'బాహుబలి ది బిగినింగ్' తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. తద్వారా, దేశమంతా ఇప్పుడు 'బాహుబలి ది కంక్లూజన్' కోసం ఎదురుచూసేలా చేసింది. ప్రపంచ వ్యాప్తంగానూ 'బాహుబలి ది కంక్లూజన్'కి క్రేజ్ విపరీతంగా ఉంది. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు 'బాహుబలి ది కంక్లూజన్' రానుండగా, సినిమా పబ్లిసిటీని ఇప్పటికే ఉధృతం చేశారు. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన ఈ చిత్ర రాజంపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.
వంద కోట్లు కాదు, వెయ్యి కోట్లు టార్గెట్‌గా ఈ సినిమా బిజినెస్‌ని ప్లాన్ చేసి, దానికి తగ్గ వ్యూహాలతో సినిమాని అత్యథిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తొలి రోజుకి సంబంధించి గత రికార్డులు ఎలాగూ పటా పంచలైపోతాయి. అనుకున్నట్టుగా వెయ్యి కోట్లు సాధించడం అంత చిన్న విషయం కాదుగానీ, అది కూడా సాధించేస్తామన్న ధీమాతో ఉంది రాజమౌళి టీమ్. నిర్మాణంలో ఎక్కడా రాజీపడకపోవడం, అలాగే పబ్లిసిటీని క్యాష్ చేసుకుని సినిమాపై పట్టు వదిలేసుకున్నట్టు కాకుండా రెట్టించిన ఉత్సాహంతో సినిమా కోసం పనిచేయడం వంటివి 'బాహుబలి ది బిగినింగ్'ని వెరీ వెరీ స్పెషల్‌గా మార్చాయి. సినిమా రూపొందించి ఊరుకుంటే సరిపోదు, దాన్ని జననాల్లోకి తీసుకెళ్ళాలి. అదే చేస్తోంది రాజమౌళి టీమ్. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, దర్శక నిర్మాతలు, ఒకరేమిటి అందరూ సినీ ప్రమోషన్‌లో తలమనుకలై ఉన్నారు. అందుకే ఒక్క రాజమౌళి మాత్రమే కాదు, సినిమాకి పనిచేసినవారంతా బాహుబలులే.
|