Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

సమర్ధించటం? సమర్ధించుకోవటం? - శ్రావణ్ దమ్ములూరి.

Support? Justify?
మనిషి ఏ పని చేసినా తనని తాను సమర్ధించుకుంటాడు ,అది మంచైనా, చెడైనా సరే. అలాగే తనని ఇష్టపడేవాళ్లు , తన కోసం ఆలోచించే వాళ్ళు కూడా మనిషి  ఎం చేసిన సమర్దిస్తువస్తారు,అది తన  తల్లితండ్రులు ఐనా అవ్వొచ్చు,తన అవసరాన్ని కోరుకునే వాళ్ళైనా అవ్వొచ్చు, కొన్ని సందర్భాల్లో ధైర్యం చెప్పటానికి కూడా అవ్వొచ్చు . ఉదాహరణకు  ఒక కుర్రవాడు పరీక్షలో తప్పితే తండ్రి మందలిస్తాడు, తల్లి కొడుకుని సమర్దిస్తుంది , మరలా చదివి పాస్ అవుతాడని. ఇలా మనుషులకు ఎందుకు ఒకరిని ఇంకొకరు సమర్ధించుకోవలసి వస్తుంది లేదా తమని తామే సమర్ధించుకోవలసి వస్తుంది. దీని వల్ల జరిగేవి మంచి ఫలితాన్ని ఇస్తాయా? లేదా చెడు ఫలితాన్ని ఇస్తాయా ?.

"సమర్ధించటం"... అంటే ఒకడు తప్పు చేసినా లేదా ఏదైనా చెడు తలచినా పరవాలేదు ఏంకాదు అని తప్పు చేసిన వాడికి ధైర్యం చెప్పటమే సమర్ధించటం. ఇది ప్రతీ ఇంట్లో జరుగుతుంది, దీని వల్ల ఉపయోగము ఉండొచ్చు చెడు ప్రభావము కూడా ఉండొచ్చు. ఒక తండ్రి తన కొడుకుని ప్రతీ విషయంలో సమర్ధించవచ్చు, అది కొడుకు అర్ధం చేసుకుంటే బాగుపడొచ్చు లేదా తండ్రి సమర్ధించటాన్ని అదునుగా చూసుకొని ఇంకా తప్పులు చేసి పాడైపోవచ్చు కూడా !!

మనందరికీ తెలుసు కౌరవులు జూదంలో పాండవులపై మోసపూరితంగా గెలిచారని. అక్కడున్న వారికి కూడా తెలుసు కౌరవులు చేస్తుంది తప్పు అని, కానీ చాలా మంది దాన్ని సమర్ధించారు పాండవులను వనవాసం, అజ్ఞాతవాసానికి పంపారు. వనవాసం పూర్తయిన తరువాత కురుక్షేత్రం మొదలు కావటం పాండవులు గెలవటం, కౌరవులు తమ సర్వస్వాన్ని ఆనవాళ్లు లేకుండా కోల్పోవటం కూడా మనకు తెలుసు.

ఆ సమయంలో వాళ్ళు కౌరవులను సమర్ధించకుండా , మీరు చేసేది తప్పు అని చెప్పి ఉంటె ఇంతటి ఘోరం కౌరవులకు జరిగేది కాదు కదా!!  కానీ , వాళ్ళకి తెలిసినా ఎందుకు చెప్పలేదంటే "పరిస్థితి" అటువంటిది. ఇదే  ఇరకాటంలో మనిషి ఎప్పుడూ ఇరుక్కుపోతుంటాడు, అందుకే మంచైనా చెడైనా ఒక మనిషి ఇంకో మనిషిని సమర్ధించాల్సి వస్తుంది.

"సమర్ధించుకోవటం" ... అంటే ఒకడు  ఎం చేసినా అది చెడైనా, మంచైనా  వాడికి వాడే గొప్పగా చెప్పుకోవటం సమర్ధించుకోవటం. ఇది చాలా సందర్భాలలో మనిషి తనని తాను సమాజం నుండి కాపాడుకోవటానికి చేస్తున్నదే. సమర్ధించుకోవటంలో చాలా స్వార్థం ఉంటుంది , అలాగే దీని వల్ల మనిషికి తన మీద తనకి నమ్మకం కూడా పెరుగుతుంది. ఆ నమ్మకాన్ని మంచికి వాడుకుంటే పరవాలేదు, కానీ చెడుగా వాడుకుంటే చాలా కష్టాలు  అనుభవించాల్సి వస్తుంది.

మనకి బాగా తెలుసు రావణాసురుడు , రామ లక్ష్మణులను తప్పుదోవ పట్టించి సీతా దేవిని అపహరించిన విషయం. తాను చేస్తుంది తప్పు అని తనకి తెలుసు, కానీ , అది రాజసంగా భావించి చేసాడు. ఆ తరువాత రాముడు వారధిని నిర్మిచటం , లంకను చేరటం, రావణాసురుడిని సంహరించటం జరిగింది.

ఆ సమయంలో రావణాసురుడు తనని తాను సమర్ధించుకోకుండా , తాను చేస్తున్నది తప్పు అని ఆలోచించి ఉంటె రావణాసురునికి అంతటి దుస్థితి వచ్చి ఉండేది కాదు కదా !!

కానీ , ఈ విషయం తనకు తెలిసినా ఎందుకు పట్టించుకోలేదు అంటే "సందర్భం" అటువంటిది. తన అహంకారాన్ని కోల్పోలేక , చులకనగా చుస్తారన్న భయంతో మనిషి ఎప్పుడూ తనని తాను సమర్ధించుకుంటూనే ఉంటాడు.

ఇది రామాయణ , మహా భారతాల్లోనే కాదు ప్రతీ కుటుంబంలో ,ప్రతీ మనిషిలో,  ప్రతీ రోజూ జరుగుతూనే ఉంటుంది. అసలు చెప్పాలంటే జీవన చక్రంలో ఒక అలవాటుగా మారిపోయింది,మార్చటం అంత తేలిక కాదు. ఇవి మార్చలేకే ఎన్నో రామాయణాలు, మహాభారతాలు మన ఇళ్లల్లో, మన చుట్టూ ఉన్న సమాజంలో రోజూ జరుగుతాయి,జరుగుతూనే ఉంటాయి.

" పరిస్థితి, సందర్భం " అవి తెచ్చిన మార్పులే ఇవన్నీ. కాబట్టి వాటిని సరిగ్గా అర్ధం చేసుకోగలిగి , అనుసరించగలిగితే కొంతవరకైనా వీటి వల్ల జరిగే అనర్థాలను దూరం చెయ్యొచ్చు అని నా చిన్న ఆలోచన.
మరిన్ని శీర్షికలు