Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

చంద్రశేఖర్ యేలేటి తో ఇంటర్వ్యూ

interview with chandrasekhar yeleti

డిఫ‌రెంట్ అంటే... కొత్త‌గా ఆలోచించ‌డం కాదు!  - చంద్ర‌శేఖ‌ర్ యేలేటి 

ఒక్క సినిమా చాలు... ద‌ర్శ‌కుడి టేస్టేంటో చెప్ప‌డానికి! అలాంటి సినిమాలు నాలుగు తీశాడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. ఐతేతో చిన్న సినిమాల దృక్కోణాన్ని పూర్తిగా మార్చేశాడు. చిన్న సినిమాని ఎంత‌బాగా తీయొచ్చో నేర్పించాడు. రేర్ బ్ల‌డ్ గ్రూప్‌తో అనే కాన్సెప్ట్‌ని క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌గా ఎలా చెప్పొచ్చో.. ఒక్క‌డున్నాడులో నిరూపించాడు. ఒక‌రోజు మిస్స‌యిపోతే.. జ‌రిగే గంద‌ర‌గోళం - అనుకోకుండా ఓరోజు. ఇలా.. ప్ర‌తీ సినిమాకీ త‌న‌దైన ముద్ర వేయాల‌ని త‌పించే ద‌ర్శ‌కుడు.. యేలేటి. ఇప్పుడు మ‌న‌మంతా అంటూ మ‌రో ప్ర‌య‌త్నం చేశారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో గో తెలుగు డాట్ కామ్ జ‌రిపిన చిట్ చాట్ ఇది..

* చాలా కాల‌మైంది మీరు మీడియా ముందుకొచ్చి..
- (న‌వ్వుతూ) అవునండీ.. సినిమా సినిమాకీ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చేస్తోంది క‌దా..

* ఫాస్ట్ ఫాస్ట్‌గా సినిమాలు తీయొచ్చు క‌దా?
- స్వ‌త‌హాగా నేను కొంచెం స్లో. క‌థ రాసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకొంటా. ఆ త‌ర‌వాత స్ర్కీన్ ప్లే ప‌నులు మొద‌లెడ‌తాను. నాతో సినిమా అంటే...యేడాదిన్న‌ర ప‌ట్టేస్తుంది. అందుకే ఇన్నేళ్ల ప్ర‌యాణంలో ఇన్ని త‌క్కువ సినిమాలు చేయ‌గ‌లిగా. మ‌ధ్య‌లో ఓ రెండు సినిమాలు మొద‌లైన‌ట్టే మొద‌లై ఆగిపోయాయి.

* అవేంటి?
- వెంక‌టేష్ గారితో ఓ సినిమా అనుకొన్నా. ఉద‌య్ కిర‌ణ్‌తో ఓ సినిమా ప్లాన్ చేశా. కానీ కుద‌ర్లేదు.

* బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్ వ‌చ్చింది క‌దా?
- అవును. అనుకోకుండా ఓ రోజు సినిమాని హిందీలో తీయ‌మ‌న్నారు. నాకు హిందీ భాష‌పై పెద్ద‌గా ప‌ట్టులేదు. దాంతో ఆ అవ‌కాశాన్ని వ‌దులుకొన్నా.

* మీ త‌ర‌హా క‌థ‌ల‌కు బాలీవుడ్ బాగా న‌ప్పుతుందేమో క‌దా. అక్క‌డ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు మంచి మార్కెట్ ఉంది..
- అవును. కాక‌పోతే.. హిందీ సినిమా చేయాలంటే ఓ రెండేళ్లు తెలుగు సినిమా గురించి పూర్తిగా మ‌ర్చిపోవాలి. నా దృష్టంతా బాలీవుడ్‌పైనే పెట్టాలి. ఇప్ప‌టికే స్లో అంటున్నారు.. అప్పుడు మ‌రింత స్లో అనేస్తారు.. (న‌వ్వుతూ).

* సౌతిండియ‌న్ సినిమా కూడా మెల్ల‌మెల్ల‌గా మారుతోంది.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు అల‌వాటు ప‌డుతున్నారు..
- అవును.. ప్రేమ‌మ్‌, దృశ్య‌మ్‌లాంటి సినిమాలు బాగా ఆడాయి. మ‌ల్టీప్లెక్స్‌కి జ‌నాలు బాగా అల‌వాటు ప‌డుతున్నారు. నిజంగానే ఇది మంచి టైమ్‌.

* మ‌ళ్లీ ఐతే లాంటి సినిమా ఎందుకు ట్రై చేయ‌లేదు?
- ఐతే.. కాన్సెప్ట్‌, ఆ టేకింగ్ ఇప్ప‌టికీ రిస్కే అనుకొంటున్నా. అందుకే మ‌ళ్లీ అంత ధైర్యం చేయ‌లేదు.

* ఐతే 2 అనే సినిమా వ‌స్తోంది..
- అవును. అయితే దానికీ నాకూ, ఐతే సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. కేవ‌లం వాళ్లు టైటిల్ అడిగారు. గుణ్ణం గంగ‌రాజు గారు ఇచ్చేశారు.

* స్టార్ హీరోల‌తో సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న రాలేదా?
- ఎందుకు రాదు. కాక‌పోతే నేను హీరోని దృష్టిలో ఉంచుకొని క‌థ‌లు సిద్ధం చేయ‌ను. క‌థ‌లు రాశాక‌... హీరోలెవ‌రో ఆలోచిస్తా.

* స్టార్ హీరోలెవ‌రూ సినిమా చేద్దాం... అని అడ‌గ‌లేదా?
- అడిగారు.. కానీ నేనే వాళ్ల‌కు స‌రిప‌డా క‌థ‌లు త‌యారు చేసుకోలేక‌పోయా.

* నేనూ ఓ మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టాలి అనిపించ‌లేదా?
- ఎందుకు అనిపించ‌దు.. హిట్టు ఎవ‌రికి వ‌ద్దు?? అయితే క‌మ‌ర్షియ‌ల్ కోణంలో క‌థ‌లు ఆలోచించ‌డం నాకు రాదు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేదే ఏదో టిపిక‌ల్ క‌థ చెబుతాన‌ని. ఐతేతో ఆ ముద్ర ప‌డిపోయింది. అలాంట‌ప్పుడు నేను కూడా క‌మ‌ర్షియ‌ల్ క‌థ చెబితే బాగోదు క‌దా?

* మీ మీద ప‌డిన ముద్ర చెరిపేద్దాం అన్న ఆలోచ‌న రాలేదా?
- కొత్త‌గా ఆలోచిద్దామ‌ని కూర్చుంటే కొత్త ఆలోచ‌న‌లు రావు. జ‌న్మ‌తః ఉండాలి. అందుకే నేను మారాల‌న్నా మార‌లేను. నా త‌త్వ‌మే అంత‌.

* మ‌న‌మంతా... ఎలాంటి సినిమా?  థ్రిల్ల‌ర్ అనుకోవ‌చ్చా?
- లేదు... ఇదో ఎమోష‌న‌ల్ డ్రామా. న‌లుగురు భిన్న‌మైన వ్య‌క్తుల క‌థ‌. ఆ న‌లుగురి మ‌న‌స్త‌త్వాలేంటి?  వాళ్ల క‌థేంటి? ఈ నాలుగు క‌థ‌లూ ఎక్క‌డ ఇంట‌ర్‌లింక్ అయ్యాయి? అనేది ఆస‌క్తిక‌రం.

* నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌కు స్ఫూర్తిగా తీసిన సినిమానా?
- ఒక సంఘ‌ట‌న అని చెప్ప‌లేను.. చాలా సంఘ‌ట‌న‌లు క‌ళ్లముందు క‌నిపిస్తాయి. 

* మోహ‌న్‌లాల్‌ని ఎంచుకోవ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉందా?
- నా క‌థ‌కు, ఆ పాత్ర‌కు ఆయ‌నైతేనే స‌రిపోతుంద‌నిపించింది. వెంట‌నే ఆయ‌న్ని క‌లుసుకొన్నా. ఐతే సినిమాని మ‌ల‌యాళంలో రీమేక్ చేశారు. అందులో ఆయ‌న పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర వేశారు. అలా.. నా గురించి ఆయ‌న‌కు కొంత వ‌ర‌కూ తెలుసు. ఐతే ద‌ర్శ‌కుడిగానే ఆయ‌న ముందుకెళ్లా. క‌థ న‌చ్చి.. వెంట‌నే ఒప్పుకొన్నారు.

* ఆయ‌న‌తోనే డ‌బ్బింగ్ చెప్పించాల‌న్న ఆలోచ‌న ఎవ‌రిది?
- ఆయ‌న‌దే. ఏ భాష‌లో న‌టించినా.. ఆయ‌న పాత్ర‌కు ఆయ‌నే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం ఓ అల‌వాటు. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకొన్నారు.

* టీజ‌ర్‌లో డైలాగులు వింటే... స్ప‌ష్ట‌త లేన‌ట్టు అనిపిస్తోంది..
- స్వ‌త‌హాగా మ‌ల‌యాళి. ఆయ‌న తెలుగు మాట్లాడితే అలానే ఉంటుంది క‌దా? అయితే.. సినిమాలో ఆయ‌న వాయిస్ ఇంకా బెట‌ర్‌గా ఉంటుంది. డ‌బ్బింగ్ కోస‌మే ఆయ‌న చాలారోజులు క‌ష్ట‌ప‌డ్డారు.

* పుస్త‌కాలు చ‌దువుతుంటారా?
- ఇది వ‌ర‌కు ఫిక్ష‌న్ చ‌దివేవాడ్ని. ఇప్పుడంతా నాన్ ఫిక్ష‌నే. తెలుగు పుస్త‌కాల‌కంటే... ఇంగ్లీష్ పుస్త‌కాలే ఎక్కువ‌గా చ‌దువుతా.

* మ‌ళ్లీ సినిమా ఎప్పుడు...
- ప్ర‌స్తుతం నా దృష్టంతా మ‌న‌సంతా సినిమాపైనే. ఆ త‌ర‌వాతే... కొత్త సినిమా గురించి ఆలోచిస్తా.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ...


- కాత్యాయని

-

మరిన్ని సినిమా కబుర్లు
chiru 150th movie heroin kajal