Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..http://www.gotelugu.com/issue239/655/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)...

గాయత్రికి రమేష్ పెళ్లి చేసుకుందాం అనగానే విసుగ్గా అనిపించింది.

పదే ,  పదే  పెళ్లి మాట ఎత్తుతాడే అనుకుంది చిరాకుగా. సరదాగా కొంత కాలం  లవర్స్ లాగా  సినిమాలు, షికార్లు తిరుగుతూ, మధ్య, మధ్య  కౌగిలింతలు, ముద్దులతో ఎంజాయ్ చేసాక పెళ్లి చేసుకుంటే మజా ఉంటుంది.. ఇతను ప్రారంభం లోనే పెళ్లి, పెళ్లి అని మొదలు పెట్టాడు. ఇదేం మనిషి అనిపించింది.

“ఎట్లనో బతుకుదాం ... నేను మా అమ్మనడిగి తెస్త పైసలు నువ్వేం పికరు చేయకు.. మనం ఏడికన్న పోదం ...”

“ఎక్కడికి?” ఆశ్చర్యంగా చూసింది.

“ఎడకో ... చూద్దాం ... ముందు ఈ ఊర్లకేల్లి పోయి పెండ్లి చేసుకున్నంక చూద్దాం ...”

“ నేను రాను ... నాకు భయం ....” వణికి పోతూ అంది.

“ బయం లేదు ఏం లేదు .... నాతోని వస్తున్నవ్ గంతే” మొండిగా అన్నాడు.

“ రాను ....” గభాల్న కూర్చున్న దగ్గరి నుంచి లేచింది ...

ఆమె చేయి పట్టుకుని లాగి కూర్చోబెడుతూ అన్నాడు “నువ్వు రాకుంటే తోల్కబోత ...”

“ వదులు నా చేయి .... నేను రాను”  చేయి లాక్కుంటూ అంది.

“ వదల .... నువ్వు రావాలే... వస్తున్నవ్ ...”

“ నీకు పిచ్చి పట్టిందా... వదులు ... అందరు చూస్తున్నారు.. వదులు” ఒక్క విదిలింపు తో చేయి లాక్కుంది.

రమేష్ తను కూడా లేచి నిలబడి బతిమాలుతూ అన్నాడు...” నువ్వు లేకుంటే నేను బతక లేను గాయత్రి నాకు నువ్వు కావలె...ఈడ ఉంటె మన పెద్దోల్లు మనలను కల్వనియ్యరు ... ఏడికన్న పోయి హాపిగ ఉందాము.. నా మాట ఇను ...”

అతనలా బతిమాలుతుంటే గాయత్రికి  జాలేసింది.. రమేష్ అంటే తనకి ఇష్టమే కాని అప్పుడే పెళ్లి అంటే చిరాకు పుడుతోంది..

“నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోడం ఇష్టం లేదు.. నా చదువు పూర్తి కావాలి... నేను జాబ్ చేయాలి.. అయినా అలా ఇంట్లో చెప్పకుండా పారిపోడం అంటే నాకు భయం ... నీతో వచ్చాక నువ్వు నన్ను వదిలేస్తే..”

“నిన్ను వదుల్తన .... గట్లనకు ... సచ్చిం దాకా వదల ...నిన్ను నేను చదివిస్త ... నీకెంత కావాల్నంటే అంత చదువుకో ...”

గాయత్రికి  అతని మాటల్లో నిజాయితీ కనిపించింది. నిజం గానా అంది మెరిసి కళ్ళతో.

“ప్రామిస్ “ అన్నాడు.

“ఏమో వదిలేస్తే ....”

“అరె సమజ్ కాదా వదల అన్న కదా.. నిన్ను లవ్ చేస్తున్న ... పెండ్లి చేసుకుంట ..”

అతని కళ్ళల్లోకి చూసింది.. తన మీద బోలెడంత ప్రేమ కనిపించింది.  నిజంగా ప్రేమిస్తున్నాడు రమేష్ తనని .. అందుకేగా పది రోజుల నుంచి నాన్న కాపలా కాస్తున్నా తనే   ధైర్యం చేసి ఇక్కడ కలుసుకునే ఏర్పాటు చేసాడు.. పాపం వాచ్ మాన్ తో తిట్లు కూడా తిన్నాడు తన కోసం ... రమేష్ అన్నట్టు ఇలాగే అయితే ఇంక ఇద్దరూ కలుసుకునే అవకాశం ఉండదు.. విడిపోవడమే .... గాయత్రికి ఆ మాట అనుకుంటేనే ఎలాగో అనిపించింది. రమేష్ తనని ప్రాణంగా ప్రేమిస్తున్న రమేష్, తనని గోల్కొండ తీసుకు వెళ్ళిన రమేష్, తనకి మంచి , మంచి గిఫ్ట్ లు ఇచ్చే రమేష్ ... సరదాగా కబుర్లు చెప్పే రమేష్ .... ఇతన్ని వదిలి ఎలా బతకడం ... చదివిస్తా అంటున్నాడు..  ప్రాణంగా చూసుకుంటా అంటున్నాడు.  కానీ అతనితో వెళ్తే సినిమాల్లో చూపించినట్టు కొంత కాలం తరవాత తనని వదిలేస్తే ... మళ్ళీ తను ఎక్కడికి వెళ్తుంది? ఉహు ఆలా వదలడు. తన ఇంట్లో కంటే ఎక్కువ సుఖంగా ఉండచ్చు ఇతనితో ..  గాయత్రి ఆలోచనలు పరి, పరి విధాల పోతున్నాయి..
“ఏమాలోచిస్తున్నవ్ గాయత్రీ ... చెప్తున్నా విను ...ఈడనే ఉంటే మనం ఎన్నటికి ఇట్లనే ఉండాలె నువ్వు నీ ఇంట్ల .. నేను నా ఇంట్ల ... మీ అమ్మ నాన్న నీకు వేరే వానితోని పెండ్లి చేస్తరు ... వచ్చేతోడు ఎసొంతోడో ... తాగుబోతు అయితే నీ లైఫ్ ఖరాబ్ ... నాకు తాగే అలవాటు లేదు.. నిన్ను మంచిగ సూసుకుంట ...రేపు రాత్రి నీ బట్టలు, బుక్స్ తీసుకుని వచ్చెయ్ ... ఈడనే వెయిట్ చేస్త ...”

కొంచెం ఆశగా , మరి కొంచెం దీనంగా చూసింది గాయత్రి ....” నాకు భయం వేస్తోంది రమేష్ .. అసలు ఎలా బైటికి రాను.. నా బట్టలు, నా పుస్తకాలు తీసుకుని ఎవరూ చూడకుండా ఇంట్లోంచి రావడమే ..పైగా  అమ్మ, నాన్న, అన్నయ్యని వదిలి ఎలా రాను. నా వల్ల కాదు ..”
“అయితే నేను ట్యాంక్ బ్యాండ్ ల దూకుత ...” బెదిరింపుగా అన్నాడు.

భయంగా అతని చేయి పట్టుకుని “ అలా అనకు” అంది ..

“మరి చెప్పు వస్తావా రావా ...”

“ఎలా ?”

“ఇప్పుడు ఎట్ల వచ్చినవో అట్లనే ...”

నిస్సహాయంగా చూసింది

“చెప్పు వస్తావా ...”

“నాక్కొంచెం టైం ఇవ్వు . మరీ రేపే అంటే ఎలా ... నాలుగు రోజులు ఆగుదాం ..”

“సరే .... నాలుగు రోజులు అంటున్నావ్ కదా ఒ కే .. రాకుంటే చూడు ... ట్యాంక్ బండ్ల దూకి  సూయిసైడ్ చేస్కుంట ...”

అతని వైపు చూసింది.. అతని కళ్ళల్లో పట్టుదల ...మొండితనం  తప్పకుండా అన్నంత పని చేస్తాడు అనేలా ఉంది .

తలాడించింది అప్రయత్నంగా ..

అతని కళ్ళు మెరిశాయి... “నాకు ఎరికే నీకు నేనంటే లవ్ “ అన్నాడు.

అయితే గాయత్రి అనుకున్నట్టు నాలుగు రోజులు గడవకుండానే ఉపద్రవం వచ్చి పడింది.

అప్పటికే ఆమె కదలికల మీద నిఘా పెట్టిన కోటేశ్వర రావుకి గాయత్రి కాలేజ్ నుంచి ఎటో  వెళ్ళిందన్న విషయం తెలిసి పోయింది. చూచాయగా ముందు రోజే గాయత్రి అప్పుడప్పుడు కాలేజి ఎగ్గొట్టి  ఎక్కడికో వెళ్తోందని రోజూ ఆమెతో కలిసి ఇంటికి వెళ్ళే  నీరజ ద్వారా  తెలిసింది...

నీరజ ఇల్లు గాయత్రి ఇంటికి వెళ్ళే దారిలోనే ఉండడం తో రమేష్ పరిచయం అయిందాకా ఇద్దరూ కలిసే ఇంటికి వెళ్ళేవాళ్ళు. కానీ రమేష్ తో పరిచయం అయాక ఇందిరా పార్క్ లో అతనితో కలిసి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకోడం, అతనితో కలిసి చెట్ట పట్టాలేసుకుని గోల్కొండ వెళ్ళడం ఈ మధురానుభూతులు అలవాటు అయాక గాయత్రి నీరజ ని అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది. గాయత్రి అకస్మాత్తుగా ఆలా మారి పోడం నీరజకి ఆశ్చర్యం, అనుమానం కూడా కలగడానికి దారి తీసింది.. ఆలా చేసిందంటే ఖచ్చితంగా  ఆమెకి బోయ్ ఫ్రెండ్ దొరికాడని నీరజ ఊహించింది... సహజంగా ఆడ పిల్లలకి ఉండే కుతూహలంతో అతను ఎవరో తెలుసుకోడానికి ప్రయత్నించింది కానీ ఇంత వరకు తెలుసుకో లేక  పోయింది. ఈ లోపల గాయత్రి రోజూ తండ్రితో కలిసి కాలేజ్ కి రావడం, మధ్య, మధ్య సాయంత్రాలు కూడా ఆయనే వచ్చి తీసుకు వెళ్ళడం చూసాక ఆమె అనుమానం నిజం అయింది. గాయత్రి బాయ్ ఫ్రెండ్ తో తిరగడం ఆయన చూసాడని అందుకే వెంట పెట్టుకు వస్తున్నాడని రూడి చేసుకుంది.

అనుకోకుండా  ముందు రోజు ఇంటికి దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్ లో కోటేశ్వర రావుకి నీరజ కనిపించి  విష్ చేయడం , మాటల మధ్య గాయత్రి విషయం రావడం తన అనుమానం నీరజ ఆయన ముందు కసిగా బైట పెట్టడం జరిగింది. ఆ రోజే గాయత్రి తల్లితో గొడవ పడడం ఆ గొడవలో తన పట్ల ఆంక్షలు విధిస్తున్న తల్లి, తండ్రులకి ఎదురు తిరిగి కాలేజ్ కి ఒక్కతి వెళ్ళడంతో కోటేశ్వర రావు ఆఫీస్ కి లీవ్ పెట్టి ఇంట్లో ఉండి పోయాడు.. గాయత్రి కాలేజ్ నుంచి రాగానే ఇవాళ నిలదియాలని ఎదురు చూస్తున్నాడు. అనుకోకుండా గాయత్రి అదే సమయంలో సాయంత్రం రమేష్ ని కలుసుకుని ఆలస్యంగా ఇంటికి రావడం జరిగింది.

గాయత్రి ఇంట్లో అడుగు పెట్టే సరికి తల్లి, తండ్రి చెరో కుర్చీలో నిశ్సబ్దంగా  కూర్చున్నారు.  ఆ నిశ్శబ్దం పెద్ద విస్ఫోటనానికి దారి తీసే అగ్ని పర్వతం చుట్టూ అలుముకున్న వాతావరణం లా ఉంది.

వాళ్ళనలా చూడగానే భయంతో ముచ్చెమటలు పోశాయి గాయత్రికి .. కాళ్ళల్లో వణుకు మొదలైంది.. అర చేతులు చెమటతో తడిసి పోయాయి..

అప్రయత్నంగా తల భూమి లోకి వంగింది.

“ఎక్కడి నుంచి వస్తున్నావు ?” ఉరుములా వినిపించింది ఆయన స్వరం .

గాయత్రి బిత్తర పోతూ తల్లి మొహం లోకి చూసింది. సమాధానం చెప్పమన్నట్టు చూస్తోంది ఆవిడ ..

“కా కా .....” గాయత్రి పెదాలు దాటి సమాధానం వచ్చేలోగా కోటేశ్వర రావు కుడి చేయి బలంగా ఆమె చెంప తాకటం, గాయత్రి కేవ్వుమనడం జరిగింది.

భర్త ఆలా చేయి చేసుకుంటాడని ఊహించని అన్నపూర్ణ గభాల్న ఆయన చేయి పట్టుకుంది.

ఆయన అన్నపూర్ణ ని విదిలించి కొట్టి మరో సారి  చేయి ఎత్తాడు. ఆవిడ గట్టిగా ఆయన చేయి పట్టుకుని “ ఏంటండి ఈ ఆవేశం ఎదిగిన ఆడపిల్లని కొట్ట కూడదు.. ఊరుకోండి” అంటూ గాయత్రి వైపు కోపంగా  చూసి అంది “ నీకు ఏం మాయ రోగం వచ్చిందే ఇట్లా తయారయావు... ఎక్కడికి వెళ్లి చచ్చావు.. ఎవడితో తిరిగి వస్తున్నావు.. చెప్పి తగలడు.”

కళ్ళ నిండా  నిండిన నీళ్ళు చెంపల మీదికి కారి పోతోంటే రెండు చేతుల్లో మొహం దాచుకుని గది లోకి పరిగెత్తి మంచం మీద వాలి పోయి వెక్కి, వెక్కి ఏడవ సాగింది గాయత్రి. 

“వదులు నన్ను ఇవాళ దాని సంగతి అటో, ఇటో తేలిపోవాలి” సింహంలా గర్జించాడు కోటేశ్వర రావు.

“ఏం తేలుస్తారు? మీరు ఎంత కొట్టినా అది నిజం చెప్పదు ... చెప్పేది అయితే తప్పు చేయదు.. దానికేదో అయింది.. దారి తప్పుతోంది.. ఒకటే మార్గం దానికి చదువు ఆపేసి పెళ్లి చేయండి ... అంతే”  అంది అన్నపూర్ణ .

కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తాండవం చేసింది.. తరవాత కోటేశ్వర రావు స్వరం వినిపించింది. “అవును అదే పరిష్కారం ..” వింటున్న గాయత్రికి గుండె మండి పోయింది... ఏడుపు ఉధృతంగా తన్నుకు రాసాగింది.

చదువు మానిపిస్తారా.. అంటే ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన చదువు మానేయాలా ఆడ పిల్లలు. మరి తన తోటి వాళ్ళు బోలెడు మంది ఫ్రెండ్స్ తో పబ్ లకు,  రెస్టారెంట్ లకు తిరుగుతున్నారు.. వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళు చదువు మానిపిస్తారా?

ఇంత చెడ్డ అమ్మ, నాన్న ఎక్కడైనా ఉంటారా ? అసలు తను పార్క్ కి వెళ్లినట్టు వీళ్ళకి ఎలా తెలుసు? నాన్న ఈ టైం కి ఇంట్లో ఎందుకు ఉన్నాడు.. తన మీద కాపలా మానలేదా.. ఇవాళ తను రమేష్ ని కలుసుకున్నట్టు తెలిసిందా... ఎలా గాయత్రికి తన నిస్సహాయత మీద , బానిస బతుకు మీదా ఏవగింపు కలగ సాగింది.. ఏంటి ఈ బతుకు? ఇప్పుడే పెళ్ళా.? రమేష్ అన్నది నిజమే .... అతను అన్నట్టే అమ్మ, నాన్న తనకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.. వాళ్ళ నిర్ణయం ఇంక మారదు.. ఎలా ఎం చేయాలి.?

గాయత్రి దుఃఖం  ఆందోళనగా మారి పోయింది. ఎలా ? ఈ ఆపద గట్టెక్కడం ... పెళ్లి అప్పుడేనా ! ఎవరన్నా చేస్తారా ఇలా? చదువు పూర్తీ అయాక కొంత కాలం జాబ్ చేయాలి...తన సంపాదనతో సరదాగా ఎంజాయ్ చేయాలి... బాయ్ ఫ్రెండ్ తో కొంత కాలం సరదాగా సినిమాలు, షికార్లు చేయాలి..అప్పుడు పెళ్లి చేసుకోవాలి.. అంతే కాని ఇప్పటి నుంచే పెళ్లి చేసుకుని పిల్లల్ని  కని వాళ్ళని పెంచి పెద్దచేసి బాధ్యతల సుడి గుండంలో కొట్టుకు పోయి జీవితం అంటే ఇంతే అనే స్థితికి వచ్చేయాలి.. ఆ తరవాత పిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, చూస్తుండగానే ముసలి తనం  వచ్చేస్తుంది.

నో ఆలా జరగకూడదు.. జరగనివ్వను ..

గాయత్రి లేచి కూర్చుంది.. ఏవేవో ఆలోచనలు.. రమేష్ అన్నట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ... ఎక్కడికి వెళ్ళాలి? రమేష్ తోటే వెళ్ళాలి.. వెళితే అతను కూడా పెళ్లి అంటూ వెంట పడుతున్నాడు.  లేదులే ... ఇప్పుడంటే ఈ ఆంక్షల వలన కలుసుకో లేక పోవడంతో ఆలా అంటున్నాడు కానీ, ఇద్దరూ కలిసి వేరే ఊరు వెళ్లి చదువు కంటిన్యూ చేయచ్చు.  చదువుకి డబ్బు కావాలి ... తను పిల్లలకి ట్యూషన్ చెప్ప గలడు. రమేష్ కూడా ఏదన్నా చేస్తాడు..

ఎస్ .... వెళ్లి పోవాలి.. ఈ ఇంట్లో ఉంటే బతకాలని కూడా అనిపించదు.. ఇంత భయంకరమైన బతుకు ఎలా బతకడం? వెళ్లి పోవాలి..... ఎలా .... ఎలా?

కార్తికేయ లోపలికి వచ్చాడు. గాయత్రి మంచం  మీద నుంచి కదలలేదు.

కాస్సేపు చూసి కార్తికేయ తనకి కావాల్సిన వస్తువులు తీసుకుని హాల్లోకి వెళ్ళి పోయాడు.

అన్నపూర్ణ వచ్చి అన్నానికి రమ్మంది.. కదల లేదు గాయత్రి .. అన్నపూర్ణ దగ్గరకి వచ్చి పళ్ళు కొరుకుతూ అంది “ వేదవ్వేషాలు వేయకుండా రా ... ఆయన అసలే  రావణాసురుడు అయాడు.. చంపేస్తాడు..చేసిన రభస చాలు రా “ అంటూ రెక్క పుచ్చుకుని లాక్కెళ్ళింది ..

గాయత్రికి ఏడుపు, ఉక్రోషం, కసి .... ఏమి చేయలేని నిస్సహాయత ...తల వంచుకుని అన్నం కెలుకుతూ కూర్చుంది. ఆమెని పరీక్షగా చూస్తూనే భోజనం ముగించాడు కోటేశ్వర రావు .

చేయి కడుక్కుని గదిలోకి వెళ్తున్న గాయత్రి అన్నపూర్ణ స్వరం విని శిలలా నిలబడి పోయింది.

“నాన్నగారు, అన్నయ్య ఆ గదిలో  పడుకుంటారు నువ్వు నాతో పడుకో ...”

అంటే ... అంటే... ఇంకాస్త బలంగా , ధృఢమైన రక్షణ గోడ కట్టడమా తన చుట్టూ ..

“నీకే చెప్పేది నా గదిలోకి వెళ్ళు” హెచ్చరించింది అన్నపూర్ణ .

గాయత్రి తల తిప్పి చూసింది .. కోటేశ్వర రావు ఆమెనే చూస్తున్నాడు.

గబుక్కున గాయత్రి తల్లి గదిలోకి వెళ్ళి పోయింది.

సడన్ గా గాయత్రికి నవ్వొచ్చింది. ఎందుకు వీళ్ళు తనని ఇంతగా కాపలా కాస్తున్నారు.. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నందుకే తనకి పారి పోవాలనిపిస్తోంది.. కొంచెం స్వేఛ్చ ఇస్తే ఎంత బాగుంటుంది... కానీ ఇవ్వరు.. చూస్తా ఎంత కాలం ఇలా కాపలా కాస్తారో ... రెక్కలు వచ్చిన పక్షిని పంజరంలో బంధిస్తే ఏం చేస్తుంది... ఆ పంజరం ఊచలు విరిచి పారిపోయే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. తనూ అంతే.. 

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham