Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Heroine from Konidela Family

ఈ సంచికలో >> సినిమా >>

అక్షరాల్లో కథ వేరు - కదిలే కథ వేరు

Story in Letters

సినీ పరిశ్రమలోనే కాదు, ఎక్కడయినా సరే ‘ఎవరి పని వారు చేస్తే మంచిది’ అన్న ప్రస్తావన ఎక్కువగా విన్పిస్తుంటుంది. సినీ పరిశ్రమలో అయితే వివిధ విభాగాలపై ఆసక్తితో కొందరుంటారు. మరికొందరు అన్నిట్లోనూ వేలు పెట్టేసి కెలికేయాలనుకుంటారు. అలా కెలికేసే బ్యాచ్‌ కారణంగా చాలా సినిమాలు మట్టి కరిచేసిన దాఖలాలూ కోకొల్లలు.

అదలా వుంచితే, ఓ విభాగానికి చెందినవారు ఇంకో విభాగంలో రాణించిన సందర్భాలూ వున్నాయి. నటులు దర్శకులయ్యారు, దర్శకులు నటులయ్యారు, దర్శకులు సంగీత దర్శకులు అయిన సందర్భాలకూ కొదవేం లేదు. సంగీతం, దర్శకత్వం, నటన, నిర్మాణం, డైలాగ్స్‌, పాటలు పాడటం.. ఇలా చెప్పుకుంటూ పోతే, 24 విభాగాల్లో అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు వచ్చినవారు తక్కువేం కాదు. కానీ, అలా జంపింగ్‌ చేసినవారిలో అతి తక్కువమందే సక్సెస్‌ చవిచూశారు.

రైటర్లు డైరెక్టర్లుగా మారినా అంతే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కొరటాల శివ.. ఇలా ఈ మధ్యకాలంలో అతి తక్కువ మంది రైటర్లు దర్శకులుగా మారి తమ సత్తా చాటుకున్నారు. అలాగని అందరు రైటర్లూ దర్శకులు కాలేరు. వంశీ డైరెక్టర్‌ కమ్‌ రైటర్‌. దాసరి నారాయణరావు వంటి హేమా హేమీలకు మాత్రమే అది చెల్లిందన్నది నిర్వివాదాంశం.

ఇంకా సరిగ్గా చెప్పాలంటే, కాగితమ్మీద కథ రాయడం వేరు. దాన్ని సెల్యులాయిడ్‌పై వేయడం వేరు. ఒకదానిపై పట్టున్నవారికి ఇంకోదానిపై ఆసక్తి వుండొచ్చుగానీ, కమాండ్‌ వుండడం చిన్న విషయం కాదు. ఎక్కడో ఒకటీ అరా సక్సెస్‌లున్నాయని, అక్షరాల్లో కథను రాసేవారు, సెల్యూలాయిడ్‌పైనా తామే దాన్ని చూపాలనుకునేవారెవరైనా, అలాంటి ప్రయోగాలు ఎక్కువగా విఫలమయ్యాయనే విషయం గుర్తుంచుకోవాలి.

మరిన్ని సినిమా కబుర్లు
Dana Karna Movie