Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aaditya hrudayam - vn adithya

ఈ సంచికలో >> సినిమా >>

రాలిన తారకి ఆర్జీవీ నివాళి

RGV Tribute to jiah khan

జియాఖాన్‌... ‘నిశ్శబ్ద’ గానే బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ తార నేల రాలింది. కాదు, నింగికెగిసింది. చుక్కల్లో కలిసిపోయింది. బలవన్మరణానికి పాల్పడి, యావత్‌ భారతదేశాన్నీ విస్మయానికి గురిచేసింది. ఇలా తారలు అర్థాంతరంగా, బలవంతంగా తనువు చాలించడం జియాఖాన్‌తోనే మొదలు కాలేదు. అయినా ఓ తార బలవన్మరణానికి పాల్పడితే, అది సినీ పరిశ్రమనే కాదు, ప్రేక్షక లోకాన్నీ ఆవేదనకు గురిచేస్తుంది.

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకీ జియాఖాన్‌ మరణం ఆవేదనకు గురిచేసింది. తనకు జియాఖాన్‌ మరణ వార్త ఎలా తెలిసింది? ఆ సమయంలో తానెలా స్పందించాను? అన్నదానిపై వర్మ ఇలా వివరించారు. జియాఖాన్‌కి నివాళులిలా అర్పించారు. వర్మ తెరకెక్కించిన ‘నిశ్శబ్ద్‌’ సినిమాతోనే జియాఖాన్‌ తెరంగేట్రం చేసింది. అందుకే ఆమె మరణం వర్మని కదిలించింది.

జియాఖాన్‌ మరణంపై వర్మ స్పందన...
‘రాత్రి 3 గంటల సమయంలో ఓ స్నేహితుడితో మా ఇంట్లో వుండగా జియాఖాన్‌ మరణ వార్త తెలిసింది. షాక్‌కి గురయ్యాను. వెంటనే ఆ వార్త నిజమో కాదో కన్‌ఫర్మ్‌ చేసుకోవడానికని తెలిసినవారికి ఫోన్‌ చేశాను. చేదు వార్తే అయినా అది నిజమని తెలిసింది. చాలా ఆవేదన చెందాను. ఓ అందాల తార, బోల్డంత భవిష్యత్‌ వున్న హీరోయిన్‌, బలవన్మరణానికి పాల్పడిందంటే ఆమెకు ఎంత కష్టం వచ్చి వుండాలి.?’

‘నిశ్శబ్ద్‌’ సినిమా గురించి అనుకోకముందు ఓ సందర్భంలో జియాఖాన్‌ని చూశాను. స్టన్నింగ్‌ బ్యూటీ ఆమెది. టిపికల్‌గా కన్పించలేదు. కానీ ఆకట్టుకుంది. ఆ తర్వాత అమితాబ్‌తో ‘నిశ్శబ్ద్‌’ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా మదిలో జియాఖాన్‌ రూపం మెదిలింది. అంతే, అమితాబ్‌తో ఆ విషయం చెప్పాను. అలా ‘నిశ్శబ్ద్‌’ సినిమాలో జియాఖాన్‌ నటించింది. సెట్స్‌లో అందరితోనూ సరదాగా వుండేదామె. ఇప్పటికీ ‘నిశ్శబ్ద్‌’ యూనిట్‌ ఆమెను మర్చిపోదు. ఆ సినిమా ట్రైలర్‌ వచ్చినప్పుడు ఆమె తల్లి ఆనందంతో తన కూతుర్ని కౌగలించుకున్న సందర్భాన్ని మర్చిపోలేను.

కాలం గడిచిపోయింది. ఆరేళ్ళు పూర్తయిపోయాయి  ‘నిశ్శబ్ద్‌’ వచ్చి. మళ్ళీ ఆమెకు నేను మరే సినిమాలోనూ అవకాశం ఇవ్వలేకపోయాను. ఓ సందర్భంలో ఆమె నన్ను కలిసింది. అవకాశం కోసం అడిగింది. నేనేమీ చెప్పలేకపోయాను. ఇప్పుడు బాధపడుతున్నాను. కాదు, కన్నీరు పెడుతున్నాను. ఆమె బలవన్మరణానికి పాల్పడినందుకు కాదు. ఆమెకు అవకాశం ఇవ్వలేకపోయినందుకు. ఎవరూ అవకాశాలివ్వలేదన్న కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకునేంత డిప్రెషన్‌లోకి వెళ్ళడమంటే నేనూ ఆమె ఆత్మహత్యకు పాల్పడడంలో ఎంతో కొంత బాధ్యుడినే కదా.

నన్ను క్షమించు. ఆరేళ్ళపాటు అవకాశం ఇవ్వలేకపోయినందుకు. ఇప్పుడు బాధపడుతున్నాను. అయినా ఏం ప్రయోజనం. కెరీర్‌ మీద ఎంతో ఆశతో సినీ రంగ ప్రవేశం చేసిన ఓ పద్ధెనిమిదేళ్ళ యువతి.. ఆరేళ్ళపాటు మంచి అవకాశాలేవీ లేకుండా ఖాళీగా కూర్చోవడం ఎంత కష్టమో అప్పట్లో తెలియలేదు నాకు. ఇప్పుడది తెలుస్తోంది. కానీ, ఇప్పుడు అవకాశమే లేదు.

‘నిశ్శబ్ద్‌’ సినిమాలో ఎలా వుంటుందో, అదే మనస్తత్వం జియాఖాన్‌ది. కెరీర్‌ ఒక్కటే కాదు, వేరే అంశాలూ ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పి ఉండొచ్చు. కానీ కెరీర్‌ సరిగ్గా లేకపోవడంతో వచ్చే ఫ్రస్ట్రేషన్‌ ఎలా వుంటుందో అర్థం చేసుకోగలను. కెరీర్‌ బాగుంటే, మిగతా సమస్యలన్నీ చిన్నవిగా కన్పించేవేమో.
- రామ్‌గోపాల్‌ వర్మ

మరిన్ని సినిమా కబుర్లు
Heroine from Konidela Family