Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఈ తూరుపు ఆ పశ్చిమం - దంతులూరి కిశోర్ వర్మ

 

నీ గూడు చెదిరింది...

 

రవీంద్రనాథ్ ఠాగోర్ 1901లో బెంగాలీలో రాసిన నష్టానిర్ అనే చిన్ని నవలని 1971వ సంవత్సరంలో ది బ్రోకెన్ నెస్ట్ గా ఇంగ్లీష్‌లోకి అనువదించారు. మేక్‌మిలన్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించారు. బ్రోకెన్ నెస్ట్ అంటే చెదిరిపోయిన గూడు అని అర్థం. పంతొమ్మిదవ శతాబ్దపు చివరి భాగంలో బెంగాలీ ఉమ్మడి కుటుంబాల నేపద్యంగా రాసిన బ్రోకెన్ నెస్ట్ నవల ఠాగోర్ గొప్ప నవలల్లో ఒకటి.  మధ్యవయసు భూపతి, యవ్వనంలో ఉన్న అతని భార్య చారులత, భూపతి సోదరుడి వరుసయ్యే అమల్‌ల మధ్య ముక్కోణపు ప్రేమ కథ ఇది. కథగా చిన్నదైనప్పటికీ పాత్రల మానసిక సంఘర్షణ, మనస్తత్వాల విశ్లేషణ, సన్నివేశాల కల్పన అత్యద్భుతంగా ఉంటాయి. ప్రపంచపు ఎన్నదగిన గొప్ప దర్శకులలో ఒకరైన సత్యజిత్ రే ఈ నవలని `చారులత` అనే పేరుతో బెంగాలీలో తీశారు. నవలకీ, సినిమాకీ మధ్య కథ విషయంలో కొన్ని వ్యత్యాసాలున్నాయి. కానీ బ్రోకెన్ నెస్ట్ నవల తప్పనిసరిగా ఎలా చదవవలసినదో, చారులత సినిమా కూడా తప్పనిసరిగా అలానే చూడవలసినదే.

 

భూపతి ధనవంతుడు. ఎక్కడా పనిచెయ్యవలసిన అవసరం లేదు. కానీ చిన్నప్పటి నుంచీ ఇంగ్లీష్ భాషమీద ఉన్న మమకారంతో ఓ ఆంగ్ల వార్తా పత్రికని ప్రారంభించాడు. సంపాదకుడిగా రోజంతా ఉక్కిరి బిక్కిరి అయ్యేంత పని. దేశ సరిహద్దు సమస్యల గురించి వార్తలు ప్రచురిస్తున్నాడు కానీ, తన భార్య బాల్యం సరిహద్దు దాటి నిండు యవ్వనంలోకి ప్రవేశించిన విషయాన్ని విస్మరించాడు. ఇంటిదగ్గర చారులతకి కావలసినంత తీరుబడి. పుస్తకాలు చదవడం, కుట్లూ అల్లికలూ చెయ్యడంతో పొద్దు పుచ్చుతోంది.  ఆమె సోదరుడు ఉమాపతిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి పేపర్ ఆఫీసులో మేనేజరుగా వేసుకొన్నాడు. అతని భార్య మందాకినిని చారులతకి తోడుగా పెట్టాడు. అంతటితో భార్య విషయంలో తన బాధ్యత తీరిపోయిందనుకొని తన పనుల్లో మునిగిపోయాడు. 

 

కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న అమల్ భూపతికి వరసకి తమ్ముడు అవుతాడు. పుస్తకాలు చడవడంలో చారులత అతని సహాయం తీసుకొంటుంది. అమల్‌ది చిన్నపిల్లవాడి మనస్తత్వం. చారులతకి సహాయం చేసి, పెద్ద ప్రతిఫలం అడుగుతాడు. ఇంటికి స్నేహితులని పిలిచి, వాళ్ళకు వండిపెట్టమంటాడు. ఒక్కోసారి పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి. ఇంట్లో వేసుకోవడానికి కార్పెట్ చెప్పులు, నెక్‌టై లాంటివి తయారు చేసి ఇమ్మంటాడు. `ఎందుకు చెయ్యాలి, నేను చెయ్యను,` అని పోట్లాడుతుంది. కానీ, ఆమె నుంచి `ఇది కావాలి..` అని హక్కుగా అడిగి తీసుకొనే వాళ్ళు ఎవరూ లేదు. ఇప్పుడు అమల్ అడుగుతుంటే పైకి కాదన్నా ఇష్టంతో చేసి పెడుతుంది. భూపతిది కల్మషం తెలియని మనస్తత్వం. చారులత, అమల్‌ల సాన్నిహిత్యం చూసి ఒకే ఈడు పిల్లలు కలసి ఆడుకొంటుంటే ఆనందపడే తండ్రిలా ముచ్చట పడుతున్నాడు. వదినకి చదువులో సహాయం చెయ్యమని అమల్‌తో చెపుతున్నాడు.    

 

చారులత, అమల్‌లు కవిత్వం గురించి మాట్లాడు కొంటారు. అమల్ తాను రాసిన కవితలని చారులతకి చదివి వినిపిస్తే మెచ్చుకొంటుంది. ఇద్దరూ కలిసి ఇంటికి చేరిఉన్న ఖాళీజాగాని ఉద్యానవనంగా మార్చాలని ప్రణాళికలు చేసుకొంటూ ఉంటారు. క్రమంగా అమల్ రచనలు పత్రికల్లో అచ్చవ్వడం మొదలయ్యాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. ఇదివరలో అతని కవితలకి పాఠకురాలు చారులత మాత్రమే. ఇప్పుడు ఎంతో మంది పాఠకురాళ్ళు వాటిని చదివి, మెచ్చుకొని, ఆరాధిస్తున్నారు. ఆఖరికి మందాకిని కూడా అమల్‌మీద ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంది. ఈ విషయం చారులతకి అస్సలు నచ్చడం లేదు.  ఒకరోజు చారులతకి కవిత వినిపిద్దామని వస్తాడు. మందాకిని మాత్రమే ఉంటుంది. `పాపం ఒకరి కోసం వచ్చావు. వేరొకరు ఉన్నారు ఇక్కడ,` అంటుంది. `ఎడమవైపూ గడ్డి ఉంటుంది, కుడివైపూ ఉంటుంది - గాడిదకు ఏదైనా ఒక్కటే,` అంటాడు. ఈ ఒక్క మాటలో అతని ప్రవృత్తి అవగతమౌతుంది. చారులతలో లాగ ప్రేమా, విరహం లాంటి ప్రకోపాలు అమల్‌లో కనిపించవు.

అమల్ ప్రోత్సాహంతో చారులత కూడా కవితలు రాస్తుంది. వాటిని పత్రికకు పంపుతాడు. అచ్చవుతాయి. దానితో పాటూ అమల్, చారులతల శైలులని పోలుస్తూ - `చారులత చక్కగా రాస్తుందని.. అమల్, మన్మథాదత్త లాంటి కవులు తమ పంధా మార్చుకొని ఆమె శైలిని అలవరచుకోకుంటే వాళ్ళు వెనుకబడిపోతారని` ఒక వ్యాసంకూడా మరొక పత్రికలో వస్తుంది.  అవి చూసుకొని చారులత ఆనందపడుతుందని అపార్థం చేసుకొంటాడు. అమల్ తనను దూరం చేస్తున్నాడని చారులత ఉక్రోషపడుతూ ఉంటుంది. 

 

భూపతికి న్యూస్‌పేపర్ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. బావమరిది ఉమాపతి అతనిని మోసం చేశాడు. ఇప్పుడు మనుష్యుల్లో స్వార్థం అనే మరో కోణాన్ని భూపతి చూస్తున్నాడు. కస్టాలు, బాధలు అన్నీ మరచిపోయి భార్యదగ్గర ఎక్కువసమయం గడపాలని నిర్ణయించుకొన్నాడు. కానీ అప్పటికే చారులత మనసులో అమల్ నిండిపోయి ఉన్నాడు. అమల్ దూరమవుతున్నాడనే వ్యధ తప్పించి నైతిక విలువల పరిధిని దాటి పరాయివ్యక్తి గురించి ఆలోచించడం మంచిదా, కాదా అనే సంఘర్షణ ఆమెలో ఎప్పుడూ లేదు. 

 

అన్నగారికి కలిగిన నష్టం గురించి అమల్ తెలుసుకొన్నాడు. ఎవరితోనూ పంచుకోకుండా తనలో తాను కుమిలిపోతున్న అతని అవస్థ చూసి బాధపడ్డాడు. బారిస్టరుగా తిరిగి వచ్చిన తరువాత భూపతికి సహాయం చెయ్యాలని నిశ్చయించుకొన్నాడు. కానీ, చారులతకి భూపతి పరిస్థితి ఏమీ తెలియదు. తన ప్రేమ, విరహం.. వాటితోనే సతమతమౌతుంది. అమల్ పెళ్ళి చేసుకొని, పై చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు. బలమైన దెబ్బతగిలి మనసు మొద్దుబారిపోయినట్టు అమల్ వెళ్ళిన కొత్తలో ఏమీ తెలియలేదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అమల్ లేని లోటు జీవితంలో శూన్యత లాంటి భావన కలిగిస్తుంది.  తన గదిలోనికి వెళ్ళిపోయి తలుపులన్నీ మూసుకొని, దిండులో ముఖం దాచుకొని అమల్‌తో తాను గడిపిన క్షణాలనన్నింటినీ మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకొంటుంది. `అమల్! అమల్!` అనుకొంటుంది. ఇంటి పనుల పర్యవేక్షణలో కూడా మనసు పెట్టలేకపోతుంది. పనివాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. అయినా పట్టించుకోదు. ఉండుండి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అమల్ పేరు వినిపిస్తే మనసులో అలజడి రేగుతుంది, ముఖం తెల్లగా పాలిపోతుంది.  జ్ఞాపకాల గాయాల్ని మనసులో గుడి కట్టుకొంది, కన్నీటి మాలలతో రోజూ పూజిస్తుంది. భూపతికి చారులత మనసు అర్థమయ్యింది. `పిచ్చిపిల్ల బాధని ఎవరితో చెప్పుకొంటుంది,` అని భూపతి భార్యమీద జాలిపడుతున్నాడు. ఆమెని అక్కడే వదిలి ఎక్కడికో దూరంగా ఉద్యోగం కోసం వెళ్ళిపోదాం అనుకొంటున్నాడు. `మళ్ళీ ఎప్పుడు వస్తారు?` అంటుంది. `నీకు వొంటరిగా అనిపించినప్పుడు కబురుచెయ్యి వస్తాను,` అంటాడు.    

 

మూడుపాత్రల్లో చిన్న చిన్న వ్యక్తిత్వ లోపాలు గొప్ప సంక్షోభాన్ని సృష్టించాయి. కథను చదువుతూ `అయ్యో!` అనుకోవడం తప్ప భూపతినో, అమల్‌నో, చారులతనో తప్పుపట్టలేం.  మనసు బరువెక్కుతుంది. నవల చదువుతూ `ఇలా జరిగుండకపోతే..` అని ఎన్నోసార్లు అనుకొంటాం. చాలా కాలం తరువాత  కూడా పాత్రలు జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. మూడు ఉదాత్తమైన పాత్రలు నవలని చిరస్మరణీయం చేశాయి. మంచి పుస్తకానికి ఉండవలసిన లక్షణాలు అవే అనుకొంటాను. మీరూ చదివితే నేను చెప్పిన మాట నిజమేనని ఒప్పుకొంటారేమో!  ఇప్పటికే ఈ నవలని మీరు చదివి ఉంటే తప్పనిసరిగా మీ అభిప్రాయాలని ఇక్కడ పంచుకోండి. చదివి ఉండకపోయినా ఈ పరిచయం గురించి మీ మాట ఒకటి చెప్పండి. 

మరిన్ని శీర్షికలు
jyotipatham