Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabandham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

గతసంచికలో ఏం జరిగిందంటే ... http://www.gotelugu.com/issue186/534/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

(గతసంచిక తరువాయి)

తన గురించి ఎన్నో ఎంక్వైరీలు చేసి, తన  మీద అంత నమ్మకం పెట్టుకుని మెయిల్ ఇచ్చిన వ్యక్తి వేరే డిటెక్టివ్  సహాయం కోరుతాడన్న విషయం నమ్మ శక్యంగా అనిపించ లేదు పాణికి.

వెంటనే తన సెక్రెటరీ రమణకి ఫోన్ చేసాడు.  “నిజామాబాద్ జిల్లాలో సిర్నా పల్లి అనే గ్రామం ఉంటుంది. అక్కడ సిర్నా పల్లి సంస్థానం రాజా వారు రాజా రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ. ఆయనతో అర్జెంటుగా నేను మాట్లాడాలి.  వీలైనంత తొందరగా ఆయన ఫోన్ నెంబరు కనుక్కుని  నా సెల్ ఫోన్ కి  కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్  చెయ్యి”  అన్నాడు.

దాదాపు ఐదు నిమిషాల తరువాత  కారు బి.కె.సి. రోడ్డు దాటి  లాల్ బహదూర్ శాస్త్రి రోడ్డు మలుపు తిరుగుతుంటే రమణ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది పాణికి.

“మీరు చెప్పిన సిర్నాపల్లి సంస్థానాన్ని కాంటాక్ట్ చేసాను సార్...” అంటూ ఒక్క  క్షణం ఆగాడు అతడు.

“ఏమైంది? రాజా వారితో మాట్లాడావా?”  ఆత్రుతగా అడిగాడు పాణి.

“లేదు సార్”

“అదేం?”

“రాజా రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ ఈ రోజు ఉదయమే మరణించారట !”  నెమ్మదిగా చెప్పాడు.

షాక్ తిన్నట్టుగా ఒక్క క్షణం మౌనంగా ఉండి పోయాడు పాణి. “మరణించాడా? ఎలా?”  ఆశ్చర్యంగా అన్నాడు.

“ఆయన ఆత్మ హత్య చేసుకున్నారట” 

“ఆత్మ హత్యా?!” తన చెవులని తానే నమ్మ లేనట్టుగా ఉండి పోయాడు పాణి. “నో... నో వే!!  కచ్చితంగా అది ఆత్మ హత్య అయి ఉండదు. అలా జరిగే అవకాశం లేదు. నువ్వు సరిగ్గానే విన్నావా?” అనుమానంగా అన్నాడు.

“నేను సరిగ్గానే విన్నాను సర్,  ఆయన రాజ మహల్లోనే ఆత్మ హత్య చేసుకుని మరణించారుట.  ఆయన తాత గారైన పెద్ద రాజా వారు అంటే రాజా రాజ్ బహదూర్ విక్రమ్ వర్మ గారు స్వయంగా చెప్పారు”

ఫోన్ పెట్టేసిన తరువాత పాణి చాలా సేపు స్థిమితంగా ఉండ లేక పోయాడు.  రాజేంద్ర వర్మ ఆత్మ హత్య  చేసుకున్నాడంటే నమ్మ శక్యంగా అనిపించడం లేదు అతడికి. ఇందులో ఏదో మర్మముందనిపిస్తోంది.  అతడు మెయిల్లో రాసిన దాన్ని బట్టి, అతడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయన్నది నిర్వివాదాంశం.  కోటలో బయట పడిన ఆ నిధి గురించి  తెలిసిన వాళ్ళెవరో అతడ్ని హత్య చేసి దాన్ని ఆత్మ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉండి  ఉండచ్చు.

ఎవరు?  ఎవరు అతడ్ని హత్య చేసినది? ఆ నిధి గురించి తెలిసిన వాళ్ళు  ఇంకా ఎవరెవరున్నారు?  

తనలో ఉన్న సహజమైన జిజ్ఞాస ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే దాకా తనకి స్థిమితాన్నివ్వ లేదని అర్ధమైంది అతడికి.  తను ఆ అగంతకుడి మెయిల్ని నెలల పాటూ విస్మరించి తప్పు చేసాడా అన్న అపరాధ భావం మనసులో తొలుస్తుండడంతో అంత త్వరగా ఆ ఆలోచనల నుంచి బయటికి రాలేక పోయాడు.

***

పాణి కీర్తిలాల్ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన మూడు గంటల తరువాత సూరత్ లోని  వజ్రాల వ్యాపారి చమన్‍ లాల్‍కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. 

ఫోన్ చేసినతను  పేరు చెప్పకుండా  “ఒక డీల్ ఉంది. మీరు ఓకే అంటే మా మనిషి మిమ్మల్ని కలిసి మాట్లాడతాడు” అన్నాడు. 

“ఏమిటి డీల్?” అన్నాడు చమన్‍ లాల్. అలాంటి ఫోన్ కాల్స్ అతడికి మామూలే. విదేశాల నుంచి   స్మగ్లింగ్ చేసి మన దేశానికి తరలించే వజ్రాలనీ, నిధి వేటలో అరుదుగా బయట పడే వజ్రాల వంటి వాటిని  రహస్యంగా కొనే ఆ వ్యాపారికి  వజ్రాల  బ్లాక్ మార్కెటింగ్ లో అపారమైన అనుభవం వుంది.

“అరుదైన రెడ్ డైమాండ్స్ దొరికాయి. పెద్ద మొత్తంలో”

వింటున్న  ఆ వ్యాపారి తన చెవులని తనే నమ్మ లేక పోయాడు.

“ఎక్కడ?”

“తెలంగాణా లోని సిర్నా పల్లి రాజ సంస్థానంలో రెడ్ డైమాండ్స్ పొదిగిన నగలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. అవి మా చేతికి ఎలా వచ్చాయన్నది మీకనవసరం”

అతడి మాటలు విన్నాక ఇంక వివరాల్లోకి వెళ్ల లేదు చమన్‍ లాల్. వజ్రాల వ్యాపారంలో అపారమైన అనుభవం, వజ్రాల చరిత్ర మీద అవగాహన  ఉన్న అతడికి ఆ మాత్రం క్లూ చాలు. అతడి దగ్గర నిజంగా రెడ్ డైమాండ్స్ ఉన్నాయన్న విషయం అర్ధం చేసుకో గలిగాడు.

“అవి చాలా ఖరీదైనవి. అంత ఖరీదు చెల్లించడం నా లాంటి  చిన్న వ్యాపారుల వల్ల కాదు” అన్నాడు వెంటనే.  అది అతడు ఉపయోగించే బిజినెస్ టెక్నిక్.  అవతలి వాళ్ళ దగ్గర ఉన్నది దొంగ సొమ్మని అతడికి తెలుసు. దాన్ని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలించుకోవాలనుకుంటూ ఉంటారు. ఇప్పుడు తను కొనక పోతే వేరే  బేరం చూసుకోవాలసి వస్తుంది. దాని వల్ల వాళ్ళకి సమయం వృధా అవడమే కాకుండా, ఆ దొంగ సొమ్ము వాళ్ళ దగ్గర ఉందన్న విషయం తన ద్వారా నలుగురికీ తెలిసే అవకాశం కూడా ఉంటుందన్న భయం ఉంటుంది. అది వాళ్ళకి చాలా ప్రమాద కరం. అందుకే  ఇలాంటి విషయాల్లో వాళ్ళు రెండో  పార్టీ దగ్గరకి వెళ్ళడం చాలా అరుదు. బేరాలాడకుండా ఎంత తొందరగా వీలైతే  అంత తొందరగా ‘డీల్’ పూర్తి చెసుకుని  తను ఎంత ఇస్తే అంతా పుచ్చుకుంటారు.

“వాటి ఖరీదు మీకు తెలుసు. అవి మరెక్కడా దొరకవని కూడా మీకు చెప్పక్కర్లేదు. వచ్చిన అవకాశాన్ని మీరు వదులు కోరని కూడా మాకు తెలుసు. అనవసరంగా సమయం వృధా చెయ్యకుండా మీ కోట్ చెప్పండి” అన్నాడు అవతలి వ్యక్తి కూడా తెలివిగా.

చమన్‍ లాల్ ఇంక సంభాషణని పొడిగించ లేదు. “సరే, నేను పార్టీని చూసుకుని మీతో మళ్ళీ మాట్లాడతాను. మీ నెంబరు చెప్పండి” అన్నాడు.

“రేపు ఇదే సమయానికి మీకు నేనే ఫోన్ చేస్తాను” అని ఫోన్ పెట్టేసాడు అవతలి వ్యక్తి. ఫోన్ పెట్టేసిన వెంటనే తనకి తెలిసిన పెద్ద పెద్ద వజ్రాల వ్యాపారులలో ఆ రెడ్ డైమాండ్స్‍  కొనడానికి సరైన వ్యాపారి ఎవరా అని కొద్ది క్షణాలు ఆలోచించాడు చమన్‍లాల్. అతడికి మొదట గుర్తొచ్చిన పేరు... కీర్తి లాల్!  వెంటనే ముంబైలో ఉన్న కీర్తి లాల్‍కి ఫోన్ చేసాడు.

నేర పరిశోధనలో ఒక నిజం వెలుగు చూడాలంటే, కొన్ని సంఘటనల మధ్య నుండే లింకులతో అల్లుకున్న ఒక ‘లూప్’ పూర్తవ్వాలి.  పై సంఘటనల కున్న లింకుల మధ్యన ఉన్న అటువంటి ‘లూప్’ చమన్‍ లాల్  కీర్తి లాల్‍కి  ఫోన్ చేయడంతో  పూర్తయింది !

****

చమన్‍ లాల్ ఫోన్ అందుకున్న కీర్తి లాల్ మధ్యాహ్నం లంచ్ టైమ్‍లో  పాణికి  ఫోన్ చేసి అన్నాడు  “పాణి గారూ, మీరు నమ్మ లేని  ఒక  విషయం చెప్పనా?”  అతడి కంఠం ఎంతో ఉద్వేగంగా ఉంది.

“ఏమిటి?” అన్నాడు పాణి.

“ఎంత కాకతాళీయమో చూడండి? ఇవాళ ఉదయమే  మనం అరుదైన రెడ్ డైమాండ్స్‍ గురించి,  సిర్నాపల్లి  సంస్థానం గురించీ  మాట్లాడుకున్నామా?  మీరు వెళ్ళిన  కొద్ది సేపటికి నాకు సూరత్ నుంచి వజ్రాలని బ్లాక్ మార్కెట్లో అమ్మే ఒక బ్రోకర్ నుంచి ఫోన్ వచ్చింది”

‘సిర్నాపల్లి’  పేరు వినగానే పాణి గుండె కొట్టుకునే వేగం పెరిగింది. “ఏమని?” అన్నాడు ఆత్రుతగా.

“పూర్వం బ్రిటీష్ రాజుల దగ్గరనుంచి సిర్నాపల్లి సంస్థానానికి వచ్చిన రెడ్ డైమాండ్స్ ప్రస్తుతం అతడి దగ్గరకి అమ్మకానికి వచ్చాయట. నన్ను కొనుక్కుంటారా అని అడిగాడు”

పాణి గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది. “ఎవరు? ఎవరు ఆ వజ్రాలని సూరత్ వ్యాపారికి అమ్ముతానన్నది?”   అడిగాడు.

(రాజా వారు ఆత్మహత్య చేసుకుని ఒక్కరోజైనా గడవక ముందే అక్కడి సంపదను ఒక్కొక్కటిగా దొంగ బజారుకి తరలించడం మొదలెట్టిన ఆగంతకులెవరు?.........వచ్చేవారం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్