Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope27th november to 3rd december

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

(గత సంచిక తరువాయి)

రాయల వసంతఋతు వర్ణన రమణీయంగా సాగుతున్నది.

ద్విజతఁ గాంచియు మధుసేవ విడువలేక
జాతిఁ బాసినతేంట్ల నిస్వనముఁ గూడు
కొనుటనో యనఁ గోకిల స్వనము సెలఁగెఁ  
దనకు మరి పంచమత్వంబు తప్పకుండ    

ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ద్విజము అంటే పక్షి అని కూడా అర్థము. భూమి మీద పడ్డప్పుడు ఒకసారి, గాయత్రీ మంత్రోపదేశము పొందిన తర్వాత రెండవసారి, యిలా రెండుసార్లు జన్మను పొందుతాడు గనుక బ్రాహ్మణుడు ద్విజుడు. పక్షి గుడ్డుగా ఒకసారి, గుడ్డులోనుండి పక్షిగా రెండవసారి జన్మను పొందుతుంది గనుక ద్విజము. ద్విజత్వము ఉన్న బ్రాహ్మణుడికి మధుపానము నిషిద్ధము, కనుక ద్విజత్వము ఉన్న తుమ్మెదకు కూడా మధుపానము నిషిద్ధమే అంటున్నాడు రాయలవారు చమత్కారంగా. అలా నిషిద్ధము అయినా కూడా మధుపానము చేసి, తుమ్మెదలకు జాతి భ్రష్టము ఐపోయింది. వాటితో కలిసి వనాలలో తిరిగిన కారణంగా కాబోలు, కోకిలలకు కూడా జాతి భ్రష్టత్వము 
కలిగింది. కోకిల కూడా ద్విజమే కనుక, తుమ్మెదలతో కలిసి వనాలలో తిరిగిన కారణంగా, ఆ తుమ్మెదల కంఠస్వరం కోకిలలకు వచ్చినట్లుంది. కనుక కోకిలలు పంచమత్వాన్ని పొందాయి,  కనుక పంచమ స్వరంతో కూస్తున్నాయి,వసంతంలో. పంచమహాపాతకాలలో సురాపానం కూడా ఒకటి అని, ఆ మహా పాతకాలు చేసినవాళ్ళతో స్నేహం చేయడం, కలిసి తిరగడం కూడా మరొక 

మహా పాతకం అని ఇంతకుముందు చెప్పుకున్నాము. కనుక కోకిలలకు కూడా ఆ పాపం అంటుకుని, జాతి భ్రష్టమైపోయి, పంచమత్వాన్ని పొందాయేమో, కనుకనే పంచమస్వరంలో తీయగా పాడుతున్నాయి అని చమత్కరిస్తున్నాడు రాయలవారు.     

పూచినమావులం దవిలి పూవిలుజోదున కమ్మె మాధవుం 
డేచిన శంక నాతఁ డవి యేకొనియే పథికావళీజయ 
శ్రీచణుఁ డయ్యె నట్టిద యకృత్యముచే నగునట్టిపీడయుం
గోచరమౌనె దైవ మనుకూలము నై పరుమేలు తీరినన్  

రాయలవారి భాషాపటిమకు, భావనా గరిమకు, విస్తృతపఠనానుభవానికి, లోకోక్తులుగా నిలిచిపోయే పలుకులకు ఈ పద్యం చక్కని ఉదాహరణ. మావులు అంటే మామిడిచెట్లు అని, గుఱ్ఱములు అనికూడా అర్థం. పూయడం అంటే చెట్లు లతలు పూయడము, శరీరము పొక్కడం. మాధవుడు అంటే వసంతుడు.వసంతంలో మామిడి చెట్లు చివుళ్ళు తొడగడం, పూయడం సహజమే. మన్మథుని పూలబాణాలలో మామిడిపూలు కూడా భాగమే. ఈ రెండు విషయాలను చమత్కారపూర్వకంగా వాడాడు. అదనంగా కొన్ని అందించాడు మన్మథునికి.నిలువెల్లా పూచిన మావులను(మామిడిచెట్లను)చూసి, నిలువెల్లా పూచిన గుఱ్ఱములు(మావులు)కావొచ్చును అని, మిక్కిలి అనుమానముతో (ఏచిన శంకన్)వసంతుడు వాటిని మన్మథునికి అమ్మేశాడు. ఎందుకంటే శరీరం పూయడం, అంటే పొక్కడం, అంటే చర్మసంబంధమైన రుగ్మత కలగడం గుర్రాలకు మంచిది కాదు, అవి అంతకుముందులా పరుగెత్తలేవు, ఎందుకంటే చర్మసంబంధమైన తీవ్ర రుగ్మతలు ఎముకలు, కీళ్ళు దెబ్బతినేలా చేస్తాయి. ఆ గుర్రాలనే, ఆ మావులనే, ఆ మామిళ్ళనే మన్మథుడు తీసుకుని పథికులను, విరహులను జయించడానికి 'శ్రీ చణుడు' అయినాడు. మన్మథుని పూల బాణాలలో మామిడి పూలు కూడా ఉన్నాయి కనుక, మామిడి పూల బాణాల లక్షణం 'సంతాపనం', 

సంతాపాన్ని కలిగించడం కనుక అలా జనుల మనసులకు మన్మథ తాపాన్ని కలిగించడంలో విజయుడు అయినాడు మన్మథుడు. యిప్పుడు ఈ వసంతఋతువులో నిలువెల్లా పూచిన మామిళ్ళను తీసుకుని,వాటిని వాహనంగా చేసుకుని, అంటే మామిడి కొమ్మలనెక్కి, వాటి మాటున దాగి, యింకా విజ్రుంభిస్తున్నాడు మన్మథుడు. దైవము అనుకూలము ఐనప్పుడు అకృత్యము అంటే చేయ గూడని పనిని, నష్టాన్ని కలిగించే పనిని చేసినా ఆ పాడుపని తాలూకు పీడ అంటుకోదు.యింతవరకూ వ్రాసిన ఏ కవి అయినా గొప్ప కవియే అవుతాడు, కానీ 'శ్రీ చణుడు' అని ఉద్దేశపూర్వకంగా వాడిన కారణంగా, శ్రీకృష్ణదేవరాయలు కారణజన్ముడైన మహాకవి అయినాడు, ఈ వ్యాసకర్త ఉద్దేశములో.  మన్మథుడు అమ్మవారి ఉపాసకులలో, లలితా ఉపాసకులలో అగ్రగణ్యులలో ఒకడు. 'శ్రీ' అని అమ్మవారిని,  'చణుడు' అని సామర్థ్యాన్ని కలిగినవాడు అని చెప్పి, మన్మథుడు అమ్మవారి కటాక్ష సామర్థ్యాన్ని, కరుణను పొంది విజయుడు అయినాడు అని చెప్తూ సౌందర్యలహరిలోని, ఆదిశంకరులవారి ఒక దివ్యమైన శ్లోకాన్ని సూచిస్తున్నాడు రాయలవారు. 

' ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖా
 
వసంతః సామంతో మలయమరు దాయోదన రథః
తదాప్యేకః సర్వం హిమగిరి సుతే కా మపి కృపా 
మపాంగా త్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే '    

విల్లు గొప్పదా అంటే కాదు, పుష్ప సంబంధమైనది, చెరుకువిల్లు. వింటినారిని చూద్దామా అంటే ఎంత మాత్రమూ నిలకడలేని, ఒకచోట ఉండని తుమ్మెదల బారు నారి. సరే బాణాల సంగతి చూద్దామా అంటే ఐదు పూలు, ఐదే బాణాలు. సరే అనుసరించి వచ్చే సామంతుల అండ దండ ఏమన్నా ఉన్నదా అంటే, సామంతుడు వసంతుడు,సంవత్సరానికి ఒక్కసారి వచ్చి రెండే నెలలు వెంట ఉంటాడు. మరి రథం ఏమన్నా గొప్పదా అంటే మలయ మారుతం, నిలకడలేని, సున్నితమైన గాలి. తనేమో ఒక్కడే. ఐనప్పటికీ, మన్మథుడు ఈ జగత్తును మొత్తాన్ని, అందునా కనీసము శరీరము అనే ఉనికి కూడా లేకుండా, అనంగుడై గెలుస్తున్నాడు, పడేస్తున్నాడు, ఆటాడిస్తున్నాడు ఎలా అంటే, అమ్మా! నీ కడగంటి చూపుల కరుణకు వాడు పాత్రుడు కావడం వల్లనే' అని ఆదిశంకరులవారు అన్నభావాన్ని ధ్వనిస్తున్నాడు రాయలవారు. ఆదిశంకరుల ఈ శ్లోక స్ఫురణ, స్ఫూర్తి ఉన్నాయి రాయలవారి ఈ పద్యంలో.అంతే కాదు, మనకు దైవం అనుకూలుడు అయితే, మన శత్రువుల మంచిరోజులు ముగిసిపోతే మనదే విజయం. అంటే కేవలం మన గొప్ప వలన కాదు, దైవకృప మనమీద ఉండడం వలన, శత్రువుకు చెడ్డరోజులు దాపురించడం వలన మనము తెలిసీ తెలియక చేసిన చెడ్డపనులు కూడా చెడ్డ ఫలితాన్ని యివ్వకుండా ఉంటాయి. యిందుకు వ్యతిరేకముగా ఉన్నపుడు, దైవం అనుకూలించనప్పుడు, మనకు చెడ్డరోజులు, శత్రువులకు మంచిరోజులు వచ్చినపుడు మనం చేసే మంచిపనులు కూడా మంచి ఫలితాలను యివ్వవు, ఓడిపోతాము, కనుక మనం నిమిత్త మాత్రులమే, పనిచేసే వారిమే, పని చేయాల్సినవారిమే. గీతాచార్యుడు చెప్పినట్లుకర్మలను చేయడంలోనే మన పాత్ర, వాటి ఫలితాలను నిర్దేశించడంలో కాదు, అని చెప్తున్నాడు రాయలవారు. రాయలను మించిన కవిరాయలు ఎవరన్నా ఉన్నారా?

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని శీర్షికలు
humour interview