Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 23rd june to 29th june

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ ( తీర్థ యాత్రలు ) - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

బదరీనాధ్

జోషిమఠ్ లో వున్న సిక్కు మతస్థుల గురుద్వారా గురించి చెప్పుకున్నాం కదా ? జోషిమఠ్ కి 18 కిలోమీటర్ల దూరంలో వున్న గోవింద ఘాట్ వరకు బైకుల మీద , రకరకాల నాలుగు చక్రాల వాహనాలమీద వచ్చే సిక్కులు యిక్కడ నుంచి కాలినడకన సుమారు 23 కిలో మీటర్లు కొండలు యెక్కి హేమకుంఢ్ సాహెబ్ చేరుకుంటారు . ఈ యాత్ర కూడా కష్టతరమైనదే , ఈ యాత్ర తో పాటు ' వేలీ ఆఫ్ ప్లవర్స్ ' యాత్ర కూడా చేసుకుంటూవుంటారు పర్యాటకలు . వేలీ ఆఫ్ ఫ్లవర్స్ యాత్ర ని వివిధ టూర్ ఆర్గనైజర్స్ నిర్వహిస్తూ వుంటారు . ఆసక్తి వున్నవారు తమకు నచ్చిన టూర్ ఆపరేటర్ల ద్వారాగాని , తమంతటతామే గాని యీ యాత్ర చేసుకోవచ్చు .

ఈ యాత్ర వివరాలు మరొకసారి చెప్పుకుందాం . ఆ వివరాలు మరో పత్రికలో పరిశీలనలో వున్నాయి .

పాండుకేశ్వర్ నుంచి సుమారు 25 కిలో మీటర్ల ప్రయాణానంతరం బదరీ చేరుతాం . ప్రయాణించే దూరం 25 కిలోమీటర్లే అయినా సమయం రెండు రెండున్నర గంటలు పడుతుంది .

ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని చమొలీ జిల్లాలో అలకనంద నదీ తీరాన వున్న అలకనంద లోయలో వుంది బదరీనాధ్ . ఉత్తరాఖంఢ్ లోని చార్ధామ్ లలో ఒకటిగా లెక్కింప బడుతూ హిందువులకు పరమ పవిత్ర స్థలం గా విరాజిల్లు తోంది బదరీనాధ్ .

ఇప్పటికి సుమారు ఓ 25, 26 మార్లైనా వెళ్లి వుంటాను కానీ ప్రతీ మారు బదరీ నగర శివార్లలోకి ప్రవేశించగానే నా వొళ్లు యేదో గగుర్పాటుకు లోనవుతుంది . నా కెంతో యిష్టమైన ప్రదేశం యిది .

ఇక్కడవున్న అన్ని మఠాలలోనూ బసచేసేం . పెద్ద హోటల్స్ లోనూ వున్నాం . నాకు నచ్చిన హోటల్ ఘరెవాల్ వికాశ్ మండల్ వారి గష్ట్ హౌసు కోవెలకు చాలా దగ్గరగా వుంటుంది . కారు పార్కింగ్ సదుపాయం వుంది . మఠాలైతే అగర్వాల్ చౌల్ట్రీ బావుంటుంది . మిగతావన్నీ అంతంత మాత్రంగా వుంటాయి . మిగతా అన్ని మఠాలు కూడా రూము రెండు తీసుకుంటాయి . సదుపాయాలు బాగుండవు .

సాధారణంగా యాత్రీకులు యిక్కడ పిండప్రదానాలు చేసుకుంటారు కాబట్టి పొద్దుటే స్నానాలు నారదకుండం లో చేసుకొని తర్వాత బ్రహ్మకపాలం చేరుకుంటారు . ముందుగా బ్రాహ్మణులతో మనకి యేపధ్దతిలో కావాలో చర్చించుకొని దక్షిణ వివరాలు కూడా మాట్లాడుతుంటే మంచిది .

ముందుగా మనం యిక్కడ దర్శనీయ స్థలాలను గురించి మాట్లాడుకుందాం .

ఇంతకుపూర్వం ముందు యీ వ్యాసంలో చెప్పినట్లు పంచ ప్రయాగలు చూసేం , పంచబదరి క్షేత్రాలను దర్శించుకున్నాం , పంచకేదారలలో ఒకటైన కల్పేశ్ మహదేవ్ ని దర్శించుకున్నాం . బదరీనాధ్ లో పంచ శిలలను , పంచ ధారలను దర్శించుకుందాం .

ముందుగా బదరీనాధ్ ' విశాలబదరి ' అని యెందుకు పిలువబడుతోందో తెలుసుకుందాం . కృత యుగంలో నారాయణుడు నామం ఉఛ్చరించినంత మత్రాన్నే ప్రత్యక్షమై దర్శనమిచ్చే వాడట . త్రేతా యుగంలో పూజలు నిర్వహిస్తే దర్శనమిచ్చేవాడట , ద్వాపరయుగంలో కఠినమైన తపస్సులు చేసినవారికి మాత్రమే దర్శనం యిచ్చేవాడట , కలియుగంలో మానవకల్యాణార్ధం విగ్రహ రూపంలో వుండి పూజలందుకుంటానని  శలవివ్వగా విశ్వకర్మ యీ మందిర నిర్మాణం కావించి విగ్రహ ప్రతిష్ట చేసేడు . కలియుగంలో బౌద్ధమతం ప్రాచుర్యం లో వున్నప్పుడు యీ విగ్రహాలను నారదకుండంలో నిమజ్జనం చేసి బౌద్దులు బుద్దవిగ్రహ ప్రతిష్ట చేసుకున్నారు . అధ్వైత గురువు ఆదిశంకరులు నారద కుండం నుంచి విగ్రహాలను వెలికితీసి పునః ప్రతిష్ట చేసేరు . ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ' విశాలుడి పూజలకు మెచ్చిన నారాయణుడు అతని పేరు మీదుగా యీ క్షేత్రం ప్రసిధ్ది పొందుతుందని వరం ప్రసాదించేడు , అప్పటినుండి బదరీనాధ్ విశాలబదరీగా పిలువబడుతోంది . ఇక స్థలపురాణం తెలుసుకుందాం .

మహాభారత యుధ్దానికి పూర్వం యిది శివుని నివాసం . శివుడు పార్వతితో యిక్కడ నివసిస్తూ వుండేవాడు .             మహాభారత యుధ్దానంతరం శ్రీకృష్ణావతారం చాలించి వైకుంఠానికి మరలిన విష్ణుమూర్తి విచలిత మనస్కుడై    మనశ్శాంతి లేక వుంటూ ఒకనాడు తన అనుచరులను భూలోకమున తపస్సాచరించుటకు అనువైన ప్రదేశమును వెతక వలసినదిగా కోరుతాడు . భూలోకాన్ని సందర్శించిన విష్ణు అనుచరులు యీ ప్రదేశాన్ని అనువైనదిగా తెలియ జేస్తారు . విష్ణుమూర్తి వైకుంఠాన్ని విడచి పెట్టి యిక్కడకు వచ్చి అప్పటికే శివుడు పార్వతితో నివాసముండడం చూచి ఓ పసివాడి రూపం దాల్చి శివపార్వతుల వ్యాహ్యాళి మార్గంలో నేలపై రొధిస్తూ కనిపిస్తాడు . పసివాని రోదనకు జాలిపడుతున్న పార్వతిని శివుడు అది అంతా విష్ణుమాయ అని వారిస్తాడు . ఇలా కొంతకాలం సాగగా ఓ రోజు పార్వతీ దేవి మాతృ మమతను అరికట్టలేక పసిబాలుని తనతో తీసుకొని నివాసానికి వస్తుంది .

నివాసం చేరిన వెంటనే విష్ణుమూర్తి నివాసానికి తగ్గట్టుగా ఆకారాన్ని పెంచి తపస్సాచరించేందుకు సంసిధ్దుడౌతాడు . అది చూచిన శివపార్వతులు తమనివాసం విడిచి పెట్టవలసినదిగా కోరుతారు విష్ణుమూర్తి అంగీకరించకపోవడంతో విష్ణుమూర్తికి యిష్టమైన శనగలు అక్కడ పండకోడదనే శాపం పెట్టి కేదార్ కి చేరుకుంటారు .

విష్ణుమూర్తి తపస్సమాధిలో మునిగి పోతాడు , వైకుంఠంలో విష్ణుమూర్తి లేకపోవడంతో లక్ష్మీదేవి అతనిని వెతుకుతూ హిమాలయాలలో మంచులో కూరుకు పోయి తపస్సు చేసుకుంటున్న విష్ణుమూర్తికి అండగా బదరిక ( రేగు ) వృక్షంగా మారి  మంచు నుంచి రక్షణ కల్పిస్తుంది .

వ్యాకుల మనస్సు సరిపడగా విష్ణుమూర్తి తపస్సు చాలించి చూడగా మహాలక్ష్మి బదరిక వృక్షంగా తనను కాపాడడం గుర్తించి తాను ఆ ప్రదేశంలో బదరీనాధుడిగా అవతరించి అదే పేరుతో పూజలందుకుంటానని సెలవిచ్చి వైకుంఠానికి లక్ష్మి దేవితో మరలిపోతాడు .

అప్పటినుంచి ఆ ప్రదేశం బదరీ గా పిలువబడుతూ విష్ణుమూర్తి బదరీనాధుడిగా పూజలందుకుంటున్నాడు .

వైష్ణవ దివ్యక్షేత్రాలైన 108 లోనూ ఒకటిగా  గుర్తింపబడింది .

అధ్వైత గురువును ఆదిశంకరులు విష్ణుపురాణం , స్కందపురాణాలను  ప్రమాణికంగా తీసుకొని వాటిలో వర్ణించిన ఆనవాలు ప్రకారం బదరీ ని వెతుకుతూ వచ్చి వాతావరణం అనుకూలించక పోవడంతో జోషిమఠం లో వేచియుండి అక్కడనుండి బదరి చేరి విగ్రహాలను వెతుకగా నారదకుండం లో యిప్పడు పూజలందుకుంటున్న విగ్రహాలు దొరకగా వాటిని మందిరంలో ప్రతిష్టించి తన శిష్యులైన నంబూద్రీలను పూజారులుగా నియమించేరు .

బదరీనాధ్ మందిరం యెన్నో మార్లు  కొండచరియలు విరిగి పడడం వల్ల , భూకంపాలవల్ల , వరదలవల్ల కూలిపోవడం జరిగింది .

ఇప్పటి నిర్మాణం 1930 ప్రాంతాలలో సంభవించిన భూకంపం వల్ల పాత మందిరం కూలిపోగా నిర్మాణంప బడ్డది .      ముఖ్య ద్వారం , అలకనంద మీద వున్న వంతెన 1970 లలో నిర్మించేరు . ముఖ్య ద్వారం కర్ర నిర్మాణం , రంగులతో ఆకర్షణీయంగా వుంటుంది .

మందిరం ప్రతీ సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి నాడు తలుపులు తెరుస్తారు ,  ఆశ్వీజ మాసం లో విజయ దశమినాడు పవిత్ర పూజలు నిర్వహించి ఆరునెలలకు సరిపడా నెయ్యి  అఖండజ్యోతిలో వేసి ఆ జిల్లా కలెక్టరు , మందిర ట్రస్టీలు , రాజకీయ ప్రముఖులు సమక్షంలో మందిరం మూసి సీలు వేస్తారు . తిరిగి జిల్లా కలెక్టరు , రాజకీయ ప్రముఖులు మందిర ట్రస్టీలు  యెదుట తలుపులు తెరుస్తారు .  అఖండ జ్యోతి వెలుగుతూనే వుంటుంది .  ప్రతికూల పరిస్థితులలో కూడా యీ జ్యోతి ఆరదు .  ప్రతీ యేటా తలుపులు తెరిచే సమయానికి యాభై వేలకు పైబడి భక్తులు అఖండ దీప దర్శనానికి వస్తారు . అఖండ దీపం యెన్నో యేళ్లగా అన్ని వాతావరణ పరిస్థితులలోనూ వెలుగుతూనే వుంటుంది .

తలుపులు తెరిచే రోజేకాదు యెప్పుడు వెళ్లినా యీ అఖండజ్యోతిని దర్శించుకోవచ్చు .

సాధారణంగా చార్ ధామ్ యాత్రలు నిర్వహించే వారు సాధారణంగా మే మాసం నుంచి జూన్ లేక జూలైల వరకు బస్సులు నడుపుతారు . మే జూన్ మాసాలలో కొండలలో హిమపాతం కాని వర్షం కాని జరుగుతూ యాత్రకు ఆటంకం గా వుంటుంది . దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రీకులతో భోజన వసతులకు యిబ్బందులు కలుగుతూ వుంటుంది . జూలై ఆగస్టు మాసాలు వర్షాలు విపరీతంగా   కురిసే అవకాశం వుండటం వల్ల ఆ మాసాలలో యీ యాత్రలు పెట్టుకోక పోవడం  మేలు . సెప్టెంబరు మధ్య నుంచి దశరా నవరాత్రుల వరకు యీ యాత్రలు అహ్లాదకరంగా వుంటాయి ,

అంతేకాకుండా దర్శనానికి యెటువంటి క్యూలు వుండవు . కావలసినంత సేపు దైవ సన్నిధిలో గడపొచ్చు .

గత పది సంవత్సరాలుగా యిక్కడ అన్ని రకాలైన ఆహారపదార్థాలు లభ్యమౌతున్నాయి .

వసతులు , మఠాలు , బజారు అన్నీ అలకనంద యీవలి వొడ్డున వుండగా కోవెల , పూజారుల నివాసాలు , స్థానికుల నివాసాలు ఆవలి వొడ్డున వున్నాయి .

1965 ప్రాంతాలలో వెళ్లిన వారు గడ్డకట్టిన అలకనందను రబ్బరు టైర్ల సహాయాన దాటుకొని వెళ్లేవారు , ఆ కథలను మా నానమ్మగారి ద్వారా విన్నాను .

ప్రస్తుతం అలకనందన దాటేందుకు వంతెన వుంది .

మందిర ముఖ ద్వారం రంగులతో ఆకర్షణీయంగా కనుపిస్తుంది . ఎత్తైన మెట్లు దాటి లోపలకి వెళితే యెడమ వైపున పెద్ద గంట కట్టి వుంటుంది యెడమ చేతి వైపుగా వెడితే లక్మి మందిరం , దానిపక్కగా మండపాలు వుంటాయి . అక్కడ బదరీనాధుడికి , లక్ష్మీ దేవికి భక్తులు సమర్పించిన బట్టలు వస్తువులు అమ్మకానికి వుంటాయి . అక్కడే ఆర్జిత సేవల టికెట్లు కూడా విక్రయిస్తూ వుంటారు .

గర్భ గుడిని ఆనుకొని కామధేనువు , అర్జనుడు , తపస్సమాధిలో వున్న బదరీనాధుని దర్శించుకోవచ్చు .

అక్కడ తలయెత్తి దూరంగా వున్న కొండలను చూస్తే యెర్రజండా యెగురుతున్న కొండ నారాయణ శిల , దానిపక్కనే వున్నది నరశిల .

కాస్త ముందుకు వస్తే క్షేత్ర పాలకుడు ఘంటాకర్ణుని విగ్రహం చూడొచ్చు . ఈ విగ్రహం 2013 కట్టినది , యింతకముందు యీ ప్రదేశంలో ఓ పెద్ద గంట , పెద్దపెద్ద చెవులుకలిగిన పెద్ద ఘంటాకర్ణుని విగ్రహం వుండేవి . అవి వరదలలో పాడయిపోతే యిప్పడు వున్న చిన్న విగ్రహం ప్రతిష్టించేరు .

మనం మరే మందిరం దగ్గరా వినని యీ ఘంటా కర్ణుడు యెవరు అనే మీ సందేహాల తీర్చడం నా కర్తవ్యం .      ఘంటాకర్ణుడు రావణుని సేనలో ఓ రాక్షసుడు , విష్ణువును శతృవుగా తలచి విష్ణునామం యెక్కడ చెవులలో పడుతుందోనని చెవులకు పెద్ద గంటలను వ్రేలాడవేసుకొని యెప్పుడూ తలవూపుతూ వుండేవాడట . కృత యుగంలో యీ ప్రాంతం కుబేరుడి రాజ్యాంగా వుండేది . ఇక్కడ చిన్నాపెద్దా మందిరాలలో  కుబేరునికి ప్రత్యేకమైన మందిరం వుండడం కనిపిస్తుంది . కుబేరుని రాజ్యాన్ని చూసి అసూయకు లోనైన రావణాసురుడు ఘంటాకర్ణుని సైన్యాధికారిగా నియమించి కుబేరుడి పైకి దండెత్తి వచ్చి కుబేరుడిని ఓడించి ఘంటాకర్ణుని  కుబేరుడి రాజ్యానికి రాజుని చేసి లంకకు మరలి పోతాడు .

ఘంటాకర్ణుడు పరమ శివభక్తుడు , ప్రతీరోజూ ఆదికేదార మందిరంలో శివార్చన చేసుకొని సర్గప్రాప్తి కోరుతూ వుంటాడు , స్వర్గ ప్రాప్తికి విష్ణుమూర్తిని శరణు చేరాలని శివుడు అతనికి నారాయణమంత్రం వుపదేశిస్తాడు . విష్ణునామం వినగానే అతనికి పూర్వజన్మ జ్ఞానంకలిగి పాపవిమోచన జరుగుతుంది .

సాత్వికునిగా మారిన ఘంటాకర్ణుడు హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్న కుబేరుడి వద్దకు వెళ్లి రాజ్యభారం తీసుకొని తనను రాజ్యవిముక్తుడను చేయవలసినదిగా ప్రార్ధించగా కుబేరుడు ఓడిన రాజ్యం తీసుకో నిరాకరిస్తాడు .  ఘంటాకర్ణుడు కుబేరుని పేరుమీద రాజ్యభారంవహించి ప్రజాహితుడుగా పరిపాలన చేస్తాడు . అందుకే ఘంటాకర్ణుడు రాక్షసుడైనా కూడా మందిరం లో చోటు సంపాదించుకున్నాడు .

మనా గ్రామం లో కూడా ఘంటాకర్ణుని మందిరం వుంది .

బదరీనాధుని దర్శనం పై వారం చేసుకుందాం అంత వరకు శలవు 

మరిన్ని శీర్షికలు
Spicy Dal