Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు...ఆమె...ఒక రహస్యం

atadu .. aame..oka rahasyam

గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue218/613/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

( గతసంచిక తరువాయి ).. “ఆపండి!!”  అంటూ గట్టిగా అరిచింది ఇంద్రనీల అతడి మాటలకి. ఆవేశంతో ఆమె గుండెలు ఎగసెగసి పడుతున్నాయి.   పాణి ఆశ్చర్యంగా చూసాడు ఆమె వంక.

ఆమె కళ్ళలోకి సూటిగా చూసిన అతడు షాక్ తిన్నట్టుగా ఆగిపోయాడు ఒక్క క్షణం.  కేసు తొందరగా తెమలడం లేదన్న  చికాకులో తను గమనించలేదు కానీ,  తనకి తెలిసిన ఐ రీడింగ్ తో అనలైజ్ చేసి చూస్తే, అప్పటి దాకా తను చేసిన అభియోగాలన్నీ విన్న తరువాత ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భావాలు అవమానం... కోపం... అంతే తప్ప భయం కా...దు...!

నిజంగా ఆమెకి ఈ నేరంతో సంబంధముండి ఉంటే తన మాటలకి ఆమె కళ్ళల్లో  భయం కనిపించాలి ! అంతే కానీ తను చెప్పిన విషయాలు విన్నాక ఆమెకి  కోపం వస్తోందంటే,  అవమానంగా ఫీలవుతోందంటే...  ఆమెకి నిజంగా  ఈ నేరంతో  సంబంధం లేదా?  తనకి తెలిసిన ఐ రీడింగ్ ఎప్పుడూ తనకి అబద్దం చెప్పలేదు.

ఆ  చిన్న ఆలోచనే అతడికి మంచి కాఫీ త్రాగినంత శక్తినిచ్చింది. తెల్లవారు ఝామున ఆ సూసైడ్ నోట్లోని మేటర్ తెలుసుకున్న దగ్గర నుంచీ అనుభవించిన ఏదో తెలియని బాధ...

మొదటి నుంచీ అతడికి ఈ కేసులో ఇంద్రనీల నేరస్తురాలు కాకపోతే బాగుండునని అనిపిస్తోంది.  కానీ సూసైడ్ నోట్లో  ఎప్పుడైతే బంగారు లక్ష్మి  పేరు కనిపించిందో,  అప్పుడే ఈ కేసులో ఆమెకి కచ్చితంగా సంబంధం ఉందన్న విషయం నిర్దారణ అయిపోయింది.

ఇప్పుడు కొత్తగా ఈ ఆశ.... అంత అందమైన అమ్మాయి... రెండు రోజులుగా తనతో ‘క్లోజ్’ గా ఉంటూ తనని కవ్వించిన అమ్మాయి... కళ్ళతోనే కవిత్వం చెప్పగల సమర్ధురాలైన ఈ అమ్మాయి  ఈ కేసులో నేరస్థురాలు కాకపోతే అంతకన్నా సంతోషకరమైన విషయం  ఈ ప్రయాణంలో తనకి మరొకటుండదనిపించింది.

ఆమె ఏం చెబుతుందోనని ఆసక్తిగా ఆమె వంక  చూసాడు.

“మీరు నమ్మండి నమ్మక పోండి. ఒక్క విషయం మాత్రం నిజం.  బంగారు లక్ష్మి నా స్నేహితురాలన్న ఒక్క విషయం తప్ప ఈ హత్యతో నాకెటువంటి సంబంధమూ లేదు.  అసలు... అసలు... బంగారు లక్ష్మి పేరు రాజేంద్ర సూసైడ్ నోట్లో ఎందుకు రాసాడో  నాకే అర్ధం కావడం లేదు. నాకు తెలిసి  రాజేంద్ర బంగారు లక్ష్మికి ఎలాంటి  వజ్రాలనీ ఇవ్వలేదు. అస్సలు బంగారు లక్ష్మి రాజేంద్రని ఎన్నడూ చూడలేదు. మాట్లాడలేదు.  అతడు ఆమెకి వజ్రాలని ఇవ్వడమేమిటీ? నాకంతా గందరగోళంలా ఉంది”

ఆమె మళ్ళీ కొత్త కథ ఏమైనా మొదలు పెట్టిందా అని అనుమానంగా ఆమె కళ్ళలోకి చూసాడు పాణి.  ఆమె కళ్ళకి అందంతో పాటూ అద్భుతంగా నటించగల శక్తి కూడా ఉందేమో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం ఆమెని చూస్తుంటే ఆమె నిజమే చెబుతోందనిపించింది.

“ఈ విషయంలో మనకి క్లారిటీ రావాలంటే ముందు మనం బంగారు లక్ష్మి తో మాట్లాడాలి”

“నిజమే. బంగారు లక్ష్మితో మాట్లాడితే అసలు విషయం తెలుస్తుంది” అని, సడెన్‍గా ఆమె ఫోన్ ముందు రోజు నుంచీ తనకి దొరకకపోవడం గుర్తొచ్చి   “ఓహ్ గాడ్. బంగారు లక్ష్మి ఫోన్ మొన్న రాత్రి నుంచీ నాకు దొరకడం లేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అని వస్తోంది. ఏమైందో ఏమిటో”

పాణి ఆమె వంక అనుమానంగా చూసాడు “అయితే, బంగారు లక్ష్మి ఆ వజ్రాలని తీసుకుని ఎక్కడికైనా పారిపోయిందా?”

“ఏమిటి మీ ఉద్దేశం? మొదటేమో మా రత్నమాల రాజేంద్రని చంపి వజ్రాలు ఎత్తుకు పోయిందన్నారు.  తరువాత నేను సూసైడ్ నోట్‍ని ఆల్టర్ చేసి వజ్రాలని దోచేసానన్నారు. ఇప్పుడు బంగారు లక్ష్మి వజ్రాలని ఎత్తుకుపోయిందంటున్నారు. మా స్నేహుతురాళ్ళందరమూ వజ్రాల దొంగల్లా కనిపిస్తున్నామా మీ కళ్ళకి?  నేనేదో నా బాధ చెప్పుకుందామని మీ దగ్గరకి వస్తే  వచ్చిన దగ్గర నుంచీ లేని పోని అబాంఢాలు వేస్తున్నారు?”  ఆమె గుండెలు ఆవేశంతో మళ్ళీ ఎగసెగసి పడ్డాయి.

ఆమెని అలా చూస్తుంటే నవ్వొచ్చింది పాణికి.  ఆరు గంటల టెన్షన్ తరువాత మొదటి సారిగా నవ్వాడు. నిజంగానే ఈ నేరంతో ఏ సంబన్ధమూ లేకపోతే తన ప్రశ్నలు ఆమెని ఎంతగా ఇరిటేట్ చేస్తాయో అతడు ఊహించగలడు. 

“అసలు వచ్చిన దగ్గర నుంచీ వజ్రాలు వజ్రాలు అంటున్నారు. నాకు తెలియక అడుగుతాను ఏమిటీ వజ్రాల గొడవ?”

“మీకు వజ్రాల సంగతి నిజంగా తెలియక పోతే చెబుతాను వినండి...” అంటూ పాణి సిర్నాపల్లి సంస్థానంలో రెడ్  డైమండ్స్ దొరికిన సంగతి,  రాజేంద్ర తనకి మెయిల్ రాసిన సంగతి, ఆ తరువాత రాజేంద్ర మరణం, సూరత్ మార్కెట్లో  ఎవరో రెడ్ డైమండ్స్  బేరానికి పెట్టడం,  తనని అక్కడికి రప్పించిన అసలు కారణం ఆమెకి చెప్పి అన్నాడు.

“ఈ కేసు మొదలవడం అసలు రాజేంద్రది హత్యా ఆత్మహత్యా అన్న మీమాంసతో మొదలైంది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకి ప్రయత్నించిన  రాజేంద్ర  శరీరం మీద కత్తి గాట్లు ఉండడం, సూసైడ్ నోట్ ఆల్టర్ చేసి ఉండడం రాజేంద్రది హత్యా, ఆత్మహత్యా అన్న అనుమానాన్ని మనకి కలిగించాయి.

అంతే కాదు,  బంగళాలోని కంప్యూటర్ లోని బ్రవుజింగ్ హిస్టరీ వల్ల, రాజేంద్ర నాకు రాసిన మెయిల్ వల్లా  రాజేంద్రని హత్య  చెయ్యడానికి ఎవరో ప్రయత్నించారన్న  విషయం కూడా అర్ధమౌతోంది.  రాజేంద్రని హత్య చెయ్యడానికి ప్రయత్నించిన వాళ్ళే వజ్రాలని కాజేయడానికి అవకాశం ఉంది  కనుక,  దాని వెనక ఉన్నది ఎవరో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రాజేంద్రది హత్యే అయితే, హత్య చెయ్యబడిన వాడు సూసైడ్ నోట్ ఎందుకు రాయాల్సి వచ్చింది?  మళ్ళీ రాసిన ఆ సూసైడ్ నోట్ ని ఎవరు ఆల్టర్ చేసారు? ఇవన్నీ గందరగోళాన్ని పెంచుతున్న ప్రశ్నలు.

ఇక పోతే వజ్రాల నగలు...  రెండొందల గ్రామాల అభివృద్దికి  వెచ్చించాలని రాజేంద్ర అనుకున్న కోట్ల విలువ చేసే ఆ వజ్రాల నగలు ఎక్కడ ఉన్నాయి?  అన్నది మరో ప్రశ్న.

ఏది ఏమైనా, వజ్రాల నగలని మీ స్నేహితురాలు బంగారు లక్ష్మికి ఇచ్చినట్టుగా రాజేంద్ర స్వహస్తాలతో రాయడాన్నీ,  రాసిన ఆ వాక్యాలని ఎవరో బలవంతంగా ఎరేజ్ చెయ్యడాన్నీ బట్టి చూస్తే, బంగారు లక్ష్మికి ఈ కేసుతో కచ్చితంగా సంబంధం ఉందన్న విషయం నిర్ధారణ అవుతోంది.  ఇప్పుడు మనం చేయాల్సినది బంగారు లక్ష్మిని పట్టుకోవడం.  ఆమెని పట్టుకుంటే, ఆమెతో పాటూ ఇందులో  ఇంకెవరి హస్తం ఉందో కూడా తెలుస్తుంది” ‘ఇంకెవరి హస్తం ఉందో’ అంటున్నప్పుడు క్రీగంట ఆమెని చూస్తూ ఆమె రియాక్షన్ని గమనించాడు పాణి.

“నేను చెప్పినది మీరు నమ్మకపోతే, ఇప్పుడే మిమ్మల్ని హైదరాబాద్‍లో ఉన్న బంగారు లక్ష్మి ఇంటికి తీసుకు వెడతాను. ఆమెతో మాట్లాడుదురుగాని”  ఆవేశంగా అంది ఇంద్రనీల.

“ఆ పని మా వాళ్ళు ఎప్పుడో చేసారు”  కూల్ గా అన్నాడు పాణి.

“అంటే?”

“సూసైడ్ నోట్ లో బంగారు లక్ష్మి  పేరు  చూడగానే,  ఎక్సైజు డిపార్టుమెంట్ లో ఉన్న మా స్నేహితుడి ద్వారా  హైదరాబాద్‍లో ఆమె ఇల్లు ఎక్కడో ఎంక్వయిరీ చేసి, తెల్లవారు ఝామునే మా మనుషులని ఆమె ఇంటికి పంపించాను”

ఆమె విస్తుపోతూ చూసింది అతడి వంక.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham