Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka!

ఈ సంచికలో >> సినిమా >>

గాయని మాళవికతో ప్రత్యేక ఇంటర్వ్యూ

Interview with Singer Malavika

"ఒక్క ఫోన్ కాల్ కే వచ్చేశారు బాలకృష్ణ గారు " -  గాయని మాళవిక

చిన్న వయసులోనే పెద్ద పాటలు పాడి - అవార్డులతో పాటు దేశ విదేశాల్లో మంచి గాయనిగానే కాకుండా మంచి అమ్మాయి గా కూడా పేరు తెచ్చుకున్న మాళవిక గురించి ఆమె మాటల్లోనే .. కొంత ముఖాముఖీగా ...

" మొదట ఇది చెప్పు ... ఇంత చిన్న వయసులో ఒక చిత్ర గారో లేదా ఓ శ్రేయా గోషలో పాడితేనే తప్ప న్యాయం జరగని లాంటి -  'అమ్మా అవనీ' (రాజన్న) - పాటని పాడే చాన్స్ నీకెలా వచ్చింది ?"
"ఒక రాగం మీద అధార పడిన పాట (రాగా బేస్డ్) , స్వరాలున్న పాట, చాలెంజింగ్ గా వుండే పాట పాడాలని వుంది అంటూ కొన్ని ఇంటర్ వ్యూలలో చెబుతూ వచ్చాను. అది చూసి కీరవాణి గారు నాకు ఈ చాన్స్ ఇచ్చారనుకుంటున్నాను "

" ఆ ఒక్క పాటకే చాలా అవార్డులు వచ్చాయి కదా ? "
"నందీ అవార్డ్ తో కలిపి అయిదు "

" ఆ పాట నేర్చుకోవడానికి ఎంత టైమ్ పట్టింది ? "
"  దాదాపు ముప్ఫై నిముషాలు ... "

" మరి రికార్డింగ్ ఎక్స్ పీరియెన్స్ ? "
" అది కూడా చాలా సులువుగా జరిగిపోయింది .... కీరవాణి గారు శాటిస్ ఫై అయ్యారో లేదో అనుకుంటునే వున్నాను.  కొన్ని రోజుల తరువాత మళ్ళీ పిలుపొచ్చింది - చిన్న కరెక్షన్స్ వున్నాయంటూ -  దాంతో ఏదో తప్పు చేసి వుంటాను, అందుకే మళ్ళీ పాడిస్తున్నారు అనుకున్నాను.  తీరా వెళ్తే  'మరికొన్ని స్వరాలు యాడ్ చేశాం .. '  అన్నారు. నిజానికి ఆనందపడాలి ... కానీ ఆ రోజు నాకు విపరీతమైన జలుబు. దాంతో - ఇక అయిపోయింది మొత్తం తీసేస్తారు - అనుకుంటూ పాడేను. ఈ స్వరాలు కొంచెం హై పిచ్ లో వుండడం తో జలుబు ఎఫెక్ట్ కొంత తెలియలేదు.  ఎడిటింగ్  అయ్యాక చూసుకుంటే ఏది జలుబు గొంతుతో పాడానో నేనే పోల్చుకోలేకపోయాను. "

" అవార్డులు కాకుండా నీకొచ్చిన ఎప్రిసియేషన్సు ? "
" చాలా వున్నాయి . అందులో ముఖ్యమైనది - ఒక ప్రోగ్రామ్ లో ఈ పాట పాడేను. ఆ ప్రోగ్రామ్ కి జడ్జ్ గా ప్రముఖ గాయని జమునారాణి గారు వచ్చారు. 'ఇవాళ్టినుంచి నేను మాళవిక ఫాన్ ని ' అన్నారు . చాలా గ్రేట్ గా ఫీలయ్యాను. ఆ తర్వాత యు.ఎస్. కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఈ పాటనే పాడమనడం , కొందరైతే నేర్చుకోవడం ఇవన్నీ ఎప్రిసియేషన్సు, స్వీట్ మెమొరీస్ "

" సింగరయ్యాక చాలా దేశాలు తిరిగినట్టున్నావ్ ? "
" అవును బాబాయ్ ... యు.ఎస్. 10 సార్లు, యు.కె. 3 సార్లు, సింగపూర్,  మలేషియా,  దుబాయ్,  అబుదాబి, కువైట్,  బెహరాన్ ఒక్కొక్కసారి వెళ్ళాను "

" సింగర్ గా ఈ స్టేజ్ కి రావడానికి ముందు స్టేజ్,  స్టేజ్ ప్రోగ్రామ్స్ వాటి గురించి చెప్పు .. "
" మా అమ్మ మ్యూజిక్ టీచర్ . పేరు సరస్వతి.  జూలై 6 న పుట్టాను . ఆవిడ మ్యూజిక్ టీచర్ కావడంతో ఇంట్లో ఎప్పుడూ  సంగీత వాతావరణం వుండేది. అంచేత శ్రద్ధగా కాకపోయినా బేసిక్స్ అమ్మ దగ్గిర నేర్చుకున్నాను. ఆ తరువాత రామానుజసూరి గారి దగ్గిర వన్ ఇయర్, మండపాక శారద గారి దగ్గిర మూడేళ్ళు సంగీతం నేర్చుకున్నాను. స్కూల్ లో ఏ కాంపిటీషన్ అయినా పాడేదాన్ని. "

" ఆ రోజుల్లో నీ ఫేవరెట్ , పేటెంట్ సాంగ్స్ ఏమిటి ? "
" భరతావని భువిలో పావని అనే ప్రైవేట్ సాంగ్, మైఖేల్ జాక్సన్ హీల్ ది వరల్డ్ సాంగ్, వందేమాతరం (హిందీ) సినిమాలోని లతా గారి హే.. మా ...ఆ.. ఆ.. అనే పాట .. ఇవే పాడేదాన్ని ... "

"మరి సినిమా చాన్స్ లు ? "
"అదే చెప్పబోతున్నా ... ఈటీవీ వారు ' పాడుతా తీయగా 'పిల్లల సీరీస్ అని అనౌన్స్ చేశారు. దానికి క్యాసెట్ పంపాలి. ఇంట్లో  రికార్డ్ చేసి పంపడం కన్నా స్టూడియో లో అయితే బాగుంటుందని - అప్పుడు వైజాగ్ లోనే వుండేవాళ్ళం కనుక - వైజాగ్ లోనే వున్న ఆశీర్వాద్ గారి స్టూడియోలో రికార్డ్ చేసి పంపించాం. నా పాట విని ఆశీర్వాద్ గారు ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో పాడించారు. అప్పుడు నేను 6th  క్లాస్ లో వున్నాను. పాడుతా తీయగా లో సెలెక్ట్ అయ్యాను. ఫైనల్స్ లో విన్నర్ గా కూడా వచ్చాను."

"ఇప్పుడు సింగర్స్ గా వున్నవాళ్ళలో అప్పుడు నీతో పాటు పార్టిసిపేట్ చేసినవాళ్ళలో వున్నారా ? "
" అంజనా సౌమ్య, కారుణ్య వున్నారు"

" ఆ తరువాత ? "
" ఆశీర్వాద్ గారే 'రాక్ ఫోర్డ్' అనే ఇంగ్లీష్ మూవీ లో ' త్రూ ది మైరాయిడ్' అనే పాట పాడించారు. నగేష్ కుకునూర్ డైరెక్షన్. ఆ తరువాత ఆయనదే మరో ఫిల్మ్ 'బాలీవుడ్ కాలింగ్'  సినిమా లో 'దిల్ యె మేరా' అనే డ్యూయెట్ శంకర్ మహదేవన్ గారితో పాడించారు. 'మనసుతో' సినిమాలో ఆశీర్వాద్ గారే 'గోదారి లాగ' అనే పాట పాడించారు. "

" మరి గంగోత్రి లో పాడడం ఎలా జరిగింది ? "
" ఇవన్నీ 9th  స్టాండర్డ్ లోగానే అయ్యాయి. ఓసారి విజయనగరం లో ఆత్రేయ కళాపీఠం వారి ప్రోగ్రామ్ జరిగింది. దానికి కీరవాణి గారు గెస్ట్ గా వచ్చారు. మాకు తెలిసిన దూరపు బంధువు ద్వారా నేను పాడిన పాటల్ని కీరవాణి గారికి అందజేయడం జరిగింది. అది విని ఆయన పిలిపించారు. అప్పుడు 10th  క్లాస్ లో వున్నాను. చెన్నై లో కోదండపాణి ఆడియో ల్యాబ్ లో రికార్డింగ్. కీరవాణి గారు 10 నిముషాల్లో వస్తాను ఈలోగా పాట నేర్చుకో అని వెళ్ళిపోయారు. ఆ పాట  - నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం - 15 నిముషాల్లో రికార్డింగ్ అయిపోయింది. భయంతో ఏ సినిమా లాంటి వివరాలేవీ అడగలేదు. వైజాగ్ వచ్చేశాం. తర్వాత మరో పాట వుందని మళ్ళీ పిలిపించారు. అది - ఓక తోటలో - ఆడియో రిలీజ్ అయ్యాక తెలిసింది. అది గంగోత్రి సినిమా అని.  మొదట పాడిన బాలూ గారితో డ్యూయెట్  అని, తర్వాత పాడిన పాట ఎస్పీ చరణ్ తో డ్యూయెట్ అని."

" అప్పుడెప్పుడో శ్రీదేవి గురించి చెప్పుకునేవారు - ఏయన్నార్ తో, నాగార్జున తో నటించిన హీరోయిన్  అని.   అలా తండ్రీ కొడుకులతో ఒకే సినిమాలో పాడిన సింగర్ వి నువ్వే నేమో ?"
"కరక్టే ... కానీ ఇవన్నీ నాకు తెలియకుండా జరిగినవే ... ఆ తరువాత వరసగా - కోటి గారు,  వందేమాతరం గారు, మాధవపెద్ది సురేష్ గారు,  ఆర్పీ గారు, చక్రి గారు ఇలా అందరూ పిలవడం మొదలుపెట్టారు.  మాటిమాటికి వైజాగ్ నుంచి రావడం ఇబ్బంది గా అనిపించి హైద్రాబాద్ షిఫ్ట్ అయిపోయాం. మా సిస్టర్ ఎమ్.సి.ఏ. చేసింది తనకు హైద్రాబాద్ లో జాబ్ రావడం తో మరింత సులువైంది. వన్ ఇయర్లో నాన్నగారు కూడా ట్రాన్స్ ఫర్ చేయించుకుని  వచ్చేశారు. హైద్రాబాద్ వచ్చాకే బీకామ్, బి.ఎ.(మ్యూజిక్) కంప్లీట్ చేశాను. ఇవన్నీ ఇలా వుండగా మణిశర్మ గారు నాతో ఒంటరి, వరుడు, బిల్లా, ఏక్ నిరంజన్, ఖలేజా, రచ్చ సినిమాల్లో పాడించిన పాటలు నేను అన్ని రకాల పాటలూ పాడగలనన్న నమ్మకాన్ని అందరిలోనూ కలిగించాయి "

" ఇంతకీ పెళ్ళెందుకు చేసేసుకున్నావ్ సడన్ గా ? "
"సడన్ గా ఏం కాదు ...  దాదాపు మూడేళ్ళ క్రితం అనుకున్నది. 2010 లో యు.కె. లో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వల్కనో (లావా) వల్ల యాష్  క్లౌడ్స్ వచ్చాయి. ఫ్లయిట్స్ కాన్సిల్ అయి బంధువుల ఇంట్లోనే అనుకోకుండా వారం రోజుల పాటు వుండిపోవలసి వచ్చింది. అక్కడ వాళ్ళింటికి కృష్ణ వచ్చాడు. తనక్కడే ఎం.బి.ఏ. చేసి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. మేం సరదాగా మాట్లాడుకునే వాళ్ళం గానీ లవ్వు, ప్రేమా లాంటివేవీ అనుకోలేదు.  కానీ మా బంధువులు అనుకున్నారు. పెద్దవాళ్ళ మధ్య 15 -20  రోజుల పాటు డిస్కషన్స్ నడిచాయి. వాళ్ళు ఓకే అనుకున్నారు. అలా మా పెళ్ళి కుదిరింది. ఇలా సంబంధం అనుకున్నాక కృష్ణ అక్కడి కంపెనీ ద్వారానే ఇండియా కి వచ్చేశాడు. ప్రస్తుతానికి ఢిల్లీలో వుద్యోగం. అతి త్వరలో హైద్రాబాద్ కి ట్రాన్స్ ఫర్ వచ్చేస్తాడు. "

" పెళ్ళి తర్వాత అవకాశాలు ఎలా వున్నాయి ...   పైగా మీవార్ని కలవడానికి డిల్లీ ప్రయాణాలు ఎక్కువైనాయి కదా ? "
" మా టీవీ సూపర్ సింగర్స్ పుణ్యమా అని నన్నందరూ తమ ఇంట్లో అమ్మాయి గా ఫీల్ అవుతున్నారు  బాబాయ్ ...అంచేత అందరూ కో ఆపరేట్ చేస్తున్నారు "

" నీ పెళ్ళికి సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, రచయితలు వచ్చారంటే ఓకే మరి హీరో బాలకృష్ణ రావడం ఆశ్చర్యం కలిగించింది చాలామందికి ... "
" అది నిజంగా మిరకిలే బాబాయ్. యూకే లో ఒక ప్రోగ్రామ్ కి బాలకృష్ణ గారు గెస్ట్  గా వచ్చారు. ఆ ప్రోగ్రామ్ లో నేను పాడుతున్నాను. నా పాట విని ఆయన 'బసవరామ  తారకం ట్రస్ట్ కి ఫండ్ రెయిజింగ్ ప్రోగ్రామ్ మాంచెస్టర్ లో చేస్తున్నాను. నువ్వు పాడాలి" అన్నారు.    నేను,   శ్రీకృష్ణ ఆ ప్రోగ్రామ్ ఫ్రీ గా పాడాం. అప్పుడు ఆయన తో ఏర్పడిన పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని పర్శనల్ గా ఇన్విటేషన్ ఇద్దామని ప్రయత్నించాను. కుదర్లేదు. రేపు  పెళ్ళి  అనగా బైటికి రాలేని పరిస్తితుల్లో ఫోన్ చేశాను. లక్కీగా ఫోన్ లో దొరికారు. 'ఇలా ట్రై చేశానండి .... ' అంటూ చెప్పాను. 'ఏం పర్వాలేదు .. నేనొస్తాను ' అన్నారు. అంత పెద్ద హీరో ... నిజంగా వస్తారా అనుకున్నాను. ఒక్క ఫోన్ కాల్ కే వచ్చేశారు .... అందరం ఎంత హ్యాపీ గా ఫీలయ్యామో !?"

" సో ... ఇప్పుడంతా ఎంకరేజింగా మొత్తం అంతా బాగానే వుంది కదమ్మా !?"
" అంతా బాగానే వుంది బాబాయ్ ... దేవుడి దయవల్ల , పెద్దల  ఆశీర్వాదం వల్ల ..."

రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Raja Music Muchchatlu