Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

 గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue211/598/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి )... కానీ అమ్మాయిలు మాత్రం తక్కువ తిన్నారా? కొత్తగా ఈ తరం వాళ్ళకి అబ్బిన అవాటులో భాగంగా అది కాదురా! ఇదిరా! ఏరా....అంటూ వాళ్ళ గాలి తీస్తున్నారు.

జనరల్‌గా ఆ కాలేజీలో అందరి కళ్ళూ ఈ క్లాస్‌ మీదే వుంటాయి. ఫైనల్‌ బి.కామ్‌. క్లాసంటే అబ్బాయిలందరికీ క్రేజ్‌.

ఎందుకంటే ఆంధ్రా వాలీ బాల్‌ టీమ్‌ ఆ క్లాస్‌లో వుంది. ఆ టీమ్‌లో ఉన్న పన్నెండు మందీ అందగత్తెలే! మంచి పర్సనాలిటీతో నిరంతర వ్యాయామం మూలంగా తీర్చి దిద్ద బడిన అంగ సౌష్టవంతో చూపరుల హృదయాలను కొల్లగొడుతుంటారు.ఇక సిటీలో ఎక్కడ వీళ్ళ మాచ్‌ జరిగినా ఈ కుర్రకారంతా వీళ్ళ తరపున హాజరై దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ప్రోత్సహిస్తుంటారు.

వాళ్ళంతా ఈ టీమ్‌కి వీరాభిమానులు. అయితే వారి ఆటని చూసి కాదు. వారి అందాన్ని చూసి..

కానీ ఆ విషయం పబ్లిగ్ గా ఎవరూ అడగరు. అడిగినా కుర్రాళ్ళు ఒప్పుకోరు.

కీర్తన క్లాస్‌ లోకి ఎంటర్‌ కాగానే చాలా మంది కుర్రాళ్ళ నోర్లు మూత పడ్డాయి. ఓ సాహసి మాత్రం నోరు వూరుకోక ‘ఎవరండీ ఈ పిల్ల సుందరి అన్నాడు.

అంతే! అందరూ గొల్లున నవ్వారు. అతని వంక కోపంగా ఓ చూపు విసిరి తన ప్లేస్‌లో కూర్చుంది కీర్తన.

కీర్తన చుట్టూ చేరారు ఫ్రెండ్స్‌.

‘‘ఇక నుంచీ కీర్తనకి ఆ డైలాగ్‌ మీద పేటెంట్‌ని రద్దు చేస్తున్నా ఒకమ్మాయి అంది.

‘‘ఏం?’’ ఇంకో అమ్మాయి ఏం ఎరగనట్లు అమాయకంగా అంది.

ఉదయం అంత మంచి సీన్‌ చూసి కూడా అలా అడగడం అన్యాయం.’’

‘‘ఏం సీన్‌? ఓ! ఒక అందమైన రాకుమారుడు మన కీర్తన చెయ్యి పట్టుకుని పదిలంగా తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిన వృత్తాంతమా?’’ తమాషాగా తలాడిస్తూ అంది.

అప్పటి వరకూ వాళ్ళేం మాట్లాడుతున్నారో అర్ధమై చావక టెన్షన్‌ అంపైర్‌లా సారీ వాలీ బాల్‌ అంపైర్‌లా తల అటూ..ఇటూ  తిప్పి చూసిన కీర్తనకి అప్పటికి లైటు వెలిగింది.

ఆ రాకుమారుడు ఆకాష్‌ అని.

ఉదయం అతను తనేడుస్తుంటే కారులో తీసుకు వెళ్ళాడనీను.

చిన్న విషయాన్ని పెద్దది చేయడంలో వీళ్ళు అఖండులు. ఇప్పుడు తను సీరియస్‌గా అయితే మరింత ఏడిపించడం ఖాయం.
అందుకే సావధానంగా వీళ్ళకి అన్ని విషయాలూ చెప్పాలి.

‘‘అసలు ఆ అబ్బాయి ఎవరో నాకు సరిగ్గా తెలీదు తెలుసా?’’ కళ్ళు పెద్దవి చేసి అంది.

‘‘కోయ్‌?’’ వెనక నుంచి ఎవరో అరిచి దాక్కున్నారు. బుస్సున కోపం వచ్చింది కానీ అణుచుకుంది. అవసరం తనది.  ఇప్పుడు వీళ్ళకి అర్ధమయ్యేలా చెప్ప లేదంటే ఇక కాలీజీ గ్రౌండ్‌లో ఏడిపిస్తూ వుంటారు.

‘‘అతను నా బాయ్ ఫ్రెండ్‌ కాదూ....’ నిజాయితీగా మొహం పెట్టి అంది.

‘‘ఆ... మరీ!’’ సాగ దీశారు అమ్మాయిలు.

‘‘అతను....అతను నా అభిమాని’’ సగర్వంగా అంది.

అమ్మాయిల కళ్ళు మూత పడ లేదు. అలాగే చూస్తున్నారు. వెనకాల బెంచీ మీద తట్టుకో లేక ఎవరో ఇద్దరు ముగ్గురు విరగ దీసుకుని పడ్డ శబ్దం వినిపించింది. వాళ్ళ మీద నీళ్ళు జల్లి లేపాలన్న ధ్యాస కూడా లేకుండా వున్నారందరూ! ఎందుకంటే వాళ్ళ పొజిషన్‌ అలాగే వుంది.
వాళ్ళెవరి పరిస్థితి పట్టించుకో లేదు కీర్తన.

‘‘నా ఆటంటే అతనికి ప్రాణం. నేను ఆడుతున్నానని తెలిస్తే ఏ వూరయినా వచ్చేసే వాడు’’ అంది. కళ్ళు టప టపా ఆర్పుతూ వింటున్నారు అమ్మాయిలు. అబ్బాయిలు కూడా నోరావళించి వింటున్నారు.

‘‘మీకో విషయం తెలుసా? నా గేమ్‌ కోసం అతను ఒక సారి తన పరీక్ష కూడా వదులుకున్నాడు’’ అంది.

‘‘అబ్బ ఎంత బాగా పడగొట్టాడురా! ఈ ఐడియా నాకు ముందుగా ఎందుకు రాలేదురా!’’ ఒకబ్బాయి గుండెలు బాదుకుంటూ అన్నాడు.
అందరూ నాగ స్వరం విన్న నాగుబాముల్లా తన వంకే చూడటం గమనించి గర్వంతో ఉప్పొంగి పోయింది.

‘‘అలాంటి మనిషిని పట్టుకుని బాయ్‌ ఫ్రెండ్‌ అదీ ఇదని అనకండి చిరాగ్గా. అతనికి తెలిస్తే ఫీలవుతాడు. ఓ.కె.నా....?’’ అంది.
వేగంగా బుర్రలు తిప్పేశారు.

వాళ్ళలా అయోమయంలో వుండగా, మరో పన్నెండు మంది అమ్మాయిలు దూసుకు వచ్చారు. అందులో మరాఠీ అమ్మాయిు కొందరున్నారు. యిద్దరు ముగ్గురు తెలుగమ్మాయిల్లా వున్నారు.

వాళ్ళంతా మహా రాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాలీ బాల్‌ టీమ్‌. ఈ కాలేజీ లోనే బి.సి.సి.యన్‌. కోర్స్‌ చేస్తున్నారు. మహా రాష్ట్ర జట్టుకి కెప్టెన్‌ నాగ మణి బిందు. ఆ అమ్మాయి తెలుగమ్మాయే!

కానీ ఆ అమ్మాయి పుట్టక ముందు నుంచీ వాళ్ళ ఫ్యామిలీ ముంబైలో సెటిల్‌ అయి పోవడంతో తనకి ఆ ఏరియా మీదే మమ కారం ఎక్కువ.
అందుకే ఆంధ్ర జట్టులో చోటు దొరికినా ఆమె రిజెక్ట్‌ చేసి, మహా రాష్ట్ర జట్టు లోనే వుండి పోయింది.

ఇక్కడ ఆమె చుట్టాలు చాలా మంది వుండటంతో వాలీ బాల్‌ ప్రాక్టీస్‌కి మంచి సదుపాయాలు వుండటం మొదలైన కారణాల చేత వాళ్ళు ఈ కాలేజీలో చేరారు.

జాతీయ క్రీడకి ఆంధ్రాజట్టు, మహారాష్ట్ర జట్టు, పంజాబ్‌ జట్టునే ఫేవరేట్స్‌గా పరిగణిస్తున్నారు.  అందులో మొదటి రెండు జట్లూ ఒకే కాలేజీలో చదువుతుండటం విశేషం.

ఆంధ్రా జట్టులో అమ్మాయిు ఎంత అల్లరి చేసినా మిగతా విషయాల్లో స్ట్రిక్ట్‌గా వుంటారు. విజయం కోసం ఎప్పుడూ స్ట్రెయిట్‌ వే తో ప్రయత్నిస్తారు.

కానీ మహారాష్ట్ర జట్టు వాళ్ళు ఎప్పుడూ ఫెయిర్‌ గేమ్‌ ఆడరు. విజయం ఏ దోవలో వచ్చినా వాళ్ళకిష్టమే. అది రూల్స్‌కి విరుద్ధంగా లేకుండా వుంటే చాలు.

మిగతా విషయాలేమీ వాళ్ళు లెక్క చేయరు. క్రీడా స్ఫూర్తి వారిలో చాలా తక్కువ. విజయం కోసం ప్రత్యర్థి జట్టు లోని వ్యక్తిగత బహీనతని తెలుసుకుని వాటి మీద దెబ్బ తీయటం ద్వారా ఆటలో వాళ్ళు కంట్రోల్‌ తప్పేలా చేయటం పరిపాటి.

ఉదాహరణకి ప్రత్యర్థి జట్టు లోని ఒకమ్మాయి తాలూకు బాయ్‌ ఫ్రెండ్‌ గురించి నెగెటివ్‌గా ఇండైరెక్ట్‌గా మాట్లాడటం ద్వారా ఆ అమ్మాయి లోని మానసిక ప్రశాంతతని దెబ్బ తీస్తారు. దాంతో ఆ అమ్మాయికి ఆట మీద ఏకాగ్రత వుండదు.

ఇదంతా నాగమణిబిందు శిక్షణ. ఇరవై ఏళ్ళ ఆ అమ్మాయికి ఎదుటి వారి సైకాలజీని యిట్టే పట్టేయటం సహజంగా అబ్బిన గుణం.
ఆమె తన గేమ్‌ గురించే కాక ప్రపంచం లోని చాలా విషయాల గురించి అనర్గళంగా చర్చించ గలదు. చదువులో కూడా ఎప్పుడూ క్లాస్‌ ఫస్టే.
తీరిక సమయాల్లో ఫ్యాషన్‌ షోలో పాల్గొనడం ఆమె హాబీ.

ఒక మాటలో చెప్పాలంటే యువకుల కలల సుందరి ఆమె. కానీ సామాన్యమయిన యువకులెవరూ ఆమెతో మాట్లాడటానికి సాహసించరు.
ఎందుకంటే ఆమెకి వున్న అన్ని ప్రత్యేకమైన అర్హత ముందు తాము తూగలేమోనని వారి అభిప్రాయం.

కానీ ఆమె షోకేస్‌లో బొమ్మ లాంటిది. అంతే!

అలాంటి మణి బిందు కి ఇప్పుడు ఆంధ్రా జట్టు అంటే కాస్త భయం పట్టుకుంది.ఈ మధ్య వాళ్ళ ఆట తీరు చూస్తుంటే నేషనల్‌ గేమ్స్‌ హోదా
నిజమయ్యే ట్లుంది.ఆమెకి ఎప్పుడూ తమ ఆట మీద, తమ మానసిక దృఢత్వం మీద తగని నమ్మకం. వాళ్ళు అమ్మాయిలయినా, చిన్న వయసు వారైనా, ఎలాంటి సెంటిమెంట్ ల కీ తావివ్వరు. ఎవరైనా అబ్బాయి నచ్చితే సినిమాలు, షికార్లు అంతే! తప్ప, వాడు వదిలేస్తాడేమో, పెళ్ళి చేసుకోడేమో అన్న భయం వారికుండదు. ఇంకాస్త ముందుకెళితే అమ్మాయిలే తమని వదిలేస్తారేమోనని వాళ్ళ బాయ్‌ఫ్రెండ్స్‌ భయపడతారు.

జీవితాన్ని ఛాలెంజ్‌ గానూ, ఈజీ గానూ తీసుకునే మనస్తత్వం వారిది. అయితే ఆరు నెలల్లో రాబోయే నేషనల్‌ గేమ్స్‌ వారికి ప్రెస్టేజ్‌ క్వశ్చన్‌. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి. ఇదే సంకల్పం అన్ని జట్లకీ వుండొచ్చు. కానీ ఆంధ్రాజట్టు కెప్టెన్‌ కీర్తనకి మాత్రం ఆ సంకల్పం కోసం ప్రాణాలైనా యిచ్చే తెగువ ఉంది.

కీర్తనంటేనే మణిబిందుకి చులకన భావం. ఏదో గిరిజన గ్రామం నుంచి పొరపాటున ఈ సిటీలోకి వచ్చినట్లు వుంటుందని ఆమె భావం.
మనిషి అందంగా వుంటే సరా...?

ఆ అందానికి తగిన ఆకర్షణ, మాటలో, నడకలో, వేష ధారణలో ఉండాలి. ఏమిటో పల్లెటూరి గబ్బిలాయిలా వుంటుంది.

మిగతా ప్రపంచాన్నంతా వదిలేసి ఆట మీదే దృష్టి పెడితే నేషనల్‌ గేమ్స్‌లో ఏంటి? ఇంటర్నేషనల్‌ గేమ్స్‌లో కూడా గెలవొచ్చునని ఆమె అభిప్రాయం.

ఒక్క వాలీ బాల్‌లో తప్ప ఆమె తనతో ఎందు లోనూ సరి తూగదని నాగ మణి బిందు అహంకారం. ఆ విషయాన్ని ఇండైరెక్ట్‌గా పది సార్లు కీర్తన ముందు, ఆమె ఫ్రెండ్స్‌ ముందు అనేది.

అందరికీ అర్ధమై కోపంతో ఉడికి పోయే వారు. కీర్తన మాత్రం ఓ నవ్వు నవ్వి వూరుకుంటుంది. అది చూసి ఒంటికి కారం పూసినట్లు ఫీల్‌ అయ్యేది. బుద్ధ విగ్రహం ఓ పట్టానా కదలదు. గొణుక్కునేది.

అలాంటి నాగ మణి బిందు హడావిడిగా తమని వెతుక్కుంటూ క్లాస్‌కి వచ్చే సరికి ఏదో విశేషమే వుందనుకున్నారందరూ.

‘‘ఏం చేస్తున్నారు?’’ అందరినీ ఉద్దేశించి అడిగింది.

‘‘తొక్కుడు బిళ్ళ ఆడదామనీ....’’ వెనకాల నుంచి ఎవరో అబ్బాయి అరిచాడు.

చివ్వున తల తిప్పి చూసింది నాగమణిబిందు. అందరి మొహాలూ అమాయకంగా వున్నాయి. ఎవరన్నారో తెలీదు. ఐదూ ఆరు ఎత్తుకి తక్కువ లేని మంచి పర్సనాల్టీలుగ పన్నెండు మంది వేరే క్లాస్‌ అమ్మాయిు తల తిప్పి చూస్తుంటే, గట్టిగా ఏమనడానికీ భయం వేసింది అబ్బాయికి.

‘‘మేనర్‌ లెస్‌ బ్రూట్స్‌....! గొణిగింది నాగ మణి బిందు.

‘‘మరే....! అచ్చం మీలాగా’’ వూరుకోక మరో అబ్బాయి అంటించాడు.

‘‘గైస్‌...కామెంట్స్‌ వద్దు’’ క్లాస్‌లో ఎవరో అన్నారు. ఆ తర్వాత అందరూ కామై పోయారు.

( మిగతా వచ్చేవారం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu aame oka rahasyam