Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Dizziness | Giddiness | కళ్లు తిరుగుతున్నాయా? | Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వర ప్రసాద రావు

sahiteevanam

'ఆముక్తమాల్యద'

అనితరసాధ్యమైన శైలిలో గోదాదేవి అందచందాలను వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. యిది ప్రబంధము కనుక  ప్రబంధశైలిలో నాయిక వర్ణన శృంగార రసభరితంగా ఉంటుంది. అది తప్పుపట్టవలసిన విషయము కాదు. కనుల వర్ణన తర్వాత ఆమె నాసికను వర్ణిస్తున్నాడు.

నాసాచంపకతస్సుగంధ మచటన్  రా భృంగముల్ గ్రోల సం
త్రాసం బందియు బల్కుచో నలము వక్త్రం బేల నా నేల యం
దే సౌరభ్యము లేదు? కుందములు గావే దంతముల్గాని నా
డాసక్తిన్ ప్రతిబింబ దంభమున నేలా వరాల దజ్జాతికిన్?

ఆమె ముక్కు సంపెంగలా ఉన్నది. ముక్కును సంపెంగతో కవులు పోల్చడంలో ఒక చమత్కారము ఉన్నది. సంపెంగ పూవును కాడను పైకి ఉండేట్లు దళములు క్రిందికి ఉండేట్లు చేసి చూస్తే కాడలాంటి సన్నని పొడవైన ముక్కు, దళముల లాంటి ముక్కుపుటలు అని పోలిక అని అర్థం అవుతుంది. సరే, ముక్కు సంపెంగలా ఉన్నది. సువాసనలను వెదజల్లే ఆమె ముఖానికి ముసురుకుందామని తుమ్మెదలు ఆశపడడం జరుగుతున్నది. కానీ ముక్కు సంపెంగ అయ్యేప్పటికి వాటికి ఆశాభంగము అవుతున్నది, ఎందుకంటే సంపెంగ పూల వాసన  తుమ్మెద లకు పడదు. ఐతేమాత్రం వాటికి ఊరటగా ఆమె ముఖంలో ఏ సౌరభము లేదని? అన్ని సౌరభాలూ రాశిపోసుకున్న అందగత్తె ఆమె. ఆమె దంతములు మొల్లలు, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆ దంతముల సౌరభము ఎగసిపడుతుంటే, ఆ సౌరభానికి మత్తెక్కి ఆమె ముఖానికి ముసురుకుంటున్నాయి తుమ్మెదలు.తెల్లని మొల్లల లాంటి స్వచ్ఛమైన ఆమె దంతములలో ఎగురుతున్న తుమ్మెదల తిబింబాలు కనిపిస్తున్నాయి! ఆ పరిమళము కోసం కాకుంటే, తుమ్మెదలు ఎందుకు ముసురుకుంటాయి ఆమె ముఖానికి,అద్దంలో అందచందాలు చూసుకున్నట్లు ఆమె దంతములపై తమ ప్రతిబింబాలు చూసుకోడం అనే వంకతో ఆమె దంతముల పరిమళం కోసమే ఆ తుమ్మెదలు ముసురుకుంటున్నాయి.

శంఖ సామ్యమ్ము రా మున్ను జలజభవుడు 
సరసిరుహపత్త్ర నేత్ర కంధర యొనర్చె 
జవ్వనము వచ్చి వెండి సాక్షాత్కరించు 
శంఖమున చేసె నును గంధసార చర్చ 

ఆమెను చేసేప్పుడే బ్రహ్మదేవుడు ఆమె కంఠము శంఖాన్ని పోలేట్లుగా ఉండేట్లు చేశాడు. ఇంతలో  ఆమెకు యవ్వనం వచ్చింది. గంధపు పూత తెచ్చింది. దాంతో నిజంగానే శంఖం ఐపోయింది ఆమె  కంఠం. బాల్యం విడిచి యవ్వనం రావడంతో అలంకరణ, సోకులు తెలిశాయి కనుక గంధం పూసుకోవడం  మొదలైంది, దాంతో ఆకారంలోనే కాక రంగులో, అందంలో కూడా నిజంగానే శంఖం ఐంది ఆమె కంఠం.

కమలదళేక్షణ సంగీ
తమున నిగుడు మంద్ర మధ్య తార త్రి స్థా
నములకు దీర్చిన రేఖల 
క్రమమగు రేఖా త్రయమున గంఠం బమరున్ 

ఆ పద్మాక్షి పాడుతున్నప్పుడు సంగీతంలో ఉండే మంద్ర, మధ్య, తారా స్థాయిలకు ఆమె కంఠం పుట్టుకస్థానం  అని చెప్తున్నట్లుగా ఆమె కంఠం మీద ముచ్చటగా మూడు ముడుతలు ముద్దుగా ఉన్నాయి. అసలే నాదానికి శ్రేష్ఠమైన శంఖం కదా ఆమె కంఠం, ఆ శంఖానికి ఉన్నట్లే, ఆమె పాడేప్పుడు సంగీత శాస్త్రం నిర్దేశించినట్లే  మూడు స్థాయిలు ఆమె గొంతుకలో పుట్టాయి అన్నట్లుగా మూడు ముడుతలు ఆమె కంఠంమీద ఉన్నాయి. ఇందులో యింకొక చమత్కారం ఏమిటంటే, స్త్రీకి కంఠం మీద మూడు ముడుతలు ఉండడం శీలానికి,  పాతి వ్రత్యానికి చిహ్నం, అదే పురుషులకు ఉంటే ఠీవికి రాచరికానికి చిహ్నం అని శరీర సాముద్రికాశాస్త్ర సూచన.

లలన మృదు బాహుబిసలతలు గడగి 
బిసలతా శ్రీలనెల్లను వెస హరించె 
మరి హరింపంగ గా యవి నెరులు విరిగి 
సారె దనుయాత్ర దంతుల జరపుచుండు 

ఆమె బాహువులు పొడవుగా, సున్నితంగా తామర తూడుల్లా ఉన్నాయి. ఆమె బాహువుల నాజూకుదనం, అందం తామర తూడుల 'శ్రీ'ని, వాటి వైభవాన్ని, ప్రతిష్టను కాజేశాయి. వాటి నడుములు విరిగిపోయాయి,  వెన్నులు చచ్చుబడ్డాయి, తూడులు వాలిపోయాయి, దాంతో ఆ తామరలు తూడుల మధ్యన ఉండే సన్నని  దారములాంటి దాంతోనే జీవనం గడుపుకోవడం మొదలెట్టాయి, చేసేదిలేక! ఆమె 'బిసతంతుతనీయసీ' అని పొగడబడిన 'అమ్మవారి' ప్రతిరూపమే కదా మరి!

(కొనసాగింపు తరువాతి సంచికలో) 
***వనం వేంకట వరప్రసాదరావు  

మరిన్ని శీర్షికలు
yuva