Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Golconda Fort

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజయోగములు - గుమ్మా రామలింగ స్వామి

Raja Yogamulu by Gumma RamalingaSwamy

మానవుల జాతకములలో బలమైన గ్రహస్థితిని రాజయోగములుగా పరిగణింతురు. రాజు అన్నపదమును కాలమాన పరిస్థితులను బట్టి మార్పుచేసుకుని వాడుకోవలెను. విద్యాధికులు, ధనవంతులు, ఆరోగ్య వంతులు, దీర్ఘాయుష్షు కలవారు, ఏ విద్యా గంధము లేక, సామాన్యులుగా జన్మించినవారు, అధికారము, పదవులు చేపట్టిన వీరిని రాజయోగులు గా గుర్తించవలెను. వీనికి ఈ ప్రత్యేకత గ్రహములు, వాని ఉనికిని బట్టి వచ్చినదే.

జాతకమున మూడు లేక నాలుగు గ్రహములు తమ ఉచ్చ లేక స్వ క్షేత్రములలో ఉండి ఆ రాశులు కేంద్రములైన, అట్టిజాతకుడు రాజసమానుడగును. ఐదు లేక ఇంకనూ ఎక్కువ గ్రహములు ఈ స్థితిని పొందిన అతడు సామాన్య కుటుంబములోజన్మించిననూ  రధ,గజ, తురగ సేనా సమేతు డగు రాజగును. ఇట్టి అధికారులను, మంత్రులను ఉద్యోగులను చూచు చున్నాముగదా!.

ఉత్తమ వంశమున జన్మించినను, ఏ దుర్యోగములు లేనియెడల గ్రహములకు అస్తంగతాది దోషములు లేనియెడల, ఈ యోగము పట్టును. ఇట్టి గ్రహబలములు లేనిచో, ఎంతటి వారైనను క్రిందికి దిగజారి సామాన్యులగుట మనమెరిగినదే కదా!

ఈరాజయోగములకు గల గ్రహ స్థితిని వివరించుచున్నాను:- ఈ యోగము పట్టుటకు, గ్రహములు వక్రించి యుండుట, అధిక గ్రహములు దిక్బలము, షడ్బలము కలిగియున్న, సామాన్య స్థితి లోని వారు అనూహ్యముగా ఉచ్చస్థితిని పొందుదురు. లగ్నము, వర్గోత్తమ నవాంశమందుండి, లగ్నమును చంద్రుడు మినహా నాలుగు గ్రహములు చూచుచున్న అతడు ఏ కులమున జన్మించినను రాజగును. చంద్రుడు పక్షబలసంపన్నుడై, అనగా దినదిన ప్రవర్ధ మానుడగుచున్నప్పుడు, అట్టి చంద్రుని, మరొక శుభగ్రహము, ఉచ్చ క్షేత్రము నుండి చూచుచున్నను, మరియూ శుక్రుడు అశ్వనీ నక్షత్రమున ఉండి, లగ్నము కూడా మేషమయి, ఆ శుక్రుని మూడు గ్రహములు చూచుచున్ననూ, లగ్నాధిపతి బలవంతుడై, రెండవ ఇంట ఉన్న అది తనకు నీచ, శత్రు, స్థానము కాకున్న, రాజయోగముగా భావించవలెను.

ఈ విషయములు చదువుచున్నప్పుడు సామాన్య పాఠకులకు, కొంచెము వివరణ అవసరము. జాతకములలో, గ్రహములు, బలముగలిగి, స్వ, ఉచ్చ, మిత్ర ,స్థితి పొంది, శుభ గ్రహముల దృష్టి కలిగి ఉన్న అది రాజయోగ జాతకముగా తెలుసుకొన వలెను. శుభగ్రహముల ఉనికి, బలములు, ఇతరగ్రహముల దృష్టి, మొదలగు అంశములే, ఈ రాజయొగమున మరీమరీ చెప్పబడుచున్నవి, మరియు పాపగ్రహముల ఉనికి గూడా రాజయోగములు కలిగించును.

1) జన్మరాశ్యాధిపతి నుండి, మూడు, ఆరు ,పదకొండు, స్థానములలో పాపగ్రహమున్ననూ రాజయోగము కలిగించును.
2) కుజ, బుధులు ద్వితీయమందున్ననూ రాజయొగము,
3) రవి శుక్రులు, చతుర్ధమున ఉన్నానూ,కుజ ,గురు ,శనులు ,ముగ్గురూ ,లగ్నమున గాని, రాజ్య కేంద్రముల (10 వ ఇంట) ఉన్ననూ,
4) 11వ, ఇంట శని ఉన్నానూ రాజయోగమని కూడా చెప్పుచున్నారు.

మరియొక ముఖ్య విషయము: ఈ గ్రహములు జాతకమున కనిపించినంతనే, రాజయోగమని నిర్ణయించ రాదు. ఈ యోగము, ఆ గ్రహముల దశయందు, అంతర్దశలయందు, ఈ ఫలములు కనిపించును. ఈ యోగములు, బాల్యమున గాని, యవ్వనమున గాని,  వార్ధక్యమున గాని పట్టును. యవ్వనమున కలిగిన ఫలితము ఇతరులకు కనిపించును. బాగుగా యోగించును.

బాల్యమున వార్దక్యమున కలిగిన అంత యోగకారిగా తెలియదు. మరియూ జాతకమున ఈ గ్రహ స్థితి ఉన్ననూ, కొంతమందిలో అంత రాణింపు లేకపోవుటకు కారణములు, వారి పూర్వ జన్మ పాప పుణ్య ఫలములే. ఈజన్మలో కలిగిన యోగములచేత, లబ్ధి పొందినవారు, తదుపరి జన్మలలో కూడా ఉత్తమగతులు కలుగుటకు, ఈ అవకాశమును వినియోగించుకుని పుణ్య కార్యములు చేసిన, ముందు జన్మలకు కూడా ఈ శుభములు గలిగి ఉత్తమ జన్మ కలుగును. మనము సామాన్యముగా ఒకే లగ్నమున జన్మించిన, ఈ యోగములు గలవారిని చూచిన, వారివారి జీవన విధానము వేరువేరు గా ఉండును.

అందుకు కారణము పూర్వజన్మ శుకృతములే.

నేను ఒకే సమయమున పుట్టిన వారి జాతకములు గ్రహించి వారి ప్రగతిని గమనించి మరీ, ఈ విషయము చెప్పుచున్నాను.. మానవ జన్మలోనూ, జాతకములలోనూ ఇన్ని రహస్యములు కలవు.

మరిన్ని శీర్షికలు
maro mithunam