Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: కాలా 
తారాగణం: రజనీకాంత్‌, నానా పటేకర్‌, సముద్ర ఖని, హ్యుమా ఖురేషి, ఈశ్వరిరావు తదితరులు. 
సంగీతం: సంతోష్‌ నారాయణ్‌ 
సినిమాటోగ్రఫీ: మురళి జి 
రచన, దర్శకత్వం: పా రంజిత్‌ 
నిర్మాత: ధనుష్‌ 
నిర్మాణం: వుండర్‌ బార్స్‌ ఫిలింస్‌ 
విడుదల తేదీ: 07 జూన్‌ 2018 
క్లుప్తంగా చెప్పాలంటే 
ముంబైలోని ధారావి అనే ఓ మురికి వాడ వుంటుంది. ఆ మురికి వాడకు కరికాలన్‌ అలియాస్‌ కాలా నాయకుడు. ఓ రాజకీయ నాయకుడు హరిదాదా (నానా పటేకర్‌) ఆ మురికివాడను సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో వుంటాడు. దానికి కాలా అడ్డు తగులుతాడు. మరి హరిదిదాదా, కాలాను అడ్డు తొలగించుకున్నాడా? ధారావి మురికి వాడను సొంతం చేసుకున్నాడా? హరిదాదా కారణంగా కాలాకి కలిగిన నష్టమేంటి? ధారావిని హరిదాదా చేతుల్లోకి వెళ్ళకుండా కాలా ఏం చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెరపైనే దొరుకుతాయి.

మొత్తంగా చెప్పాలంటే

నటుడిగా రజనీకాంత్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది? ఆయన అలా నడిస్తే ఓ స్టైల్‌. సిగరెట్‌ కాల్చితే ఇంకో స్టయిల్‌. కూర్చుంటే స్టైల్‌, నిల్చుంటే స్టైల్‌. మురికివాడ కథ ఎంచుకున్నా రజనీకాంత్‌లోని ఆ స్టైల్‌ మాత్రం తగ్గలేదు. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీదనే మోసేశాడు రజనీకాంత్‌. డైలాగులు, యాక్షన్‌.. ఇలా ఒకటేమిటి, అన్నిట్లోనూ తనదైన స్టైల్‌తో సత్తా చాటాడు ఈ సూపర్‌ స్టార్‌. 'కాలా' పాత్రలో రజనీకాంత్‌ ఒదిగిపోయిన తీరు సింప్లీ సూపర్బ్‌.

రజనీకాంత్‌ తర్వాత సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాత్ర నానా పటేకర్‌దే. నానా పటేకర్‌, రజనీకాంత్‌ ఒకే ఫ్రేమ్‌లో కన్పిస్తే, ఆ సీన్స్‌ అద్భుతమే. ఒకరితో ఒకరు పోటీ పడ్డారు నటన పరంగా. ఒకరితో ఒకరు తలపడే సీన్స్‌ అభిమానుల్ని విపరీతంగా అలరిస్తాయి. ఈ సినిమాకి రజనీకాంత్‌ తర్వాత అతి పెద్ద ఎస్సెట్‌ నానా పటేకర్‌ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈశ్వరీ రావు, హ్యుమా ఖురేషీ తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.

కథ పరంగా చూసుకుంటే, ఇది కొత్తదేమీ కాదు. కథనం బాగానే వుంది. డైలాగ్స్‌ కొన్ని బాగా ఆకట్టుకుంటాయి, కొన్ని తేలిపోతాయి. మురికివాడ సెట్‌ అత్యద్భుతంగా అన్పిస్తుంది. టెక్నికల్‌గా ముందు ఈ సెట్‌ గురించే మాట్లాడుకోవాలి. సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ బాగున్నాయి. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా వున్నాయి.

రజనీకాంత్‌ గత చిత్రాలు తీవ్రంగా నిరాశపర్చడంతో ఈ సినిమాపై కాసిన్ని అనుమానాలు నెలకొన్న మాట వాస్తవం. అదే సినిమాకి ప్లస్‌ అయ్యింది. తక్కువ అంచనాలతో థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడు డిజప్పాయింట్‌ అవడు. అయితే, రజనీకాంత్‌ నమ్మకాన్ని పా రంజిత్‌ ఇంకోసారి వమ్ము చేశాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. కథకుడిగా పా రంజిత్‌ మైనస్‌ పాయింట్స్‌ కన్పిస్తాయి. రజనీకాంత్‌ అభిమానులు ఆశించే చాలా విషయాల్లో పా రంజిత్‌ లైట్‌ తీసుకుంటున్నాడు. ఓవరాల్‌గా సినిమా ఫర్వాలేదన్పిస్తుంది. డిజాస్టర్స్‌ తర్వాత వచ్చిన సినిమా కావడంతో, 'బెటర్‌' అనే అభిప్రాయమైతే ఖచ్చితంగా కలుగుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే

కాలాతో రజనీకాంత్‌ కోలుకున్నట్టే

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka