Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cartoon competetion

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాశ్మీర్ అందాలు చూస్తారా..! - కర్రా నాగలక్ష్మి

beauty ok kashmir

మహారాణి మందిరం ---

మహారాజా హరి సిసోడియా అనే డోగ్రా రాజు అతని రాణి పూజ కొరకై నిర్మించిన శివ పార్వతి మందిరం . ఈ మందిరం గుల్ మార్గ్ కి సుమారు యేడు కిలో మీటర్ల దూరంలో వుంది . గుల్మార్గ్ వెళ్లేవారు తప్పకుండా దర్శించదగ్గ ప్రదేశం . మందిరం చిన్న కొండపై వుండడం తో మొత్తం గుల్ మార్గ్ ని యిక్కడ నుంచి చూడొచ్చు . చిన్న మందిరమే అయినా యిక్కడి ప్రకృతి మనలని కట్టి పడేస్తుంది . తెల్లని మంచుతో కప్పబడ్డ హిమాలయాలు యేటవాలుగా వుండే పచ్చిక బయళ్లు , దట్టమైన అడవులు ఒకవైపు వుంటాయి . అదే అక్టోబరు మాసం లో వస్తే కనుచూపు మేర వరకు అంతా తెల్లగా వున్న మంచు మధ్యలో మందిరం , మందిర పై కప్పు పై కురిసిన మంచుతో చాలా అందంగా వుంటుంది .         1971 -72 ప్రాంతాలలో వచ్చిన  రాకేష్ ఖన్నా , ముంతాజ్ నటించిన ' ఆప్ కీ ఖసమ్ ' సినిమా లో "  జై జై శివశంకర్ " పాట చిత్రీకరణ యిక్కడ జరిగింది . అప్పట్లో ఆ సినిమా , ముఖ్యంగా ఆ పాట సూపర్ డూపర్  హిట్ అయింది . అలాగే శమ్మీ కపూర్ సినిమాలలో పాటపాడుతూ శమ్మీ కపూర్ పచ్చికలోనూ , మంచుపై దొర్లిన ప్రదేశాలు యివే , వాటిని చూస్తున్నప్పుడు దొర్లడం శమ్మీకపూర్ కి అలవాటు కాదని యిక్కడి ప్రకృతిని చూస్తే అలా చెయ్యాలని యెవరికైనా అనిపిస్తుందని  అనిపించింది


గుల్ మార్గ్ నుంచి మనం సోన్ మార్గ్ వెళదాం . కశ్మీరు లోయలో తప్పక చూడదగ్గ ప్రదేశాలలో యిదొకటి , సమయా భావం వల్ల యెవరికైనా ఒక ప్రదేశం వదిలేయ వలసి వస్తే పహల్ గాం వదిలేయొచ్చు , కాని గుల్మార్గ్ , సోన్ మార్గ్ మాత్రం చూసేరండి యిది నా ప్రత్యేక సలహా .

శ్రీనగరు నుంచి సోన్ మార్గ్ సుమారు 87 కిలో మీటర్లు  , శ్రీనగరు నుంచి ణ్-1డ్ మీద మన ప్రయాణం సాగుతుంది .  సోన్ మార్గ్ 1950 ప్రాంతాలలో గల్ఫ్ దేశాలకు , చైనాకు ఉపయోగించిన సిల్క్ రోడ్డు యిక్కడ నుంచే మొదలవుతుంది  . జమ్ము కశ్మీరు లోని గందర్బల్ జిల్లాలోకి వస్తుంది ఈ ప్రాంతం .

శ్రీనగరు లోయ లో యెటు వెళ్లినా యెత్తైన పైను వృక్షాలు , పచ్చని వరి పొలాలు చిన్న చిన్న సెలయేళ్లతో చాలా అహ్లాదకరం గా వుంటుంది . ఉత్తర భారత దేశ ప్రజల ముఖ్య ఆహారం గోధుమ అని చిన్నప్పుడు మనం చదువుకోవడంయీ ప్రాంతం వారంతా గోధుమ రొట్లు తింటారనేది చిన్నప్పటి నుండి మన మనస్సులలో ముద్రింప బడ్డ అపోహ , కాని చాలా ప్రదేశాలలో ముఖ్యంగా హిమాచల్ , ఉత్తరాఖండ్ , కశ్మీరు కొండ ప్రాంతాల ప్రజల ముఖ్య పంట వరి , ఆహారం వరి అవడం మనకి ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది . ఇక్కడ పండే వరి తో చేసే వంటలు చాలా రుచికరంగా వుంటాయి . ఎందుకు అంటే కుంకుమ పువ్వు పండే పొలాలలో పండుతాయి కాబట్టి రుచి వస్తుంది అంటారు , అలాగే బాదం పప్పు కొనేటప్పుడు కూడా పప్పులో తేడాలు చెపుతూ రేటు యెక్కువగా వున్న బాదం పలుకులు కుంకుమ పువ్వు పండే పొలాల దగ్గర వున్న తోటలలో పండేయని చెప్తారు .

సోన్ మార్గ్ వెళ్లే దారంతా కూడా చాలా సెన్సిటివ్ ప్రాంతంగా ఆర్మీ వారు చెప్తారు . మనకి కూడా మోహరించి వున్న ఆర్మీ ని చూస్తే తెలుస్తూ వుంటుంది . ఎప్పుడు యెక్కడ దారి బందు చేస్తారో తెలియని పరిస్థితి . ఎక్కడో ఓ చోట చొరబాటుదారులు దాడులు చేస్తూ వుండడం వల్ల ఆర్మీ యాత్రీకులను ఆపివేస్తూ వుంటారు . కశ్మీరు లోని అమర్ నాధ్ గుహకు యీ మార్గం గుండా వెళ్ల వలసి రావడం , లడాక్ సరిహద్దు ప్రాంతాలలోని సైనికులకు పంపే నిత్యావసర మరియు ఆయుధాలు యీ మార్గం గుండా పంపడం వలన పొరుగు రాష్ట్ర చొరబాటుదారులు దాడులు చేస్తూ వుంటారు . ఒక రాత్రి పూర్తిగా యాత్రీకులను సగం కట్టిన కట్టడం లో పూర్తి రక్షణ లో వుంచి చొరబాటు దారులను మట్టుబెట్టిన తరువాత యాత్రీకుల యాత్ర తిరిగి కొనసాగించడం చేస్తూ వుంటారు . ఆ అనుభవం కూడా మాకు కలిగింది . ఓ సారి మొత్తం యాత్రీకులను అంటే సుమారు వందల సంఖ్యలో వాహనాలను రోడ్డు మీదే ఆపి యెవ్వరూ వాహనాలనుంచి యెట్టి పరిస్థితి లోనూ బయటికి రావద్దని సాయుధ సైనికులు హెచ్చరికలు చేస్తూ మొత్తం అన్ని యాత్రీకుల వాహనాలకు పహారా యిచ్చి అలజడి తగ్గేక తిరిగి యాత్ర ప్రారంభ మవడం గుర్తుంది .

చాలా చొరబాటు ఉదంతాలు బయటకి రాకుండా ఆర్మీ వారు గోప్యంగా వుంచుతారు . సర్గం లాంటి శ్రీనగరు లోయలో చొరబాటు దారులు యమకింకరులలా తగలబెట్టినా లోయ యింకా స్వర్గాన్ని తలపిస్తూనే వుండడం ఆశ్చర్యాన్ని కలుగ జేస్తూ వుంటుంది .

ఈ మార్గం లో సోన్ మార్గ్ వరకు ప్రయాణం మైదానాలలో సాగుతుంది . సుమారు 30-40 కిలోమీటర్లు ప్రయాణంచిన తరువాత క్రికెట్ బేట్లు అమ్మే షాపులు కనిపిస్తాయి . చిన్న పెద్ద అన్ని సైజులలో , క్రికెట్లు ఆడేవి అన్నీ దొరుకు తాయి . అలా దారి పొడవునా అమ్ముతూ వుంటారు . బేట్లు తయారీకి వాడే కర్ర యిక్కడ పెరుగుతుందట , మొత్తం వందల సంఖ్యలో షాపులు , వేల సంఖ్య లో బేగులు వున్నాయి . ముందుకు వెళుతూ వుంటే బేటుల తయారీ కర్మాగారాల మధ్య నుంచి మన ప్రయాణం సాగుతుంది . ప్రతీ ప్రయాణీకుడు కనీసం రెండేనా కొంటూవుంటారు . వీటికి మన్నిక కూడా యెక్కువే .


సోన్ మార్గ్ లోయలో సంవత్సరం లో చాలా కాలం హిమపాతం జరగడం తో చాలా కొద్ది అంటే మూడు నాలుగు మాసాలు మాత్రమే పర్యాటకులకై తెరుస్తారు . సాధారణంగా ఏప్రెల్ ఆఖరు వారం నుంచి సెప్టెంబరు మధ్య వరకు తెరచి వుంటుంది .అప్పుడు  కూడా యెక్కువ సమయం వర్షం కురుస్తూ వుంటుంది . ముఖ్యంగా సోన్ మార్గ్ వెళ్లే పర్యాటకులు రైన్ కోట్లు గాని గొడుగులు కాని తీసుకు వెళ్లడం మంచిది . ఇక్కడ ఉష్ణోగ్రతలు శ్రీనగరు కంటే చాలా తక్కువగా వుంటాయి కాబట్టి ఆ ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగే చలి బట్టలు తీసుకొని వెళ్లాలి . ఈ ప్రాంతంలో కశ్మీరీ టీ ( ఖహ్వా ) , ఉప్పు టీ యెక్కువగా తాగుతారు . కశ్మీరీ టీ అంటే చలిని తట్టుకొనేందుకు అని తెలుసు కాని యీ ఉప్పు  టీ యెందుకో మరి తెలీదు . మామూలు టీ కావాలంటే ' లిప్టన్ ' టీ అంటే పాలు పంచదార వేసిన టీ యిస్తారు . అన్ని చోట్ల మన టీ దొరకదు

సోన్ మార్గ్ అయిదారు కిలో మీటర్లు వుందనగానే  మనకి రోడ్డు కి యిరువైపులా వున్న కొండ చరియలలో , మైదానాలలో పచ్చని పూలతో వున్న మొక్కలు కనువిందు చేస్తాయి . దూరం నుంచి పిసిడి రంగు తివాసి పరిచినట్లున్న వుండడం తో దీనిని కి పిసిడి మార్గం ( సోన్ మార్గ్ ) అనే పేరు వచ్చిందేమో అని అని పించక మానదు . నిజం కూడా అదేనేమో ? .

చాలా అందమయిన ప్రదేశం . పచ్చని పూలు , ఆకు పచ్చని గడ్డి , చుట్టూరా యెత్తైన కొండలు పొడవైన దట్టమై పైను వృక్షాలు , మంచు కరిగి ప్రవహిస్తున్న సెలయేటి గలగలలు , కొంగలు , పేరు తెలియని రంగురంగుల పక్షుల .... ఓహ్ ......... వర్ణించలేని ప్రకృతి సౌందర్యం మంత్రముగ్ధులను చేస్తుంది .

ఎత్తైన వాహనరాకపోకలు కలిగిన కనుమ గా చెప్పబడే ' జోజిల్లా ' యిక్కడకు 15 కిలో మీటర్ల దూరంలో వుంది . యేడాదిలో చాలా భాగం మంచు పడుతూ సైనికులకు చేరవేసే నిత్యావసర సరకులకు అంతరాయం కలుగుతూ వుండడం తో గగన గీర్ దగ్గర ఆరు కిలో మీటర్ల పొడవైన సొరంగమార్గం , 14 కిలోమీటర్ల సొరంగమార్గం ' జోజిల్లా ' వద్ద నిర్మాణం జరుగుతోంది . ఇవి పూర్తయితే సరిహద్దు లో వున్న మన సైనికులు ఆహార , ఆయుధ కొరత ను అధిగమించవచ్చు .

ఈ ప్రాంతాలలో కను చూపు మేర వరకు పర్వతాలపై నిర్మానుష్య ప్రదేశాలలో మన సాయుధ సైనికులు పహారా యివ్వడం కనిపిస్తూ వుంటుంది .

ఈ ప్రాంతం లో చాలా చోట్ల గడ్డకట్టిన సెలయేళ్లు , కరగకుండా వుండిపోయి సూర్యరశ్మి వల్ల కరుగుతూ వున్న గడ్డకట్టిన మంచు కనువిందు చేస్తాయి . ఇంకా యెక్కువ గడ్డకట్టిన మంచును చూడాలంటే యిక్కడకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో వున్న ' తేజీవాస్ ' హిమనీనదానికి వెళ్లొచ్చు . ఇక్కడ చుట్టు పక్కల పర్యాటక స్థలాలను సందర్శించేందుకు యిక్కడి వాహనాలనే కుదుర్చుకోవాలి , కాబట్టి బేరాలు చాలా యెక్కువగా వుంటాయి .

ఇక్కడ విషస్సార్ సరస్సు , క్రిష్ణా సార్ సరస్సు , గంగాబల్ సరస్సు , గడసర్ సరస్సు చూడదగ్గవి . కశ్మీరు లోయ అంతా సరస్సులమయం . ఎన్ని సరస్సులు చూస్తాం అనుకుంటే సోనెమార్గ్ లో పచ్చిక మైదానంలో బంగారు రంగు పూల మధ్య గుట్టలు యెక్కుతూ  ఫొటోలు తీసుకుంటూ కూడా గడిపేయొచ్చు . ఇక్కడ తక్కువ సదుపాయాలు కలిగిన భోజన వసతులు వున్నాయి , ప్రకృతికి అతి దగ్గరగా గడపాలనుకొనే వారు ఒకరాత్రి గడపొచ్చు , అంతకంటే యెక్కువ వద్దనేది ఆర్మీ వాళ్ల సలహా .

సాధారణంగా అమర్ నాధ్ యాత్రీకులు ముఖ్యంగా హెలీకాఫ్టర్ ద్వారా యాత్ర చేసేవారు , బాల్టాల్ మీదుగా యాత్ర చేసేవారు యీ మార్గం గుండా ప్రయాణిస్తూ  వుంటారు .

ఇక్కడ నుంచి ' జోజిల్లా ' మాత్రం వీలుచేసుకొని తప్పక వెళ్ల వలసిన ప్రదేశం . చుట్టుపక్కల తెల్లని మంచు చూస్తే యిక్కడ యేడాది పొడవునా మంచికురుస్తూనే వుంటుంది అనేది మనకి తెలుస్తుంది . ఇక్కడ భారతదేశ సైనిక స్థావరం తప్ప మరేమీ లేదు , పర్యాటకులు అక్కడ కొద్ది నిముషాలు గడిపి వెళ్లిపోతారు ,ఆర్మీ వారితో వచ్చిన వారికి వేడివేడి టీ సైనికులు వారి స్థావరంలో యిస్తారు . కనీసపు చలిబట్టలు  ధరించి , తలను మంచుగాలులకు వదిలేసిన సైనికులను ప్రశ్నించగా వారి పై అధికారి అనుమతితో అతను చెప్పిన విషయం వినగానే నాకు కళ్ళంట నీళ్లొకటే తక్కువ . విషయం యేమిటంటే చలిబట్టలు యెక్కువ వేసుకుంటూ శరీరం నిద్రకు ఆగలేదు , తల కప్పుకుంటే చెవులు మూసుకుపోయి చిన్న చిన్న అలికిడులు వినబడవు యీ రెండూ కూడా వారి విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తాయి . సాధారణంగా యిక్కడ మైనస్ 20 డిగ్రీలు వుంటుందట , పగలు బాగా యెండ వచ్చిన రోజు మేం అక్కడ వున్నాం ఆరోజు మైనస్ 7 డిగ్రీలు వుందట అలాంటి చలిలో మన సైనికులు విధి నిర్వహణ చేస్తూ వున్నారు , అంతకంటే క్లిష్ట పరిస్థితులలో కూడా మన సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు . అయితే వినడం వేరు చూడడం వేరు కదా ? అలాంటి మన జవానులకు సెల్యూట్  చెయ్యకుండా వుండగలమా ? .

మరిన్ని శీర్షికలు
weekly horoscope 10th febuary to16th febuary