Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సంక్రాంతి పండుగ ఎక్కడ.. ఎలా..? - కర్రా నాగలక్ష్మి

 పెద్దపండగ , సంక్రాంతి అని ఉభయతెలుగు జిల్లాలలో పిలువబడుతూ అంత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకొనే పండుగ భారతదేశం అనాదిగా వ్యవసాయదేశం కాబట్టి  చాలా పండగలు వ్యవసాయ సంబంధమైనవిగా వుండడం సర్వసాధారణం . దేశ వ్యాప్తంగా హిందువులు అందరూ జరుపుకొనే పండుగలలో యిది ముఖ్యమైనది . చిన్నచిన్న ఆచారాలలో తేడాలు తప్ప ముఖ్యంగా జరుపుకొనే పధ్దతి, వుద్దేశం 

 

సంక్రాంతి  కొత్తపంట చేతికొచ్చేక జరుపుకొనే పండగ అయినా యిది సూర్యుని కి సంబంధించిన పండుగ. సూర్యుడు ఒకరాశి నుంచి మరొకరాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అని అంటారు .  ఏప్రెల్ 14 న సూర్యుడు మేషరాశి లో ప్రవేశిస్తాడు . అలా ప్రవేశించినపుడు మేష సంక్రమణం అంటాం , ఆ రోజు సౌరమానాన్ని పాటించేవారికి సంవత్సరం ప్రారంభం అవుతుంది . అంటే మన  ' తమిళతంబిలకి ' యిలా సూర్యుడు రాశి మారడం అనేది ఆంగ్లతారీఖులతో ముడిపడి వుండడం కూడా విశేషమే , సూర్యుడు మకర రాశి లో ప్రవేశించి నప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు ఆంగ్లతేదీలప్రకారం యిది జనవరి 14 పడుతుంది , సుమారు నాలుగు సంవత్సరాలకి ఒకసారి ( లీప్ యియర్) 15 వ తారీఖున పడుతుంది . సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడు కాబట్టి దీనిని ఉత్తరాయణ మని , దక్షిణ దిశగా చేసే ప్రయాణాన్ని దక్షిణాయనం అని  అంటారు. సూర్యుడు ఆరునెలలు ఉత్తరాయణం లోనూ, ఆరునెలలు దక్షిణాయణంలోనూ ప్రయాణిస్తాడు. మకరసంక్రాంతి రోజు నుంచి పగటి సమయం యెక్కువగానూ రాత్రి సమయం తక్కువగానూ వుంటుంది, మకరసంక్రాంతి రోజు పగటి సమయం రాత్రిసమయం సమానంగా వుంటాయి .

దక్షిణాయనంలో సూర్యుని కిరణాలు యేటవాలుగా భూమిని చేరుతాయి దానివల్ల చలిపెరగడం, సూర్యుని ప్రభావం తగ్గడం వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి, ఉత్తరాయణం లో సూర్యుని కిరణాలు సూటిగా భూమిని తాకటం వల్ల చలి ప్రభావం తగ్గి సూక్ష్మ క్రిములు నశించి ఆనారోగ్య సమస్యలు తగ్గుతాయి, యిది సైన్సు చెప్పే నిజం. అన్ని జీవరాశులకు ఆరోగ్యప్రదాత అయిన సూర్యుని హర్షోల్లాసాలతో ఆహ్వానించడంలో అనుచితం లేదుకదా? .

హిందూ పురాణాలప్రకారం ఉత్తరాయణం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు, అలాగే ఉత్తరాయణంలో మరణించిన వారు జనన మరణాల నుంచి విముక్తి పొంది స్వర్గ వాసం పొందుతారని నమ్మకం దీనికి ప్రమాణంగా మహాభారతం లో యిఛ్చా మరణవరం కలిగిన భీష్ముడు అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు వేచివుండి ఉత్తరాయణ ప్రవేశానంతరం ప్రాణాలు విడుస్తాడు .

సంక్రాంతి పౌరాణికంగానూ, సైన్సు ప్రకారంగానూ కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాక దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాలుగు రోజుల పండగ. మొదటి రోజు భోగి , రెండవ రోజు సంక్రాంతి, మూడవరోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ గా జరుపుకుంటారు. 

నిజానికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ధనుస్సంక్రమణం నుంచే ప్రారంభమవుతుంది పండగ . ధనుర్మాసమంతా తెల్లవారుఝామున వీధులలో రంగవల్లులు దిద్దడం , బంతి , చేమంతులతో అలంకరించిన గొబ్బమ్మలను ముగ్గులలో వుంచి పూజలు చెయ్యడం మొదలయి మకరసంక్రాంతి రోజుతో ముగుస్తుంది . నగరసంకీర్తనలు , హారిదాసులపాటలు , గంగి రెద్దుల ఆటలు అన్నీ మొదలవుతాయి .

ఈ మధ్య పల్లెలలో కూడా యివన్నీ కనుమరుగవున్నాయి .

భోగి నాడు తెల్లవారుఝామున భోగి మంటతో రోజు మొదలవుతుంది , మంటలో నానారకాలయిన కర్రలను , యింట్లో పనికిరాని వస్తువులను , పిడకలను కాల్చడం చేస్తారు . అంటే యిల్లు శుభ్రపరుచుకోడం అన్నమాట , మనలోని కామక్రోధమదమాత్సర్యాలను కూడా ఆమంటలో కాల్చేయాలన్నది దీనిలోని పరమార్దం . దీనివల్ల పర్యావరణం కూడా శుభ్రపడుతుంది . తరవాత అభ్యంగన స్నానం , కొత్తబట్టలు , పిండివంటలు కబుర్లు  నవ్వులు యీ పండగలో మరో విశేషం అల్లుడు అత్తవారింటికి వచ్చి కానుకలు అందుకోడం ముఖ్యమైన ముచ్చట . సాయంత్రం యింట్లో వున్న చిన్న పిల్లలకు భోగిపళ్లు పోసి ముత్తైదువలకు వాయనాలు యివ్వడం అనాదిగా మనకు వస్తున్న ఓ ముచ్చట . ముద్దముద్దుగా వుండే చిన్న పిల్లలకు దృష్టి దోషాలు తొలగి పోవాలని రేగిపండ్లు , చెరుకు ముక్కలు, తీపి పదార్ధాలు దిగతుడచి తలపైనుంచి పొయ్యడమే భోగి పళ్లు పొయ్యడం . భోగితో మొదలుపెట్టి మూడురోజులు బొమ్మల కొలువు పెడతారు . సంక్రాంతి నాడు కొత్త బెల్లంతో చేసిన పరమాణ్ణం నైవేద్యంచేసి కొత్తబట్టలు , పసుపు కుంకుమ , చెరుకు , సంక్రాంతి పురుషునికి ధారపోయడం చేస్తారు. ముత్తైదువలు పసుపు కుంకుమ ఒకరికొకరం యిచ్చుకుంటారు . పిల్లలు గాలిపటాలు పోటీ పడి యెగురవేస్తారు . కొన్ని ప్రాంతాలలో సంక్రాంతినాడు మరణించిన వారికి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు . దీనిని ' పెద్దలను పిలవడం ' అని వ్యవహరిస్తారు. మిగతా దక్షిణాది రాష్ట్రాలవారికి భోగిమంట, గొబ్బితట్టడం, భోగిపళ్లు పొయ్యడం లేకపోయినా మిగతావన్నీ వుంటాయి. సంక్రాంతికి పొలంలో చెరుకుగడలతో పందిరిలా కట్టి అక్కడ మంటపై చెరుకు రసంతో వండిన పొంగలి సూర్యుడికి నైవేద్యం చేస్తారు.  మూడవ రోజు యేడాది పొడవున మనకు పాలిచ్చి,  రైతులకు సహాయంగా నిలిచిన పశువులకు అలంకరించి పూజించడం చేస్తారు. నాలుగవ రోజు ముక్కనుమ లేక కాకి కనుమ పశువులకు, పర్యావరణాన్ని రక్షించే పక్షులకు ఆహారం పెడతారు .

రాజ్యాలను తలకిందులు చేసిన కోడి పందాలు, యెడ్ల పందేలు నిర్వహిస్తారు, తమిళనాట జల్లికట్టు నిర్వహిస్తారు .

పశ్చిమ రాష్ట్రాలలో గాలిపటం యెగరవెయ్యడం ముఖ్యమైనదిగా వుంటుంది. గాలిపటం పైన తమకోరికలను రాసి యెగుర వేస్తారు, వాటిని చదివిన పెద్దలు ( చనిపోయినవారు ) వారి కోర్కెలు తీరుస్తారని కొందరు, స్వర్గంలోని దేవతలు తీరుస్తారని కొందరు నమ్ముతారు. మహారాష్ట్ర లో తెలుగు రాష్ట్రాలలాగే పసుపుకుంకుమ పంచు కుంటారు.  సన్నిహితులకు, స్నేహితులకు బెల్లం నవ్వులతో చేసిన తీపి పదార్దాలు, కొత్త ధాన్యాలను పంచుతారు. ఈ ఆచారాన్ని ' తిల్ గుల్ ' పంచడం అని వ్యవహరిస్తారు . 

తిల్ గుల్ పంచడం దక్షిణభారతదేశ లో తప్ప  దేశం మొత్తంలో కనిపిస్తుంది. ' తీపిని పంచు తియ్యగా మాట్లాడు ' అనేది ప్రచారం లో వున్న నానుడి. 

మహారాష్ట్ర లో సంకరాసురుడు అనే రాక్షసుడు ప్రజా కంటకుడుగా వుండగా సంక్రాంతి దేవి అతనిని సంహరించిన దినంగా కూడా జరుపుకుంటారు. ఉత్తరభారతదేశమంతటా భోగి సాయంత్రం మంటవెయ్యడం , మంటచుట్టూ తిరుగుతూ పాటలు పాడడం కాయధాన్యాలను, పండ్లను అగ్నికి ఆహుతి నివ్వడం చేస్తారు, కాల్చిన వేరుశనగలను నివేదించి అందరికీ పంచుతారు. దీనిని ' లోరి' అని అంటారు. సంక్రాంతి నాడు పప్పుబియ్యం కలిపి 'ఖిచిడి' వండి సూర్యునికి నైవేద్యం చేస్తారు. 

భారదేశమంతటా ఆచరించే మరో ముఖ్యమైన ఆచారం సంక్రాంతి నాడు చేసే పుణ్య నదీ స్నానం, ఆ రోజు చేసే నదీ స్నానం సర్వపాపాలను పోగొడుతుందని హిందువుల నమ్మకం. సంక్రాంతి రోజు పిండప్రదానం చెయ్యడం హిందువులందరిలోనూ కనిపిస్తుంది.

పెద్ద వారికి నమస్కరించి వారి ఆశీశ్శులు పొందడం మనదేశంలో నే కాదు దక్షిణ ఆసియా దేశాలలో కూడా కనిపిస్తుంది .

ముక్కనుమ నాడు జిల్లేడు ఆకులను బుజాలపై వుంచుకొని , తలపై రేగిపండు వుంచుకొని స్నానం చెయ్యాలి , దీనివల్ల సర్వ చర్మరోగాలను నశిస్తాయి అనేది మనఆచారమేకాదు , ఆయుర్వేదం లో నిరూపింపబడ్డ నిజం కూడా .

 'భోగాలి బిహు ' అని అస్సాంలోను , ఉత్తరాయణ్ అని గుజరాత్ లోను , ' పౌష్ సొంక్రమణ్ ' అని పశ్చిమ బెంగాల్ లోను , ' శిశూర్ శీంక్రాంత్ ' అని కశ్మీరు లోయ లోను , ' పొంగల్ ' అని తమిళనాట పిలుచుకున్నా మిగతావారు మకరసంక్రాంతి అనే  పండుగ చేసుకుంటారు . పల్లెలలో నాలుగు రోజులు పండగగా చేసుకుంటున్నా పట్నాలలో యీ పండగ రెండురోజులకు కుదించబడింది . మూడవ రోజు పశువుల పండగగానే జరుపుకుంటారు .

అరుణాచలం లోను , శబరిమలై లోనూ మకరజ్యోతిని వెలిగించడం లక్షలాది భక్తులు ఆ జ్యోతిని దర్శించుకోడం ప్రతీసంవత్సరం జరుగుతూ వుంటుంది .

ఉత్తరాంచల్ లో ' కాలా కౌవా ' పండగ అని చేసుకుంటారు పిల్లలు కాకులవెనుక పాటలు పాడుతూ తిరుగుతారు . 

ఉత్తరాది వారు నువ్వులు బెల్లంతో చేసిన పదార్దాలను సూర్యుడికి నైవేద్యం చెయ్యడం కనిపిస్తుంది , వీటి సేవనం వల్ల శరీరంలో చలికి తట్టుకొనే శక్తి వస్తుందని నమ్మకం .

దక్షిణ ఆసియా దేశాలలో కూడా సంక్రాంతి పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది . నేపాలు , మైన్మార్ , థాయ్ లాండు ' , లావోస్ , కంబోడియా , శ్రీలంక లలో కూడా సంక్రాంతి జరుపు కుంటారు .

ఈ దేశాల ప్రజలు బౌద్దమతస్థులు కావడంతో వీరి ఆచార వ్యవహారాలు సుమారుగా ఒకేలా వుంటాయి . నేపాలు హిందూ సామ్రాజ్యం కావడం వల్ల మన సాంప్రదాయాలు యెక్కువగా కనిపిస్తాయి .

ముందుగా నేపాలు గురించి తెలుసుకుందాం . 

నేపాల్ దేశం హిందూదేశం , ఈ దేశం లో యెక్కువ మంది విక్రమశకాన్ని అనుసరిస్తారు . మైధిలి ప్రాంతానికి చెందిన ' థరు ' జాతివారు ' కీరత్ శకాన్ని ' అనుసరిస్తారు .

          2000 సంవత్సరం లో సంక్రాంతికి మేం అక్కడ వుండడం వల్ల నేపాలులో సంక్రాంతి జరుపుకొనే పద్దతి ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది . పొద్దన్నే పశుపతి నాధ్ మందిరం వెనుక వైపున వున్న ' భాగమతీ ' నదిలో గాని , గండకి నదిలో గాని పుణ్య స్నానాలు చేసి  వీధులలో మంటవేసుకొని స్నానాదులు కానిచ్చి ముంగిట చిన్న ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మధ్యలో పూలు రాగినాణేలు , పసుపు కుంకుమ వుంచి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని యింటిముందర వున్న శివలింగానికి ( ప్రతి యింటి ముందు శివలింగం వుంది ) పూజచేసుకొని పసుపతినాథుని దర్శించుకొని అభిషేకాదులు చేసుకొని ఆ రోజు వుపవాస దీక్షలో వుంటారు . 

       'థరు ' జాతి ప్రజలు యీ రోజుని కొత్త సంవత్సర ప్రారంభ దినంగా జరుపుకుంటారు . 

    బంగ్లాదేశ్ లో ' షాక్రైన్ , ' పౌష్ సంక్రాంతి ' అని జరుపుకుంటారు . సంక్రాంతిని వీరు రెండురోజుల పండగగా జరుపుకుంటారు . నదీ స్నానాలు , గాలిపటాలపోటీలు జరుపుకుంటారు . రాత్రి బాణాసంచా కాలుస్తారు . నోటితో మంటలనూదే వారు వారి విద్యతో ప్రజలకు వినోదం కలిగిస్తారు . దీనిని ' ఘరివుత్సబ్ ' అని అంటారు .

     శ్రీలంక లో ' థాయ్ పొంగల్ ' గా  తమిళులు యెక్కువగా నివశిస్తున్న ప్రాంతాలలో జరుపుకుంటారు . 

        థాయ్ లాండు లో ' సోంక్రాన్ ' గా , మైన్మార్ లో 'థింగ్యాన్ ' గా , లావోస్ లో ' పిమ ' గా కంబోడియా లో ' మహా సోంక్రాన్ ' గా జరుపు కుంటారు . ఈ దేశాలన్నీ కూడా బౌద్ధమతాన్ని అనుసరించే దేశాలు కావడంతో వీరు బౌద్ద శకాన్ని అనుసరిస్తారు . అయితే వీరు జరుపుకొనేది మేష సంక్రమణం , దీననే వీరు సంక్రమమణం గా వ్యవహరించడంతో మనకి కాస్త తికమకగా వుంటుంది .

         సంక్రమణం పండుగ కొన్ని దక్షిణ ఆఫ్రికా దేశాలలో జరుపుకోవడం కనిపిస్తుంది .

     పండగలు అన్నవి మన సంస్కారంలో ఒక భాగం , మునులు , ఋషులు ఆయా మాసాలలో కలిగే వాతావరణ మార్పులను మన శరీరాలు తట్టుకొనేందుకు వీలుగా ఆయా సమయాలలో ఆచరించవలసిన విధులను నిర్దేశించేరు , మనం యెందుకు చేసుకోవాలి , చెయ్యకపోతే మనకు జరిగే నష్టం యేమిటి అనే వితండవాదం మాని మన ఆచారవ్యవహారాలను ఆచరించే ఆయఃరారోగ్యాలను పొందండి . 

మరిన్ని శీర్షికలు
weekly horoscope 13th january to 19th january