Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabhandham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు... ఆమె.. ఒక రహస్యం..

గతసంచికలో ఏం జరిగిందంటే ... http://www.gotelugu.com/issue187/538/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

(గతసంచిక తరువాయి)

“ఫోన్ చేసిన వాళ్ళ పేరు చెప్ప లేదట కానీ, రెడ్ డైమాండ్స్ గురించి  చెప్పారుట. అప్పట్లో బ్రిటీష్ రాజుల నుండి కానుకగా వచ్చిన ఆ వజ్రాలని  అప్పటి సిర్నాపల్లి రాజులు  కొన్ని నగలలో పొదిగారట. ప్రస్తుతం  ఆ నగలు సిర్నాపల్లిలో ఒకరి దగ్గర ఉన్నాయట ! వాటిని అమ్ముతానని ఫోన్ చేసాడు !!”

పాణి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉండి పోయాడు. 

“అరుదైన ఆ వజ్రాలకి నేను ఎంత డబ్బైనా చెల్లించ డానికి సిద్దంగా ఉన్నాను.  అవి నా స్వంతమైతే,  అటు వంటి అలాంటి వజ్రాలు మన దేశంలో కేవలం మా వద్ద మాత్రమే ఉంటాయి”  అంటూ ఇంకా ఏదో చెప్ప బోయాడు కీర్తీ లాల్.

అతడి మాటల్ని మధ్యలో ఆపి అన్నాడు పాణి “ఎవరు?  ఎవరు ఆ వ్యాపారికి ఫోన్ చేసినది?  ఆ నగలు అసలు వాళ్ళ దగ్గరకి ఎలా వచ్చాయి? అంత పెద్ద డీల్ మాట్లాడే వాళ్ళు తమ పేరు చెప్పక పోవడ మేమిటి?”  ఎంత వద్దనుకున్నా అతడు తన గొంతు లోని సీరియస్‍ నెస్‍ ని దాచుకో లేక పోయాడు. 

ఉద్వేగంలో ఉన్న కీర్తిలాల్ దాన్ని పెద్దగా పట్టించుకో లేదు. చిన్నగా నవ్వి, అన్నాడు “పాణి గారూ, ఇలాంటి విషయాల్లో డీలింగ్స్ ఎలా ఉంటాయో మీకు చెప్పక్కర్లేదు కదా? డీల్ కుదిరే వరకూ ఆ వ్యక్తి తన ఐడెంటిటీని  బయట పెట్టడు”

‘ఏదో ప్రమాదం నా వెనుక పొంచి ఉందని బలంగా అనిపిస్తోంది. నాకు మీ సహాయం కావాలి.  మీరు ఒకసారి మా సంస్థానానికి వచ్చి,  నా ఆశయం  నెర వేరేంత వరకూ నా భద్రతా విధులు నిర్వర్తించ డానికి తగిన ఏర్పాట్లు చేయాలని నా కోరిక... ఒకప్పుడు ఈ సంస్థానం క్రింద ఉండే రెండొందల గ్రామాలు ప్రస్తుతం కరువు కాటకాలతో అల్లాడుతున్నాయి.  ప్రజలు  కనీస సౌకర్యాలు లేకుండా బాధ పడుతున్నారు.   ఈ సంపదతో వాళ్లకి ఏమైనా చెయ్యాలన్నది నా ఆలోచన...’

తనకి వచ్చిన మెయిల్ లోని వాక్యాలు కళ్ళ ముందు మెదిలాయి పాణికి.

“కీర్తి లాల్ గారూ, ఆ వ్యక్తి ఎవరో, ఆ వజ్రాలు అతడి దగ్గరకి  ఎలా వచ్చాయో తెలుసుకోకుండా కొనే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకండి.  మరో విషయం... ఆ వ్యక్తి నుంచి మళ్ళీ ఫోన్ వస్తే  ఆ నెంబరు నోట్ చేసుకోమని ఆ సూరత్ వ్యాపారికి చెప్పండి. ఈ విషయంలో ఏం జరుగుతోందో  ఎప్పటికప్పుడు నాకు తెలియ చెయ్యండి”  గబ గబా అన్నాడు.

అతడి మాటలకి కొద్దిగా ఆశ్చర్య పోయినట్టుగా ఒక్క క్షణం మౌనంగా ఉండి, ఆ తరువాత అన్నాడు కీర్తి లాల్  “ఎందుకలా అంటున్నారు? ఈ విషయంలో మీకేమైనా అనుమానాలున్నాయా?”   

“అలాంటిదేం లేదు. నిజా నిజాలు తెలుసుకో కుండా ఇలాంటి వాటిల్లో తొందర పడి ముందుకు వెళ్ళడం మంచిది కాదని నా ఉద్దేశం. ఇన్నాళ్ళ నుంచీ వ్యాపారం చేస్తున్న  మీకు తెలియదని కాదు కానీ,  మీ సంస్థ సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించే వ్యక్తిగా  అలా చెప్పాలనిపించింది”

“మా పట్ల మీకున్న శ్రద్ధకి థాంక్స్ పాణి గారూ.  ఆ వ్యక్తి నుంచి మళ్ళీ ఫోన్ వస్తే మీకు తప్పక తెలియ చేస్తాను”  అని ఫోన్ పెట్టేసాడు కీర్తిలాల్. ఫోన్ పెట్టేసాక రాజేంద్రవర్మ  మరణం వెనుక ఏదో  మిస్టరీ ఉందన్న అనుమానం మరింత బల పడింది పాణికి.  ఆ  మిస్టరీని శోధించక పోతే  రెండొందల గ్రామాల అభ్యున్నతికి కారణం కావాలని అతడు కోరుకున్న సంపద అన్యా క్రాంతమై పోయే ప్రమాదముందనిపించింది.

అతడి ఫోన్ పెట్టేసిన వెంటనే సెక్రెటరీ రమణని పిలిచి చెప్పాడు పాణి “మన ట్రావెల్ ఏజెంటుకి ఫోన్ చేసి ఈ సాయంత్రంలోగా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫ్లైట్ టికెట్ బుక్ చెయ్యి”

“హైదరాబాద్ లో ఏమైనా కొత్త  కేసా?” అన్నాడు రమణ.

“హైదరాబాద్ కాదు, నిజామాబాద్ వెడుతున్నాను. అదే ట్రావెల్ ఏజెంటుకు చెప్పి ఫ్లైటు హైదరాబాద్ వెళ్ళే సమయానికి  హైదరాబాద్ ఎయిర్‍ పోర్టు నుంచి నిజామాబాద్ వెళ్ళడానికి ఒక టాక్సీని కూడా బుక్ చేసి సిద్దంగా ఉంచమని  చెప్పు”

రమణ గది లోంచి వెళ్ళ బోతుంటే వెనక్కి పిలిచాడు పాణి  “సిర్నాపల్లి గ్రామం నిజామా బాద్ జిల్లా లోని ఏ పోలీస్ స్టేషన్ పరిధి లోకి వస్తుందో తెలుసుకుని, ఆ స్టేషన్లో పని చేసే  ఎస్సై పేరు,  వివరాలు కనుక్కుని చెప్పు”

పావు గంట తరువాత పాణి గది లోకి వచ్చైన రమణ అన్నాడు “సిర్నా పల్లి గ్రామం నిజామా బాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లోకి వస్తుంది.  ఆ స్టేషన్ ఎస్సై ఈ మధ్యనే  హోమ్ మినిస్టర్ రికమెండేషన్‍తో హైదరా బాద్  ట్రాన్స్ ఫర్ చేయించు కున్నాడు. కొత్త ఎస్సైని  పోస్టు చేసారుట”

“ఎవరా కొత్త ఎస్సై? ”

“ఎవరో   కొత్తగా రిక్రూట్ అయిన లేడీ ఎస్సైని ఆ పాత ఎస్సై  స్థానంలో పోస్ట్ చేసారట.   చాలా తెలివైన అమ్మాయి, చదువులో గోల్డ్ మెడలిస్టు. కావాలని మరీ ఆ అడవికి పోస్టింగ్ వేయించుకు వెడుతున్న సాహస వంతురాలట”

“కావాలని అక్కడకి పోస్టింగ్ వేయించుకుని మరీ వెడుతోందా?  ఆమె పేరు?”  ఆసక్తిగా అడిగాడు పాణి.

“ఇంద్ర నీల !  ఆమె నిన్ననే సిర్నా పల్లి లో జాయినై  ఛార్జి తీసుకుందట”  చెప్పాడు రమణ.

‘ఇంట్రెస్టింగ్‘ అనుకున్నాడు పాణి. అందమైన ఆ పేరు వినగానే ఆమె ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం అప్రయత్నంగానే అతడి మదిలో కలిగింది.

“పూర్తి వివరాలు నాకు వాట్సప్ లో పంపు.  నిజామా బాద్  జిల్లా డి ఎస్పీ ప్రసాద్ నాకు స్నేహితుడు. ఈ కేసులో ఆమెని నాకు సహకరించేట్టు  రికమెండ్ చెయ్యమని కోరతాను”  చెప్పాడు రమణకు.

“సరే సార్” అన్నాడు  రమణ.  అలవాటు ప్రకారం అతడు చెప్పిన కొద్ది క్షణాలకే తను సేకరించిన  ఇంద్రనీల  వివరాలన్నింటినీ పాణికి వాట్సప్‍లో పంపించాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే తత్వం రమణది.  ఇంద్ర నీల గురించి తను సేకరించిన అన్ని వివరాలతో పాటూ, తనకి దొరికిన ఆమె  ఫోటోని కూడా అత్యుత్సాహంగా పాణికి వాట్సప్ లో పంపించాడు. అదే  తను చేసిన  పెద్ద పొరపాటని  అతడికా క్షణంలో తెలియదు... ఎందుకంటే, ఆ  ఫోటోని పాణి కన్నా ముందు అతడి ఫోన్ లో అతడి భార్య అంజలి చూసింది అతడు  హైదరాబాద్ బయలు దేర బోయే ముందు !!

(ఆ ఫోటో చూసిన డిటెక్టివ్ పాణి భార్య అంజలి ఫీలింగ్స్ ఏమిటి?! ఆమెకి వచ్చిన కల నిజమవబోతోందా?  … వచ్చే  వారం !)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్