Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabhandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే... http://www.gotelugu.com/issue190/549/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

( గతసంచిక తరువాయి) ‘‘మన గమ్యమునకు ఒక మార్గము మూసుకు పోయిన ఆ వెను వెంటనే వేరొక మార్గము అన్వేషింప వలె. ఇప్పుడు నా ప్రయత్నము అదే. ఆ రెండో మార్గమే జడల మాంత్రికుడు.’’

‘‘నా మట్టి బుర్రకు అంత చప్పున అర్థము గాదు గాని విషమేమిటో వివరముగ  జెప్పుము.’’

‘‘నాగ రేడుకు అల్లుడనగుదునేని ఒక్కతే తనయ గావున తదుపరి వారసుడ నేనే గదా. నాగ లోక ఆధిపత్యం నాదేనని సింహాసనమునకు నేనే అధిపతినని ఆశ పడితి. ఇప్పుడా ఆశ నెర వేరదని రూఢమైనది. ఇక నా లక్ష్యం సాధించాలంటే రెండో మార్గం తప్పని సరి.
జడల మాంత్రికుడు గతంలో మర్మ భూమి యందు సంచరించినపుడు వానితో పరిచయమైనది. వాడు పది శిరముల నాగము కొరకు అన్వేషించుచున్నాడు. అలాంటి నాగము మన లోకాధీశుడు నాగ రేడు మహా పద్ముడు తక్క లోకమున వేరొకండు లేడు. ఆ విషయం తెలిసి ఆ మాంత్రికుడు మర్మ భూమిలో అన్వేషణ సాగించినాడు. కాని వాడికి నాగ లోకమునకు మార్గము తెలీదు. నాగ రాజు భూ లోకమునకు రాక పోకలు సాగించు వేళయు తెలీక విసిగి నిరాశతో మరలి పోయినాడు. అప్పుడు నేను నా గురించి గాని మన గుట్టు మట్టు గాని చెప్ప లేదు.
అసలు విషయమేమనగా, ఈ జడల మాంత్రికునికి భూ లోకమున ఎలాంటి ఆశలు లేవు. అతడి దృష్టి గంధర్వ లోకముపై వున్నది. లోకాధి దేవత మోహినీ శక్తిని ఉపాసించి సిద్ధింప జేసుకుని ఆమె సాక్షాత్కారం పొంది తన అభీష్టం మనవి చేసాడు. అందుకు ఆ శక్తి సమ్మతించి తనకు భూలోకమున పది శిరముల నాగమును గొప్ప హోమం చేసి బలియిచ్చిన నీ కోరిక తీర్చెదనని మాటిచ్చినది.

అసలీ జడల మాంత్రికులు మహా కౄరులు, ప్రమాద కరమగు మహా మాంత్రికులని నాకు తెలియు. వాడి తల మీద జడలు గట్టిన కేశములు ఒక్కోటి ఒక్కో మంత్ర సిద్ధికి గురుతు. వాడిని ఎవరూ సంహరింప లేరు. వాడి ప్రాణం ఎక్కడ నిక్షిప్తం చేసుకున్నాడో ఎవరికీ తెలీదు. వానికి గంధర్వ లోకము అచటి భోగ భాగ్యములన్నీ మక్కువ మిక్కుటము.

వాడు మన నాగ రేడు జాడ రయుటలో విఫలమైనాడు. నేను మన నాగ రేడును వాడికి బంధీని చేస్తే వాడు నాకు మన నాగ లోకాధిపత్యమును యివ్వ గలడు. కాబట్టి నేను ఆ జడల మాంత్రికుని కలిసి మర్మ భూమికి గొని పోవలె.’’ అంటూ అసలు గుట్టు బయట పెట్టాడు వక్ర దంతుడు.

వక్ర దంతుడి నిర్ణయం వినగానే కళ్ళు గిర్రున తిరిగి మూర్చ వచ్చినంత పనైంది మాయా శృంగుడికి. ఏదో దురాలోచన  చేస్తున్నాడనుకున్నాడు  గాని వక్ర దంతుడి కన్ను సింహాసనం మీద ఉందని గాని నాగ రాజుకే పొగబెట్టి నాగ లోకాధిపత్యం చేజిక్కించుకోవాలనుకుంటున్నాడని  గాని వూహించ లేక పోయాడు.

ఈ కుట్ర గురించి తను వినక పోయినా బాగుండేది. విన్నాడు గాబట్టి ఇక తన దారిన నాగ లోకం పోలేడు. వక్ర దంతుడు సహింపడు. వెళితే తన కుట్ర గురించి ప్రభువుకు ఎక్కడ చెప్పేస్తాడోనని సందేహించి తన ప్రాణం తీసే  ప్రయత్నం చేయ వచ్చు.

‘‘ఏమిరా! నాతో వత్తువా? నీ దారిన పోదువా?’’ అడిగాడు వక్ర దంతుడు.

‘‘మిత్రమా! నీవు రాజైన మహా మంత్రి నేనే గదా. సంతోషమే గదా. ఇనుముతో చేరినందుకు అగ్గికీ సుత్తి దెబ్బు తప్పవన్నట్టు నీతో చేరినందుకు నాకునూ తిప్పలు తప్పవు గదా. నీతోనే నేను’’ అన్నాడు మాయా శృంగుడు.

అక్కడితో ప్రయాణం ఆపి పగలంతా విశ్రాంతి తీసుకున్నారు. చీకటి పడగానే అశ్వాలను వదిలి ఇద్దరూ ఆకాశ మార్గాన ఫ్రాగ్‌జ్యోతిష పురం దిశగా సాగి పోయారు.

****************************************

శివ నాగ పురం నుండి మత్స్య దేశ సరి హద్దు దాటి అంగ రాజ్యంలో ప్రవేశించ డానికి వారం రోజులు, ఆంగ రాజ్యం నుండి అసోము రాజ్యం మీదుగా మర్మ భూమి అటవీ ప్రాంతం చేరడానికి మరో వారం రోజులు వెరసి పక్షం దినాలు అశ్వాల మీద ప్రయాణం సాగించాలి. కాని ధనుంజయ, భద్రాదేవిలు పట్టుదలతో ఏక ధాటిగా ప్రయాణం సాగించి ఏడో రోజుకే మర్మ భూమిలో ప్రవేశించారు.

ఆ రోజు నాగదండును నాశన మొనర్చి ఉలూచీశ్వరిని విడిపించాక అంతా శివ నాగ పురం కొండ గుట్టను చేరుకున్నారు. అక్కడ భూతం ఘృతాచి వాగు చెంత శాలి వృక్షం క్రింద వారి కోసం ఎదురు చూస్తోంది.

ధనుంజయుడు భద్రాదేవి, ఉలూచీశ్వరిలు అలుపు తీరా వాగు నీటిలో స్నానాలు చేసారు. రక్త సిక్తమైన దుస్తుల్ని ఉతికి పిండి ఆర బెట్టి పొడిదుస్తులు ధరించారు. తిరిగి కొండ గుట్ట ఎక్కి శివాలయాన్ని చేరుకున్నారు.

ఆ రోజు ఆలయాన్ని తెరిచే రోజే`

కాస్త ఆలస్యమైనప్పటికీ అర్చక స్వాములు వచ్చి`

గుడి తాళాలు తీసారు. ఆలయంలో శివుని అభిషేకించి పూజాదికాలు ఆరంభించారు. ధనుంజయుడు తన ఇరువురు భామలతో భక్తి శ్రద్ధలతో ఆ సదాశివుని సేవించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. శివ నాగ పురం సత్రంలో మధ్యాహ్న భోజనాలు గావించి ఇక బయలు దేరారు.
భూతం ఘృతాచి భద్రా దేవి అశ్వం మీది తోలు సంచి లోను, ఉలూచీశ్వరి శ్వేత నాగు రూపంలో ధనుంజయుని అశ్వం మీది తోలు సంచిలోను విశ్రమించారు. ధనుంజయ, భద్రాదేమలు అశ్వాలను మహా పథంలో శర వేగంతో పరుగులెత్తించారు. ఆ విధంగా ఏడో రోజుకే వీరు మర్మ భూమి అడవి లోకి ప్రవేశించారు.

న్యాయ ధర్మాలు, అక్రమాలు అన్యాయాలు వీటికి ఏ యుగం లోనూ, ఏ కాలంలోనూ కూడ పొసగదు. స్వార్థం మనిషిని అక్రమాలు అన్యాయాలకు నడిపిస్తే, న్యాయ ధర్మాల కోసం పోరాటాలు తప్పవు. గడచిన యుగాల్లో వీటి నడుమ మహా యుద్ధాలే జరిగాయి.
అక్కడ రత్న గిరిలో పరిస్థితి ఏమిటో ఇద మిద్ధంగా ధనుంజయునికి తెలీదు. తన జనకుడి ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తూంటుంది. యుద్ధ ఘంటికలు మ్రోగుతూ వుంటాయి. తను ఎంత త్వరగా దివ్య నాగ మణితో రత్న గిరి చేరుకుంటే అంత మంచిది. తండ్రి గారిని, రాజ్యాన్ని కూడ కాపాడుకో గలడు. అందుకే తొందరగా నాగ లోకం చేరుకోవాలని ధనుంజయుడు వేగిర పడుతున్నాడు. నాగ రాజును ఎలాగోలా ఒప్పించి దివ్య నాగ మణిని సంపాదించాలని ఆరాట పడుతున్నాడు. అందుకు తగ్గట్టే త్వరిత గతిని మర్మ భూమికి చేరుకో గలిగారు. ఎనిమిదో రోజు పొద్దు పొడిచిన కొద్ది సేపటికి యువరాణి ఉలూచీశ్వరి అందరినీ సంపంగి వనానికి తీసుకెళ్ళింది.

విచిత్రంగా అక్కడ ఒంటరిగా శంకు పుత్రి తమ కోసం ఎదురు చూస్తూండటం అందరినీ ఆశ్చర్య పరిచింది. శంకు పుత్రి ముఖం కళ తప్పివుంది. ఆమె ముఖం చూడ గానే ఏదో జరిగిందని అందరికీ అర్థమై పోయింది.

అశ్వం నుంచి ఒక్క దూకులో దిగి`

శంకు పుత్రి చెంతకు పరుగెత్తింది ఉలూచీశ్వరి. వెనకే ధనుంజయుడు, భద్రా దేవి అశ్వాలు దిగి దగ్గర కెళ్ళారు.

‘‘అత్తా! ఏమి జరిగినది? నీ ముఖము వాడి యున్నది. నీ కనుల నీరు చిప్పిల్లుచున్నవి. అందరూ కుశలమే గదా?’’ అనడిగింది ఆత్రంగా.

‘‘లేదు. క్షేమముగా లేరు. నాతో రండి మీకే తెలియు’’ అంది ఖిన్న వదనంతో శంకు పుత్రి.

‘‘ఎవరు క్షేమమున లేరు. అసలేమి జరిగినది?’’ ఉలూచీశ్వరి పట్టుబట్టి అడిగింది. శంఖు పుత్రి కనులు తుడుచుకుంది.

‘‘ఏమి చెప్పుదు? ఎలా చెప్పుదు? నీ జనకుడు నాగరేడు ప్రమాదపు అంచున క్రుందుచున్నాడు. ఎంతో ఉత్తముడు, సమర్థుడని భావించి అల్లుడ్ని చేసుకోవాలని చూసిన వక్ర దంతుడు ఎంత నీచ నికృష్టుడో, ఎంతటి ధూర్తుడో ఇప్పుడు గదా తెలిసి వచ్చినది. వాడు నిజముగా ఆశ పడినది నిన్ను గాదు, నాగ లోక ఆధిపత్యము. ఇక నిన్ను పొందుట అసాధ్యమని గ్రహించి తన ద్రోహ బుద్ధి చూపించినాడు. ఎవడో మాంత్రికుని వెంట దెచ్చి నాగ రేడును బలి పీఠమున     ఉంచినాడు. అచట భయంకర విషాదము నెలకొని వున్నది. ఈ గండము కాయుట ఎవరి వల్లనూ అగునట్లు లేదు. మీరు వస్తే ఏదో విధమున రక్షించెదరని నిరీక్షించుచుంటి. తక్క సమయమునకు వచ్చితిరి. ధనుంజయా! వేగిరము నా వెంట రండు.’’ అంటూ కన్నీరు తుడుచు కుని లేచింది శంకు పుత్రి.

నాగ రాజు మహా పద్ముని మూలంగా ఒకప్పుడు శంకు పుత్రి తన ప్రియుని కోల్పోయింది. నాగ లోక ప్రవేశార్హత కోల్పోయి ఎన్నో కడ గండ్ల పాలయింది. అయినప్పటికీ నాగరేడు ఆపదలో వుంటే సంతోష పడ లేదు. వేదన చెంది దుఖ్ఖితురాలయిందంటే ఆమె ప్రభూభక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకో వచ్చు. కాని వాస్తవంగా అక్కడ ఏమి జరుగుతుందీ ఎవరికీ అర్థం కాలేదు. ఆమె మాటలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాయి. నాగ రాజు అంతటి మహా శక్తి సంపన్నుడిని ఒక మాంత్రికుడు బంధీని చేయటమా...?

‘‘నిశ్శబ్ధంగా నాతో రావలె. అచట ఏమి జరుగుచున్నదీ మీరే చూద్దురు గాని.’’ అంటూ అక్కడి నుండి కదిలింది శంకు పుత్రి. ధనుంజయుడు భద్రా దేవి అశ్వాలను సంపంగి వనం లోనే చెట్లకు బంధించి తమ ఆయుధాలు తీసుకుని కాలి నడకన బయలు దేరారు. ముఖ్యంగా ఉలూచీశ్వరి తన జనకుని చూడ నెంచి ముందు పోబోతూండగా శంకుపుత్రి, భద్రాదేవిలు ఆమె ప్రయత్నాన్ని అడ్డగించారు.

‘‘ఇప్పుడు ఒంటిగ నీవచటికి పోవుట ప్రమాదము. మేము ఏదో ఒకటి జేసి నీ జనకుని రక్షింతుము గాక. వేగిర పాటు వలదు.’’ అంటూ హెచ్చరించింది భద్రా దేవి. అంతే కాదు, ఉలూచీశ్వరి వెళ్ళకుండా చూసుకునే బాధ్యతను భూతం ఘృతాచికి వప్పగించింది. తామర మడుగును చుట్టి అవతలి కొండ పాదం వైపు కదిలారంతా.

అదృష్టవంతునికి అవకాశాలు వెదుక్కొంటూ వస్తాయి. దురదృష్ట వంతునికి వచ్చిన అవకాశాలు కూడ చేజారి పోతూంటాయి. మొదట మాటకు ఉదాహరణ యువరాజు ధనుంజయుడు అనుకొంటే రెండో మాటకు ఉదాహరణ వక్ర దంతుడు అనుకో వచ్చు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా న్యాయ ధర్మాలు తప్పక సాహసమే ఊపిరిగా ముందుకు సాగుతున్న వాడు ధనుంజయుడు. వరుస పరాజయాలతో అభాసు పాలై చివరకు వక్ర మార్గంలో నాగ లోక ఆధిపత్యానికే ఆశ పడి తప్పు మీద తప్పు చేస్తూనే వస్తున్నాడు వక్ర దంతుడు. దాని ఫలితమే ఇప్పుడీ క్లిష్ట పరిస్థితి.

ఏమైనప్పటికీ ఇది తమకు కలిసి వచ్చిన అవకాశం గానే భావిస్తున్నారు ధనుంజయ, భద్రాదేవిలు. నాగ రాజును గనుక తాము రక్షింప గలిగితే ఆయన కృపకు పాత్రులైనట్టే. ఉలూచీశ్వరితో బాటు దివ్య నాగ మణి ని కూడ ఇచ్చి సగౌరవంగా తమను అశీర్వదించి పంపిస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో గలగాలి. ఎట్టి పరిస్థితి లోను నాగ రాజును కాపాడాలి. కాని అక్కడ పరిస్థితి ఏమిటో, ఆ దుష్ట మాంత్రికుడు ఎవరో తెలీకుండా వూహా గానాలు చేసి లాభం లేదు. ఆలోచిస్తూనే వడి వడిగా నడుస్తున్నారంతా. ఉలూచీశ్వరి అయితే దారి పోడవునా దుఖ్ఖిస్తూనే వుంది. ఘృతాచి ఆమె ముందుకు వెళ్ళి పోకుండా జాగ్రత్తగా అనుసరించి వస్తోంది. నిశ్శబ్ధంగా ముందుకు సాగుతున్నారంతా.

అక్కడ తామర మడుగు పశ్చిమ తీరంలో సంపంగి వనం ఉండగా, మడుగు తూర్పు తీరాన వుంది ఎత్తయిన కొండ శిఖరం. ఈ కొండ పాదం లోనే తూర్పు దిక్కు నుండి నాగ లోకానికి రహస్య మార్గం వుంది. ధనుంజయ బృందం నిశ్శబ్ధంగా మడుగును చుట్టి దక్షిణ భాగంగా కొండ పాదం చేరుకుంది. అక్కడ దట్టమైన చెట్ల మధ్య పొదల్ని అడ్డు పెట్టుకుంటూ కొంత దూరం ముందుకు పోగానే అప్పుడు వారి కంట బడిందా ఘోర దృశ్యం.

సూర్యుని నల్ల మబ్బులు మూసేయటంతో ఎండ జాడ లేదు. అయినా ఆ ప్రదేశం స్పష్టంగా గోచరిస్తోంది. ఎదురుగా కొండ పాదం వద్ద సువిశాలమైన మైదాన ప్రాంతం వుంది. ఆ మైదానం మధ్యలో అతి పెద్దదయిన అగ్ని వలయం ఒకటి కణ కణ రగులుతోంది. ఆ వలయం బయట కొండ పాదం అంతటా అనేక మంది నాగ లోక వాసులు, ప్రముఖులతో నిండి వుంది. అంతా శిలా విగ్రహాల్లా నిలబడి దుఖ్ఖిస్తున్నారు. వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, గుళికుడు, మహా గుళికుడు, శంఖుడు మొదయిన ప్రముఖులంతా ఉండీ మంత్ర బద్ధులయి ఏమీ చేయ లేని నిస్సహాయ స్థితిలో కన్నీళ్ళతో చూస్తున్నారు. వారి ముందు శోక తప్త అయిన నాగ రాణి కీర్తి మతి కొంగు చాపి తన భర్తను కాపాడమని ధీనంగా అందరినీ అర్థిస్తున్న దృశ్యం గుండెల్ని కదిలించేలా వుంది.

అగ్ని వలయం కుడి పక్కన పెద్ద రాతి స్థంభం వుంది. దానికి చేర్చి కనిపించని బంధనాలేవో తనను కట్టి పారేసినట్టు భారీ సర్ప రూపం లోని నాగ రేడు మహాపద్ముడు బంధితుడై వున్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam