Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఇందూరమణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.....

http://www.gotelugu.com/issue285/749/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)...

‘‘ఆమెని ఎక్కడో చూసానంటాడు సార్‌! ఎక్కడ చూసాడో గుర్తు రావటం లేదు అంటాడు. చాలా సేపు తర్కించి అడిగినా పాపం గుర్తు రాక చాలా ఇబ్బంది పడ్డాడు. గుర్తొచ్చిన వెంటనే నాకు ఫోన్‌ చెయ్యమని నా సెల్‌ నెంబర్‌ ఇచ్చి వచ్చేసాను సార్‌!’’ చెప్పాడు రైటర్‌.

‘‘ఓకే, రాజమండ్రిలో నాకు దొరికన ఆధారం ఇదే ఈ ఫొటో చూడండి.’’ అంటూ తన సెల్‌ లో తీసిన గ్రూప్‌ ఫొటో చూపించాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

సెల్‌ చేతిలోకి తీసుకుని ఫొటో పరిశీలనగా చూసాడు రైటర్‌.

‘‘సార్‌! ఈ గ్రూప్‌ ఫొటో మధ్యలో నిలబడ్డ అమ్మాయే కదా సార్‌ ఈమె. ఆమె ఫొటోయే కదా సార్‌. వయసులో ఉండగా తీసినట్టున్నారు.’’ ఆనందంగా కేసు ఓ కొలిక్కి వచ్చేసిందన్న సంతోషంతో బిగ్గరగానే అన్నాడు రైటర్‌.

‘‘నాకూ ఒక విషయం అంతు చిక్కటం లేదు. ఈ ఫొటోలో ఉన్నది... మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న‘ఆమె’ ఇద్దరూ ఒక్కరేనా? అని’’ ఆలోచిస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఇంతలో కేజిహెచ్‌లో ఉండాల్సిన కానిస్టేబుల్స్‌ ఇద్దరూ ఆయాసంతో ఆతృతగా స్టేషన్‌లోకి పరుగున వచ్చారు.

వాళ్లలా ఎందుకు పరిగెత్తుకు వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. వస్తూనే రైటర్‌ కోసం వెతుకుతూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ గది ముందుకు వచ్చి నిలబడ్డాడు.

‘‘ఏమైంది? మీరెందుకు వచ్చేసారు?’’ రైటర్‌ వాళ్లని చూస్తూనే అడిగాడు. ఆయాస పడుతూ నిలబడ్డ కానిస్టేబుల్‌ని చూస్తూనే లోపలకు రమ్మని తల వూపి సైగ చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌..

ఇద్దరూ భయంగా లోపలకు వచ్చారు.

‘‘ఏం జరిగింది? ఎందుకలా ఆయాస పడి పోతూ ఆందోళనగా కనిపిస్తున్నారు. చెప్పండి?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌!....సార్‌! కేజిహెచ్‌లో చికిత్స పొందుతున్న కుర్రాడు సోము కనిపించటం లేదు సార్‌!’’ ఆందోళనగా అన్నారు ఇద్దరూ.

‘‘ఆ కుర్రాడితో మీకేం పని. మీకు అప్పగించిన పని ఆ కుర్రాడి మిత్రుడు ‘రాము’ని ఫాలో చెయ్యమని కదా!’’ రైటర్‌ కల్పించుకుని అన్నాడు.

‘‘సోము దగ్గరే రాము కూడా ఉన్నాడు సార్‌. ఇద్దరూ కనిపించటం లేదు.’’ అన్నారిద్దరూ మళ్లీ.

‘‘వ్వాట్‌!  ఎక్కడికి పోతారు? ఆ చుట్ట పక్కల అంతా వెదక లేక పోయారా?’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘వెతికాము సార్‌! ఎవరో ఒకామె కారులో వీళ్లిద్దర్నీ ఎక్కించుకుని వెళ్ళి పోయిందని చూసిన వాళ్ళు చెప్పారు.’’ భయంగా అన్నాడొక కానిస్టేబుల్‌.

‘‘వ్వాట్‌!’’ అదిరి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

కానిస్టేబుల్స్‌ ఇద్దరూ చెప్పింది వింటూనే మ్రాన్పడి పోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎవరీమె?!? ఏం కావాలి ఆమెకి? పోలీసులకు దొరక్కుండా ఎందుకు దాక్కుంటోంది?! ఎవరూ లేని ఆనాధ యాచక కుర్రాళ్ళను ఎందుకు కిడ్నాప్‌ చేసింది.’’ ఆలోచిస్తూనే టక్కున లేచి నిలబడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌..

హాస్పిటల్‌ నుండి పారిపోతుంటే హాస్పిటల్‌ సిబ్బంది చూస్తూ ఊరుకున్నారా?. నెవ్వర్‌! ఇందులో ఏదో మోసం ఉంది. అక్కడే ఎవరో...ఆమెకి సహాయం చేస్తున్నారు. ఎవరు?!        

ఆలోచిస్తూనే స్టేషన్‌లో నుండి బయటకు వచ్చాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

అదే సమయంలో పోలీస్‌ స్టేషన్‌ ముందు జీపు దిగాడు సి ఐ సత్యారావు. సి.ఐ.ని చూడగానే గౌరవ పూర్వకంగా సెల్యూట్ చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అప్పుడే రావడం...ఎటో వెళ్ళడానికి బయలుదేరడం కూడా జరిగి పోతుందా?’’ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కి ఎదురు పడగానే అన్నాడు సి.ఐ. సత్యారావు.

‘‘ఎస్సార్‌! కేజిహెచ్‌కి వెళ్తున్నాను.’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘నువ్వు ఎక్కడికెళ్లినా ముందుగా నాతో చెప్పు. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకు. అదీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో’’ పోలీస్‌ స్టేషన్‌ లోకి నడుస్తూనే అన్నాడు సి.ఐ. సత్యారావు.

సి.ఐ. ని అనుసరిస్తూ మళ్ళీ స్టేషన్‌ లోకి వచ్చాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎస్సార్‌! నాతో రైటర్‌ గారు కూడా వస్తున్నారు.’’ చెప్పాడు ఎస్సై.

‘‘ఓకే. కేరీ ఆన్‌’’ అంటూ సి.ఐ. సత్యారావు తన గది లోకి వెళ్ళి పోయాడు.

బుల్లెట్‌ మీద రైటర్‌ని ఎక్కించుకుని అర గంటలో కేజిహెచ్‌ కి చేరుకున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

నేరుగా ఎమర్జెన్సీ వార్డు లోకి వెళ్ళాడు. యూనిఫాంలో ఉన్న పోలీసుల్ని చూడగానే నర్సు గాబరాగా ఎదురొచ్చింది.

‘‘సార్‌! చెప్పండి సార్‌! ఎవరు కావాలి?’’ ఆతృతగా అడిగింది.

‘‘ఇక్కడ సోము అనే కుర్రాడుండాలి ఏడి ఎక్కడికి వెళ్ళాడు?’’ కోపంగా అరిచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అదే సార్‌ ఆ కుర్రాడి కోసమే వెతుకుతున్నాము.’’ భయం భయంగా చెప్పింది నర్సు.

‘‘వార్డులో ఉండాల్సిన పేషెంట్లు ఎలా మిస్సవుతారమ్మా! మీరు డిశ్చార్జ్‌ చేస్తే గాని వెళ్ల లేరుగా?’’ అన్నాడు రైటర్‌.

‘‘అదేం లేదు సార్‌. కొందరు మేము ఉండమన్నా ఉండకుండా వెళ్లి పోతుంటారు. కొందరు మాకు తెలీకుండా పారి పోతుంటారు. ఇది సహజమే సార్‌!’’ అంది నర్సు.

‘‘ వార్డులో కాపలా ఎవరూ ఉండరా? ఎమర్జెన్సీ వార్డు కదా ఇది మీరు ఇరవై నాలుగ్గంటలు పేషెంట్లను పర్యవేక్షిస్తూ ఉండాలికదా.’’ కోపంగా అన్నారు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘నిజమే సార్‌ కానీ ఉదయం టిఫిన్‌ సప్లయి చేస్తున్నప్పుడు ఆ కుర్రాడు తన స్నేహితుడితో కలసి బయట వరండాలో కబుర్లాడుతూ కూర్చున్నాడు. హాస్పెటల్‌ కాంపౌండులోనే కదా ఉన్నాడని మా సిస్టర్‌ మందుల కోసం స్టోర్‌ రూమ్‌కి వెళ్ళిందట సార్‌.’’ అంది ఆ నర్సు.

‘‘నర్సు ఒక్కరే ఉంటారా?’’ అడిగాడు రైటర్‌.

‘‘ద్వారం దగ్గర వార్డు బోయ్‌ కూడా కాపలా ఉంటాడు సార్‌?’’ అంది నర్సు.

‘‘అతను చూసుండాలి కదా!’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అతను డ్యూటీ దిగి వెళ్లి పోయాడు సార్‌! ఆ తర్వాత చూస్తే ఈ బెడ్‌ మీద ఉండాల్సిన కుర్రాడు కనిపించ లేదు.’’ అంది నర్సు.

ఇదంతా సర్వ సాధారణం అన్నట్టు చెప్తున్న నర్సుకేసి కోపంగా చూసాడు. కానీ ఏం చేయ గలడు.

‘‘ఇక్కడ నుండి ఎవరి సహాయం లేకుండా కుర్రాళ్లిద్దరూ అంత దర్జాగా పారిపోలేరు. ఎవడో ఒకడు అండగా ఉన్నాడు. వాడు ఈ వార్డు బోయ్‌ కావచ్చు. మరెవరైనా కావచ్చు చూద్దాం.’’ ఆలోచిస్తూనే చుట్టూ పరికించి చూసాడు ఎస్సై.

‘‘ఆ వార్డు బోయ్‌ మళ్లీ డ్యూటీకి ఎప్పుడొస్తాడు?’’ అడిగాడు రైటర్‌.

‘‘మళ్ళీ నైట్‌ డ్యూటీకి వస్తాడు సార్‌.’’ అంది నర్సు.

‘‘అంత వరకూ వెయిట్‌ చెయ్యలేం. వాళ్ల ఇల్లెక్కడో మీకు తెలుసా సిస్టర్‌?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘నాకు తెలీదు సార్‌. అదిగో ఆ ద్వారం దగ్గర ఉన్న వార్డు బోయ్‌ని అడగండి.’’ అంటూ వేరే పేషెంట్‌ దగ్గరకు పరుగున వెళ్లింది నర్సు.

వార్డు బయట ద్వారం దగ్గర కూర్చున్న వార్డు బోయ్‌ ఉదయమే డ్యూటీకి వచ్చానని చెప్పాడు. అతని దగ్గర  నైట్‌ డ్యూటీలో ఉన్న వార్డు బోయ్‌ ఇంటి అడ్రస్‌ తీసుకుని బయలుదేరారు ఇద్దరూ,.

చెంగల్రావు పేట సందులో ఉంది ఆ వార్డు బోయ్‌ ఇల్లు.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ బులెట్‌ మీద కూర్చుని రైటర్‌ని పంపించాడు.

డ్యూటీ దిగి వచ్చి గదిలో హాయిగా పడుకున్నాడు వార్డు బోయ్‌. పోలీసులొచ్చారని పెళ్లాం కొట్టి లేపే సరికి ఉలిక్కి పడి లేచాడు. కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చి ఇంటి ముంగిట నిలబడ్డ పోలీసుని చూడగానే గతుక్కుమన్నాడు. గబగబా లుంగీ సర్దుకుని నిటారుగా నిలబడ్డాడు.

‘‘సార్‌! నాకోసమే వచ్చారా?’’ ఆతృతగా అడిగాడు వార్డు బోయ్‌.

‘‘నీకోసమే! రా! సందు చివర ఎస్సై గారు నిలబడ్డారు.’’ అంటూనే అతను చెప్పేది వినకుండా చెయ్యి పట్టుకుని ఎస్సై అక్బర్‌ ఖాన్‌ దగ్గరకు లాక్కు వచ్చాడు రైటర్‌.

‘‘ఇతనేనా ఆ వార్డు బోయ్‌?’’ వార్డు బోయ్‌ని చూస్తూ అడిగాడు ఎస్సై.

‘‘ఎస్సార్‌!’’ చెప్పాడు రైటర్‌.

‘‘సార్‌! నేనేం తప్పు చేసాను సార్‌?’’ అయోమయంగా అడిగాడు వార్డు బోయ్‌.

‘‘ఏం తప్పు చేసావో నీకు తెలీదా? నిజం చెప్తే సరే సరి. లేదా స్టేషన్‌కి లాక్కు పోయి నిజం ఎలా రాబట్టాలో మాకు తెలుసు.’’ కర్కశంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! సార్‌! నిజమేంటో నాకర్థం కావటం లేదు సార్‌!’’ భయం భయంగా ఎస్సై కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘ఎమర్జెన్సీ వార్డులో ఉండాల్సిన ‘సోము’ ఎక్కడికి వెళ్ళాడు?’’ సూటిగా చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! సోము గురించి అడుగుతున్నారా?! ఆ కుర్రాడు పారి పోయాడు సార్‌?’’ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘పారి పోయాడా? పారి పోయేలా తప్పించావా? ఆ కుర్రాడితో పాటు ఉండాల్సిన రాము కూడా లేడు కదరా! వాడేమయ్యాడు.’’ అడిగాడు రైటర్‌.

‘‘సార్‌! ఇద్దరూ కలిసే పారి పోయారు సార్‌?’’ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘పారి పోయారని నీకెలా తెలుసు?’’ అడిగాడు ఎస్సై.

ఎస్సై అక్బర్‌ఖాన్‌ అలా నిలదీసి అడిగే సరికి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా తల దించుకుని నిలబడి పోయాడు వార్డు బోయ్‌.

‘‘మర్యాదగా నిజం చెప్తే బ్రతికి పోతావ్‌. లేదా వాళ్లిద్దర్నీ నువ్వే తప్పించావని కేసు బుక్‌ చేస్తే నీ ఉద్యోగం పోతుంది. జైలు పాలవుతావు. నీ కుటుంబం రోడ్డున పడుతుంది.’’ కర్కశంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! అంత మాట అనకండి సార్‌! నాకు తెలిసిందంతా చెప్తాను. పూస గుచ్చినట్టు చెప్పేస్తాను.’’ ఆందోళనగా అన్నాడు వార్డు బోయ్‌. రైటర్‌ కేసి చూసి వాడు చెప్పేదంతా రికార్డు చేయమన్నట్టు తల తోనే సైగ చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘రెండు రోజుల క్రితం....’’ అంటూ వార్డు బోయ్‌ జరిగిందంతా చెప్పడం ప్రారంభించాడు.

వార్డు బాయ్ చూసినదాంట్లో అతడికి తెలిసినదెంత? అతడు ఎప్పబోయేదాంట్లో నిజమెంత? ఆ వివరాల ద్వారా పోలీసులు చేదించగలిగేదెంత???

 

ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చేశుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani