Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
betalaprasna

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఈ బధ్ధకం అనేది, రానేకూడదు కానీ,వచ్చిందా ఒక్కటంటే ఒక్కపనీ టైముకవ్వదు. మామూలుగా ప్రతీ రోజూ ప్రొద్దుటే లేవడానికి బధ్ధకం. చదువుకున్నప్పటి రోజులనుండి, ఉద్యోగం చేసినంతకాలం, అవసరార్ధం ప్రొద్దుటే లేవాలికదా, అబ్బే అదేం చిత్రమో, ఒక్కరోజుకూడా, మనస్పూర్తిగా లేచిన పాపాన్ని పోలేదు.ఎప్పుడూ బధ్ధకమే. రిటైరయిన తరువాత తెల్లారకుండా నిద్రలేచేసి, ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీయడం.అంటే అర్ధం అయిందేమిటిటా, పనీ, బధ్ధకం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట.

ఈ బధ్ధకం అనేది రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తూంటారు. ఈ బధ్ధకం కూడా అలాటిదే, నా ఉద్దేశ్యం- మనం వాడే సందర్భాన్ని బట్టి అర్ధం మారుతూంటుంది. ఉదాహరణకి, పిల్లాడికి మార్కులు తక్కువొచ్చాయనుకోండి, తండ్రంటాడూ,"మామూలుగా బాగానే చదువుతాడండీ, ఇంకొంచం శ్రధ్ధగా చదవడానికి బధ్ధకం" లాగన్నమాట!

ప్రొద్దుటే లేవడానికి అలారం మరీ పెట్టుకుంటారు.పైగా గడియారం ఓ పదిహేను నిమిషాలు ఫాస్ట్ గా పెడతారు. ఆ అలారం కాస్తా పాపం మ్రోగినా, దాని నోరునొక్కేసి, పెళ్ళాం నిద్రలేపినా, 'ఇంకో పది నిమిషాలు పడుక్కోనీయవోయ్, ఇదిగో లేచెస్తున్నా.."అనడమూ బధ్ధకంలోకే వస్తుంది.అలాగే పొద్దుటే స్కూలుకెళ్ళడానికి పిల్లల్ని లేపేడప్పుడు చూస్తూంటాము. ఏ రోజునా టైముకి లేవరు. ప్రతీ రోజూ ఓ యజ్ఞమే!

ఎప్పుడైనా కూతురు పురుటికి వస్తే, నెలలు నిండిన తరువాత,ఎప్పుడైనా డల్ గా ఉన్నట్లు కనిపించిందా, ' ఏమ్మా బధ్ధకంగా ఉందా? హాస్పిటల్ కి ఈవాళో రేపో వెళ్ళాలేమో'అనే మాట ప్రతీ తల్లి నోటినుండీ వింటాము.అంతదాకా ఎందుకూ, తిన్నది అరక్క, పొట్ట ఖాళీ అవకపోతే వాడే పదం 'మల బధ్ధకం' కూడా ఈ క్యాటిగరీ లోకే వస్తుందనుకుంటా.

ఈ రోజుల్లో పిల్లలు, ఆ బధ్ధకం శబ్దాన్ని మార్చేసి స్టైలుగా 'బోరు' అంటున్నారు. తెలుగులో చెప్పుకోడానికి నామోషీ!ఏ రాయైతేనేం బుర్ర పగలుకొట్టుకోడానికీ!చిన్నప్పుడు న్యూస్ పేపరు చదవడం తప్పనిసరైపోయేది. అదే ఓ అలవాటుగా మారింది. అందుకనే మన ఇళ్ళల్లో ఉండే పెద్దవారు, స్కూళ్ళకీ, కాలేజీలకీ వెళ్ళి డిగ్రీలు సంపాదించకపోయినా, న్యూస్ పేపరు చదివే, వారి లోక జ్ఞానం ఇంప్రూవ్ చేసికున్నారు.అందుకే వారికున్న general knowledge ముందర మనం పనికి రాము.ఇప్పుడో, న్యూస్ పేపరు చదవడానికి టైమే ఉండడం లేదూ, ఈ టి.వీ. ల ధర్మమా అని.పైగా, కంప్యూటరు లో ఓ నొక్కు నొక్కగానే, మనకి కావలిసిన సమాచారం వచ్చేస్తోందాయే! మరి బధ్ధకం పెరిగిపోతుందంటే పెరగదు మరీ?

పిల్లాడిని అన్నం తినరా అంటే బధ్ధకం.ఈ బధ్ధకం అనేది ఓ national obsession అయిపోయింది. మన ఆటగాళ్ళని, ప్రతీ రోజూ ప్రాక్టీసు చేయండిరా బాబూ, అని ఆ కోచ్ లు మొత్తుకున్నా సరే, ఛస్తే వెళ్ళరు.ఈ వేళ చేయవలసిన పని రేపటికి వాయిదా వేస్తున్నామంటే, ఈ 'బధ్ధకం భూతం' మనల్ని ఆవహించేసిందన్నమాటే.భగవంతుడు కూడా బాగుచేయలేడు మనల్ని.ఏదో అదృష్టం కొద్దీ, ఈ బధ్ధకం అనేది లేనిది ఆ ఒక్క 'అమ్మ' కే! ఆవిడకి సరాదాకైనా, బధ్ధకం వేసిందా, ఇంట్లోవాళ్ళ పని గోవిందాయే !

మా మనవడున్నాడే చి.అగస్థ్య- వాడికి నడకొచ్చింది. అయినా సరే పిలవగానే, నడవకుండా పాకుతూ వచ్చేస్తాడు! ఏదోలా పనైపోతూందిలే, ఇలా అయితే శ్రమ పడఖ్ఖర్లేదూ అని! మరి ఇదికూడా 'బధ్ధకం' లోకే వస్తుంది. ఇదివరకటికి వాడెవడో, ' నీ నెత్తిమీద బూజుందిరా' అంటే, 'ఆ చేత్తో నువ్వే తీసేయకూడదూ?' అన్నాట్ట!ఇది అల్టిమేట్ బధ్ధకం లోకి వస్తుంది !

ఈరోజుల్లో ఏ పనీ సరైన టైములో చేయాలంటే బధ్ధకం. కాలాన్ని బట్టి ప్రతీదానికీ ఇన్స్యూరెన్స్ లు మొదలయ్యాయి. వాటికేమో ప్రతీ ఏడూ ప్రీమియం కడుతూండాలి. టైములో కట్టకపోతే వాటికి కాలదోషం పట్టిపోతుంది… అలాగే క్రెడిట్ కార్డులకీ నెల నెలా కట్టడమోటీ.. వాడు చెప్పిన తేదీలోపల కట్టకపోతే , పై నెలలో జుర్మానా కూడా కట్టాల్సొస్తుంది. వీటిని చివరి నిముషందాకా కట్టకపోవడం – కారణం మళ్ళీ బధ్ధకమే..

ప్రతీ ఏడాదీ పిల్లలకి కొత్త పుస్తకాలూ, యూనిఫారాలు తీసుకోడానికి కూడా, బధ్ధకమే.. రేపు స్కూళ్ళు తెరుస్తారనగా, ఆ ముందురోజు వెళ్ళడం. చిత్రం ఏమిటంటే ఆ రోజు  ఏ కొట్లో చూసినా హడావిడే.. అంటే బధ్ధకస్తుల వరదన్నమాట.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బధ్ధకమనేది మహమ్మారిలా పాకిపోయింది..

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
jayajayadevam