Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue243/664/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)...

గంగరాజు షాప్ కి ఇంకా కొంచెం దూరంలో జనరల్ స్టోర్స్ నడిపించే  వెంకటేశు నెలాకరు కావడం వల్ల పెద్దగా కస్టమర్స్ లేకపోడంతో త్వరగా  షాపు మూసి ఇంటికి బయలుదేరాడు. వీధి దీపాలు వెలగడం లేదు.. చీకటిగా ఉంది .. మునిసిపల్ వాళ్లకి కంప్లయింట్ చేయాలన్న ధ్యాస కాని ఆలోచన కానీ అక్కడున్న ఎవరికీ అంతగా లేకపోడంతో లైట్లు వెలక్క చాలా రోజులైనా అలాగే గడిపేస్తున్నారు.

ఆ చీకట్లో ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుస్తూ వెళ్ళడం గమనించిన వెంకటేశు వాళ్ళని గుర్తుపట్టక పోయినా ఒక వ్యక్తిని మరో వ్యక్తీ నడిపించడాన్ని బట్టి ఎవరికో ఆరోగ్యం బాగాలేదు కాబోలు అనుకుంటూ తనొక చేయి వేయడానికి కొంచెం వేగంగా నడుస్తూ వాళ్ళని చేరాడు. దగ్గరగా రాగానే గంగారాజుని గుర్తు పట్టి  ఎవరన్నా అంటూ ఖంగారుగా దగ్గరకి వచ్చాడు.. గంగరాజు నడిపిస్తున్నది కోటేశ్వరరావుని అని చూసి  “అరె ఏమైందన్న సార్కి” అన్నాడు గంగరాజుకి సాయంగా కోటేశ్వరరావు భుజం మీద చేయి వేస్తూ.

“ఏంలేదు ... బి పి ఎక్కువైనది కావచ్చు... జర సాయం చేయి ఇంటికి తోల్కపోదం” అన్నాడు గంగరాజు.

ఇద్దరూ కలిసి కోటేశ్వరరావు ని అతని ఇంటి దగ్గరకు తిసుకువచ్చేసరికి అప్పటికే రక, రకాల ఆందోళనలతో విలవిలాడుతున్న అన్నపూర్ణ వాళ్ళవైపు అయోమయంగా చూసింది. ఆవిడ చూపుల్లో కనిపిస్తున్న ప్రశ్నలు గమనించి సానుభూతి తో అన్నాడు గంగరాజు.

“ఏం కాలే చెల్లెమ్మ పరెశాను గాకు” ఆవిడకు సరిచేప్పే ప్రయత్నం చేస్తూ ఇద్దరూ కలిసి సోఫాలో పడుకోబెట్టారు.. కార్తికేయ త్వరగా వెళ్లి గ్లాసుతో నీళ్ళు తెచ్చి “ఏమైంది నాన్నగారికి” అన్నాడు.

“జర బి పి ఎక్వ గావచ్చు..” అని అతని చేతిలో నిళ్ళ గ్లాస్ తీసుకుని వేళ్ళతో నీళ్ళు కోటేశ్వరరావు మొహం మీద చిలరించాడు.  అయితే స్పృహలో ఉన్నా ఏం జరుగుతోందో తెలియని అయోమయ స్థితిలో ఉన్న కోటేశ్వరరావు నీళ్ళు మొహం మీద పడడంతో కదిలాడు.. గంగరాజు, వెంకటేశుని చూసి  అతి కష్టం మిద లేచి కూర్చుని  మీ ఇద్దరూ వెళ్ళండి అన్నట్టు సైగ చేసాడు..

“సారు.. డాక్టర్ సాబ్ ని తోల్కరమ్మంటావా” అంటున్న వెంకటేష్ ని వారిస్తూ..” సార్ రెస్ట్ తీసుకుంటాడు పద పోదం ... మల్ల రావచ్చు”  అన్నాడు గంగరాజు.

ఇద్దరూ వెళ్ళిపోగానే అన్నపూర్ణ వచ్చి ఆయన పక్కన కూర్చుని ఏడుపు గొంతుతో అడిగింది “ఏమైందండీ...”

ఆయన సమాధానం చెప్పకుండా తీక్షణంగా నేల వైపు చూస్తూ  “గీజర్ ఆన్ చేయి అన్నపూర్ణా ... అందరం మైల స్నానాలు చేయాలి” అన్నాడు.

“ఏవండి...” అన్నపూర్ణ మాట పైకి రాకుండా అడ్డుపడుతూ చేత్తో మాట్లాడద్దు అన్నట్టు సైగ చేసి “నీ కూతురు లేదింక “ అన్నాడు.

“ఏవండి” అంటూ ఆవిడ విరుచుకుపడిపోయింది. కార్తికేయ అమ్మా అంటూ ఆదుర్దాగా ఆవిడ దగ్గరకు వచ్చాడు.. కోటేశ్వరరావు నిర్లిప్తంగా పడిపోయిన భార్య వైపు చూసాడు.

గంగరాజు ఇల్లు చేరేసరికి ఆఫీస్ నుంచి వచ్చిన సురేష్ అన్నం తింటున్నాడు.. దుర్గమ్మ పక్కనే కూర్చుని వడ్డిస్తోంది.. గంగరాజు చెప్పులు వదిలి లోపలికి అడుగుపెడుతుండగా ఆమె స్వరం వినిపించింది..

“గీ పోరడు ఇంక రాలే.. ఏడికి పోయిండో  ఏమో.. జర తమ్మునితోని కూసుని ఆడు ఏం  జడువుతున్నడూ  సూడరాదు  కొడకా.. కాలేజ్ కి పోతలేదంటున్డు మీ నాయన..టైం ఎంతాయేనో ఏమో.. గిప్పుడు నాయన ఒచ్చిందంటే పంచాయితీ ... “

అడుగుల చప్పుడుకి తలెత్తి చూసాడు సురేష్.. గంగరాజు మొహం గంభీరంగా ఉంది.. తీక్షణంగా దుర్గమ్మని చూస్తూ అన్నాడు..” నీ కొడుకు మొగోడైండు ... ఆనికి సడువెందుకే పెండ్లి కావాలె.. నాతోని చెప్పింటే మస్తు చేస్తుంటి ఆని పెండ్లి.. నేను చేయనని ఆడే చేసుకోనికి పోయిండు.”

దుర్గమ్మ కూర్చున్న చోటునుంచి లేచి ఒక్క అంగలో గంగరాజు దగ్గరకు వచ్చి అతడి  భుజం పట్టుకుని ఊపుతూ అంది..

“ఏమంటున్నవయ్య... పెండ్లి చేసుకోనుడేన్ది.. నా కొడుకు గసొంటోడు కాడు .. ఆనికి లచ్చలు కట్నంతోని వస్తది పిల్ల.  “

“అవు ... ఒస్తదోస్తది ... కలెక్టరు సదువు సదివిండు... కట్నం తెస్తది.. గసొంటి ఆశలేం పెట్టుకోకు.. బాపనోల్ల పిల్లను తీసుకుని పోయిండు నీ కొడుకు..”

ఆ మాట వింటూనే లబ లబలాడుతూ “ ఓలమ్మో యాడకు పోయిందయ్యా ... ఏ బాపనోల్ల పిల్లనయ్యా ... దేవుడా గా పిల్ల నా కొడుకుకు మందు పెట్టేనయ్యో...” అంటూ శోకాలు పెట్టసాగింది. సురేష్ బిత్తరపోయి చూడసాగాడు.

గంగరాజు భార్య శోకాలు పెడుతుంటే గట్టిగా అరిచాడు.. “ఏయ్ నోరుముయ్య్ .... గా పిల్లనెందుకంటవ్ ... అమాయకురాలు .. వాడే గా పిల్లని పటాయించి తోల్కపోయిండు...వీని షోకులు, వీని నకరాలు జూసి గా పిల్ల పాపం మోసపాయే.. గా సారు, అమ్మ దుక్కం చూస్తే మస్తు  బాదైంది ... ఆల్లకు ఇజ్జత్ పాయె.. నీకు, నాకు ఏం గాలే... మగపోరడు ... వానికేంది ... అని భార్యని కసిరి సురేష్ తో అన్నాడు.. ఆడు ఏడున్నదో , ఏడికి తోల్కపోయిండో  జర తెలుసుకో కొడకా... ఎట్లనన్న తెలుసుకుని గా పిల్లని తిస్కరావాలే ...లేకుంటే ఆల్లు బద్నాం అయితారు... గాయత్రి బతుకు బండలైదీ. ఈని మొకానికి లక్ష్మి దేవంటి పిల్ల గావాల్నా.. “

దుర్గమ్మ  గయ్యిమంది..”. నీ కొడుకు గురించి నీకు పికరు లేదు ... ఆల్ల గురించి మస్తు పికరున్నది..”

“బుద్ది ఉన్నోల్లందరూ నా లెక్కనే అంటరు.  ఆనికి సిగ్గు , లజ్జ ఉన్నదా ... ఆడపిల్లను గట్ల తోల్కపోతడా ... కనిపిస్తే బొక్కలు తీస్తా ... పోరా సురేషు ... పోలిస్ స్టేషన్ల కంప్లయింట్ ఇచ్చిరా పో ...” ఆజ్ఞాపించినట్టు అన్నాడు గంగరాజు.

సురేష్ బెదురుగా అన్నాడు..  “సారోల్లెమంటారో నాయనా .... పోలిస్ లకు చెప్తే ఆల్ల ఇజ్జత్ పోతది... అడిగి చెబ్దం ..”

గంగరాజు ఆలోచించాడు.. నిజమే ... ఈ విషయం బయటికి వస్తే నష్టం కోటేశ్వరరావు సార్ వాళ్ళకే ... తెల్లవారాక వాళ్లనే అడిగి ఏం చేయాలో నిర్ణయించ వచ్చు.. ఇప్పుడు ఎక్కడని వెతుకుతాడు.. ఇప్పటికే ఈ పంచాయతి మొదలై చాలా సేపైంది. పదిన్నర .. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని  వెతకడం ...

గంగరాజుకి తన కొడుకు మీద కోపం , గాయత్రి మీద సానుభూతి, ఆ కుటుంబం పట్ల ఆవేదన కలిసి మనసంతా కకావికలం అయింది.. నిస్సత్తువగా కింద కూలబడ్డాడు.. దుర్గమ్మ శోకాలు పెడుతూనే ఉంది ...

బోలెడు కట్నంతో పిల్ల వస్తుందన్న ఆశ,  వాడు చదువుకున్నా,  చదువుకోకున్నా, అందగాడైనా, కురూపి అయినా వాడు మగాడు.. ఆ అర్హత చాలు లక్షలు కట్నంగా ఇచ్చి పిల్లనివ్వడానికి,  అట్లాంటిది పైసా కట్నం లేకుండా ఆ పిల్లని ప్రేమించడం ఏంటి నా కొడుకు  అనే సగటు తల్లి లాగే ఆమె కూడా ఆలోచిస్తోంది.

తన కొడుకు ఆవారా తిరుగుళ్ళు తిరుగుతూ అమాయకురాలైన మంచి కుటుంబంలోని పిల్లని మాయ మాటలతో తీసుకుని వెళ్లి ఆ పిల్ల జీవితం ఏం  చేస్తాడో అనే ఆందోళన గంగరాజుది.

ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఇంత దుమారం రేపడం కాక అందమైన గాయత్రిని పనికిమాలిన వాడు అయిన తన తమ్ముడు లేవదిసుకు  పోవడం ఏంటి? ఏట్ల జరిగిందిట్లా.. ఆ గాయత్రి వాడిని ఎట్లా నమ్మింది అని సురేష్ ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఆ రాత్రంతా జాగారం చేశారు.

ఒక గది, దానిని ఆనుకుని చిన్న వసారా ... అవతలి వైపు సన్నటి సందు.. అందులో బాత్రూం, లావేట్రి .

ఆ ఒక్క గదిలో ఒక నవారు మంచం, చిన్న స్టూలు ... గోడకి  హ్యంగర్ లు తగిలించుకునే స్టాండ్ ... దాని నిండా  ప్యాంట్ లు, షర్ట్ లు.  చిన్న వసారాలో ఒక గట్టు .. దాని మిద కిరోసిన్ స్టవ్, కొన్ని స్టీలు గిన్నెలు, గరిటెలు, రెండు కంచాలు ..

తన ఇల్లుగా చెప్పి ఆటో అతను నర్సిమ్మ తీసుకొచ్చిన ఆ ప్రదేశం చూస్తుంటే గాయత్రికి కడుపులో తిప్పేసింది.. అడుగుపెట్టగానే నీచు వాసనతో కూడిన మందు వాసన.  గుమ్మం బయట నిలబడిపోయిన జి గాయత్రి వైపు చూసి  “దా లోపటికి” అన్నాడు రమేష్ ఆమె చేయి పట్టుకుని లాగుతూ. విసురుగా ఆ చేయి విడిపించుకుని “నా వల్ల కాదు నేను రాను ... కంపు కొడుతోంది.. వాంతి అయేలా ఉంది” అంది గట్టిగా.

“ఏం కంపు ... నాకు లేదు.. నీకెట్ల వస్తుంది.. నకరలు చేయకు ... సప్పుడు చేయకుండ రా” అన్నాడు కసురుతూ .

“రాను ..నేను వెళ్ళిపోతా మా ఇంటికి వెళ్లి పోతా .. తప్పు చేశా నేను తప్పు చేశా ..” రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగింది గాయత్రి.

నర్సిమ్మ రమేష్ ని మందలిస్తూ అన్నాడు.. “నువ్వూకో  నేను మాట్లాడతా” అని గాయత్రి దగ్గరకు వచ్చి నెమ్మదిగా నచ్చ చెప్తున్న స్వరంతో అన్నాడు..” వచ్చినవ్ వచ్చినవ్ బిడ్డా.. జర సోచాయించి ఏం జెయాలె చేద్దాం ... నీకు ఈడ ఉండుడు ఇష్టం లేకుంటే నాతోని రా పక్కన మా సుట్టపోల్లున్నారు ... ఆల్ల ఇల్లు మంచిగుంటది.. ఆడ ఉండు.. ఏడ్వకు ... నీకు రమేష్ అంటే ఇస్టమై వచ్చినవ్ ... నాకెరికే కొత్త సోటు జర బయముంటది.. పర్వాలేదు ... దా పోదం ...”

“నేను మా ఊరు వెళ్ళిపోతా” వెక్కుతూ అంది గాయత్రి.

“ఏడికి పోతావ్ .. నేను పోనియ్య ...” విసురుగా ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు రమేష్.

“ఏయ్ నువ్వు గమ్మునుండు ...” రమేష్ ని దూరంగా తోసాడు నర్సిమ్మ ..

“నువ్వు రా బిడ్డా” అంటూ గాయత్రి చేతిలోంచి ఆమె బాగ్ అందుకున్నాడు..

“నేను మా ఇంటికి వెళ్ళాలి” మళ్ళి అంది గాయత్రి ..

“నేను పంపిస్త పికరు చేయకు ... ముందు జర మొకం కడుక్కుని పశాంతంగా కూసో .. మల్ల ఆలోచన చేద్దాం ... ఎట్ల పోవుడు ఏందీ సంగతి ... నేనున్నా కదా .. నా మీద నమ్మకం పెట్టు ...”

గాయత్రికి ఆ క్షణంలో నర్సిమ్మ మాట వినడం కన్నా గత్యంతరం కనిపించలేదు.. కళ్ళు తుడుచుకుని అతనిని అనుసరించింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్