Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aaditya hrudayam - vn adithya
"నిను వీడని నీడను నేనే"

"మనం చీకటిలో చేసిన పనే, వెలుగులో మనని వెంటాడే మన నీడ". అలా 12 ఏళ్ళ క్రితం నేను చీకటిలో ఒక పని చేశాను. నన్ను వెలుగులోకి తెచ్చి ఈ రోజుకీ నీడలా నా వెన్నంటి ఉంది. ఆ పనే, నా దర్శకత్వంలో వచ్చిన నా మొదటి సినిమా 'మనసంతా నువ్వే'.

చీకటిలో చేసిన పనేంటంటారా! ధియేటర్లో లైట్లు ఆర్పి ఆసినిమాని అఖిలాంధ్ర ప్రేక్షకులకి చూపించడం. నీడల్లో కూడా కొన్ని, మన వెనక ఎవరో ఉన్నారన్నభరోసాని, ధైర్యాన్నిఇస్తాయి. అటువంటి మంచి నీడ 'మనసంతా నువ్వే'. కొన్ని నీడలు మాత్రం భయపడేలా చేస్తాయి. అటువంటి నీడ నా నిర్మాణ సారధ్యంలో వచ్చిన నా సినిమా 'రెయిన్ బో'.

అసలు నీడల్లో మంచివి, చెడ్డవి ఉంటాయని ఆ అనుభవంలోకి ఎలా వచ్చిందంటే, ఈ కాలమ్ రాయడానికి నా వృత్తి'గత', వ్యక్తి'గత' జీవితాలని నేను ఒకసారి విశ్లేషించుకున్నాను. అప్పుడు తెలిసింది నాకీ విషయం...

నేను గమనించిన నా నీడలు:

1. అత్యద్భుతమైన విజయం - ఈ నీడ ఏర్పడగానే చాలా ఆనందంగా ఉంటుంది. మనం గాల్లో తేలినట్టుంటుంది. తర్వాత్తర్వాత ఎన్ని సినిమాలు తీసినా ఈ నీడతో పోలుస్తూ ఉంటే మాత్రం అప్పుడప్పుడు ఇబ్బందిగా తోస్తుంది. నాకు 'మనసంతా నువ్వే' సినిమా అలాంటిదే.

2. ఘోర పరాజయం - ఇది తాత్కాలికమే అయినా, మరో విజయం అనే వెలుగుని చూసేవరకూ ఇది మనని భయపెట్టినట్టు అణుబాంబు కూడా భయపెట్టదు. నాకు 'రెయిన్ బో' సినిమా అలాంటిది.

3. మంచి స్నేహితులు - ఈ నీడని సంపాదించుకోవడం చాలా కష్టం. తర్వాత నిలబెట్టుకోవడం మరీ కష్టం. ఎవ్వరి వెలుగు వల్లైనా ఈ నీడ మనకి తెలీకుండానే మాయం అయిపోవచ్చు.

4. చెడు సావాసాలు, వాటి ఫలితాలు - ఈ నీడ మనపై వెలుగు పడిన కొద్దీ వెంటాడుతుంది. వికృతరూపం చూపిస్తూనే ఉంటుంది.

5. కుటుంబం - కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనతో ఎవరుంటే వారే మన కుటుంబం. ఆ నీడ పట్టున చల్లగా ఉండొచ్చు. సుఖంగా ఉన్నప్పుడు, మనమే నలుగురికి నీడనిచ్చే శక్తి ఉన్నప్పుడు ఎవరి కుటుంబమైనా, మన కుటుంబమే, వారి కిష్టమైతేనే.

6. అనారోగ్యం - ఈ నీడ చాలా ప్రమాదకరమైనది. ఒకసారి వస్తే మన బాగోగులతో సంబంధం లేకుండా మనల్ని కాల్చుకు తింటూనే ఉంటుంది.

వీటిని ఇలా గమనించాక నాకనిపించింది ఒక్కటే - ఈ పరిశ్రమలో మనం చూడవలసినది ఎదురుగా ఉన్న వ్యక్తిని, అతని స్థితిగతులని కాదు. వెనకున్న వారి నీడను చూడాలని. అప్పుడు వారి మీద అపరిమితమైన గౌరవం ఏర్పడుతుంది.

వెలుగులో ఉన్న వ్యక్తి కన్నా, వెనకాలున్న నీడ గొప్పది. అందుకే, "నిను వీడని నీడను నేనే" కాదు - "నను వీడని నీడను నేనే" ఇది నా స్లోగను.

వచ్చేవారం..."మెగాభిమానం - మూడు ముళ్ళ ముచ్చట". 
మరిన్ని సినిమా కబుర్లు
RGV Tribute to jiah khan