Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Sankranthi

యాత్ర

జరిగిన కథ : మ్యూజిక్ కంపోజింగ్ కని ఆస్ట్రియా బయలుదేరుతుంది సినిమా బృందం. హవేలీలో ఎదురుపడిన షహనాజ్ కళ్ళు డైరక్టర్ జీవన్ ని కట్టిపడేస్తాయి. ఎయిర్ పోర్ట్ కి వచ్చిన షహనాజ్ ని తదేకంగా చూస్తుంటాడు జీవన్...ఆ తర్వాత.....

ఎయిర్ క్రాఫ్ట్ క్రూ చూపించే ఇంగ్లీషూ, హిందీ సినిమాలూ, రకరకాల గేమ్సూ ఉన్నాయి. ఇంకా మనం ప్రత్యేకంగా చూసుకోవాలంటే వాళ్ళ దగ్గరున్న కొన్ని సినిమాల లిస్టు సీటు ముందు బ్యాగ్ లాంటి దాంట్లో ఉంది. అది చూసి పేరు చెబితే కేవలం మనం మట్టుకే సినిమా చూసుకునే సౌకర్యం కల్సిస్తూ ప్లే చెయ్యబడుతుంది.

అలాగే, విమానం ఆకాశంలో ప్రయాణం చేస్తుండగానే ప్రపంచంలో ఎక్కడికైనా మనం ఫోన్ మాటాడుకునే అవకాశం ఉంది. అయితే మన ఇంటర్నేషనల్ బ్యాంక్ కార్డ్ ఫోన్లో    ఇన్ సర్ట్ చేసి మాటాడ్డం మొదలెడితే నిమిషానికి అయిదు యూరోల చొప్పున మన ఎకౌంట్ లో కరెన్సీ తీసుకుంటారు. అదే ఫోన్ ద్వారా ఫ్లైట్ లో వేరే సీటులో ఉన్న వాళ్ళతో మాటాడుకోవచ్చు. దానికి చార్జీ లేదు. అదెలాగంటే ఫోన్ రిసీవరుకున్న బటన్స్ మీద మనం ఎవరితో మాటాడాలనుకుంటున్నామో ఆ మనిషి కూర్చున్న సీట్ నంబర్ ప్రెస్ చెయ్యాలి. ఎవరి ద్వారానో ఫోన్ చెయ్యడం నేర్చుకున్న యోగి, కో – డైరెక్టర్ గంగరాజు తో మాటాడదామనిపించి అతని సీటు నంబర్ G.24 డయల్ చేశాడు. నిజానికి గంగరాజు నెంబర్ G26. రాంగ్ నంబర్ నొక్కడం వల్ల ఫోన్ గాఢంగా నిద్రపోతున్న ఒక అరబ్ షేక్ కి కనెక్టయ్యింది. ఫోన్ రింగ్ కి ఉలిక్కిపడి లేచిన షేక్ “హలో” అన్నాడు.

అట్నుంచి యోగి “టోను మారుస్తావేంట్రా గంగరాజు...?” అన్నాడు.

చిరాకు పడిపోయిన షేక్ అరబిక్ భాషలో తిట్టాడు.

నవ్వేసిన యోగి “మనం ఫ్లైటెక్కి నాలుగ్గంటలన్నా కాలేదు. అప్పుడే అరబ్బుల భాష నేర్చేసుకున్నావ్రా ఇడియట్..?” అన్నాడు.ఇడియట్ అన్న ముక్క చాలా బాగా అర్థమైంది షేక్ కి. తనకి ఫోనెవరు చేశారో ఎయిర్ హోస్టెస్ ద్వారా తెల్సుకుని, దీపావళి నైటు నేలబారున వదిలిన తారాజువ్వలా దూసుకుంటూ యోగి దగ్గర కొచ్చి కాలరు పట్టుకుని మెడ కొరికెయ్యబోతుంటే ఏం మాటాడాలో అర్థం కాని యోగి “గంగరాజనుకున్నాను.... గంగరాజనుకున్నాను” అంటున్నాడు.

“అది కాదు సాయిబూ మావోడు.... అది నీ సీటనుకోలేదురా” అని ఆ అరబ్ షేక్ భుజం మీద చెయ్యి వేసిన గంగరాజు గూబ మీద పెద్ద సౌందొచ్చేలాగ కొట్టేడు.

దాంతో ఉలిక్కిపడ్డ ఫ్లైట్లో వాళ్ళంతా ఒకేసారి ఇటు తిప్పారు వాళ్ళ తలకాయలు.

చెంప తడుముకుంటున్న గంగరాజుని భుజం పట్టుకుని నడిపించుకెళ్తున్నాడు యోగి...! నడుస్తున్న గంగరాజు బ్రేకు లేసినట్టు ఠక్కున ఆగిపోయేసరికి “మళ్ళీ ఏవయింది..?” అన్నాడు యోగి.“ఆ కొత్త హీరోయినూ, కొత్త హీరో గాడూ చూడు ఒకళ్ళనొకళ్ళు ఎలా కర్చుకుపోయి కూర్చున్నారో..! ఆ ఉలెన్ శాలువా ఎంత నైసుగా కప్పుకున్నారో చూడు...” అన్నాడు గంగరాజు.

“ఎందుకు ఆళ్ళని చూసి అంత కడుపు మంట..? నువ్వు కూడా ఈ విమానంలో ఏ తురక పిల్లనో చూసుకోకూడదు...” అన్నాడు యోగి.“నా బాధ అందుకు కాదెహె...”

“మరెందుకెహె...?”

“ఆ పిల్ల వాళ్ళమ్మనీ, నాన్ననీ తన కూడా ఎందుకు రావద్దందో ఇప్పుడర్థమయినందుకు” అన్నాడు గంగరాజు.విండో సీట్ దగ్గర కూర్చుని బయటి చీకటినే చూస్తున్న షహనాజ్ నే చూస్తున్నాడు జీవన్.

ఆ చీకటిని చూస్తానే ఏవేవో కలలు కంటున్నట్టు కళ్ళు కాసేపు మూస్తుంది, కాసేపు తెరుస్తుంది. మధ్య మధ్యలో నవ్వుకుంటుంది.అదంతా చూస్తున్న జీవన్ ఆ షహనాజ్ ని చూస్తా ఎక్కడికో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు.

ఆ షహనాజ్ మట్టుకి జీవన్ని చూడ్డం లేదు.

జీవన్ మట్టుకామెనే చూస్తున్నాడు. చూస్తానే ఊహించుకుంటున్నాడు. ఎన్నో ఊహలు, ఎన్నెన్నో ఊహలు, ఎన్నెన్నో అందాలు, చూడచూడ బంధాలు అని పాడుకుంటున్నాడు.

అక్టోబర్ – 1

ఉదయం ఎనిమిది గంటలకి దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఆగింది ఫ్లైట్.

ఏరో బ్రిడ్జిమీంచి సెక్యూరిటీ చెకింగ్ వేపొచ్చారంతా.

మెటల్ రింగ్స్ ఉన్న బూట్లు వేసుకున్న యోగిని విప్పమన్నారు పోలీసులు. రాజమండ్రి నుంచొచ్చిన గోవిందు మీద ఏం అనుమానం కలిగిందో వాళ్ళకి బూట్లు, బెల్టుతో పాటూ బట్టలన్నీ విప్పించారు. చారల పట్టా పట్టీ డ్రాయరుతో అందరి ముందూ నిలబడ్డానికి చాల ఇబ్బంది పడిపోతున్నాడు గోవిందు. తనకేసి చూసి ఊగిపోతూ తెగ విరగబడి నవ్వుతున్న హరిప్రియని చూసి చాలా మండిపోయిన గోవిందు, దుబాయ్ పోలీసుల్ని పిల్చి “ మీకు అనుమానమొచ్చింది మగోడ్ని గాబట్టి నా బట్టలన్నీ విప్పించెయ్యగలిగేరు. ఆ పిల్ల మెల్లో ఏముందో ఏంటో ఓసారి విప్పించి చూడండి” అన్నాడు.

అర్థం కాని దుబాయ్ పోలీసు తన ఇనప బూటుతో గీవిందు కాలు తొక్కేసాడు.

మెటల్ డిడెక్టర్ తో గోవిందు శరీరమంతా డిటెక్ట్ చేస్తే సరిగ్గా కుడి కాలు దిగాక కుయ్... కుయ్ మని సౌండు రావడంతొ ఆ డిటెక్ట్ చేస్తున్న వాడికేం అర్థం కావడం లేదు. తెగ కన్ఫ్యూజ్ అయిపోతుంటే... ఏంటంటూ వాడి పై అధికారి వచ్చాడు. అతని పరిస్థితీ అదే. డిటెక్టర్ మోకాలి కింద పెట్టినప్పుడల్లా సౌండొస్తుంది. చివరికి తెల్సిందేంటంటే ఎప్పుడో గోవిందు కాలు విరిగినప్పుడు లోపల మెటల్ రాడ్ వేశారట. అదీ సంగతీ..!“ఆ షహనాజ్ మనతో ఎందుకు వస్తుంది...?” జార్జి ప్రసాద్ నడిగాడు జీవన్.“రెండు వారాలు టైమిస్తే షహనాజ్ తనని ప్రేమించిన సాక్ష్యాలు చూపిస్తానని ఛాలెంజ్ చేసాడట. అలా చూపించగల్గితే నేను నిన్ను పెళ్ళి చేసుకోడానికి సిద్ధం అందట షహనాజ్.”“ఒకవేళ చూపించకపోతే నిన్ను ప్రొఫెషనల్ కిల్లర్స్ తో చంపించేస్తాను” అన్నాడట సలీం.“ఆ వజీర్ చాలా తేడా మనిషి, నందిని పంది చెయ్యగలడు. ఇటు చూస్తే భాయి షూటింగ్ కి వస్తున్నాడు”.“ఇంట్లో ఒంటరిగా ఉండే షహనాజ్ ని ఆ వజీర్ ఎలాంటి హింసకి గురి చేస్తాడో అని ఆమెను కుడా ఆస్ట్రియా తీసుకొస్తున్నాడు సలీం” అని చెప్పాడు జార్జి ప్రసాద్.

“14 రోజుల పాటు నరకం అనుభవించాలన్నమాట షహనాజ్” అనుకున్నాడు జీవన్.

జీవనలా అనుకుంటుండగా సరాసరి తనే జీవన్ దగ్గరికొచ్చి కళ్ళతోనే తనతో మాటాడినట్టు, ఆ కళ్ళని చూస్తూనే నీ సంపూర్ణమైన రూపం ఎప్పుడు చూపిస్తావు...? అని నిశ్శబ్ధంగా అడిగినట్టూ, ఆమె నిశ్శబ్ధంగా నవ్వినట్టూ అనిపించినా జీవన్, షహనాజ్ ని ఊహించుకుంటా ఏవేవో కలలుగన్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్