Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

కబాలి చిత్ర సమీక్ష

movie review kabali

చిత్రం: కబాలి 
తారాగణం: రజనీకాంత్‌, రాధికా ఆప్టే, ధన్సిక, కిషోర్‌, దినేష్‌ రవి, విన్‌స్టన్‌ చావ్‌, రిత్విక తదితరులు 
సంగీతం: సంతోష్‌ నారాయణ్‌ 
సినిమాటోగ్రఫీ: జి. మురళి 
నిర్మాణం: వి క్రియేషన్స్‌ 
నిర్మాత: కలైపులి ఎస్‌ థాను 
దర్శకత్వం: పా రంజిత్‌ 
విడుదల తేదీ: 22 జులై 2016

క్లుప్తంగా చెప్పాలంటే

కబాలి (రజనీకాంత్‌) మలేసియాలో పెద్ద గ్యాంగ్‌ స్టర్‌. ఓ ఘటనలో పోలీసులకు చిక్కి 25 ఏళ్ళపాటు జైలు జీవితం గడుపుతాడు. అతనికి భార్య, కుమార్తె ఉంటారు. అయితే జైలుకు వెళ్ళే సమయంలోనే కబాలి తన కుటుంబాన్ని కోల్పోతాడు. తిరిగి బయటకు వచ్చిన కబాలిని చంపేందుకు అప్పటిదాకా ఎదురుచూస్తున్నవారంతా ఎటాక్స్‌కి ప్లాన్‌ చేస్తుంటారు. అప్పుడే తన కుటుంబం చనిపోలేదని కబాలికి తెలుస్తుంది. ఇంకో వైపున ఓ సమస్య కోసం పోరాడే క్రమంలో గ్యాంగ్‌ స్టర్‌గా మారిన కబాలి, ఆ సమస్యను పాతికేళ్ళ తర్వాత పరిష్కరించేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు? 'కబాలి' కుటుంబం ఏమైంది? అనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే

రజనీకాంత్‌ వయసుతోపాటే నటనలో ఈజ్‌ పెంచుకుంటూ పోతున్నారు. అతనిలో స్టైల్‌ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. నెరిసిన గడ్డంతో రజనీకాంత్‌ డాన్‌లా తెరపై కన్పిస్తోంటే అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. ఆ గెటప్‌లో రజనీకాంత్‌ పవర్‌ఫుల్‌ డైలాగులు, స్టైలిష్‌ పెర్ఫామెన్స్‌ నభూతో నభవిష్యతి అనిపిస్తాయి. తనదైన పెర్ఫామెన్స్‌తో 'కబాలి' పాత్రకు జీవం పోశాడు రజనీకాంత్‌. వన్‌ మ్యాన్‌ ఆర్మీ అన్నట్లుగా సినిమా మొత్తాన్నీ తన భుజాలపై మోసేశాడు.

రాధికా ఆప్టే బాగానే చేసింది. ఎమోషనల్‌ సీన్స్‌లో మంచి నటనా ప్రతిభను చాటుకుంది. అయితే అక్కడక్కడా ఆమె పాత్ర తేలిపోతుంది. కబాలి కుమార్తెగా ధన్సిక ఓకే. పవర్‌ఫుల్‌గా కనిపించాల్సిన పాత్రలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్‌గా ఆమె పాత్ర ఓకే. విలన్‌ పాత్రలో విన్‌స్టన్‌ చావ్‌ బాగానే విలనిజం పండించాడు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

కథ పరంగా ఇదేమీ కొత్తది కాదు. ఎన్నో సినిమాల్లో చూసేసిందే. రజనీకాంత్‌ నుంచే 'భాషా' సినిమా వచ్చేసింది. అందులో పండిన ఏమోషన్స్‌, కథ ఈ సినిమాతో పోల్చడం సరికాదు. ఎందుకంటే రజనీకాంత్‌ ప్రెజెన్స్‌ మీద ఫోకస్‌ పెట్టిన దర్శకుడు మిగతా విషయాల్ని లైట్‌ తీసుకున్నాడు. డైలాగులు బాగున్నాయి. రజనీకాంత్‌ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా డైలాగులు ఆకట్టుకుంటాయి. స్క్రీన్‌ప్లే ఫర్వాలేదు. సినిమా స్లోగా సాగుతుంది. ఎడిటింగ్‌తోపాటు స్క్రీన్‌ప్లే లోపాలూ ఉండటమే దానికి కారణం. మ్యూజిక్‌ ఓకే. మరీ గొప్పగా ఏమీ లేదు. టైటిల్‌ సాంగ్‌ మాత్రం అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌లో హైలైట్‌ సినిమాటోగ్రఫీదే. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ సినిమాకి అవసరమైన మేర సహకరించాయి. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి.

రజనీకాంత్‌తో డిఫరెంట్‌ లుక్‌నీ, అదీ స్టైలిష్‌ లుక్‌నీ ట్రై చేయించడం వరకూ దర్శకుడ్ని అభినందించాలి. ఆ స్థాయిలో రజనీకాంత్‌ పాత్రకు బిల్డప్‌ ఇవ్వగలిగాడు. 'డాన్‌' పాత్రలో రజనీకాంత్‌ని నేటి తరానికి తగ్గట్లు చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు దర్శకుడు. అయితే, సినిమాని వేగంగా నడిపించలేకపోయాడు. ఒక్కోసారి సినిమాలో పేస్‌ బాగా తగ్గిపోయి, అభిమానులకే నీరసం వచ్చేస్తుంటుంది. రజనీకాంత్‌ లాంటి సూపర్‌ స్టార్‌ ఛాన్సిచ్చాక దాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సి ఉన్నప్పటికీ దర్శకుడు సరిగ్గా ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయాడు. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ రెండిట్లోనూ లోపాలున్నాయి. కథలో లోపాలు, దాన్ని చెప్పడంలో లోపాలు అన్నీ కలిసి ఓ మంచి ప్రయత్నం బెడిసికొట్టిందనే భావనను కలిగిస్తాయి. సినిమాపై ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్న దరిమిలా ఏ మాత్రం ఆ అంచనాల్ని అందుకునేలా దర్శకుడు సినిమాని తీసినా, చారిత్రాత్మక చిత్రం అయ్యేది. ఓవరాల్‌గా రజనీకాంత్‌ అభిమానుల్ని సైతం ఈ చిత్రం నిరాశపర్చింది.

ఒక్క మాటలో చెప్పాలంటే
'కబాలి'తో అంచనాలు 'బలి'రా

అంకెల్లో చెప్పాలంటే: 2.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka