Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu aame oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

 గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue212/599/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

( గతసంచిక తరువాయి )...‘‘ఏంటి విశేషం బిందూ?’’ కీర్తన ఆత్మీయంగా అడిగింది. ఆమెకి తన టీమ్‌, వేరే టీమ్‌ అనికాదు. అసలు బాగా ఆడేవాళ్ళంటే ఎవరయినా యిష్టమే.

ఏ మరకలూ అంటని తెల్లని కాగితం ఆమె మనసు. అందుకే కళ్ళూ, పెదాలు ఎప్పుడూ స్వచ్ఛంగా మెరుస్తూ వుంటాయి.
భుజాలు ష్రగ్‌ చేసింది మణి బిందు.

‘‘స్పెషల్‌ న్యూస్‌ ఏమీ లేదు. ఫ్రెండ్లీ మ్యాచ్‌ పెట్టుకుందామని అడగడానికి వచ్చాం’’ చెప్పింది.

కీర్తన తన టీమ్‌ మేట్స్‌ వంక చూసింది.

వాళ్ళు కాసేపు ఆలోచించారు. ఫ్రెండ్లీ మ్యాచ్‌కి అంతగా ఆలోచించాల్సింది ఏముంది? కీర్తనకి అర్ధం కాక పోయినా, ఫ్రెండ్స్‌ బృందం ఏదో వుందని గ్రహించింది. అందుకే...

‘‘ఇప్పుడు డిస్కస్‌ చేసుకుని రేపు చెపుతాం’’ అంది

‘‘ఓకే. పాజిటివ్‌ రిప్లయ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం’’ చెప్పి వెళ్ళి పోయారు వాళ్ళు.

అవర్‌ అయి పోవడంతో అందరూ వెళ్ళి పోయారు. ఈ పన్నెండు మందీ మిగిలారు.

‘‘ఎనీ ప్రాబ్లమ్‌....?’’ కీర్తన అడిగింది.

‘‘కొంచెం ఆలోచిస్తే మంచిది....’’

‘‘ఏం?’’ నొసలు ముడిచి అడిగింది కీర్తన.

‘‘నేషనల్‌ గేమ్స్‌ గురించి వాళ్ళు పక్కా ప్లాన్‌లో వున్నారు ఆ అమ్మాయి అంది.

‘‘ఉండనీ! మనం మాత్రం లేమా?’’ కీర్తన అంది.

‘‘మనం మన గేమ్‌ గురించి ప్లాన్‌లో వున్నాం. వాళ్ళు ఎదుటి గేమ్‌ గురించి ప్లాన్‌లో వున్నారు.’’

‘‘అంటే?’’ కీర్తన అర్ధంకానట్లు అడిగింది.

‘‘ఏముందీ....మన టీమ్‌లో వున్న లోటు పాట్లేవో అబ్జర్వ్‌ చేయడానికి ప్లాన్‌. నీకు తెలుసు కదా ఫేవరెట్‌ టీమ్స్‌ లో వాళ్ళూ మనం వున్నామని.ఈ గేమ్‌లో మనం కాస్త అటూ యిటూగా ఆడితే ఎంత ప్రాపగాండా చేస్తారో తెలుసా...?’’ ఆవేశంగా అంది ఆ అమ్మాయి.
నవ్వుతూ తల అడ్డంగా ఆడించింది కీర్తన.

‘‘అది వాళ్ళ ప్రాబ్లమ్‌. వాళ్ళ కోసం మనం ఆటకి ఎందుకు దూరం కావాలి....? ఒక మంచి టీమ్‌తో ప్రాక్టీస్‌ జరుగుతున్నందుకు సంతోషించాలి’’ అంది.

పునరాలోచనలో పడ్డారు.

‘‘మన ఆట మీద మనకి నమ్మకం వున్నపుడు ఎదుట వారి మాటలకి ఎందుకు యింపార్టెన్స్‌ యివ్వాలి? లోకంలో మన గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు. అది వాళ్ళ యిష్టం. వాళ్ళ టైమ్‌ వేస్ట్‌ పని అది.

నా ఉద్దేశం ప్రకారం! మనకి యిది మంచి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అవుతుంది’’ కీర్తన అంది.

‘‘అంతేలే! అయినా నేషనల్‌ గేమ్స్‌లో తెలుపు మనదే!....ఎందుకంటే, మ్యాచ్‌ జరిగేది హైద్రాబాద్‌ లోనే. మన సొంత గడ్డ. కొన్ని వేల మంది మనకి డైరెక్ట్‌ సపోర్ట్‌నిస్తారు’’ ఒకమ్మాయి ఉత్సాహంగా అంది.

‘‘ఆడేపుడు మన కళ్ళ ముందు కోర్టు, నెట్‌, బాల్‌, ప్రత్యర్ధులూ, మనమూ అన్న ఆలోచన తప్ప యింకేదీ మైండ్‌లోకి రానివ్వక పోతే మంచిది. అపుడు ఎక్కడ ఆడినా మనకి ఒక్కటే’’ కీర్తన అంది.

‘‘అఫ్‌కోర్స్‌! ఎంత కాదనుకున్నా మనని ప్రోత్సహించే వారి చప్పట్లు టానిక్‌ లా పని చేస్తాయి.’’

‘‘ఆ చప్పట్లే కొంప ముంచుతాయి. క్రికెట్‌లో చూస్తుంటాం....బ్యాట్స్‌ మాన్‌ సిక్సర్‌ కొట్ట గానే ప్రేక్షకులంతా లేచి నిల బడి చప్పట్లు కొడతారు. అక్కడితో అది ఆగుతుందా! నెక్ట్స్‌ బాల్‌కి కూడా చప్పట్లు కొడుతూనే వుంటారు. అంటే ఆ బాల్‌ని కూడా సిక్సర్‌గా మలచమని.
అక్కడే ఆ ఆటగాడి సంయమనం తెలుస్తుంది. అది మంచి బాలయితే ఫర్వా లేదు. కానీ ఆ బాల్‌ సరిగా లేక పోయినా ప్రేక్షకు చప్పట్లతో ఒళ్ళు మరిచి దాన్ని కూడా లాగి పెట్టి కొట్టానుకుని వికెట్‌ సమర్పించుకో వచ్చు. అందుకే అవి తాత్కాలికంగా మర్చి పోవాలి’’ కీర్తన నవ్వి అంది.

‘‘యిదీ నిజమే!....మరీ ఆనందం ఎక్కువైనా కష్టమే! ఈసారి ఈ విషయం గుర్తు పెట్టుకుంటాం’’ ఫ్రెండ్స్‌ అన్నారు.

‘‘అయితే మనం ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడుతున్నట్లేనా?’’ కీర్తన అడిగింది.

అందరూ బొటన వేళ్ళు పైకెత్తారు.

కీర్తనలోవున్న గొప్ప దనం అదే! గేమ్‌కి సంబంధించి ఏ డెసిషన్‌ తీసుకున్నా అందరి సంపూర్ణాంగీకారం పొందాకే ఆ పని చేస్తుంది. దాంతో సమైక్యత వెల్లి విరిసి విజయం కరతలామకం అవుతుంది.

*****

భూపతి ఫార్మాస్యూటికల్స్‌ ఆఫీస్‌.

అశోక్‌ ఆఫీస్‌ వర్క్ తో బిజీగా వున్నాడు. కొత్తగా వచ్చిన రెండు ఆర్డర్స్‌ డెలివరీ డేట్‌ దగ్గర పడటంతో ఊపిరి సలపనంత పని. దానికి తోడు త్వరగా యింటికి వెళ్ళాలన్న ఆరాటం. దాంతో చాలా టెన్షన్‌గా వున్నాడు.

అతనికి నమ్మక మైన మనిషి ప్రకాష్‌. అతనూ బ్యాచిలరే! ఫార్మసీ చేసినా అటెండర్‌ పని దగ్గర నుంచి ఏ పని చెప్పినా చేస్తాడు. యిగో ఫీలింగ్‌ ఉండదతనికి. రేయింబవళ్ళూ ఈ కంపెనీ కోసమే కష్ట పడతాడు.

అతని మీద బాగా నమ్మకం కుదిరాక రాత్రి పూట పర్యవేక్షణంతా అతనికే అప్పగించేశాడు.

ఏ వ్యాపారస్థుడికయినా నమ్మకమైన మనిషి దొరకడం ఎంతో అదృష్టం.

నిజాయితీ, పట్టుదల, పని పట్ల అంకిత భావం....ఈ లక్షణాలు మూడూ ఒక ఉద్యోగిలో వుంటే ఆ ఉద్యోగిని నియమించుకున్న వాడు అదృష్టవంతుడు.

అశోక్‌ కి ప్రకాష్‌తో పరిచయం చాలా విచిత్రంగా జరిగింది.

నిరంతరం యింట్లో గొడవలు జరుగుతున్న సమయమది...ఈ ఫార్మాస్యూటికల్స్‌ని తన అండర్ లోకి తెచ్చుకోడానికి పిన్నితో హోరా హోరీ పోరాడుతున్నాడు. అప్పట్లో తన మనసు చాలా బాధగా వుండేది. ఆస్థి కోసం అనవసరంగా పాకులాడుతున్నానా....? అని అప్పుడప్పుడూ సందేహమొచ్చేది.పిన్నికి తాము సొంత పిల్లలు కాక పోయినా తమ అభివృద్ధి కోసం ఆమె పాటు పడక పోయినా కనీసం అడ్డు పడ కూడదు కదా? మరెందుకు ప్రతి విషయం లోనూ ఆమె కలగ జేసుకుంటుంది అని అనిపించేది.

కుటుంబ సభ్యుల మధ్య వుండాల్సిన సున్నితమైన బంధాలేమో తెగి పోతున్నట్లు అనిపించేది.

ఎవరి మీదో తెలియని కసి, క్రోధం.

అలాంటి పరిస్థితుల్లో ఓరోజు వీధుల్లో నడుస్తుండగా ఒక యింటి గుమ్మం నుంచి ఒకమ్మాయి దాదాపుగా పరిగెడుతున్నంత వేగంతో గాభరాగా అటు యిటూ చూసుకుంటూ వచ్చి..ఎదురుగా వున్న రాయిని చూసుకోకుండా నడిచి పడి పోయింది.

రాయి దెబ్బకి కాలి బొటన వేలి గోరు నలిగి రక్తం కారుతోంది.

అయ్యో! అనుకుంటూ లేపడానికి వెళ్ళాడు. ఆలోపే లేచి పరిగెత్తడానికి ప్రయత్నిస్తోంది.

అశోక్‌ చెయ్యి పట్టుకుని ఆపి....‘‘రక్తం కారుతోంది....కర్చీఫ్‌ కట్టుకోండి’’ యివ్వ బోయాడు.

అతని వైపు చూడటం లేదామె. వెనక గుమ్మం వైపే చూస్తూ ‘ఊహూ’ అంటూ విదిలించుకో బోయింది.

వదల లేదు అశోక్‌. ఆమె వంక పరిశీనగా చూశాడు. భుజానికి తగిలించుకున్న సంచి నిండా ఏవో సోప్స్‌ కనబడుతున్నాయి. మొహంలో ఒక విధమైన కంగారు.

ఈమె బహుశా సేల్స్‌ గళ్‌ కావచ్చు. ఎవరైనా మిస్‌ బిహేవ్‌ చేసి వుండొచ్చు. సేల్స్‌ గాళ్‌ అంటే అందరికీ లోకువే! అతని మనసు కాస్త మూలిగింది.

‘‘ఏమయింది?’’ ఆమెనే చూస్తూ అన్నాడు.

‘‘ఇక్కడొద్దు. కొంచెం ముందుకు పదండి చెబుతాను’’ పరుగెత్త బోయింది. ఆపాడు.

‘‘నేనుండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయ లేరు. చెప్పండి హుందాగా అన్నాడు.

ఆమె వెనక గుమ్మం వంకా అతని వంకా ఓసారి మార్చి మార్చి చూసింది. ఆ తర్వాత పోక చెక్క లాంటి నోరు విప్పి.

‘‘లోపల పెద్ద కుక్క వుంది‘‘ కళ్ళు పెద్దవి చేసి భయంగా అంది.

కాసేపు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఆ తర్వాత అశోక్‌ గల గలా నవ్వాడు. చాలా కాలానికి మనస్ఫూర్తిగా టెన్షన్స్‌ అన్నీ దూది పింజల్లా ఎగిరి పోయేలా నవ్వాడు.

‘‘ఎందుకూ....?’’ చిన్నబుచ్చుకుంటూ అందామె.

‘‘కుక్క వుందని భయ పడి వేలికి ఎంత దెబ్బ తగిలించుకున్నారో చూడండి. వుండండి కట్టు కడతాను’’ అని కర్చీఫ్‌ని చింపి కిందకి వంగాడు.

‘‘అయ్యయ్యో! వద్దండీ!....’’ మొహ మాట పడి పోయి వెనక్కి లాగుతూ అంది.

‘‘ఫర్లేదు రండి!’’ అంటూ రక్తాన్ని తుడిచి కట్టు కట్టాడు.

ఆ సమయంలో ఆమె పాదం మీద దృష్టి పడి అతనికి ఎంతో ఆశ్చర్యమనిపించింది. మందార పువ్వులా సుకుమారంగా వుంది పాదం. అసలు కష్టాల తాకిడే లేనట్లుంది. ‘యిలాంటి అమ్మాయి కాళ్ళరిగేలా తిరుగుతూ ఉద్యోగం ఎలా చేస్తుందో ఏమో!’ నిట్టూర్చాడు.

‘‘చాలా థాంక్సండీ!....’’ కృతజ్ఞతగా అంది.

‘‘ఫర్వా లేదు’’ ఆమెనే చూస్తూ అన్నాడు. ఎందుకో చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది.

మెరూన్‌ కలర్‌ కాటన్‌ చీర, అద్దినట్లున్న బ్లౌజ్‌, మెరూన్‌ కలర్‌ పెద్ద సైజు స్టిక్కర్‌, పసుపు రంగు శరీర ఛాయ, పెద్ద జడ, నల్లగా మెరుస్తున్న కళ్ళు, అచ్చం బాపూ బొమ్మలా వుంది.

‘‘వుంటానండి?’’ అంటూ చెప్పి ముందుకు కదిలింది. నడవ లేక కాలు పట్టి పట్టి వేస్తూ కనిపించింది.

‘‘హలో!.....’’ చిటికె వేసి పిలిచాడు.

తిరిగి చూసింది.

‘‘మీ పేరూ....?’’ అడిగాడు.

‘‘జాహ్నవి....’’ చెప్పింది.

‘‘ఒక్క నిముషం వుండండి. కారులో డ్రాప్‌ చేస్తాను‘‘ చెప్పాడు. చెప్పి ఆమె మాట కోసం ఆగకుండా దూరంగా షాప్‌ దగ్గర పార్క్‌ చేసిన కారుని తీసుకుని వచ్చాడు.

ఈ లోపు అక్కడే నిలబడింది ఆమె. ఆ కాసేపూ అతని కారులో వెళ్ళడం మంచిదా కాదా అని తర్కిస్తూ నిలబడింది.

ఆలోచనలు యింకా పూర్తి కాలేదు. అతను వచ్చేశాడు. ‘‘రండి’’ ఫ్రంట్‌ డోర్‌ తీస్తూ పిలిచాడు.

మౌనంగా వెళ్ళి కూర్చుంది.

‘‘నా పేరు అశోక్‌’’ చెప్పాడు.

(మిగతా వచ్చేవారం..........)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్