Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

కేశవ చిత్రసమీక్ష

kesava movie review

చిత్రం: కేశవ 
తారాగణం: నిఖిల్‌ సిద్దార్ధ, రీతూ వర్మ, ఇషా కొప్పికర్‌, ప్రియదర్శి తదితరులు 
సంగీతం: సన్నీ ఎంఆర్‌ 
సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని 
దర్శకత్వం: సుధీర్‌ వర్మ 
నిర్మాత: దివాకర్‌ మణి 
నిర్మాణం: అభిషేక్‌ పిక్చర్స్‌ 
విడుదల తేదీ: 19 మే 2017

క్లుప్తంగా చెప్పాలంటే 
న్యాయ విద్య అభ్యసిస్తోన్న పి.కేశవవర్మ (నిఖిల్‌) గుండె జబ్బుతో బాధపడుతుంటాడు. అందరికీ ఎడమవైపున గుండె ఉంటే, కేశవకి మాత్రం కుడివైపున ఉంటుంది. ఆవేశపడినా, అలసిపోయినా గుండె ఆగిపోతుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కేశవ, వరుసగా పోలీసు అధికారుల్ని హత్య చేసేస్తుంటాడు. ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరక్కుండా హత్య చేయడంలో కేశవ దిట్ట. అతను చదువుతున్న కాలేజీలోనే కేశవ చిన్ననాటి స్నేహితురాలు సత్యభామ (రీతూవర్మ) చదువుతుంటుంది. కేశవని గుర్తుపట్టి, అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉండగా వరుస హత్యల మిస్టరీని ఛేదించేందుకు స్పెషల్‌ ఆఫీసర్‌గా వస్తుంది షర్మిలా మిశ్రా (ఇషా కొప్పికర్‌). ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించిన షర్మిల, ఓ సందర్భంలో కేశవను అరెస్ట్‌ చేస్తుంది. ఇంతకీ కేశవ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? కేశవ హత్యల పరంపరకు బ్రేక్‌ పడిందా? లేదా? అన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే 
స్టైలిష్‌ అప్రోచ్‌ ఉన్న యూత్‌ ఫుల్‌ ఫిలింస్‌ని ఎంచుకుంటున్నాడు నిఖిల్‌. విభిన్న పాత్రలను ఎంచుకోవడం ద్వారా యంగ్‌ హీరోల్లో స్పెషల్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న ఈ యువ హీరో సినిమా సినిమాకీ తనలోని మెచ్యూరిటీ లెవల్స్‌ పెంచుకుంటూ వెళుతున్నాడు. కేశవ పాత్రలో అద్భుతమైన నటనను పండించాడు నిఖిల్‌. స్టబర్న్‌ క్యారెక్టర్‌లో నిఖిల్‌ ఒదిగిపోయిన తీరుకి క్లాప్స్‌ పడతాయి. విమర్శకుల ప్రశంసలు అందుకునే నటనా ప్రతిభతో నిఖిల్‌ ఆకట్టుకున్నాడు.

హీరోయిన్‌ రీతూ వర్మ అందంగా ఉండటమే కాదు, అభినయంతోనూ అలరిస్తుంది. తెలుగు తెరకు ఓ మంచి హీరోయిన్‌ దొరికిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. 'పెళ్ళిచూపులు' తర్వాత ఈ 'కేశవ' ఆమెకు మంచి మైలేజ్‌ ఇస్తుంది హీరోయిన్‌గా. 'చంద్రలేఖ' సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్‌గా మెరిసిన బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌, ఇందులో పోలీస్‌ అధికారిగా నటించి, మెప్పించింది. ఆమె క్యారెక్టర్‌ని స్టైలిష్‌గా డిజైన్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా బాగానే చేశారు.

కథ, కథనం పరంగా దర్శకుడు కొత్తదనం చూపేందుకు ప్రయత్నించిన తీరు అభినందనీయం. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా సినిమాటోగ్రఫీ గురించే చెప్పుకోవాలి. మంచి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బాగా హెల్ప్‌ అయ్యింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం బాగున్నాయి. పాటలు వినడానికే కాదు, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. సెకెండాఫ్‌లో ఒకటి రెండు చోట్ల ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. ఓవరాల్‌గా గుడ్‌. ఓ చిన్న సినిమాకి అవసరమైన స్థాయిలో ఖర్చు చేయడం అభినందనీయం. సినిమా రిచ్‌గా తెరకెక్కింది.

ఫస్టాఫ్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. హత్యలు జరుగుతున్న తీరు, కాలేజీ క్యాంపస్‌, డిఫరెంట్‌ మూడ్‌లో సాగే సినిమా - ఇవన్నీ ఇంటర్వెల్‌ వరకు ఆడియన్స్‌ని సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. సెకెండాఫ్‌లోనే కొంచెం వేగం తగ్గినట్లు అన్పించినా, మళ్ళీ వేగం పుంజుకుని, క్లయిమాక్స్‌కి వచ్చేసరికి ఇంట్రెస్టింగ్‌ మూడ్‌లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తాయి. ఫైనల్‌గా సినిమా మంచి అనుభూతిని మిగుల్చుతుంది. లిమిటెడ్‌ బడ్జెట్‌లో క్వాలిటీ తీసుకురావడం, మంచి పబ్లిసిటీ, వీటన్నిటికీ తోడుగా తక్కువగా ఉన్న నిడివి ఇవన్నీ సినిమాకి బాగా కలిసొస్తాయి. ఓవరాల్‌గా థ్రిల్లర్‌ మూవీస్‌ని ఇష్టపడేవారినే కాకుండా, అందర్నీ బాగానే ఆకట్టుకునే అవకాశాలున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే 
థ్రిల్లింగ్‌ కేశవ క్వయిట్‌ ఇంట్రెస్టింగ్‌

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka