Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sare sare pitta katha

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఏదీ, ఆ కమ్మదనం?(కవిత) - చెక్కా చెన్నకేశవరావు

edi aa kammadanam

సుద్దులు చెప్పే పెద్దలు ఏరీ?
సూక్తులు వినే వ్యక్తులు ఏరీ?

వేదాంతాల  సార సంగ్రహం
'వేమన శతకం'
సుభాషితాల సూక్తం
'సుమతీ శతకం'
దశరధ తనయుని దాతృత్వం, ధీరత్వం
'దాశరధీ శతకం'
ఈ శతకాల సారాంశం
చెప్పే వారేరీ? వినే వారేరీ?

రసరమ్య రంజిత మౌక్తికం
'రామాయణం'
జీవన, రాజకీయ క్రీడల చదరంగం
'మహా భారతం'
భగవాన్ కృష్ణ కృపామృతం
'శ్రీమద్భాగవతం'
ఆ కమనీయ కావ్యాల కధాంశం
చెప్పేవారేరీ? వినే వారేరీ?

ప్రేమను రంగరించి
గోరుముద్దలు తినిపించే
తల్లులు ఏరీ?

మాతా పితరుల పరిష్వంగ సుఖం
అందుకుందామనే బిడ్డలు ఏరీ?

రక్త సంబంధీకుల రాకపోకలు
ఆత్మీయుల ఆహ్వానాలూ
స్నేహితుల సమాగమాలూ
ఆకాంక్షించేవారేరీ? తీర్చే వారేరీ?

ఈ యాంత్రిక యుగంలో
క్షణం తీరిక ఏ(లే)దని అనవద్దు
కొంచెంలో కొంచెం
సమయం వెచ్చిద్దాం

మనం మనం ఒకటి అనుకుంటే
మనిషికి మనిషే సాయం అనుకుంటే
'మన' అనుకుంటే మనసుండకపోదు
మనసుంటే మార్గమూ ఉండకపోదు

అందరూ తలుచుకుంటే
సాధించలేనిది ఏముంటుంది?
స్వర్గాన్ని భువికి దింపుదాం
మన ముంగిట నిలుపుదాం

ఏదీ ఆ కమ్మదనం అని అడిగేవారికి
ఇదిగో, ఇదిగో, ఇక్కడ అని చక్కని
సమాధానం చెబుదాం, ఆ పాత కమ్మదనాన్ని
పదికాలాలపాటు నిలుపుదాం! నిలుపుదాం!!

మరిన్ని శీర్షికలు
Dal Tadka by P Srinivasu