Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue293/765/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)..‘‘ఇది మేడమ్ గారి ఏ టి ఎమ్ కార్డు.’’ అంటూ జేబులో నుండి శోభాదేవి గారి ఏ టి ఎమ్ కార్డు తీసి చూపించాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘వ్వాట్! ఇది మీకెక్కడ దొరికింది. నిన్ననే మేడమ్ గారు ఈ ఏ టి ఎమ్ కార్డు పోయిందని బ్యాంకులో రిపోర్టు చేసి పిన్ నెంబర్ బ్లాక్ చేసాము. కొత్త ఏ టి ఎమ్ కార్డు తీసుకున్నాం కూడా.’’ అంతులేని ఆశ్చర్యంతో అంది ఆ అమ్మాయి.

ఆ అమ్మాయి అలా అనే సరికి ఎస్సై అక్బర్ఖాన్ కి మతిపోయింది. ఏ ఆధారంతో అయితే తాను ఇంత దూరం వచ్చాడో....అది తుస్సుమంది. శోభాదేవి గారితో ఇంకేం మాట్లాడగలడు? ఎలా ఆరా తీయగలడు? ‘ఆమె’ ఎవరు?....మీ కార్డు ఆమె దగ్గరకెలా వెళ్లిందని అడగాలనుకున్నాడు కానీ, క్షణంలో ఆ విషయం తేల్చేసింది ఈ అమ్మాయి.

అయినా, లోపలకెళ్లి శోభాదేవి గారిని కలవాలి. కలిసి ఏదో ఒకటి మాట్లాడాలి’ స్థిరంగా అనుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘చెప్పండి సార్! ఈ ఏ టి ఎమ్ కార్డు మేడమ్ గారికి అందజేయాలనే వచ్చారా?’’ అడిగింది ఆ అమ్మాయి.

‘‘కాదు! ఈ కార్డు ఒక హత్యా ప్రదేశంలో దొరికింది. ఆ విషయమై మాట్లాడాలని వచ్చాను.’’ అబద్ధం చెప్పక తప్పదనుకుంటూనే అబద్ధం అతికినట్టు ఉండాలంటే గంభీరంగా ఉండాలని గొంతు బిగించి మరీ నెమ్మదిగా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘హత్యా!....’’ అదిరిపడింది ఆ అమ్మాయి.

‘‘అవును.’’ అన్నాడు తెలివిగా వివరాలు చెప్పకుండా.

‘‘ఎక్కడ?! ఎప్పుడు?! ఎవరు?!’’ టకటకా అడిగింది ఆ అమ్మాయి.

‘‘ఆ విషయాలు మేడమ్ గారితోనే మాట్లాడాలి.’’ స్థిరంగా అంటూ లేచి నిలబడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ కేసి క్షణం తీక్షణంగా చూస్తూనే టక్కున ఇంటర్ కమ్ రిసీవర్ తీసింది ఆ అమ్మాయి.

‘‘మేడమ్! చాలా ఇంపార్టెంట్ మేటర్. వెరీ సీరియస్. ఆయన మీతోనే చెప్తానంటున్నారు. లోపలకు పంపించమంటారా?’’ గాబరాగా అడిగింది ఆ అమ్మాయి.

ఆ అమ్మాయి ఆతృత....బాధ్యత....చూసి మనసులోనే ముసిముసిగా నవ్వుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఆ అమ్మాయి ఇంటర్ కమ్ రిసీవర్ క్రెడిల్ చేసి ఎస్సై అక్బర్ ఖాన్ కేసి తిరిగింది.

అప్పటికే ఎస్సై అక్బర్ ఖాన్ గదిలోనుండి వరండాలో కొచ్చి ఠీవిగా బోర విరుచుకుని నిలబడ్డాడు. ‘‘సార్! మీరు లోపలకు వెళ్ళొచ్చు.’’ ఆ అమ్మాయి అనే లోపే ముఖ ద్వారం బార్ లా తెరుచుకుంటూ లోపల నుండి ఒక వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు.
‘‘ఈయనే! తీసుకువెళ్ళు.’’ చెప్పింది ఆ అమ్మాయి.

‘‘రండి సార్!’’ అన్నాడా వ్యక్తి. అంటూనే ఎస్సై అక్బర్ ఖాన్ ని వెంటబెట్టుకుని లోపలకు తీసుకువెళ్ళాడు. హాల్లో అడుగుపెడుతూనే ఉక్కిరిబిక్కిరి అయిపోయి కళ్లు తిరిగి పడిపోబోయాడు ఎస్సై అక్బర్ ఖాన్. సంభ్రమాశ్చర్యాలతో స్థాణువులా నిలబడిపోయాడు.
క్రికెట్ గ్రౌండ్ లా గుండ్రంగా ఉంది హాు. ఎటుచూసినా సుందరమైన అలంకరణ...మేడ మీదకు వెళ్ళడానికి హాలు మధ్యలో మెట్లు...అటూ ఇటూ చుట్టూ గదులు.

మేడ మీద నుండి కాశ్మీర్ శాలువా కప్పుకుని ఒక పెద్దావిడ హుందాగా ఒక్కొక్క మెట్టు లెక్కపెడుతున్నట్టే అడుగులో అడుగులేసుకుంటూ నెమ్మదిగా మేడ దిగి వస్తోంది.

ఆవిడే ఎర్రబిల్లి శోభాదేవి గారయి ఉంటుంది’ మనసులోనే అక్షరాలు కూడబలుక్కున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్. శోభాదేవి మెట్లు దిగుతున్నప్పుడు చూసాడు. ఎదురుగా గోడకు తగిలించిన పెద్ద ఫొటో. భార్యాభర్త ఫొటో.ఆ ఫొటోకి పెద్ద పూలదండ వేసి ఉంది. ఆ ఫొటోలో...ఆ ఫొటోలో అతని ప్రక్కన ఉన్న ‘ఆమె’ని తేరిపార చూసాడు ఎస్సై అక్బర్ న్. అదే ఫొటో! అచ్చు గుద్దినట్టు ఉంది. దొంగ దగ్గర దొరికిన పర్సులో ఉన్న ‘అనుమానితురాలి’ ఫొటో. ఎప్పుడో చనిపోయిన ‘ఈమె’... పోలీసు రికార్డుల్లో అనుమానితురాలిగా ముద్రపడ్డ ‘ఆమె’...ఇద్దరూ ఇద్దరేనా?! ఒక్కరు కాదు కదా! ాదు కాకూడదు. ఆమెకి ఈమెకి ఎన్నో ఏళ్ల వయసు తేడా ఉంది. ఈమె ఎప్పుడో చనిపోయింది...ఎప్పుడో...ఎప్పుడో చనిపోయింది.

మనసులో అనుకుంటూనే అదిరిపడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్. కొంపదీసి ‘ఆత్మ’ కాదు కదా! ఆశ చావక అలా సంచరిస్తోందా?’’ దెయ్యాలు, ఆత్మలు, గుడు, గోపురాలు పరిసరాల్లో సంచరించవంటారు. మరి, ‘ఈమెలా ఉండే ఆమె’ రెండు మూడు రోజులు దేవాలయ ప్రాంగణం లోనే గడిపింది కదా. దెయ్యాలు భూతాలు చివరికి దేవుళ్ళను కూడా భయపెట్టాలని తిరుగుతున్నాయా? కాదు. ఆమె దెయ్యం కాదు. భూతం కాదు. మరి? ఎవరీమె?! ఆలోచిస్తూ బొమ్మలా నిలబడిపోయాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘మీరేనా నన్ను కలవాని వచ్చింది?’’ దిగుతూనే అడిగింది శోభాదేవి. ‘‘అవును మేడమ్.’’ చెప్పాడు అక్బర్ ఖాన్.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani