Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvu nalugu yugalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

శివరాత్రి పర్వదినాన నీలకంఠ మహాదేవుని దర్శనం - కర్రా నాగలక్ష్మి

shivaratri

ప్రతి సంవత్సరం ఫాల్గుణ బహుళ చతుర్ధశిని శివరాత్రి గా హిందువులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.ఈ సంవత్సరం శివరాత్రి ఆంగ్ల కేలండర్ ప్రకారం ఫిబ్రవరి 17 న పడింది .శివరాత్రి  హిందువులకు  పరమపవిత్రమైన పండగ. ఆ రోజు భక్తులు సుర్యోదనానికి ముందుగా లేచి నదీ స్నానమాచరించి శివాలయాలలో పంచామృతాలతో ,బిల్వ పత్రాలతో శివునికి అభిషేకాదులు నిర్వహించి వుపవాస దీక్షను ప్రారంభిస్తారు. "ఓం నమః శివాయః "అనే  పంచాక్షరి మంత్రాన్నిజపిస్తూ వుపవాస దీక్షను కొనసాగిస్తారు.శివుడు అభిషేక ప్రియుడు కావున ఆరోజు శివాలయాలలో రుద్రాభిషేకాలను నిర్వహిస్తారు. ఈ వుపవాస దీక్ష వొక్కొక్క ప్రాంతంవారు వొక్కొక్క విధంగా ఆచరిస్తారు. కొందరు మంచినీరు తప్ప మరేమీ పుచ్చుకోకుండా శివరాత్రి నాడు పగలు,రాత్రి , వుపవాసం వుండి మరునాడు శివాభిషేకం చేసుకొని శివునికి నైవేద్యం పెట్టి ఆప్రసాదం తిని వుపవాస దీక్షను విరమిస్తారు. కొందరు వొంటిపూట ఉపవాసం వుంటారు.

శివరాత్రి నాడు పగలుకి యెంత ప్రాముఖ్యత వుందో రాత్రికి అంతకన్నా యెక్కువ ప్రాముఖ్యత వుంది. రాత్రి శివనామ జపం, భజనలతో భక్తులు జాగారం చేస్తారు.

శివరాత్రి యెందుకు జరుపుకుంటారు అనేదానికి ప్రముఖంగా చెప్పే కధలు ముఖ్యంగా యివి  కొన్ని

1)    హలాహలొద్భ్హవమ్

దేవతలు, దానవులు అమృత మంథనం చేసినప్పుడు కౌస్తుభం,కల్పవృక్షం,కామధేనువు, శ్రీమహాలక్ష్మి ,ఐరావతం మొదలైనవాటితో పాటు హాలాహలం కుడా వుద్భవిస్తుంది. దాని ప్రభావం వలన ముల్లోకాలు కాలి భస్మమైపొతాయని భయపడిన దేవతలు విష్ణుమూర్తిని హాలాహలం నుంచి ముల్లోకాలని రక్షింపమని ప్రార్ధింపగా ,విష్ణుమూర్తి పరమశివుడు మాత్రమే హాలాహలాన్ని నియంత్రించ గలవాడని వివరించి ,దేవతలతో శివుని ప్రసన్నం చేసుకొని హాలాహలప్రభావం గురించి ,దాన్ని నష్ట పరచకుంటే జరిగే అనర్దాలగురించి వివరించి ,హాలాహలం నుంచి ముల్లోకాలను కాపాడమని ప్రార్ధిస్తాడు. అప్పుడు శివుడు మునులు,ఋషులు ,దేవతల సూచనని పాటిస్తూ పార్వతి దేవి శివుని కంఠాన్ని వత్తి పట్టుకోగా శివుడు హాలాహలాన్ని గొంతులో పోసుకొని దాన్ని గొంతులోనే వుంచుకుంటాడు. ఋషుల సూచనని అనుసరించి శివుని ఆరాత్రి నిద్రపోనివ్వకుండా వుండేందుకు దేవతలు శివనామ స్మరణతో భజనలు చేసి రాత్రంతా జాగారంచేసి శివుని హాలాహల ప్రభావాన్నించి కాపాడుకుంటారు. హాలాహలాన్ని కంఠంలో వుంచుకున్నందువల్ల "గరళకంఠుడు " ,"నీలకంఠుడు "అనే నామాలతో భక్తులచే కీర్తించబడుతున్నాడు పరమశివుడు .

శివరాత్రి మహిమ తెలియచెప్పే కధలలో "భక్తకన్నప్ప","లుబ్ధకుడు","బిల్వమంగళుడు" , ప్రాముఖ్యత పొందేయి.

శివరాత్రికి మరో కధ  కుడా ప్రచారంలో వుంది. పురాణ కాలంలో వొకమారు విష్ణుమూర్తి కి బ్రహ్మదేవునికి తామిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయమై వాదన వస్తుంది .ఆ వాదాన యెప్పటికి అంతమవకపోయేసరికి శివుడు వారికి అగ్నితో ప్రజ్వలిస్తున్న స్తంబాన్ని చూపి దాని "ఆది"ని కనుక్కోమని విష్ణుముర్తిని ,"అంతం" కనుక్కోమని బ్రహ్మ దేవుని కోరుతాడు. విష్ణుమూర్తి "వరహం " గా మారి భూమిని తవ్వుతూ పాతాళం వైపు వెళ్తాడు, బ్రహ్మ హంసగా మారి ఆకాశంలోకి యెగిరి అంతం కనుక్కోడానికి వెళ్తాడు .విష్ణుమూర్తి,బ్రహ్మ కూడా కనుక్కోలేక వెనక్కి తిరుగుతారు. కానీ బ్రహ్మ కపటంతో ఈస్వరుని నమ్మించడం కోసం "కేతకీ" పుష్పాన్ని (మొగలి పువ్వు)  సహాయం కోరుతాడు . ఆ జ్వలిస్తున్న స్థంభం లోంచి ప్రకటితుడైన ఈస్వరుడు విష్ణుమూర్తి ,బ్రహ్మ లను చూచి వారిలో ఎవరు తెలుసుకోగలిగారో చెప్పమంటాడు. విష్ణుమూర్తి తాను ఆది తెలుసుకోలేకపోయానని ఓటమిని అంగీకరిస్తాడు, బ్రహ్మ మాత్రం అంతం చూసేనని అందుకు ఈ కేతకి పుష్పం సాక్షమని అసత్యం పలుకుతాడు. బ్రహ్మ మాటలకు ఆగ్రహించిన పరమేశ్వరుడు బ్రహ్మకు భులోకంలో పుజలందుకొనే అర్హత లేకుండునట్లు శపించి ,విష్ణుమూర్తి నిజం చెప్పినందుకు సంతోషించి భూలోకవాసుల పుజలందుకొనే అర్హత వుండునట్లు వరాన్నిప్రసాదించి ఇకపైన తానుకూడా లింగరూపం లోనే పూజలుందుకుంతాని చెప్తాడు. ఇది శివరాత్రి నాడే జరిగింది అందుకే శివరాత్రి నాడు రెండో ఝాముముగిసిన తరువాత లింగోద్బవ కాలపూజలు అన్నిశివాలయాలలోను జరుపుతారు. రాత్రంతా జాగరంచెయ్యలలేనివారు లింగోద్భవ సమయం వరకైనా జాగరణ చేస్తారు. అందుకే పెద్దలు జూదమాడుతూనేనా రెండు ఝాములకాలం జాగరణ చెయ్యాలని  చెప్పేరు.

ఇంతటి పుణ్యదినం గురించి తెలుసుకున్తున్నప్పుడు మనం దేవభూమిగా పిలువబడే ఉత్తరాఖండ్ లో వున్న "నీలకంఠ మహదేవ్ " మందిరం గురించి కుడా తెలుసుకుందాం.

ఈ కోవెల హిందువుల పరమ పవిత్రమైన హరిద్వార్ పట్టణానికి సుమారు 42కిమి .. దూరంలో "నార నారాయణ " పర్వత్ శ్రేణులలో 1675మి.. ఎత్తున్న కొండపైన వుంది. హరిద్వార్ కి దేశంలోని అన్ని రాష్ట్రాలనుంచి రైల్ బళ్ళు వున్నాయి. దేశరాజధాని డిల్లి నుంచి  హరిద్వార్ సుమారు 200కిమీ. . హరిద్వార్ నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా నడిచే బస్సులు, టాక్సీలు ,షేర్డు ఆటోలు దొరుకుతాయి. ఋషికేష్ నుంచి కుడా  అన్నిరకాలయిన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. ఋషికేష్ నుంచి సుమారు 20కిమీ. ., గంగకు అవతలి వొడ్డున వున్న స్వర్గాశ్రమమం నుంచి 12కిమి.. దూరం లో వుంది ఈ మందిరం . స్వర్గాశ్రమమం నుంచి కుడా అన్నిరకాలయిన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. చాలా మంది భక్తులు ఈ పన్నెండు కిమీ.లు కాలినడకన కోవెలకు వెళ్తారు. హరిద్వార్ నుంచి వెళ్ళే మార్గంలో రాజాజీ అభయారణ్యం లోంచి వెళ్ళవలసి వుంటుంది . ఇది పెద్దపెద్ద వృక్షాలతో కూడిన అరణ్యం . ఈ అరణ్యం అడవి ఏనుగుల నివాసం కావడంతో తరచూ ఏనుగులు ప్రయాణికులపై దాడి చెయ్యడంతో అప్పుడప్పుడు ఈ మార్గం మూసివేస్తూవుంటారు అధికారులు. దారిలో సాంబార్ లేళ్ళు , నెమళ్ళు కనిపించి కనువిందు చేస్తాయి.

ఈ పర్వతం బ్రహ్మకూటం ,విష్ణుకూటం ,మనికూటం అనే మూడు లోయల మధ్య వుంది  పంకజ్ మరియు మధుమతి అనే జీవనదులు సంగమించిన పవిత్రస్తలం ఇది. నీలకంఠ మహదేవ్ కోవేలకి ఎదురుగా వున్న ప్రాకృతికంగా ఏర్పడ్డ సరస్సులో సహజ జల వుంది. అందుకు ఆనీటికి  చాలా వైద్యగుణాలు వున్నాయని , అందులో స్నానం చేస్తే దీర్ఘ రోగాలు తాగ్గుతాయని భక్తుల నమ్మకం. ఈ కోవెల సంవత్సరం పొడవునా భక్తులకొరకై తెరిచే వుంటుంది. ఎంత చలికాలమైనా ఈ సరస్సులో భక్తులు స్నానాలు చేసి తరిస్తారు. గర్భగుళ్ళో వున్న లింగానికి ఆవుపాలు తేనే చేరుకురసాలతో అభిషేకాలు జరిపి ఆధ్యాత్మిక తృప్తిని పొందుతారు. చుట్టూవున్న కనువిందు చేసే ప్రకృతిని ఆస్వాదించి భక్తులు శారీరిక మానసిక ఆనందాన్ని పాడుతారు.

ఈ ప్రదేశంలోనే ఈశ్వరుడు హాలాహలాన్ని కంఠంలో ధరించి ముల్లోకాలను రక్షించాడని ఇక్కడి స్థల పురాణం చెప్తోంది.

నీలకంఠ మహాదేవుని కోవెలలో సంవత్సరంలో రెండుసార్లు ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి నాడు పార్వతి, పరమేశ్వరుల కల్యాణం జరిగిన రోజున మరియు మాఘ కృష్ణచతుర్దశి శివుడు హాలాహలాన్ని మింగిన రోజున వుత్సవాలు జరుపుతారు. శ్రావణ శివరాత్రి, మాఘ శివరాత్రి గా రెండింటిని వ్యవహరిస్తారు. రెండు శివరాత్రులకు కుడా  ఆయా మాసాలలో పున్నమి మొదలు చతుర్దశి వరకు శివభక్తులు వారివారి గ్రామాలనుండి కావిళ్ళు మోసుకుంటూ కాలినడకన " భం భం భోలే " అనే శివనాస్మరణ చేస్తూ హరిద్వార్ గంగలో స్నానం చేసి వారి గ్రామం నుంచి తెచ్చిన నీటిని గంగలో కలిపి గంగ నీళ్ళు పట్టి నీలఖంఠ్ మహాదేవుని  అభిషేకించి ,తిరిగి గంగ నీటిని తీసుకొని తమ గ్రామం లో వున్న శివలింగానికి అభిషేకించడంతో వారి గంగాదీక్ష పూర్తి ఔతుంది . ఈ గంగాదీక్ష పశ్చిమ బెంగాలు మొదలుకొని ఉత్తర భారతదేశమంతా భక్తిశ్రద్దలతో ఆచరిస్తారు.

వేసవిలో సూర్యుని ప్రతాపానికి  మొత్తం దేశమంతా వేగిపోతూ వుంటే ఇక్కడ మాత్రం చల్లగా ఆహ్లాదకరంగా వుంటుంది . గంగాస్నానం మహాదేవుని దర్శనంతో ఈ జన్మ పాపాలను పోగొట్టుకొని భక్తులు పునీతులౌతారు.

హరిద్వార్ ,రుషికేష్ యాత్ర కై వచ్చేవారు ఓ మూడు నాలుగు రోజులు రుషికేష్ లో వుండి చుట్టుపక్కల వున్నా ఆధ్యాత్మక ప్రదేశాలు దర్శించుకొని ఆహ్లాదాన్నీ ,ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మూట కట్టుకొని వెళ్ళాలన్నదే నాకోరిక.

ఐదు నక్షత్రాల హోటల్స్ నుంచి వుచిత భోజన, వసతి  సౌకర్యాలని అందించే యెన్నో ఆశ్రమాల వరకు యాత్రీకులకు అందుబాటులో వున్నాయి . ఇవన్నీ కుడా  గంగానదిని  ఆనుకొనే వున్నాయి. ఎక్కడ బస చేసినా గంగ యొక్క పవిత్రతని ,పరిశుభ్రతని కాపాడడం మన అందరి కర్తవ్యం  అని మరచి పోకూడదు సుమా!.           

మరిన్ని శీర్షికలు
jyotipatam