Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - సమ్ థింగ్ సమ్ థింగ్

Movie Review - Something Something

 

చిత్రం : సమ్ థింగ్ సమ్ థింగ్
తారాగణం: సిద్ధార్థ్, హన్సిక, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: సి సత్య
కెమెరా: గోపి అమర్నాథ్
నిర్మాతలు: సుబ్రహ్మణ్యం, సురేష్
దర్శకత్వం: సుందర్ సి
విడుదల తేదీ: 14 జూన్ 2013

"తీయ వేలై సెయ్యునుం కుమారు" టైటిల్ తో తమిళం లోనూ, "సంథింగ్ సంథింగ్" అనే తెలుగు టైటిల్ తో.... క్షమించండి ఆ ఇంగ్లీష్ టైటిల్ తో తెలుగులోనూ తయారైన ఈ చిత్రం నేడు విడుదలయ్యింది. వివరాల్లోకి వెళ్దాం.

క్లుప్తంగా చెప్పాలంటే:
అమ్మాయిలన్నా, ప్రేమన్నా అస్సలు ఇష్టం లేని ఒక యువకుడి జీవితంలోకి ప్రవేశించిన అమ్మాయి తనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేదే ఇందులోని కథాంశం. కథనమంతా హాస్య ప్రధానమే.

మొత్తంగా చెప్పాలంటే:
పైన క్లుప్తంగా చెప్పుకున్నదాన్నిబట్టి సహజంగా "మన్మధుడు" గుర్తొస్తుంది. కథ ఏదైనా కథనం తో ఎన్ని రకాలుగానైనా కొత్తదనాన్ని తీసుకురావొచ్చని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ఎక్కడా కథనం బరువెక్కకుండా పరుగెడుతుంది.

సిద్ధార్థ్ కి ఇలాంటి పాత్రలు పోషించడం కొట్టిన పిండి. అక్కడక్కడా కమల్ హాసన్, మిస్టర్ బీన్ లను గుర్తుతెచ్చినా, తన సహజత్వాన్ని వీడకుండా పండించాడు ఒక అమాయిక ప్రేమికుడి పాత్రని.

హన్సిక ఎప్పటిలాగానే వెన్నెల బొమ్మలా ఉంది.

ఇక ఈ చిత్రానికి వెన్నెముక లాంటి పాత్ర బ్రహ్మానందానిది. లవ్ గురు ప్రేమ్ జీ గా నవ్వులు మొలిపించాడు. అసలు ఈ సినిమాలో హీరో లాంటి హీరో, విలన్ లాంటి విలన్ పాత్ర అది.

తమిళం లో ఈ పాత్రను అక్కడి ప్రముఖ హాస్య నటుడు సంతానం పోషించాడు. అతిధి పాత్రల్లో సమంత, రాణా కనిపిస్తారు.

ప్రధమార్థం చాలా సరదాగా నడిచి ఒక ట్విస్టుతో ఇంటర్వల్ అవుతుంది. ద్వితీయార్థం కూడా ఎక్కడా విసుగు తెప్పించదు.

గోపి కెమెరా పనితనం, సత్య నేపధ్య సంగీతం కథనంలో పట్టుకి తోడ్పడ్డాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే: చూడొచ్చు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

 

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka!