Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

2018 లో మనం... - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

In 2018 we ...

ఆనందోత్సవాలతో, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం.

విష్యూ హాప్పీ న్యూ ఇయర్ అంటూ శ్రేయోభిలాషులందరూ నలిపేసిన చేతులు తీయని నొప్పి కలిగిస్తుంటాయి. పెళ్లిల్లు శుభకార్యాల విందుల్లో పంక్తి భోజనాలు, బిర్యానీతో బఫేలు తింటే తృప్తి  కలుగుతుందో లేదో కాని డిసెంబర్ 31 నాటి అర్థరాత్రి తిన్న కేక్, కూల్ డ్రింక్స్, మరో రకమైన ’డ్రింక్స్’ గుర్తుకొచ్చినప్పుడల్లా మనసులో ఒక రకమైన కిక్ కలుగుతుంది. తెలుగు పండగలకి ఊరంతా ఒకటై వేడుక చేసుకుంటారేమో కానీ అరచి అల్లరి చేస్తూ భీభత్సం చేయరు. ఎంతైనా ఇంగ్లీషోళ్ల పద్దతే వేరు. ఈ ఫెస్టివల్ కు, గెట్ టు గెదర్ కు పొద్దున్నే తలంటు పోసుకోనక్కర్లేదు. పసుపు బొట్టు పెట్టిన కొత్త బట్టలు కట్టుకోనకర్లేదు. పెద్దల కాళ్లకు దణ్ణం పెట్టనక్కర్లేదు, గుడికి వెళ్లనక్కర్లేదు, అర్చనలూ పూజలూ అసలే అఖ్ఖర్లేదు. ఎలా ఉన్న వాళ్ళం అలా వెళ్లిపోయి కనిపించిన వాళ్లకు విష్ చేస్తే చాలూ, అందరూ ’కలసి పోతారు’. ఆ తర్వాత సందడే సందడి. అసలు దారి కన్నా అడ్డదారే కదా ప్రీతి. అందుకే అన్ని సంస్కృతీ సంప్రదాయాల్లోకి ఇంతలా చొచ్చుకుపోయారు. ‘మన భాషా, మన సంస్కృతి’ అని పెద్దలు ఎంత గొంతు చించుకున్నా, మనం పెడ చెవిన పెట్టేదీ అందుకే. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు ఎప్పుడూ వాడే. ఇది ఒకప్పుడు ఫ్యూచర్ ను దివ్యదృష్టితో వీక్షిస్తూ మనవాడు చెప్పిందే. అది నిజమవకపోతే ఎలా?

బాల్యం నుంచి కుర్రతనంలోకి ప్రవేశించగానే వీపుకు అదృశ్య రెక్కలు వచ్చినట్టుగా విదేశాలకు ఎగిరెళ్లిపోదామనే తపన నిలువనీయదు. వెళ్లిపోతారు. అంతెత్తు ఎగరడం రాని, ఎగరలేని కన్నవాళ్లు దిక్కుతోచని పక్షులై ఇక్కడే మిగిలిపోతారు.

ఇంగ్లీషు వాళ్లని తరిమేశామని మురిసిపోయామేగానీ మనవాళ్లు ఆ దేశాలకి తరలి వెళ్లిపోతారని స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఊహించి ఉండం.
దాన్ని సమర్థించుకుంటూ ఇంతకు ముందు వసుధైక కుటుంబం అనుకునేవాళ్లం, ఇప్పుడు అందంగా దాన్నే గ్లోబలైజేషన్ అంటున్నాం.

అసలు విషయానికి వద్దాం. సరే కొత్తసంవత్సరంలోకి ప్రవేశించాం. సో వాట్? 2019లోకి కూడా అలాగే వెళతాం అంటున్నారా? లేదు అలా వెళ్లొద్దు. కాస్త ఛేంజ్.

ఎగురగలిగినంత ఇక్కడే (మన దేశంలోనే) ఎగురుదాం. ఎదగగలిగినంతా ఇక్కడే ఎదుగుదాం.

ఇన్నన్ని అవకాశాలు, వనరులూ సృష్టిలో ఏ జీవికీ లభించవు. అందుకే మనిషి జీవితం ఓ అద్భుతం. అయితే ఆ అద్భుతాన్ని మనం గుర్తించడం లేదు.

ఆశలూ, కోరికలు ఉన్నతాశయం కోసం కాకుండా తాత్కాలిక అవసరాలు, ఆనందాలకు పరిమితం చేసుకుంటున్నాం. అదే మనసును ఊబిలో ఉంచుతోంది.

చెత్తను ప్రోది చేసుకుని దాచుకుంటున్నాం. ఉపయోగమైన వాటిని అశ్రద్ధ చేస్తున్నాం.

ఒక్కసారి చుట్టూ చూడండి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకుని, లేని అవకాశాలని సృష్టించుకుని ఆకాశమే హద్దుగా, అప్రతిహతంగా ఎలా ఎదుగుతున్నారో. మనకేం తక్కువ? మనమెందులో తక్కువ?

ఒక్కసారి స్వేచ్ఛగా ఎగురుదాం, ఇంకాస్త పైకి ఎగురుదాం, పక్షిలా ఎగరడం అలవాటు చేసుకుందాం. ఆకాశం నుంచి ఈ భూమిని చూస్తే మీరేం సాధించారో అవగతమవుతుంది. జీవితమంటే ఇది అన్న అపరిమిత తృప్తి కలుగుతుంది. అలాంటి అనిర్వచనీయ స్థితిలో గుండెల్నిండా సంతోషపు గాలిని పీల్చుకుంటూ 2019 లోకి అడుగుపెడదాం. దానికి 2018ని పునాదిని చేసుకుందాం.

మనలో ఎంతమంది గోల్ అచీవర్స్ ఉంటారో వెళ్తూ, వెళ్తూ 2018 నిగ్గుదేలుస్తుంది. 2019 లో మళ్లీ మనం ఈ విషయం మాట్లాడుకుందాం.

"I wish you all the best"

*****

మరిన్ని శీర్షికలు
jayajayadevam