Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope(June 22 - June 28)

ఈ సంచికలో >> శీర్షికలు >>

గోల్కొండ కోట (పర్యాటకం) - లాస్య రామకృష్ణ

Golconda Fort

ఒకప్పుడు వజ్రాల వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా వ్యవహరించిన గోల్కొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుండి 11 కి.మీ. ల దూరం లో ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోహినూర్ డైమండ్ ఇక్కడి గనుల లోనే లభించిందని అంటారు.

400 ఏళ్ళ ఘనమైన చరిత్ర కలిగిన ఈ గోల్కొండ కోట 1525 లో ఖులి ఖుతుబ్ షా చేత నిర్మించబడింది. ఒకప్పుడు గొల్ల కొండగా ఇది పిలువబడేది. గొల్ల కొండ అని పిలువబడడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1143 లో ఒక రోజు, మంగళవరం అనే కొండ పైన గొర్రెలకాపరికి ఒక దేవతావిగ్రహం కనపడింది.

ఆ సమయం లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయుల రాజుకి ఈ విషయం తెలియచేయబడింది. ఆ రాజు పవిత్రమైన ఆ విగ్రహం చుట్టూ ఒక మట్టి కోటని నిర్మించాడు. 200 సంవత్సరాల తరువాత అంటే 1364 లో బహమిని పాలకులు ఈ కోటని తమ అధీనం లో కి తీసుకున్నారు. అనేక చారిత్రక సంఘటనలకు నిశ్శబ్ద సాక్ష్యం గా నిలిచిన ఈ మట్టి కోట 1507 నుండి దాదాపు 62 ఏళ్ళ వరకు  మొదటి ముగ్గురు ఖుతుబ్ షాహి రాజుల చేత 5 కిలోమీటర్ల చుట్టుకొలతలతో బ్రహ్మాండమైన గ్రానైట్ కోట గా విస్తరించబడింది.  మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1687 లో ఈ కోట ని ఆక్రమించడంతో ఖ్యాతి గడించిన ఖుతుబ్ షా పాలన గోల్కొండలో  ముగిసింది. ఆ తరువాత ఈ కోటను ఔరంగజేబు నాశనం చేశాడని అంటారు.

ఈ కోటలో  87  అర్ధ వృత్తాకార బురుజులు కలవు.  కొన్ని బురుజుల పై ఫిరంగులు కూడా కలవు. 80 ప్రవేశ మార్గాలు, 4 డ్రా బ్రిడ్జ్ లు ఇంకా రాజ సముదాయాలు ఈ కోటలో కలవు. నాలుగు ప్రధాన సింహాద్వారాలు, ఎన్నో రాజమందిరాలు, మసీదులు, దేవాలయాలు ఈ కోటలో ఉన్నాయి. తానీషా ఈ కోటలోనే శ్రీ రామదాసుని  కారాగారం లో బంధించాడు. శ్రీ రామదాసుచే చెక్కబడిన సీతారామ, లక్ష్మణుల బొమ్మలను ఈ కారాగారం లో గమనించవచ్చు.

ఈ కోట శబ్ద వ్యవస్థకి పేరొందినది. ఈ కోటలో ఎత్తైన ప్రదేశాన్ని 'బాలా హిసార్' అని అంటారు.  ఇది ఒక కిలోమీటరు దూరం లో ఉన్న ఎత్తైన ప్రదేశం. ఈ కోట ప్రవేశ మార్గంలో నుండి చప్పట్లు కొడితే బాలా హిసార్ కి వినిపిస్తుంది. దాడుల సమయం లో రాజులకి హెచ్చరికగా ఉండేందుకు ఇలా ఏర్పాటు చేసారు. ప్యాలెస్లు, ఫ్యాక్టరీలు, నీటి సరఫరా వ్యవస్థ ఇంకా ప్రసిద్ది చెందిన రహ్బాన్ ఫిరంగి ఈ కోట యొక్క ప్రధాన ఆకర్షణలు. ఈ కోటలో రహస్య భూగర్భ సొరంగం ఉందని భావిస్తారు.

ఈ సొరంగ మార్గం ద్వారా చార్మినార్ కి చేరుకోవచ్చని అంటారు. అయితే ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ కోటలో ఖుతుబ్ షాహి రాజుల సమాధులు ఉన్నాయి. గోల్కొండ బయటి గోడ నుండి ఉత్తరాన ఒక కిలోమీటరు దూరం లో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో ఈ సమాధులు ఉన్నాయి. ఈ సమాధుల చుట్టూ అద్భుతంగా చెక్కబడిన రాళ్లు ఇంకా అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. గోల్కొండ బయట ఉన్న రెండు పవిలియన్ లు ఇక్కడి ఆకర్షణలలో ప్రధానమైనవి. గోల్కొండ కోట పై ఉన్న రాజ దర్బార్ నుండి ఈ కోట లో ఉన్న కళామందిర్ ని వీక్షించవచ్చు. ఈ కోట లో కాకతీయులచే నిర్మించబడిన దేవాలయాలను చూడవచ్చు.

హైదరాబాద్ నుండి గోల్కొండకోట కేవలం 11 కిలోమీటర్ల దూరం లో ఉంది. హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకి వాయు, రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. స్థానిక రవాణా సదుపాయం కోసం లగ్జరీ లేదా సెమీ లగ్జరీ బస్సులతో పాటు ఆటో రిక్షాలు, టాక్సీలు అందుబాటులో కలవు.

ఈ కోట ప్రత్యేకతలు 

శబ్ద వ్యవస్థ
ఈ కోట యొక్క ప్రత్యేక ఆకర్షణ ఈ మాయా శబ్ద వ్యవస్థ. ఈ కోట యొక్క ప్రవేశ ద్వారం వద్ద చప్పట్లు కొడితే దాదాపు ఒక కిలోమీటరు దూరం లో ఉన్న ఎత్తైన ప్రదేశం అయిన 'బాలా హిసార్' వద్ద వినిపిస్తుంది. దాడుల సమయం లో రాజులకి హెచ్చరికగా ఉండేందుకు ఇలా ఏర్పాటు చేసారు.

తారామతి గానా మరియు ప్రేమమతి నృత్య మందిర్
గోల్కొండ కోట బయట రెండు వేరు వేరు పవిలియన్స్ ని గమనించవచ్చు. ఒకటి తారామతి గానా మందిర్. ఇంకొకటి ప్రేమామతి నృత్య మందిర్. తారామతి, ప్రేమమతి అనే ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ రెండంతస్తుల వృత్తాకార వేదికపై ప్రదర్శనలు ఇచ్చేవారు. గోల్కొండ కోట పై న ఉన్న రాజ దర్బార్ నుండి ఈ కళా మందిర్ ని వీక్షించవచ్చు.

ధ్వని మరియు కాంతి ప్రదర్శన
గోల్కొండ యొక్క చరిత్రకి జీవం కల్పించేలా ఇక్కడ నిర్వహించే ధ్వని మరియు కాంతి ప్రదర్శన అనేకమంది పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గాత్రం తో ఈ ప్రదర్శన ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో ఈ ప్రదర్శనని తిలకించవచ్చు.

ఇప్పటికీ, అంటే దాదాపు 800 ల సంవత్సరాల తరువాత కూడా ఈ కోట హైదరాబాద్ యొక్క నిర్మాణ అద్భుతాలలో ఒకటి గా నిలిచింది అనటం లో అతిశయోక్తి లేదు. ఈ  కోట ని సందర్శించడానికి ప్రతి రోజు దేశ విదేశాల నుండి పర్యాటకులు తరలి వస్తారు. 

మరిన్ని శీర్షికలు
Raja Yogamulu by Gumma RamalingaSwamy