Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
take care about your money

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

నాన్న గుండె....

నాన్నగారు రిటైరయి రెండు నెలలయింది. మేము హెచ్ ఏ ఎల్ కాలనీలో ఉండేవాళ్లం. ఇప్పుడు మేముంటున్న ఇల్లు (నెరెడ్ మెట్ ఎక్స్ రోడ్) కన్ స్ట్రక్షన్ చేయిస్తున్నారు. దాదాపు ప్రతిరోజు వెళ్లి నిర్మాణాన్ని పర్యవేక్షించేవారు. ‘అంత దూరం ఎందుకు వెళ్ళడం’ అని నేను రోజూ పోరుతున్నా‘డిఫెన్స్ లో పనిచేశాను, నాకేం అలుపు అనిపించదు. పైగా టైంపాస్ కూడాను’ అనేవారు. అప్పట్లో నేను చర్లపల్లి(ఈ సి ఐ ఎల్ దగ్గర) లో పనిచేస్తుండేవాణ్ని. కాలనీ నుంచి బాలానగర్ బస్టాప్ కి నడుచుకుంటూ వచ్చి, అక్కడ బస్ ఎక్కి సికింద్రాబాదులో దిగి, అక్కడ మరో బస్ ఎక్కి ఈ  సి ఐ ఎల్ కి చేరేవాణ్ని. అక్కడ మా సంస్థ వ్యాన్ సిద్ధంగా ఉండేది. అది నన్ను ఆఫీసుకు చేర్చేది.
మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఉద్యోగం చేస్తున్నా, నన్ను చిన్న పిల్లాడిగానే ట్రీట్ చేసేవాడు. నన్ను బాలానగర్ బస్టాప్ దగ్గర ఆయనే దింపేవాడు.

ఒకసారి సోమవారం ఉదయం మేమందరం కూర్చుని మాట్లాడుకుంటుండగా "రాత్రి నాకెందుకో గుండె పట్టేసినట్టయిందిరా, బహుశా గ్యాస్ ట్రబుల్ అనుకుంటా, కాస్త జీలకర్ర తిని పడుకున్నాను" అన్నాడు. "అదేంటి మరి రాత్రి మమ్మల్నెందుకు లేపలేదు, పద హాస్పిటల్ కి వెళ్లి చూపించుకుందాం"ఆందోళనగా అన్నాను. సాధారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని ఆయన బయటకు చెప్పడు. అదేదో పెద్దనొప్పే అయ్యుంటుందని ఊహిస్తూ అన్నాను. "ఏం ఫర్వాలేదు లేరా!"అన్నాడు. "ఊహూ, వెళ్లాల్సిందే!" అని పట్టు పట్టాను. "ఒక పని చేద్దాం. ఇవాళ రాత్రి అదే నొప్పి వస్తే వెళదాం. అనవసరంగా ఎందుకు?" అన్నారు.

మరుసటి రోజు తెల్లవారుతూనే నొప్పి సంగతి అడిగితే, ‘రాత్రి నొప్పేం రాలే’దన్నారు. హమ్మయ్యా అనుకున్నాను. కానీ మనసులో ఎందుకో కాస్త గుబులుగానే ఉంది.

అప్పట్లో పవర్ కట్ మూలంగా మా ఆఫీసుకు ఆదివారం వర్కింగ్ డే, గురువారం శెలవుండేది. బుధవారం దాకా ఆయనకు ‘నొప్పొచ్చిందేమో’ అని అడుగుతూనే ఉన్నాను. గురువారం పొద్దున్న ‘నిన్న రాత్రి మాత్రం కాస్త గుండే చిక్కబట్టేసినట్టని పించింది’అన్నాడు. అంతే ఆరోజు ఎలాగూ శెలవు రోజు గనక, ఇంక ఉపేక్షించకుండా మా నాన్నగార్ని మిలట్రీ హాస్పిటల్ కి తీసుకెళ్లాను. నాన్నగారు ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ కాబట్టి ఆ మెడికల్ ఫెసిలిటీ ఉంది. హాస్పిటల్ దాకా స్కూటర్ ఆయనే డ్రైవ్ చేశాడు.

డాక్టర్ అన్ని పరీక్షలూ చేసి ఈ సీ జీ తీయించుకు రమ్మన్నాడు. మేము అక్కడికెళ్లేసరికి చాలామంది సర్వీస్ లో ఉన్నవాళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ ఈసురోమంటూ ఎదురుచూస్తూ ఉన్నారు. పైగా ఒక మెషిన్ పాడవ్వగా, మరొక్కటే ఉందట. అది చూసి మానాన్న"చూశావుగా, ఇప్పుడిప్పుడే అవదు. పైగా ఇవాళ కాకపోవచ్చు కూడా! పదరా ఇంటికెళదాం. డాక్టర్ మందులిచ్చాడుగా" అన్నాడు.
"అదేం కుదరదు. డబ్బెంతయినా సరే, నువ్వు రేపు ఇంటి దగ్గర ఉన్న ల్యాబ్ కెళ్లి ఈ సీ జీ తీయించుకుంటానని మాటిస్తే ఇంటికి వెళదాం" అన్నాను.

"సరే లేరా"అన్నాడు నవ్వుతూ.

ఇంటికొచ్చేశాం.

***

యథాప్రకారం తెల్లారింది. శుక్రవారం.

మా నాన్నగారు నన్ను బాలానగర్ బస్టాప్ లో దింపడానికి సిద్ధమవుతున్నాడు.

"నే వెళతాను నాన్నగారూ. నిన్ననేగా డాక్టర్ దగ్గరకి వెళ్లొచ్చాం. రెస్టు తీసుకోండి"అన్నాను.

"నాకేం ఫర్వాలేదు. వచ్చి దింపుతాలేరా"అన్నాడు.

"ఎందుకండి..వద్దు..నామాట వినండి" వారిస్తూ అన్నాను.

మా అమ్మకూడా "మీ అబ్బాయి ఆ కాస్త దూరం నడిచి, ఏం అలసిపోడుగాని, హాయిగా రెస్ట్ తీసుకోండి" అంది.

ఆయనెందుకో ఒప్పుకోలేదు. "వీణ్ని దింపి, పక్కనే ఉండే మార్కెట్లో రెండు కూరలు తీసుకొస్తాను"అన్నాడు, ఎందుకోగాని నన్ను దింపాలన్న పట్టుదలతో.

చేసేదేం లేక స్కూటర్ ఎక్కాను. నన్ను బస్టాప్ లో దింపాడు.

అప్పుడే వచ్చిన బస్ ఎక్కుతూ "నాన్నా మర్చిపోకు, ఈ సీ జీ తీయించుకోవాలి. సాయంత్రం నాకు రిజల్ట్ చెప్పాలి"అన్నాను.

ఆయన నవ్వుతూ తల ఊపాడు ‘అలాగే’ అన్నట్టుగా.

నేను పావు తక్కువ తొమ్మిదికి మా సెక్యూరిటీ గేట్ దాటి లోపలికి వెళుతున్నాను. డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ పర్సన్ రెడ్డి "మీకు హె సి ఎల్ నుంచి ఫోన్ వచ్చింది సార్"అన్నాడు.

మా ఆఫీసులో రాయుడనే అతను మరొకరున్నారు. అతను క్యూ సీ ఇంఛార్జ్! టెలికాం ఇన్స్పెక్టర్స్ మా సంస్థకి, దగ్గర్లోనే ఉన్న హెచ్ సి ఎల్ కీ తిరుగుతూనే ఉంటారు. అంచేత హెచ్ సీ ఎల్ నుంచి మాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి.

నేను రెడ్డి దగ్గరకి వెళ్లి ‘ఫోన్ నాకు అయ్యుండదు, రాయుడొస్తే అతనికి ఫోనొచ్చినట్టుగా చెప్పు’ అని చెప్పి లోపలి వైపుగా ఓ పది అడుగులేశాను.

‘హెచ్ సీ ఎల్ నుంచి ఇంత పొద్దున్నే ఫోన్ రావడమేమిటి? ఫోన్ నా కోసం హెచ్ ఏ ఎల్ నుంచి రాలేదు కదా! అదీ మా నాన్న గారి గురించి కాదుగదా!’ ఆలోచన వచ్చింది తడవు వేగంగా రెడ్డి దగ్గరికి వెళ్లి ’రెడ్డీ, బాగా ఆలోచించుకు చెప్పు, ఫోన్ హెచ్ ఎ ఎల్ నుంచా?’ అడిగాను ఆందోళనగా.

’గుర్తొచ్చింది సార్, హెచ్ ఎ ఎల్ నుంచే. హె సి ఎల్ అలవాటు కదా, అదే నోట్లోంచి వచ్చేసింది’ అన్నాడు.

నాకు పై ప్రాణాలు పైనే పోయాయి.

ఇప్పట్లా అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ల్యాండ్ లైన్ నుంచి హెచ్ ఎ ఎల్ సెక్యూరిటీకి ఫోన్ చేసి ‘నాకేమన్నా ఫోన్ చేశారేమో’ కనుక్కున్నాను.
అనుకున్నంతా అయింది. మా నాన్న గారికి చెస్ట్ పెయిన్ వస్తే సెయింట్ థెరెసా హాస్పిటల్ (ఎర్రగడ్డ)కి పంపించార్ట. ఏం ఫర్వాలేదనీ, జస్ట్ ప్రికాషనరీ స్టెప్ కింద అక్కడికి అంబులెన్స్ లో తీసుకెళ్లారని చెప్పారు.

అది నిజమో లేక ప్రమాదమేమన్నా జరిగిందో, అసలే ఆయన గుండే పట్టేసినట్టుందన్నారు కూడా! వాళ్లు బహుశా నేను భయపడతానని అలా చెబుతున్నారేమో.

పరి పరి విధాల ఆలోచనలతో మెదడు మొద్దుబారి పోయింది. మనసంతా చేదుగా అయి పోయింది.

వేగంగా బస్సులు మారుతూ హాస్పిటల్ కి చేరుకున్నాను. నాన్నగార్ని ఐ సీ యూ లో ఉంచారు.

మా అమ్మ ఏడుస్తూ విషయం చెప్పింది. నేను తనని ఊర్కోబెట్టి, డాక్టర్ తో మాట్లాడితే ‘నాన్న గారికి హార్టేటాక్ వచ్చిందనీ, సమయానికి తీసుకు రావడం వల్ల లైఫ్ సేవింగ్ ఇంజక్షన్ ఇవ్వ గలిగారని. ఇంక భయపడ వలసిందేమీ లేదనీ’ చెప్పాడు.

అప్పటి దాకా కుదురును కోల్పోయిన మనసు కొంత స్థిమిత పడింది. ఎవ్వర్నీ లోపలికి అలౌ చెయ్యడం లేదు. అయినా నేను రిక్వెస్ట్ చేసి కొద్దిగా లోపలి కెళ్లి అద్దాల తలుపు లోంచి లోపలికి చూశాను.

పడుకున్నప్పుడు కాళ్లూపడం నాన్న గారికి అలవాటు. ఆయన కాళ్లూపుతున్నాడు.

అది చూసిన నా కళ్లు సజలాలయ్యాయి. అవి ఆనందబాష్పాలో, ఆయన్నలా చూసినందుకు నిండిన కన్నీళ్లో!

క్షణాలు సైతం భారంగా యుగాల్లా గడుస్తున్నాయి.

‘హాస్పిటల్లో ఉండడం మాకెవరికీ అలవాటు లేదు. ఆయనక్కూడా! పాపం ఎలా ఉన్నాడో? మేము ఎక్కడికి, ఏ శుభాశుభకార్యాలకెళ్లినా ఒకటి రెండు రోజులే! తన ఇల్లు, తన మంచం అదే ఆయనకి కంఫర్టబుల్ గా ఉండేది. అలాంటిది..ఇక్కడ ఒంటరిగా బెడ్ మీద’ ఆలోచనలతో మనసు రంపంతో ముక్కలుగా కోసినట్టవుతోంది. నాన్నగారు అడ్మిట్ అయిన విషయం తెలిసి చుట్టాలు, తెలిసున్నవాళ్లు, ఆఫీసు వాళ్లూ పోటెత్తుతున్నారు. ఎవ్వరినీ అలౌ చెయ్యడం లేదు. కొంత మందైతే సిస్టర్స్ తో, స్టాఫ్ తో గొడవేసుకున్నారు కూడా. నాకిప్పటికీ గుర్తు, ముఖం మీద స్పోటకం మచ్చలున్న ఓ సిస్టర్..చాలా సీనియర్ అనుకుంటా, రూడ్ గా మాట్లాడేది. ఆమె బయటకు వచ్చి’నా వంక కోపంగా చూస్తూ, ఇలా అందరూ ఐ సీ యూ లోపలికి చొచ్చుకు వస్తే ఎలా? పైగా గొడవ పెట్టుకుంటారా? బుద్ధుండాలి. ఇలా అయితే ట్రీట్ మెంట్ కష్టం" అంది తీవ్రంగా.

నేను ఆవిడ దగ్గరకి వెళ్లి ’మేము రాము, ఎవ్వరినీ లోపలికి వెళ్లొద్దని బతిమాలుకుంటాను. ప్లీజ్ సిస్టర్ మా డాడీని సేవ్ చేయండి చాలు’ అని ఆవిడ చేతులు పట్టుకుని కళ్ల నీళ్ళ పర్యంతమవుతూ బతిమిలాడాను.

ఆమె విసురుగా లోపలికి వెళ్లి పోయింది.

శుక్ర వారం రాత్రి హాస్పిటల్లో రక రకాల ఆలోచనల్తో, నాన్నగారి జ్ఞాపకాలతో నిద్ర పట్టలేదు. ఆయన్ను తల్చుకుంటే గుండె బీటలు వారుతోంది.
శని వారం. ఉదయం అయిదు గంటలు.

‘నాన్నగారికెలా ఉందని’ డ్యూటీ సిస్టర్ ని అడిగాను.

తను చిన్నగా నవ్వుతూ’ మీ నాన్న గారికేం ఫర్వాలేదు. ఇంటికెళ్లి టూత్ పేస్ట్, టవల్, కాసిని పాలు తీసుకు రండి’ అంది.

నాకు వెయ్యేనుగుల బలం వచ్చింది.

టీ వీ ఎస్ మీద ఇంటికెళ్లి స్నానం చేసి, సిస్టర్ చెప్పినవి తీసుకుని హాస్పిటల్ కి వచ్చాను.

మా అమ్మను కూడా, ఆటోలో ఇంటికెళ్లి, స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుడికి దణ్నం పెట్టుకుని రమ్మన్నాను. మా నాన్నకు శని వారం చాలా ఇష్టం. పొద్దున్నే లేచి రేడియోలో సుప్రభాతం పెట్టి, దేవుడికి కుంకం పెట్టి, పూలు పెట్టి, అగరొత్తులు వెలిగించేవాడు.

మా అమ్మ తనకు వెళ్లాలనిపించడం లేదని బాధగా ఏడుస్తూ అంది.

"వెళ్లమ్మా, పోని నాకు చెప్పిన సిస్టర్ చేత నాన్న కోలుకుంటున్నాడని నీకూ చెప్పించనా, అప్పుడెళ్తావా?"అని ఐ సీ యూ వైపు నాలుగడుగులు వేశాను.

అప్పుడే ఆ స్పోటకం మచ్చల సిస్టర్ ఆందోళనగా నా దగ్గరకు వచ్చి ’మీరు ఆయన పెద్ద కొడుకు కదూ, ఒక్క సారి ఇలారండి"అంది.
నా మనసెందుకో కీడు శంకించింది. ‘ఎందుకు సిస్టర్’ నా గొంతు వణుకు, ఏడుపులతో పూడుకు పోయింది.

అంతకు ముందే వచ్చి, నాకు కొద్ది దూరంలో నుంచున్న మా మల్లుబావతో ’ఒరే బావా నాకు భయమేస్తోందిరా, లోపలికి వస్తుంటే తిట్టి దూరంగా ఉంచే సిస్టర్, ఐ సీ యూ కి రమ్మంటోంది" అన్నాను వాడి మీద వాలిపోయి.

వాడు నన్ను నిదానంగా అక్కడికి తీసుకెళ్ళాడు.

అక్కడ..అక్క..డ..మా నాన్న గుండెల మీద గుద్దుతూ కొంత మంది డాక్టర్లు..మానీటర్ స్కీన్ మీద పల్స్ లు వీక్ గా..వీక్..గా..కనిపించాయి.
అంతలోనే అవ్వాల్సింది అయి పోయింది. మా నాన్నగారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసి పోయాయి.

డాక్టర్ బయటకొచ్చి విషణ్ణ వదనంతో ’సారీ’ చెప్పి ’అన్ ఎక్స్ పెక్టెడ్ గా మాసివ్ హార్టెటాక్ వచ్చింది’ అన్నాడు బాధగా. ఆయన బతికున్నప్పుడు మమ్మల్ని చూడనీయకుండా తిట్టిన సిస్టర్ కళ్లలో నీళ్లు. "సిస్టర్ మీరు తిడుతున్నారని నేనూ లోపలికి రాలేదు, ఎవ్వరినీ రానీయ లేదు. మీరే నాన్న గార్ని మాకు అప్పగించ లేదు" ఏడుస్తూ అనేశాను. నన్ను ఓదారుస్తూ అలా స్థాణువులా నిలుచుండి పోయింది.

అందరి చేత దేవుడని కొనియాడబడిన నాన్న.

ఎవ్వర్నీ నొప్పించని మనీషి.

చుట్టూ ఉన్నవాళ్లకి సహాయ సహకారాలు అందించిన మానవతా మూర్తి.

ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి.

కొట్టకుండా, తిట్టకుండా ఓ శ్రేయోభిలాషిలా, స్నేహితుడిలా మా ఇద్దరన్నదమ్ముల్నీ సంస్కార వంతులుగా పెంచిన నాన్న.

ఈ జన్మకు ఇహ లేడు.

‘నాన్నా’ అని నోరారా పిలవ లేను.

నాన్న గారూ! మా హృదయాల్లో మీరెప్పటికీ అమర్ రహే!!

భగవంతుడా! ఎన్ని జన్మలైనా ఆయనే నాకు నాన్నగా కావాలి!

ఓం శాంతి శాంతి శాంతిః

మరిన్ని శీర్షికలు
betala prashna