Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
colorful festival holi

ఈ సంచికలో >> శీర్షికలు >>

'సుధామ ' ధురం - సుధామ

కుటుంబ బడ్జెట్

ఫిబ్రవరి నెల చివర అనగానే గుర్తొచ్చేది సాధారణ బడ్జెట్. ముందు రైల్వే బడ్జెట్, ఆతరువాత సాధారణ బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టబ్డేది ఏటా ఫిబ్రవరిలోనే కదా! ఆర్థిక మంత్రిగారు చేసే మహత్యం ఏమన్నా వుందంటే అదే! ఉద్యోగస్థులు ఈ బడ్జెట్ లో ఆదాయపు పన్ను రాయితీ పెంపు ఏమన్నా జరుగుతుందా అని ఆశపడతారు. ఏఏ వస్తువుల ధరలు పెరుగుతాయా ఏ వస్తువుల ధరలు తగ్గుతాయా? అని అందరూ ఎదురు చూస్తారు. ఇంట్లో ఇల్లాలు టీవీయో, ఫ్రిజ్ నో కొనమంటే ' బడ్జెట్ అవనీ! ధరలు తగ్గుతాయేమో చూద్దాం ' అంటాడు పతిదేవుడు. ' సిగరెట్ల ధరలు పెరుగుతేనన్నా మా ఆయన మానేస్తాడేమో ! ' అని పాపం మరో ఇల్లాలు ఆశపడుతుంది. ' 'సాధారణ బడ్జెట్ ' గురించి సామాన్యుడు కలలు కనడం ఏటా జరిగే ప్రక్రియే!

" పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయోయ్ సుబ్బారావ్ ! " అని సహోద్యోగి చలపతిరావ్ అంటే " ఎంత పెరిగితే నాకేంటోయ్ ! నేనెప్పుడూ నా స్కూటర్ లో వంద రూపాయల పెట్రోలే పోయిస్తూంటాను " అన్నాట్ట సుబ్బారావు. ఇలాంటి సుబ్బారావులు చాలామందే వుంటుంటారు. ధరల హెచ్చుతగ్గులతో తమకు నిమిత్తం లేదంటూ వుంటారు. ఆ ' పాజిటివ్ తీరు ' కూడా ఒకరకం తుత్తి మరి! అదే తృప్తి! బడ్జెట్ అంటే ' రూపాయి రాకడ- రూపాయి పోకడ ' ఎలా వుంటుందనేది ప్రధానాంశం. కోటీశ్వరులనూ, వాళ్ళ నల్ల ధనాన్నీ ఏమీ చేయలేని ప్రభుత్వ, సాధారణ ఉద్యోగుల నుండి మటుకు పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఇప్పుడు సరికొత్తగా అన్నింటికీ ' ఆధార్ ' లింక్ వచ్చింది. ఒక ఆధార్ కార్డు మీద గ్యాస్ కనెక్షనే కాదు, ఆఖరికి పెన్షన్ కూడా ఆధార్ లింక్ అనివార్యం అయిపోయింది. భార్య ఉద్యోగస్థురాలయితే ఇక భర్త పెన్షన్ పూర్తిగా మర్చిపోవాల్సిందే ! మధ్యతరగతి బ్రతుకులకు ఆర్ధిక స్వావలంబన కోసమేగా ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన ఆగత్యం ఏర్పడింది. వేన్నీళ్ళకు చన్నీళ్ళతో ఒకరి ఆదాయానికి మరొకరి ఆదాయం తోడయితేనేగా ఈ వేతన జీవుల సొంత ఇంటికలలో, పిల్లల పెళ్ళిళ్ళో సాకారమయ్యేది. స్వతంత్ర్య భారతంలో ఉన్నవాడు మరింత ఉన్నవాడు అవుతుంటే, దరిద్రుడు మరీ దరిద్రుడుగా మారుతున్నాడని ఊరికే అనడంలేదు. దారిద్ర్య రేఖకు దిగువున వున్నవారు కొంచెం ఎదిగినా, మళ్ళీ ఆ రేఖ వారి నెత్తికి ఎక్కుతూ , వారిని దిగువునే వుంచుతోంది.

' హలో ఓ ఫైవుందా ? ' అని అప్పారావ్ అప్పు అడిగి బ్రతికే తీరు ' మధ్యతరగతి మనస్తత్వమే ! పక్కింటి పిన్నిగారి నుండి ' నగపూర్ కప్పుతో నాగపూర్ కప్పు కాఫీపొడి ' అప్పు తెచ్చుకునే గృహిణులు వుండేవారు. ఒకప్పుడు అప్పు పుట్టడం కష్టం. ఇప్పుడు రోజులు మారాయి. ' అప్పిస్తాం పుచ్చుకోండి ' అని వెంటబడే కంపెనీలు వాచ్చాయి. ' క్రెడిట్ కార్డు ' ఇవ్వడానికి రెడీగా వుంటున్నాయి ఎన్నో సంస్థలు. క్రెడిట్ కార్డుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్టె కట్టుకునేటప్పుడు కళ్ళు బైర్లు కమ్ముతాయి. క్రెడిట్ కార్డు సొమ్ము వసూలు చేయడానికి బ్యాంకులు, కమెనీలు, రౌడీలను కూడా రంగంలోకి దింపుతున్నాయని వార్తలొచ్చాయి. బాకీ వసూళ్ళకు ఓ సన్స్థ హిజ్రాలను వినియోగిస్తోందనీ వార్తలొచ్చాయి.

మా చిన్నప్పుడు అప్పు చేయడం అంటే తప్పు చేయడం అనే భావనే కలిగించారు మా పెద్దలు. ' దేహీ ! ' అనిఒకళ్ళను చేయి చాచి అడగకూడదనీ, ఎంతటి అవసరానికయినా ముందే జాగ్రత్తపడి ఇంత ధనాన్ని పొదుపు చేసుకు వుంచుకోవాలనీ, ఒకరికి అప్పిస్తే మాత్రం తిరిగి వస్తుందని ఆశించి ఎన్నడూ ఇవ్వకూడదనీ, వాళ్ళకు ఇచ్చేది తిరిగి రాబట్టుకోవడం ఎలా అని మధనపడేట్లయితే ఇవ్వనే కూడదనీ అనే వారు మా నాన్నగారు.

ఒక మామూలు మధ్యతరగతి గుమాస్తాగా వుండిన మా నాన్నగారు ఆరుగురు పిల్లలను పెంచి పెద్ద చేసి, విద్యాబుద్ధులు చెప్పించడానికి తన కుటుంబ బడ్జెట్ ను ఎలా ప్లాన్ చేసుకున్నారా? అన్నది నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే. లే సెక్రటరీ హోదాలో వైద్యశాఖనుంచి మానాన్నగారు అల్లమ్రాజు కామేశ్వరరావుగారు రిటైరయ్యేనాటికి ఆస్తులంటూ ఏమీ కూడబెట్టలేదు. చివర్లో వనస్థలిపురంలో రెండుగదుల ఇల్లు మాత్రం సొంతానికి సమకూర్చుకోగలిగారు. కానీ మేమంతా చదువుకుని మా కాళ్ళమీద నిలబడగలిగేలా చేశారు. మా ఇంటికి బంధువుల తాకిడి కూడా బానే వుండేది. మా అమ్మ రాజేశ్వరమ్మ అందరికీ ఆ బడ్జెట్ లోనే భోజనాలు పెట్టింది మరి.

నేను ' హెచ్. ఎస్.సి. ' కి వచ్చేదాకా మాకంటూ ' పాకెట్ మనీ ' కూడా ఎరగం.! అప్పుడు కూడా నెలకు ఒక రూపాయి మా ప్యాకెట్ మనీ. పదిహేను పైసల కవర్లో, పావలా కవర్లో వాడుతూ నేను కార్టూన్లు వేసి పత్రికలకు పంపితే, పారితోషికంగా ఏ ఆంధ్రప్రభ వారపత్రికో అయిదు రూపాయలు ఎం.ఓ. పంపితే అదో పెద్ద ఆర్జన.! మొదటిసారి ఆంధ్రప్రభ వారే 1967లో అనుకుంటా ! నా కార్టూన్లు పూర్తి నిడివి పేజీలో ప్రచురించినప్పుడు ' శ్రీమతి సుధామ ' అని చెప్పి, 25 రూపాయల ' చెక్ ' పంపించారు. పదహారేళ్ళ కుర్రాడికి బ్యాంక్ ఎక్కౌంట్ అంటూ ఏం తెలుస్తుంది ? అప్పుడే మా నాన్నగారు నాపేర కోఠీ ఆంధ్రాబ్యాంక్ లో ఏ. వెంకటరావ్ అలియాస్ సుధామ అని అక్కౌంట్ ఓపెన్ చేయించి, ఆ చెక్ ని అందులో జమ చేయించారు. నా బ్యాంకు ఖాతా అలా మొదలైంది.! అదో గొప్ప ఆనందం.!

అప్పట్లో మా కాలేజీ ఫీజులూ అవీ కూడా చాలా తక్కువే! మా అబ్బాయిని ఎల్.కే. జీ, యూ కెజీ చదివించినప్పుడు కట్టనంత ఫీజుల సొమ్ముతో, మొత్తం నా చదువులే పూర్తయ్యాయి. అంటే నివ్వెర పోనక్కర్లేదు.! మా అమ్మా నాన్నగారూ మాకు దుబారా నేర్పలేదు. పొదుపునే నేర్పారు. అనవసర వస్తువ్యామోహాలు మాకు ఏర్పడలేదు. అలాగని ఇంట్లో రేడియో లేకుండా ఏమీలేము. కానీ మా యింట్లో ఫోన్ అనేది అప్పుడు ఎరగం. ! అలాగే ' సైకిల్ ' అనేదే వాహనం. మా నాన్నగారికి సైకిలే వచ్చు. మా అన్నయ్య స్కూటర్ నేర్చుకున్నాడు కానీ, గేర్ బండ్లు నడపడం నాకు రాదు. మా నాన్నగారు కూడా తర్వాత తర్వాత టీవీ ఎస్ నడిపేవారు. మా అమ్మను కూర్చోబెట్టుకుని దానిమీదే మలక్ పేట నుండి వనస్థలి వెళ్ళేవారు.

వివాహాలు అయ్యాక ఎవరి కాపురాలు వాళ్ళు ఏర్పరుచుకోవాలన్నదే మా నానగారి సిద్ధాంతం. ! మా అన్నయ్య చేత అలాగే కాపురం పెట్టించారు విడిగా. నా వివాహం అయ్యాక నేనూ-మా ఆవిడా పంజగుట్టలో తొలిగా సంసారం పెట్టినప్పుడు, నాన్నగారు మాకు టేబుల్, కుర్చీ కొనిచ్చారు. అలాగే ఉద్యోగంలోకి చేరగానే పిల్లలం ' ఇంటికి నెలనెలా ఇంత ఇవ్వాలి ' అని నాన్న గారే నిక్కచ్చిగా మాకు అలవాటు చేసారు. ఇంటికి కొంతసొమ్ము ఇచ్చాకే మిగతా సొమ్ముతో మా కుటుంబ బడ్జెట్ రూపొందించుకునేవారం. మా అమ్మగారికీ, మా అత్తయ్య గారికీ కూడా వాళ్ళ అవసరాలు మేం చూస్తున్నా, వారికంటూ కొంత సొమ్ము చేతికి ఇవ్వడం అలాగే అలవాటయ్యింది నాకు నెలనెలాను.

పెళ్ళయ్యాక నేనూ-మా ఆవిడా మా కుటుంబ బడ్జెట్ ను నెలనెలా రాసుకుని ఇంటి అద్దె, పాలవాడు, పనిమనిషి దగ్గనుంచి, ఫీజులకు, మందులకు అంటూ సొమ్ముని వాటికి నిర్దేశించిన కవర్లలో పెట్టి వుంచి ఖర్చుపెట్టేవాళ్ళం. నెలమొదట్లో జీతం అందుకోగానే ఆ కవర్లలో డబ్బులు పెట్టడం ఓ పని. దేని కవరు దానిదే. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే కవర్లోంచి సొమ్ము తీసి, మరి దేనికో ఖర్చుపెట్టే ప్రశ్నే లేదు. అప్పట్లో జీతం ఇప్పట్లోలాగా బ్యాంకు ఖాతాలో వేసి,  ఏటీ ఎం ల ద్వారా డ్రా చేసుకోవడం కాక ఆఫీసులో క్యాషియర్ దగ్గర్నుంచి జీతం తీసుకోవడం కనుక, తగిన చిల్లరనోట్లు కూడా తీసుకుని, కవర్లలో మేం తదనుగుణంగా సర్దిపెట్టి , ఖర్చు పెట్టుకునేవాళ్ళం. మిస్ లేనియస్ కు వేరే కవరు వుండేది.

మొన్న బీరువా సర్దుతుంటే అప్పటి కవర్లు కనబడ్డాయి. ఇప్పుడలా కవర్లలో పెట్టడంలేదు గానీ, బడ్జెట్ రాసుకోవడం మాత్రం చేస్తూనే వున్నాం. ఇంటి అద్దె లాంటివి ఇప్పుడు లేక సొంత కొంపే కనుక, అద్దె లేకున్నా మెయింటెనెన్స్ వుంటుంది కదా ! ఇప్పుడు ఏ.టీ.ఎం లోంచి వందలూ, అయిదు వందలూ తప్ప యాభైలూ, ఇరవైలూ, పదులూ నోట్లు రావు కదా ! అంచేత చెల్లింపులప్పుడే ఆ వ్యవహారాలు చూసుకోవడం.కవర్లో చిల్లరతో సహా పెట్టడం ఆ రోజుల్లో కుదిరింది గానీ ఇప్పుడు కష్టమేమరి. చెల్లింపుల పద్ధతులూ మారిపోయాయి. కొన్ని ఆన్ లైన్ లోనే చెల్లించేయొచ్చు. ఇప్పుడు ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు అన్నీను కచ్చితంగా మా నాన్నగారి పెంపకమే కారణం - అప్పు చేయడం అనేదీ, అందునా ' చేబదుళ్ళు ' అనే ప్రస్తావనే లేకుండా , ఇన్నేళ్ళుగా సాగుతూ వస్తున్నాం.! సొంత ఇల్లు ( అపార్ట్ మెంట్ ) అమర్చుకోవడానికి ఎల్.ఐ.సీ. వారి దగ్గర హౌసింగ్ లోను తప్ప, ఇంతవరకూ వేరే అప్పులేవీ చేయలేదు. అదృష్టవశాత్తూ నేను రిటైరయ్యేటప్పటికి ఆ హౌసింగ్ లోనూ తీర్చేయడం జరిగింది. జమ చేసుకున్న మొత్తంతోనే అప్పు చేయకుండానే కారు కొనుక్కోవడం జరిగింది( నాకు నడపడం రాకపోయినా) అంచేత అప్పుచేసి పప్పుకూడు తినాల్సిన అగత్యం రాలేదు.

ఇంతకీ చెప్పదలుచుకున్న సంగతి ' దుప్పటి వున్నంత వరకే కాళ్ళుచాచుకో ' అన్నట్టు స్తోమతను మించిన హంగులూ ఆర్భాటాలకు వెళ్ళక, ఇతరులతో పోల్చుకుంటూ కృంగిపోక, ఎప్పటికి ఏది అమర్చుకోగలమో అది-అప్పు చేయకుండానే అమర్చుకుంటూ, ప్రణాళికాబద్ధంగా పొదుపు చేసుకుని, అందులోనే ముఖ్యావసరాల ఖర్చులు అధిగమిస్తూ, మా కుటుంబ బడ్జెట్ ను అమలు పరిచాం. అందువల్ల తృప్తిగా, హాయిగా ఎవరికీ అప్పు లేమన్న ధీమాతో నిశ్చింతగా వున్నాం. అంతకుమించిన హాయి ఏమిటి చెప్పండి.! అదీ మా కుటుంబ బడ్జెట్ కథ. సాగుతున్న ఆర్థిక ప్రణాళిక. బడ్జెట్ రూపొందించే ఆర్ధికమంత్రి మాత్రం ' కరణేషు మంత్రీ ' అనే మా ఆవిడ ఉషారాణియే! హోం మంత్రి కూడా ఆవిడే సుమండీ.! అందుకే మా గృహరాష్ట్రం  లోటు బడ్జెట్ లేక సాఫీగా సాగిపోతోంది. అదీ విషయం.

మరిన్ని శీర్షికలు
horoscope