ఫోన్ లిఫ్టయింది.‘‘ఏరా ధర్మా బాగున్నావా?’’  పలకరించాడు.

అవతలి ధర్మ అనే మధురైకి చెందిన మిత్రుడు విరాట్  గొంతును వెంటనే గుర్తు పట్టేసాడు

‘‘అయ్యా బాబోయ్  విరాట్  ఏరా నువ్వేనా?  ఇది కల గాదు గదా?’’  అంటూ పెద్దగా అరిచాడు

‘‘నేనేలేరా.  ఆశ్చర్యపోయింది చాలు.  మన వాళ్ళంతా ఎలా వున్నారు?’’  అడిగాడు విరాట్.

‘‘అంతా బాగానే వున్నాం గాని ఎన్నిరోజులైందిరా నువ్వు ఫోన్ చేసి.  ఇన్ని రోజులూ ఏమైపోయావ్  ఎక్కడున్నావ్?  కోయంబత్తూర్ లో ఉండటం లేదని తెలిసింది.  నీ ఫోన్ నంబర్లు మార్చేసావ్, ఏమైందిరా?’’

‘‘అదంతా ఫోన్ లో చెప్పే టైమ్ లేదు గాని మన వాళ్ళందర్నీ అడిగినట్టు చెప్పు’’

‘‘చెప్తా గాని మధురై ఎప్పుడొస్తున్నావ్?’’

‘‘టైమ్ పడుతుందిలే. ఈ లోపల ఓ పని చేయాలి.’’

‘‘ఒకటేంటి, పదయినా చేసేద్దాం. ఏం చేయాలి?’’

‘‘మధురై ఎ యస్ పి ప్రకాష్  తెలుసుగదా?’’

‘‘వాడా......... వాడెందుకు తెలీదు.  మెంటల్  వెధవా.  ఇంతకీ విషయం ఏమిటి?’’

‘‘ఆ మెంటల్ గాడికి కాస్త మర్యాద నేర్పాలి.  ఈ రాత్రికే పనైపోవాలి.’’

‘‘మన మర్యాద ఎలా ఉండాలి?  స్ట్రాంగా లైటా?’’

‘‘మీడియం.  వారం రోజులు ఆస్పత్రి బెడ్ మీద పడుండాలి’’

‘‘నాకొదిలెయ్.  పని పూర్తవగానే నీకు ఫోన్  చేస్తాను.  ఇదే నంబర్  గదా’’

‘‘అవున్రా ఇదే నంబరు’’

‘‘ఇంతకీ వాడితో నీకు గొడవేంటిరా?  ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నావు’’

‘‘ముందు పని చూడరా.  వివరాలు తర్వాత చెప్తాను’’ అంటూ లైన్  కట్ చేసాడు విరాట్.

అంత వరకూ సహస్ర చిత్తరువులా నిలబడి విరాట్ నే చూస్తోంది

క్షణక్షణానికీ తన ముందు అతడు చాలా ఎత్తుకు ఎదిగిపోతున్నట్టనిపించింది.  తనకు తెలీని విలక్షణమైన అంశాలు విరాట్ లో చాలా ఉన్నాయనిపిస్తోంది.  లేకపోతే.....

ఎక్కడి కోయంబత్తూర్ ? ఎక్కడి చెన్నై?  ఎక్కడి మధురై?  వీడికి మధురైలో మిత్రవర్గం ఉందా?  భయమంటే ఎలా ఉంటుందో వీడికి తెలీదా?  విరాట్ మాటలకి అక్కడ ఎయస్ పి ప్రకాష్ ఖచ్చితంగా మంచి నీళ్ళు తాగుంటాడు.  ఇంత తెగింపున్న విరాట్  అవసరమైతే తనను కాపాడగలడా?  పరిపరివిధాలా ఆలోచిస్తున్న సహస్ర విరాట్ పిలుపుతో గాని ఆలోచనల నుంచి బయటికి రాలేకపోయింది.

సీరియస్ గా చూస్తున్నాడు విరాట్

‘‘సో....... నీ అసలు పేరు లక్ష్మీ సహస్ర.  వెల్,  నాకేసే.  మేనరికం చేసుకోవటం ఇష్టం లేక నేను చెన్నై పారిపోయి వచ్చాను. ఇష్టంలేని పెళ్ళి తప్పించుకోడానికి నువ్వు పారిపోయివచ్చావ్.  త్యాగరాజన్  మనుషుల నుండి ప్రాణాలు కాపాడుకోడానికి  అజ్ఞాతవాసం గడుపుతున్నావ్. ఎవరూ నిన్ను గుర్తు పట్టకుండా చున్నీతో ముఖం చుట్టుకొని తిరుగుతున్నావు. వచ్చిన అవకాశాన్నుపయోగించుకొని నిన్ను కార్నర్ చేసి తను పెళ్ళి చేసుకోవాలని ఆశపడుతున్నాడు ఏ యస్ పి ప్రకాష్. యామై కరెక్ట్? బట్ నాకింకా కొన్నిసందేహలున్నాయి. అవి కూడ నువ్వు తీర్చేస్తే బాగుంటుంది’’ అన్నాడు.

‘‘ఇప్పుడర్ధమైందిగా నేనెంత ప్రమాదంలో వున్నానో? ఇదంతా నువ్వు చేసిన రచ్చ.  నా ఫోటోతో సహా ప్రకటించి అందరికీ నేను చెన్నైలో ఉన్నట్టు తెలిసిపోయేలా చేసావ్. నిన్నేం చేస్తానో చూడు’’ అంటూ మెరుపు వేగంతో పిడికిలి విసిరింది సహస్ర.

కంటి కొస నుండి ప్రమాదం గ్రహించి వెనక్కి దూకాడు గాని లేకపోతే విరాట్ ముఖం పేలిపోయి ఉండేది.

‘‘ఓ మైగాడ్........... నన్ను కొట్టి చంపేయాలనే ?’’ అరిచాడు.

‘‘నిన్ను చంపినా నా కోపం తీరదు.  నిన్ను కొట్టకుండా వదలను’’  అంటూ మరోసారి పిడికిలి విసిరింది,  ఈసారి  కూడ తప్పించుకుంటూ‘‘ఆగాగు’’.... అనరిచాడు

‘‘నీ వరస చూస్తే కరాటేలో కాస్త కాలు చెయ్యి ఆడించడం నేర్చుకున్నట్టుంది. పందెంలేకుండా మనం కొట్టుకుంటే బాగుండదు’’

‘‘ఒరేయ్.............. మళ్ళీ నన్నిరిటేట్  చేస్తున్నావ్.  నన్ను చూస్తే కాలు చెయ్యి ఆడిస్తున్నట్టుందా?  కరాటే కుంఫూ రెంటిలోనూ మాస్టర్ని.  బ్లాక్ బెల్ట్  హోల్డర్ని. దెబ్బ తగిలితే మంచి నీళ్ళడగవ్?’’

‘‘అబ్బో......... .అయితే ఇంకేం పందెం కాయొచ్చు.  ఎంతయినా నువ్వు నా లవర్ వి. కాబట్టి నిన్ను నేను కొట్టలేను. కాని ఛాన్సిస్తాను తీసుకో.  నువ్వు నన్ను టచ్ చేయగలిగితే నేను ప్రకటించిన కోటి రూపాయలతో బాటు అదనంగా మరో కోటి అంటే రెండు కోట్లరూపాయలు ఇవాళే ఇచ్చేస్తాను. ఒకవేళ నన్ను టచ్ చేయలేకపోయావనుకో..... ఓడిపోయావనుకో.....’’

‘‘ఓడిపోతే’’

‘‘ఒక్క ముద్దివ్వు చాలు’’

‘‘ముద్దు.........’’

‘‘యస్  ఒక్క ముద్దివ్వు చాలు,  నీ ముద్దు నాకు కోట్ల విలువ చేస్తుంది.’’

‘‘నాకు నిన్ను చూస్తుంటే ముళ్ళ కంపలో ఇరుక్కున్నట్టుంది. నన్ను జలగలా తగులుకున్నావేంట్రా? ముద్దు కావాలా! .........  చంపేస్తాను. నిజంగానే నిన్ను చంపేస్తాను’’ అంటూ ముందుకు దూకింది.

‘‘ఏయ్.........  ఆగవే రాక్షసి.  పందెం ఒకే నా కాదా చెప్పు’’ పక్కకు తప్పుకొంటూ అరిచాడు.

‘‘చెప్తాను’’ అంటూ విరాట్ మీదకు దూకింది.

ఆమె కన్నా వేగంగా వెనక్కి దూకాడు విరాట్

ఇక ఇద్దరి మధ్య ఆరంభమైంది పోరాటం

నిజానికి దీన్ని పోరాటం అనలేం

సహస్ర ఆఫెన్స్ లో ఉండి అతడ్ని దెబ్బకొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  విరాట్ డిఫెన్స్ లో ఉండి ఆమె కదలికల్ని పరికిస్తూ ఆమె చేతిగ్గాని కాలిగ్గాని అందకుండా మెరుపు వేగంలో తప్పించుకొంటున్నాడు.సహస్ర మార్షల్  ఆర్ట్స్ లో నిజంగానే మాస్టరని ఆమె కదలికలు నిరూపిస్తున్నాయి.  అదే సమయంలో విరాట్  మాటల మనిషి కాదు చేతల మనిషని, సాధారణ యువకుడు కాదు,  మార్షలార్ట్స్ లో గొప్ప యోధుడని సహస్రకి అర్దమైపోయింది. అతడు కరాటే కుంఫ్ లో మాస్టరే కాదు, నింజాఫైట్ లో ఖచ్చితంగా ప్రవేశం ఉండాలని వూహించింది. లేదంటే చేతికి అందనంత వేగంగా దూకటం సాధ్యం కాదు. అతడ్ని కొట్టి కోపం తీర్చుకోవటం సాధ్యంగాకపోయినా కనీసం అతడ్ని టచ్ చేసి తనేమిటో నిరూపించుకోవాలని సహస్ర తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఆ హాలు యిద్దరికీ ఒక తమాషా వేదికయిపోయింది.  చూడ్డానికి వాళ్ళు చేస్తోంది పోరాటంలా లేదు.  తమాషా గేమ్ షోలా ఉంది.

ఈ లోపల అటు కిచెన్ లో టిఫిన్ చేస్తున్న దీక్ష మధ్యలో ఆపేసి ఉన్నట్టుండి కన్నీళ్ళు పెట్టుకుంది అది చూసి చందూ కంగారుపడి పోయాడు.

‘‘దీక్షా!  ఏమైంది? ఏంటా కన్నీళ్ళు.......... ఇటు చూడు,  ఎందుకీ ఏడుపు?’’  అంటూ ఆమె కన్నీళ్ళు తుడిచాడు.

‘‘విరాట్  మాటలు విన్నావ్ గా?’’.

‘‘వింటే?’’  చందూకి అర్ధం కాలేదు.

‘‘ఆ రోజు అర్ధరాత్రి మధురైలో ఎ యస్ పి అయ్యా సామి నుంచి విరాట్  కాపాడిన అమ్మాయి ఎవరో కాదు,  అది నేనే’’  అంది దీక్ష.‘‘నిజమా?’’  చందూ విస్తుపోయి అడిగాడు.

‘‘అప్పటికే కోర్టులో కేసు వేసి,  ఇంట్లో ఉండటం యిష్టం లేక హాస్టల్లో ఉంటున్నాను.  మా అన్నయ్యల దగ్గర లంచం తీసుకొని నన్ను బెదిరించి కేసు వాపస్ తీసుకునేలా చేయలాని చూసాడు ఎయస్ పి అయ్యా సామి. ఎంక్వయిరీకి ఎయస్ పి గారు పిలుస్తున్నారంటూ ఆ రోజు సాయంకాలం యిద్దరు పోలీసులు వచ్చి నన్ను స్టేషన్ కు తీసుకెళ్ళి కూచోబెట్టారు. యిందులో ఏ మాత్రం సందేహించినా లాయర్ ని సంప్రదించకుండా వెళ్ళేదాన్ని కాదు. తీరా వెళ్ళాక ఎయస్ పి గారు రావాలంటూ నన్ను స్టేషన్ నుంచి పోలీసులు వెళ్ళనియ్యలేదు.  రాత్రి పదకొండు తర్వాత వచ్చాడు అయ్యాసామి, తప్ప తాగున్నాడు అర్ధరాత్రి పన్నెండుగంటలకి నన్ను స్టేషన్ గదిలోకి లాక్కుపోతుంటే ప్రమాదం గ్రహించి వాడి చేతిని బలంగా కరిచి స్టేషన్ లోంచి తప్పించుకున్నాను.  కాని ఆ ఎయస్ పి నన్నొదలకుండా మోటార్  సైకిలు మీద వెంటబడ్డాడు.|

గుడి రోడ్ లో అడ్డ వీధి పక్కన ప్లే గ్రౌండ్  దగ్గర నన్ను పట్టుకోబోయాడు. దిక్కు తోచక కేకలు వేసాను.  ఆ సమయంలో దేవుడి లా తన బైక్ మీద అటుగా వచ్చాడొక యువ కుడు. చీకట్ల మాటున మూఖాలు సరిగా తెలీలేదు.  అతను రావటమే ఎ యస్ పి ని కుక్కను కొట్టినట్టు కొట్టి వాని సర్వీస్ రివాల్వర్ లాక్కున్నాడు. నీ గురించి చాలా విన్నాన్ రా. ఇక నీకు ఉద్యోగంలో కొనసాగే అర్హత లేదు.  అంటూ రివాల్వర్ తో వాడి కుడి మోకాలు మీద మూడు సార్లు షూట్ చేసి రివాల్వర్ ని తుడిచి దూరంగా విసిరేసాడు.  నన్ను తన బైక్ మీద తీసుకెళ్ళి భద్రంగా హాస్టల్ దగ్గర దించాడు.  జరిగింది చేప్తే కోర్టు చుట్టూ తిరగాలి.  ఏమీ చెప్పకు. స్టేషన్ నుంచి హాస్టల్ కొచ్చేసానని తర్వాత ఏం జరిగిందో నీకు తెలీదని చెప్పమని హెచ్చరించి వెళ్ళిపోయాడు.  చీకట్లో అతడ్ని గుర్తుపట్టలేకపోయాను, బహుశ నన్ను అతను గుర్తుపట్టుండడు.

ఆ సంఘటనలో అయ్యా సామి కుడి కాలు మోకాలు వరకు తీసేయటంతో వాడి ఉద్యోగం పోయింది.  ఆ తర్వాత ఈ ఎ యస్ పి ప్రకాష్ వచ్చాడు,  త్యాగరాజన్ తనకి అనుకూలంగా ఉండే ఎయస్ పి నేరప్పించుకుంటాడు,  ఆ రోజు నన్ను కాపాడిన దేవుడు ఎవరని అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటాను. అది ఎవరో కాదు విరాట్ అని ఇప్పుడు తెలిసింది.’’  అంటూ కన్నీళ్ళుతుడుచుకుంది దీక్ష.‘‘ఊ అయితే విరాట్  గురించి తెలిసింది గదా.  ఆ అమ్మాయి నువ్వేనని విరాట్ కి ఇప్పుడే చెప్తాను’’  అంటూ పోబోతుంటే చందూని వెనక్కిలాగింది దీక్ష.‘‘

ఇప్పుడే కాదు గాని ముందు వాళ్ళద్దిరూ రాజీపడనీ’’ అంది సరిగ్గా అదే సమయంలో....

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఒక్కో ఆసక్తికర విషయమూ వెలుగులోకొస్తున్నాయి...ఇంకా ఆశ్చర్యపరచే విశేషాలేమిటి....వచ్చేవారం....

                                                                                                               suryadevaranovelist@gmail.com

                                                                                                               www.suryadevararammohanrao.com

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana