Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri  question

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ ( తీర్థ యాత్రలు ) దేవప్రయాగ - కర్రా నాగలక్ష్మి

deva prayaga

దేవప్రయాగ

ఋషికేశ్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల ప్రయాణం తరువాత దేవప్రయాగ చేరుతాం . ఋషికేశ్ దాటేక పెద్దగా చెప్పుకోదగ్గ గ్రామాలేమీ లేవు , యాత్రీకులకు కావలసిన కనీసపు అవుసరాలు తీర్చే పాటి దుకాణాలు కూడా లేవు అంతా ఘాట్ రోడ్డే . మలుపులు తిరుగుతూ సాగుతుంది . యాత్రీకులు తగు మందులు , వాంతుల యిబ్బంది వున్న వారు ముందుగానే వారి జాగ్రత్తలో వుండడం మంచిది .

ప్రయాగ అంటే రెండుగాని అంతకన్నా యెక్కువ నదులు సంగమించే ప్రదేశాన్ని ప్రయాగ అని అంటారు . హిందూ పురాణాల ప్రకారం పంచపురములు , పంచకైలాసాలు , పంచ కేదారాలు , పంచబదరీలు , పంచధారల , పంచశిలలు , పంచప్రయాగలు దర్శనీయ పుణ్యతీర్థాలుగా వర్ణింపబడ్డాయి .

ఇవాళ మనం చెప్పుకొనే దేవప్రయాగ పంచప్రయాగలలో ఒకటి , నందప్రయాగ , కర్ణ ప్రయాగ , రుద్ర ప్రయాగ మరియు ప్రయాగరాజ్ గా పిలువబడే త్రివేణి సంగమాన్ని పంచప్రయాగలు అనిఅంటారు . ఇవికాక యీ కొండలలో యింకా యెన్నో ప్రయాగలు వున్నాయి . చాలా చోట్ల ముఖ్యనదిలో మరో వైపునుంచి కలిసే మరోకదాంట్లో లేక వాగు కనబడుతూనే వుంటాయి . చాలా చోట్ల రెండునదులు వేరువేరు రంగులలో వుండి వాటి సంగమం ఒక అధ్భుతం అని అనిపిస్తూ వుంటుంది .

ఇక్కడ మరో ముఖ్య మైన విషయం యేమిటంటే ప్రయాగ అన్న పదానికి తపస్సు చేసే ప్రదేశం అని కూడా అర్దం వుంది . దేవతలు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి దేవప్రయాగ అనే పేరు వచ్చినట్లుగా చెప్తారు .

వేదకాలంలో యీ ప్రదేశం లో దేవశర్మ , భరద్వాజముని , సప్తఋషులు , బ్రాహ్మ తపస్సు చేసుకున్నారు .

త్రేతాయుగంలో రామరావణ యుధ్దంలో రాముడు రావణుని సంహరిస్తాడు . రావణుడు జన్మతః బ్రాహ్మణుడు కావడంతో రామునకు బ్రహ్మహత్యాపాతకం సంప్రాప్తిస్తుంది . దానిని పోగొట్టుకొనుటకు వ్యాసుని సలహాననుసరించి రాముడు దేవ ప్రయాగలో తపస్సాచరించి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకొని రాజ్యభారం నిర్వహించేందుకు అయోధ్య కు వెళతాడు రాముడు .

మహాభారత యుధ్దానికి ముందు పాండవులు శ్రీకృష్ణుని సూచన మేరకు దేవప్రయాగ లో తపస్సాచరించి యుధ్దానికి వెళ్లి విజయం పొందేరు

ముందు మనం చెప్పుకున్నట్లు రెండునదులు సంగమించిన ప్రదేశం కూడా కావడం మరో విశేషం . మనం చెప్పుకున్న పంచ ప్రయాగలు కూడా కృతయుగం నుంచి ప్రసిధ్ది కలిగి పురాణాలలో వర్ణింపబడడం జరిగింది .

మానా కి మూడు కిలో మీటర్ల దూరంలో టిబెట్టు భూభంలో గల సతోపంత్ హిమనీనదములో పుట్టిన సరస్వతీ నదికి ఉపనదిగా పుట్టి బదరీనాధ్ మీదుగా ప్రవహించి నందాకిని , దౌళి గంగ , పిండారి గంగ , మందాకిని మొదలయిన నదులతో సంగమించి ప్రవహించి దేవప్రయాగ చేరిన అలకనంద శివుని జటాఝూటం నుండి భగీరథుని కొరకు భూలోకంలోకి వచ్చిన గంగ గంగోత్రి హిమనీనదమునుండి ఉధ్బవించి  ప్రవహిస్తూ సోన్ గంగ మొదలయిన నదులతో సంగమించి టెహ్రీ మీదుగా ప్రవహించి దేవప్రయాగ చేరిన భగీరథి తో సంగమించి యిక్కడ నుంచి గంగ గా పిలువబడుతూ కాశీ మొదలైన పుణ్య క్షేత్రాలలో ప్రవహించి బంగాళాఖాతం లో కలుస్తోంది .

దీనిని అత్తా కోడళ్ల సంగమం ( సాస్ బహు సంగమ్ ) అని కూడా అంటారు . ఎందుకంటే అలకనంద విష్ణపత్ని లక్ష్మీ స్వరూపమని , గంగ శివుని భార్య కాబట్టి వీరు అత్తా కోడళ్ల వరస . ఇక్కడ వున్న మరో నమ్మకం యేమిటంటే అత్తాకోడళ్ల సంబంధాలు బాగులేని వారు యీ సంగమంలో పూజలు చేసుకొని పసుపు కుంకుమ సమర్పించుకుంటే వారి సంబంధాలు బాగుపడి కలకాలం కలిసుంటారని అంటారు .

2013 లో సంభవించిన వరదలలో పూజలకొరకై నిర్మించిన ఘాట్ కొట్టుకు పోయింది .

దేవ ప్రయాగ బదరీనాథ్ కోవెల పూజారులు శీతాకాలంలో నివసించే ప్రదేశం . వీరు యిక్కడకు వచ్చే ప్రతీ యాత్రీకుల వివరాలు గ్రంధస్థం చేస్తూవుంటారు . ఇక్కడ బస చెయ్యడానికి కనీస సౌకర్యాలతో వుండే గదులు లభ్య మౌతాయి . ముందుగా అనుకోకుండా యేవో కారణాలవల్ల యిక్కడ బసచేయ దల్చుకుంటే స్థానికంగా వుండే బ్రాహ్మణులు భోజన సదుపాయాలతో బసలను వారి యిళ్లల్లోనే యేర్పాటు చేస్తారు . ఇలాంటి వాటిల్లో వుండడం వల్ల యాత్రీకులకు హోటలు భోజనం కాకుండా యింటిభోజనం దొరుకుతుంది , ప్రకృతి వడిలో జీవనం సాగించేవారి అథిధి మర్యాదలు యెలావుంటాయో రుచి చూడొచ్చు . నిజంగా అది మరపురాని అనుభూతి .

అయితే యీ దేవప్రయాగలో మూడు నదుల సంగమం జరిగింది అని విష్ణు పురాణం లో వుంది . మానా లో లుప్తమైన సరస్వతీనది యిక్కడ పాతాళం నుంచి పైకి వచ్చి రఘునాథుని పాదాలచుట్టూ ప్రదక్షిణ చేసుకొని భగీరధి , అలకనంద సంగమించిన చోట తిరిగి పాతాళానికి వెళ్లిపోతుందని చెప్పబడింది .

దేవప్రయాగలో ముఖ్యంగా మూడు పర్వత శిఖరాలగురించి చెప్తారు అవి ఒకటి గిద్దాంచల్ , రెండు దశరధాంచల్ , మూడు నృసింహాంచల్ .
      గిద్దాంచల్ శిఖరాన వున్న పురాతన మందిరాన్ని రఘునాధ్ మందిరం అంటారు . దేవప్రయాగలో రఘునాథ్ మందిరమే కాక ధనేశ్వర మహదేవ మందిరం , మాతా భువనేశ్వరీదేవి మందిరం , దండ నాగేశ్వర మందిరం వున్నాయి .

సంగమం కి యెదురుగా వున్న మందిరమే ధనేశ్వర మహదేవ మందిరం , బదరీ , కేదార్ యాత్రలకు వెళ్లేయాత్రీకులు గంగానది నీటితో యీ ఈశ్వరునకు అభిషేకం చేసుకొని వారి యాత్ర మొదలు పెడతారు .
      ఇమగె5.ఝ్ఫ్ఘ్  సంగమానికి కుడి వైపున వున్న రఘునాధ్ మందిరం చేరుకోవాలంటే బదరీనాధ్ రోడ్డు మీద వున్న బజారు రోడ్డు దగ్గర నుంచి కాలినడకన సుమారు అర కిలోమీటరు నడక ద్వారా చేరుకోవచ్చు . సన్నని దారి లో వెళ్లి వ్రేలాడే వంతెన దాటి మందిరం చేరుకోవాలి . వ్రేలాడే వంతెన మీద వూగుతూ సాగే నడక , క్రిందన గలగల ప్రవహిస్తున్న భగీరధి యెదురుగా అలకనందతో సంగమిస్తూ కనిపిస్తూ వుంటుంది . మందిరం పురాతన రాతికట్టడం . మందిరం పక్కనే ప్రాథమిక పాఠశాల పిల్లలతో కళకళ లాడుతూ వుంటుంది . సుమారు ముప్పై యెత్తైన మెట్టు యెక్కి కోవెల చేరుకోవచ్చు . పక్కగా వున్న ద్వారం గుండా లోపలికి వెళితే  ముందుగా సీతాదేవి మందిరం , పక్కగా గరుడ మందిరం వుంటాయి లోపల గర్భగుడిలో యెత్తైన నిలుచున్న రాముని సజీవ విగ్రహం చూడ ముచ్చటగా వుంటుంది . గర్భగుడిలో హనుమంతుని విగ్రహం చూడొచ్చు . ఈ మందిరం ఆదిశంకరాచార్యులచే నిర్మింపబడింది . తరవాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు మరమ్మత్తులు చేయించేరు .

మందిర ప్రాంగణంలో చిన్న మందిరం లో శంకర భగవత్పాదుల విగ్రహం కూడా వుంది . 2013 లో సంభవించిన వరదలలో కొత్త కట్టడాలు కొట్టుకుపోయినా యీ మందిరానికి యెటువంటి క్షతి కలుగపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది .

ప్రాంతీయులు శ్రీరాముని రఘునాధుడుగా వ్యవహరిస్తారు కాబట్టి యీ మందిరాన్ని రఘునాధ్ మందిరం అంటారు . వైష్ణవుల అతి పవిత్రమైన 108 దివ్యదేశాలలో రఘునాధ్ మందిరం ఒకటి .

ధశరథాంచల్ శిఖరాన 1946 లో ఆచార్య పండిట్ చక్రధరజోషీ అనే ఖగోళ అధ్యనకర్త చే స్థాపింపబడ్డ వేదశాల చెప్పుకోదగ్గది . ఇందులో సుమారు 1600 సంవత్సరం నుంచి లిఖింపబడ్డ ఖగోళశాస్త్రానికి సంబంధించిన సుమారు మూడువేలకు పైగా గ్రంథాలను సేకరించి సంరక్షిస్తున్నారు . పూర్వకాలానికి చెందిన సూర్యగతి , దృవగతి అనే  హిందూదేశంలో పరిశోధించి తయారుచేసిన ఖగోళ పరికరాలను చూడొచ్చు . ఇవికాక రెండు చాలా శక్తివంతమైన టెలిస్కోపులు వున్నాయి .

ఇక్కడ నుంచి చంద్రబదనీ దేవి మందిరానికి వెళ్లొచ్చు . బదనీ దేవి మందిర విశేషాలు మళ్లావారం చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
weekly horoscopest  5th may to 11th may