Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue273/724/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/


(గత సంచిక తరువాయి)....  గాయత్రి శరణ్య ఇంటికి వచ్చి నెల గడిచింది.

ఆ రోజే శరణ్యకి ఎవరో చెప్పారు వాళ్ళింట్లో ఒక చిన్న పోర్షన్ ఖాళి అవుతోందని, అద్దె మూడు వేలని.. అంత అద్దె గాయత్రి ఎలా భరించ గలదు అనిపించింది శరణ్యకి.

“అలా అని మన ఇంట్లో ఎంత కాలం ఉంచుకుంటాం శరణ్యా.. ఆ అద్దె మనం కడదాం ఆ అమ్మాయిని పంపించు.. దగ్గరేగా ఆఫీసుకి వచ్చి వెళ్తుంది” అన్నాడు తేజ.

శరణ్య కొద్ది సేపు ఆలోచించింది.. తేజ అన్నది ఒక విధంగా కరెక్ట్ .. ఎంత కాలం ఇక్కడ ఉంటుంది.. అనిరుద్ అసలు వెళ్ళే ప్రయత్నం కూడా చేయడం లేదు.. వెళ్ళమని చెప్పడం బాగుండదు.. అతనికి తోడు ఈ అమ్మాయి కూడా భారమే .. డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు కానీ బాధ్యత మీద పెట్టుకోడం ఎంత వరకు సబబు!

తేజ ప్రపోసల్ అంగీకరించింది.

మర్నాడు అడ్వాన్సు ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు.

ఆ రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర గాయత్రికి చెప్పింది శరణ్య ఇల్లు దొరికింది ఫస్ట్ నుంచి అక్కడ ఉండచ్చు  అని . గాయత్రి తల ఊపింది.. ఆమెకి మనసులో మాత్రం భయం పాములా పాకుతోంది. మళ్ళి తను వంటరిగా ఉంటే ఎవరు ఎలా అటాక్ చేస్తారో, ఎలా బతకాలో ఆమెకి దడగానే ఉంది కానీ అలాగని వీళ్ళకి తను భారం కాకూడదు కదా అనుకుంది.

అయితే ఆ విషయం విన్న అనిరుద్ మాత్రం బాధ పడ్డాడు. మళ్ళి ఈ అమ్మాయిని వంటరిగా ఎక్కడో ఉంచడం అతనికి నచ్చలేదు. అలాగని ఆ మాట అనలేక పోయాడు. మా శక్తి ఇంతే నీకు కావాలంటే నువ్వు సాయం చేయి అంటారేమో అనిపించింది. అతనికి కూడా ఒక పక్క గాయత్రి అక్కడ ఎక్కువ కాలం ఉండడం సరి కాదు అనిపిస్తోంది కానీ ఆ అమ్మాయి అమాయకత్వం చూస్తుంటే మాత్రం కొంచెం జాలి వేస్తుంది. అందుకే మౌనంగా ఉండి పోయాడు. అంతే  కాదు తను కూడా వచ్చి నెల దాటింది షూటింగ్ అయి పోతే వెళ్లి పోవాలి అని నిర్ణయించుకున్నాడు.
రెండు రోజుల్లో డాక్యుమెంటరీ షూటింగ్ అయింది.

రఫ్ వెర్షన్ ఆఫీస్ లో కూర్చుని కంప్యూటర్ లో వాళ్ళు చూస్తుంటే తనూ దూరంగా నుంచుని ఆసక్తిగా చూసింది గాయత్రి. ఈ విజయవాడకి ఇంత చరిత్ర ఉందా అనిపించింది. కృష్ణా నది, దుర్గమ్మ గుడి, గాంధీ హిల్స్, మొత్తం విజయవాడని అలా చూస్తుంటే సరదాగా అనిపించింది.
మరో రెండు రోజులు ఇద్దరూ ఆఫీస్ లోనే ఉంది, ఎడిటింగ్, మ్యూజిక్ వగైరా పనులు చూసుకోడంతో గాయత్రి అక్కడ ఉండకుండా శరణ్య ఫ్లాట్ కి వచ్చేసింది.

ఒకటో తారీకు వచ్చింది.

మంచి రోజు చూసి గాయత్రిని, బాబుని వాళ్ళ కోసం రెంట్ కి తీసుకున్న పోర్షన్ కి చేర్చింది శరణ్య. అక్కడ నుంచి పది నిముషాలు నడక ఆఫీస్ కి .. ఆమె ఇంటి ఓనర్ ఇంట్లోనే బేబి కేర్ సెంటర్ నడిపిస్తోంది. బాబుని ఆమె దగ్గర వదిలేసి ఆఫీస్ కి రావడానికి ఏర్పాట్లు చేసింది శరణ్య. ఉదయం పదింటికి వచ్చి, మధ్యాన్నం మూడున్నరకి వెళ్లి పోవాలి..ఒక్కో సారి తేజ అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్తే త్వరగా వెళ్లి పోవచ్చు.  గాయత్రికి ఆవిడ పట్ల కృతజ్ఞతతో మనసు నిండి పోయింది. ఏ జన్మలోనో ఈమె నాకు అక్కనో, అమ్మనో అయి ఉంటుంది అనుకుంది.
గాయత్రి, బాబు వెళ్ళి పోయాక ఇల్లంతా బోసి పోయినట్టు అనిపించింది శరణ్యతో పాటు తేజకి అనిరుద్ కి కూడా. బాబు ఇల్లంతా పాకుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే సందడిగా ఉండేది.

“మనం అర్జెంటు గా ఓ పని చేయాలి” అన్నాడు తేజ ఆ రాత్రి శరణ్యని దగ్గరకు తీసుకుంటూ.

“ఏంటి బాబు అది.. ఇంకా ఏదన్నా సోషల్ సర్విసా..”

“ఊహు కాదు...మన సర్వీసు ..”

“మన సర్విసా..” అదోలా చూసింది.

“చెప్పనా” కొంటెగా అడిగాడు..

“చెప్పు” అంది.

“పిల్లల్ని కనేయాలి. “

“నువ్వు కనేయ్” పెదాల మధ్య నవ్వు బిగ పట్టి అంది.

“జోక్ కాదు నిజం .. సీరియస్ గా చెప్తున్నా.. ఇంక ఆ పనిలో ఉండాలి. గాయత్రి బాబు వెళ్ళాక ఇల్లంతా బోసి పోతోంది.. మన బాబో, పాపో అలా పారాడుతుంటే ఎంత బాగుంటుంది కదా!”

“బాగానే ఉంటుంది కానీ ఇంకా ఒక్క ఎనిమిది నెలలు ఆగితే నా సర్వీస్ రేగులరైజ్ అవుతుంది.. అప్పుడు మెటర్నిటీ లీవు, సిక్ లీవు అన్నిటికి ఎలిజిబిలిటి వస్తుంది..”

“ఎనిమిదా ... నో ప్రాబ్లం ... మనం సేరియస్ గా ప్రయత్నాలు మొదలు పెడితే ఈ లోగా ఎనిమిది నెలలు గడుస్తాయి..” శరణ్య తేజ ఆరాటం చూసి నవ్వింది..” చాలా ఆరాటంగా ఉందే అబ్బాయికి” అంది తలతో అతని తల సున్నితంగా డి కొడుతూ.

గభాల్న ఆమెని మీదకి లాక్కుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ అంతకన్నా ఇంకా ఈ ఆరాటం ఎక్కువ అన్నాడు చెవిలో గుస, గుసగా.

********************

ఆఫీస్ అకామడేషన్ లో పడుకున్న అనిరుద్ కి నిద్ర పట్ట లేదు.

అతనికి ఎందుకో పదే, పదే గాయత్రి గుర్తొస్తోంది. లేత తమలపాకు లాంటి సున్నితమైన శరీరం, చక్కటి కనుముక్కు తీరు, కళ కళ లాడే కళ్ళు, నెమ్మదిగా మాట్లాడే తత్త్వం. ఈ అమ్మాయి తన కన్నా చాలా చిన్నది అయిపొయింది.. లేక పోతే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం ప్రశాంతంగా సాగి పోతుంది కదా ..

ఎంత బాగుంటుంది గాయత్రి..

ఎందుకో ఈ మధ్య పెళ్లి చేసుకోవాలన్న కోరిక బలంగా కలుగుతోంది.

కానీ నలభై కి చేరువ అవుతున్న తనని చేసుకోడానికి ఎవరు ఇష్ట పడతారు అని కూడా అనిపిస్తోంది.

తేజ అన్నాడు “ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా మంది ముప్ఫై దాటాకే చేసుకుంటున్నారు.. తప్పకుండ నీకు మంచి అమ్మాయి వస్తుంది.. పేపర్ యాడ్ ఇద్దాం” అని కానీ అనిరుద్దే అందుకు అంగీకరించ లేదు.

తేజ, శరణ్యాల అన్యోన్యత చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తోంది.

అందం, విద్య, హోదా , తెలివి తేటలు, మంచి మనసు ఉన్న శరణ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా..

అందం, అణకువ, సౌజన్యం మూర్తిభవించిన గాయత్రి లాంటి అమ్మాయి దొరుకుతుందా.

వీళ్ళిద్దరూ కాకుండా తన అభిరుచికి, ఆలోచనలకి విరుద్ధంగా ఉండే అమ్మాయి దొరుకుతుందా.

అనిరుద్ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది.

బెడ్ లైట్ వెలుగులో గోడ మీద ఉన్న రవి వర్మ చిత్ర పటం చూస్తూ ఎంత బాగుంది ఈ పటంలో అమ్మాయి.. చిత్రకారుడి ఊహల్లో రూపం దిద్దుకుని, కుంచెతో ప్రాణం పోసుకున్న సుందరి...ఇలాంటి అమ్మాయి భార్యగా లభిస్తే!

అనిరుద్ కి కొంచెం భయం వేసింది ... ఎన్నడూ లేనిది ఈ మధ్య తన మనసు పెళ్లి, భార్య మీదకి మళ్ళడం కాక కనిపించిన ప్రతి అమ్మాయిని తన భార్యగా ఊహించుకోడం .. ఛ నాకేదో అవుతోంది అనుకుంటూ నిద్ర పోడానికి కళ్ళు మూసుకున్నాడు.

(ముగింపు వచ్చే సంచికలో..................)

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana