Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

 సాధారణంగా చాలా మందికి, ఖరీదు ఎక్కువగా ఉంటేనే, దాని నాణ్యత బాగుంటుందనే ఓ అభిప్రాయం ఉంటోంది. ఇదివరకటి రోజుల్లో, ఏదైనా  సరుకు కొనాలంటే, నాలుగైదు కొట్లు తిరిగి, ఎక్కడ చవగ్గా ఉంటే, అక్కడ కొనుక్కునేవారు. కొనుక్కోవడమే కాక, సంతృప్తికూడా  చెందేవారు. పైగా నలుగురికీ కూడా చెప్పేవారు. బహుశా, ఆర్ధిక పరిస్థుతులు ఒక కారణం అయుంటుంది. అయినా ఆరోజుల్లో, ఏదైనా వస్తువు కొంటే, నాలుక్కాలాలపాటు దుంగలా పడుండేది, ఎటువంటి రిపేరీ అవసరం లేకుండా.

కాలక్రమేణా, టెక్నాలజీ ధర్మమా అని, ఏదైనా వస్తువు కొంటే, ఓ ఆరునెలలకే పాతబడిపోతోంది. అంటే, పనిచేయడం మానేసిందనికాదు, ఫాషన్ మారిపోవడం అన్నమాట. ఈవేళుండేది రేపు ఉండదు.  పైగా కంపెనీలుకూడా, రీసెర్చ్ పేరుతో, రోజుకోటి కనిపెట్టేస్తున్నారు. టెక్నాలజీ అభివృధ్ధి చెందడం వరకూ బాగానే ఉంది. కానీ, అభివృధ్ధి పేరు చెప్పి, పాత వస్తువులన్నీ, చెత్త బుట్టలో పడేసేయమనడం మాత్రం ప్రాణం మీదకొస్తోంది.

ఉదాహరణకి మొబైల్ ఫోన్లే తీసికోండి, మొన్నమొన్నటిదాకా, ఒకే ఫోనుండేది, ఏ ముహూర్తాన్న అదేదో 2G  మొదలెట్టారో, అప్పుడే  6G  దాకా వెళ్ళిపోయింది.. పైగా ప్రతీవారికీ, చేతిలో, లేటెస్ట్ మోడల్ లేకపోతే, అదేదో నామోషీగా ఉంటుంది. పోనీ ఈ మోడల్స్ కి అనుగుణంగా, సమాచార వ్యవస్థ మారుతోందా అంటే అదీ లేదూ.  కొత్తగా మార్కెట్ లోకి వచ్చిందని ఏదో , కొట్టువాడు చెప్పేడుకదా అని అదేదో  3G తీసికుంటాం., ఓ నెలరోజులు వాడినా కానీ, అది నత్తనడగ్గానే ఉంటుంది. తీరా, కొట్టువాడిని అడిగితే, ఇంకా పాతదే వాడుతున్నారేమిటి మాస్టారూ, 4 G  కూడా వచ్చేస్తేనూ… అంటాడు. ఈ G  లు ఏమిటో కానీ, అంతా గందరగోళంగా తయారయిపోయింది. హాయిగా ఇదివరకటి రోజుల్లో Parle G   అని బిస్కట్లు వచ్చేవి. ఇంకా వాళ్ళకి ఈ “ దురద “  అంటుకోలేదు. అదో అదృష్టం.

ఎప్పుడైనా బట్టలు ఉతికే పౌడర్ కోసం , ఏ మాల్ కో వెళ్తే, అక్కడ ఒకటినిమించి మరోటి, రకరకాల పౌడర్లు కనిపిస్తాయి. హాయిగా ఇదివరకటిరోజుల్లో, ఏదో SUNLIGHT  ఒక్కటే ఉండేది, దానితో పనైపోయేది. కాలక్రమేణా, వాషింగు మెషీన్లు వచ్చాయి. అందులో పౌడరువేస్తేనే పనవుతుంది. మళ్ళీ టీవీల్లో వ్యాపార ప్రకటనలు… ఫలానా పౌడరు వాడితే, స్వఛ్ఛమైన తెలుపు వస్తుందీ, ఉద్యోగం తనంతట తానే, కాళ్ళ దగ్గరకు వస్తుందీ అంటూ…

ఇంక మొహాలకి రాసుకునే క్రీమ్ములు అడక్కండి—ఫలానాది రాసుకుంటే పెళ్ళికొడుకొచ్చేస్తాడంటారు.  టూత్ పేస్టుల విషయానికొస్తే, ఒకడు వేప ఉందంటాడు, ఇంకోడు ఉప్పంటాడు, ఈమధ్యన అయితే, ఏకంగా, మీ పేస్టులో బొగ్గుపొడి ఉందా లోకి వచ్చేసింది. కొన్ని రోజులలో, మీ పేస్టులో , పోపు సామానుందా అని ప్రకటన వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు.

ఏదో స్థోమత చూపించుకోడానికి, వేలకు  వేలు పోసి, సరుకు కొనడంతో సరిపోదు. ఏదో గ్యారెంటీ పిరియడ్ ఉన్నంతకాలం, ఉచితంగా చేస్తాడు.. అదేం కర్మమో కానీ, గ్యారెంటీ పిరియడ్ లో మాత్రం, లక్షణంగా పనిచేస్తుంది. సరీగ్గా అదైపోగానే, పనిచేయడం మానేస్తుంది. కొట్టువాడిదగ్గరకు వెళ్తే, అద్ఱ్దో Toll free  నెంబరిచ్చి, వాళ్ళతో మాట్టాడమంటాడు. ఏదో మొత్తానికి ఓ అరగంట ప్రయత్నం చేయగా… చేయగా దొరుకుతారు. ఇంటికి వచ్చి రిపేరీ చేసినందుకు, ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తారు.   పోనీ, మామూలు రిపేరీవాళ్ళ దగ్గరకు వెళ్దామా అంటే, వారి దగ్గర అసలు సిసలు పార్టులు దొరకవేమో అని భయం. చివరకు వాడొచ్చి , ఏదో అదీ చెప్పి డబ్బులు తీసికుని వెళ్తాడు. పోనీ, వాడు చేసిన రిపేరీకైనా గ్తారెంటీ ఉంటుందా అంటే అదీ సందేహమే. చివరకి మిగిలేదేమిటంటే, నెలసరి మాసికాల్లాగ, ప్రతీనెలా రిపేర్.

ఈ రోజుల్లో వచ్చిన గొడవ ఏమిటంటే, ప్రతీవారూ, ఏదో ఒక బ్రాండ్ వెనక్కాల పడడం. వారు కొన్న బ్రాండే ఘనమైనదీ అని చెప్పుకోవడం. పైగా ఇంకోటేదో బ్రాండు కొంటే, వారిని చులకన చేయడం. వాళ్ళు మాత్రం online  లో ఎక్కడ చవగ్గా దొరుకుతుందో, నెట్ అంతా వెదికి , కొనుక్కోడం మాత్రం చెప్పరు.

 ఇంక  , రెండురోజులకో, మూడు రోజులకో స్నానాలు చేసేవారు, ఉపయోగించే ముఖ్యమైన వస్తువు   deodorant  లు. రోజూ శుభ్రంగా స్నానం చేస్తే,  అసలు వంటినుండి దుర్వాసన ఎందుకొస్తుందీ, తెలియక అడుగుతాను. ఆ దుర్వాసన కప్పి పుచ్చుకోడానికి మళ్ళీ, పొద్దుటోటి, రాత్రోటి  సెంటులు. అసలు సెంటు వాసన రాగానే తెలిసిపోతుంది—ఈ శాల్తీ స్నానం చేసే రకం కాదూ అని.

 చేతినిండా డబ్బులుండేసరికి వేసే వెర్రి వేషాలివి.

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
vastu vastavalu