Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: నిర్మలా కాన్వెంట్‌ 
తారాగణం: నాగార్జున, రోషన్‌, శ్రియా శర్మ, ఎల్‌బి శ్రీరామ్‌, సూర్య, అనితా చౌదరి, ఆదిత్య మీనన్‌, రవిప్రకాష్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు 
సంగీతం: రోషన్‌ సాలూరి 
సినిమాటోగ్రఫీ: ఎస్‌వి విశ్వేశ్వర్‌ 
నిర్మాణం: మ్యూజిక్‌ టీమ్‌ వర్క్స్‌, అన్నపూర్ణా స్టూడియోస్‌ 
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, నిమ్మగడ్డ ప్రసాద్‌ 
దర్శకత్వం: నాగ కోటేశ్వరరావు 
విడుదల తేదీ: 9 సెప్టెంబర్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
శామ్యూల్‌ (రోషన్‌) చలాకీ కుర్రాడు, చదువుల్లో మేటి. శామ్యూల్‌ చదువుతున్న నిర్మలా కాన్వెంట్‌లోనే చదివే శాంతికి, శామ్యూల్‌ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అలా ఇద్దరి మనసులూ కలుస్తాయి. కానీ, వారిరువురి కుటుంబాల మధ్య ఆర్థిక అంతరాలు వారి ప్రేమకు చెక్‌ పెడతాయి. తనలా ఆస్తి, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తే తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తానని శామూల్‌కి శాంతి తండ్రి సవాల్‌ విసురుతాడు. దాంతో డబ్బు సంపాదనకోసం హైద్రాబాద్‌ వచ్చిన శామ్యూల్‌ హీరో నాగార్జున (నాగార్జున)ని కలుస్తాడు. ఆ తర్వాత ఏమయ్యిందన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే 
తొలి సినిమానే అయినా రోషన్‌ ఎక్కడా తడబడలేదు. చాలా బాగా చేశాడు. నటననే కెరీర్‌గా ముందే ఎంచుకున్నాడేమో, పూర్తిస్థాయిలో సన్నద్ధమయినట్లు కనిపించింది. బాల నటిగా పలు సినిమాల్లో చేసిన శ్రియా శర్మ ఇప్పటికే ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. క్యూట్‌గా ఫ్రెష్‌ లుక్‌తో కనిపించడమే కాదు, చక్కటి హావభావాలతోనూ ఆకట్టుకుంది. రోషన్‌ - శ్రియా శర్మ పెయిర్‌ తెరపై చాలా అందంగా ఉంది. క్యూట్‌ లవ్‌ స్టోరీలో క్యూట్‌ ప్రేమ జంట అందర్నీ ఆకట్టుకుంటుంది.

నాగార్జున తన ప్రెజెన్స్‌తో సినిమా రేంజ్‌ని పెంచేశారు. ఈ సినిమాకి ఇంతలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అయ్యిందంటే అది నాగార్జున వల్లనే. తన ప్రెజెన్స్‌తో సినిమాకి మంచి కిక్‌ ఇచ్చారు నాగార్జున. ఎల్‌బి శ్రీరాం కాస్సేపే కనిపించినా, తన నటనా ప్రతిభతో మరోమారు మెప్పించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

దర్శకుడు పాత కథనే ఎంచుకున్నాడు. పాత కథలే అయినా కొత్తగా చూపించగలగాలి. ఆ విషయంలో దర్శకుడు కొంచెం తడబడ్డాడు. కొత్త జంటని అందంగా చూపించడంలో మాత్రం దర్శకుడు సఫలమయ్యాడు. కథనం విషయంలోనూ కొత్తదనం చూపలేకపోయాడు దర్శకుడు. మాటలు ఓకే. సంగీతం బాగుంది. పాటలు వినడానికీ, చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఓకే. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమాని చాలా రిచ్‌గా చూపించాడు సినిమాటోగ్రాఫర్‌. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి. 
అందరికీ తెలిసిన కథే ఇది. చాలా చాలా సినిమాల్లో చూసేశాం. ఆ ఫీల్‌ కలిగినా, సినిమాని కొత్తగా పరుగులు పెట్టించగలిగితేనే దర్శకుడు సఫలమయినట్లు. కానీ ఆ విషయంలో దర్శకుడు తడబడ్డాడు. నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలగాలి, సినిమాలో లీనమయ్యేలా చేయగలగాలి. కానీ ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్స్‌ ఏమీ లేవు. నాగార్జున లాంటి స్టార్‌ సినిమాని తన భుజానికెత్తుకున్నాడంటే సినిమా నుంచి చాలా ఆశిస్తాం. కానీ, ఆ విషయంలో నిరాశ తప్పదు. కొత్త జంట, ఇద్దరూ నటన తెలిసినవారే. వారికి నాగార్జున స్టార్‌డమ్‌ హెల్పయ్యింది. సంగీతం, సినిమాటోగ్రపీ అన్నీ కుదిరాయి. ఓవరాల్‌గా సినిమా ఫర్వాలేదు అనిపిస్తుంది తప్ప, చాలా బాగుందని అనిపించడం కష్టమే.

ఒక్క మాటలో చెప్పాలంటే 
కాన్వెంట్‌లో స్టూడెంట్స్‌ బాగున్నారు

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with nagarjuna