Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue292/763/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)...‘‘సార్‌! మీరొచ్చిన పని మర్చిపోయినట్టున్నారు.’’ చిన్నగా నవ్వుతూ అంది ఆ అమ్మాయి.

‘‘మీ ఆర్డర్‌ కోసం ఎదురు చూస్తున్నాను.’’ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కూడా నవ్వుతూనే సమాధానం చెప్పాడు.

‘‘మేడమ్‌ గారు పూజ గదిలో ఉన్నట్టున్నారు...రింగ్‌ చేసాను సార్‌! నో రెస్పాన్స్‌’’ అంది ఆ అమ్మాయి.

‘‘ఫర్లేదు లెండి! నేను విశాఖ పట్నం నుండి మేడమ్‌ గార్ని కలవాలనే ప్రత్యేకంగా వచ్చాను.’’ తన గురించి ఆ అమ్మాయికి చెప్పాలనే అలా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘వైజాగ్‌ నుండి వచ్చారా?!’’ ఆనందంగా అంది ఆ అమ్మాయి.

‘‘అవును...విశాఖ పట్నాన్ని వైజాగ్‌ అన్నారంటే...మీకా ‘నగరం’తో బాగా పరిచయం ఉన్నట్టుందే.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘పరిచయమా! నేను పుట్టింది అక్కడే! మా అమ్మమ్మ గారి ఊరు. పెరిగింది హైదరాబాద్‌’’ ఆనందంగా అంది ఆ అమ్మాయి.

‘‘ఓహ్! అయితే తరచూ వైజాగ్‌ వస్తుంటారన్నమాట.’’ అన్నాడు ఎస్సై.

‘‘లేదండీ! ఇప్పుడక్కడ ఎవరూ లేరు.’’ ఒక్కసారే బాధగా అంది ఆ అమ్మాయి.

‘‘అయ్యో! మరి మీ అమ్మమ్మ వాళ్ళు...?’’ సంశయంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘హైదరాబాద్‌ వచ్చేసారు అమ్మ దగ్గరికి. తాతయ్య పోయాక అక్కడున్న ఇల్లు అమ్మేసి శాశ్వతంగా వైజాగ్‌ వదిలి వచ్చేసారు.’’ అంది ఆ అమ్మాయి.

‘‘బేడ్‌లక్‌....’’ అప్రయత్నంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌. నోట ఆ మాట వింటూనే ఉలిక్కి పడింది ఆ అమ్మాయి. టక్కున తల తిప్పి ఎస్సై అక్బర్‌ ఖాన్‌. కళ్ళల్లోకి చురుగ్గా చూసింది.

‘‘ఎవరికండి బేడ్‌లక్‌?!’’ సూటిగా కొరకొరా చూస్తూ అడిగింది ఆ అమ్మాయి.

‘‘మీకే...ఇప్పుడు వైజాగ్‌ ఎంత అందంగా తయారయిందో తెలుసా? ఆ అందాల్ని చూసే అదృష్టం కోల్పోయారుగా మీరు.’’ తెలివిగా మాట మారుస్తూ అన్నాడుఅక్బర్‌ ఖాన్‌.

‘‘మీరు బాగానే చమత్కారంగా మాట్లాడతారండి.’’ అంది ఆ అమ్మాయి ఓరగా చూస్తూ.

‘‘అయ్యో! నాకు నత్తి గట్రా లేదే! పుట్టింది పెరిగింది అంతా విశాఖ పట్నంలోనే కదా! యాస భాష బాగానే  ఉంది కదా.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అర్థమౌతోంది కదా సార్‌! మీరు చెన్నై రావడం ఇదే మొదటి సారా?!’’ నేరుగా వచ్చి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఎదురుగా ఉన్న తన రివాల్వింగ్‌ చైర్లో కూర్చుంటూ అంది ఆ అమ్మాయి.

‘‘అవును మేడమ్‌! అంతా కొత్త....కొత్తగా వుంది. మా డిపార్ట్‌మెంట్‌ ఫ్రెండ్‌ ఎయిర్‌ పోర్ట్‌కి వచ్చి రిసీవ్‌ చేసుకుని నేరుగా ఇక్కడకు తీసుకు వచ్చాడు. లేకపోతే  ఎన్ని తిప్పలు పడేవాడ్నో కదా!’’ అన్నాడు ఎస్సై.

‘‘అయ్యో! ఎక్కడా స్టే చెయ్య లేదా?’’ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కేసి ఎగాదిగా చూస్తూ చిన్నగా నవ్వుతూ అంది ఆ అమ్మాయి. ఉదయాన్నెప్పుడో అయిదు గంటలకి లేచి ఆదరా బాదరా తయారయి ఎయిర్‌ పోర్ట్‌ కి చేరుకున్నాడు. విమానం బయలుదేరే సమయానికి గంట ముందుండాలంటే రెండు గంటల ముందే వెళ్లి కూర్చున్నాడు.

అందుకే మనిషి ఫ్రెష్‌గా లేడు. ఆ అమ్మాయి అలా ఎగాదిగా చూసే సరికి సిగ్గుతో కుంచించుకుపోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘లేదండీ! నేరుగా ఎయిర్‌ పోర్ట్‌ నుండి ఇక్కడికే వచ్చాను. ఎంక్వయిరీ పూర్తయితే వెంటనే వెళ్లి పోదామనుకున్నాను.’’ అన్నాడు ఎస్సై.

‘‘మీరు సర్వీసులో జాయిన్‌ అయి ఎంతకాలమైంది సార్‌?’’ చిన్నగా నవ్వుతూ అడిగింది ఆ అమ్మాయి.

ఆ అమ్మాయి అలా అడిగేసరికి ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఉన్నట్టుండి ఆ అమ్మాయి ఎందుకలా అడిగిందో అర్థం కాలేదు. తన సర్వీసుతో ఆ అమ్మాయి కేం పని? కొంపదీసి అమాయకంగా కనిపిస్తున్నాడా? ఇప్పుడు తానేం తప్పుగా మాట్లాడ లేదే?! ఎయిర్‌ పోర్ట్‌ నుండి నేరుగా రావడం నేరమా?! ఎక్కడో....ఏదో పొరపాటు జరిగింది. అందుకే ఎగతాళిగా తన సర్వీసు ఎంతని అడుగుతోంది.

పాతికేళ్ళుంటాయేమో ఆ అమ్మాయికి. కానీ చాలా తెలివిగా మెచ్యూర్ డ్‌ గా మాట్లాడుతోంది. తన కంటే అయిదేళ్ళు చిన్నే ఉంటుంది. కానీ, ఆ అమ్మాయి కళ్లకి తన కంటే చిన్న కుర్రాడిలా...ఆకతాయిగా కన్పించానా?! పరి పరి విధాలా ఆలోచిస్తూ ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తూ మౌనంగా కూర్చుండి పోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎందుకలా అడిగారు?’’ సూటిగా ఆ అమ్మాయి కళ్ళ ల్లోకి చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడే కాలేజీ గేటు దాటి వచ్చినట్టున్నారని.’’ ముసి ముసి గా నవ్వుతూ అంది ఆ అమ్మాయి.

ఇంతలో లోపలి నుండి ఇంటర్‌ కమ్‌ ఫోన్‌ రింగయే సరికి ఒక్క సారే అలర్ట్‌ అయి రిసీవర్‌ తీసి చెవి దగ్గర పెట్టుకుంది.

‘‘ఎస్‌! మేడమ్‌! ఎస్‌! అలాగే మేడమ్‌!’’ అంటూ రిసీవర్‌ క్రింద పెడుతూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌. కేసి చూసింది ఆ అమ్మాయి. ఎస్సై అక్బర్‌ ఖాన్‌. కూడా ఆ అమ్మాయి కేసి ప్రశ్నార్థకంగా చూసాడు.

‘‘మీ గురించే సార్‌! ఎందు కోసం వచ్చారో అడగమంటున్నారు మేడమ్‌.’’ చెప్పింది ఆ అమ్మాయి.

‘‘లేదు...లేదు నేను మేడమ్‌ గారిని కలిసి చెప్పాలి.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘మీరు చెప్పే విషయాన్ని బట్టే అవసరం అనుకుంటే మేడమ్‌ గారే లోపలకు ఆహ్వానిస్తారు సార్‌!’’ నవ్వుతూ చెప్పింది ఆ అమ్మాయి.
‘ఇక చెప్పక తప్పదు.’ మనసు లోనే అనుకుంటూ బ్రీప్‌ కేస్‌ తెరిచి లోప ఫైల్లో ఉన్న పేపరు బయటకు తీసాడు.

‘‘అదేంటి?!’’ ఆశ్చర్యంగా అడిగిందా అమ్మాయి.

‘‘మేడమ్‌ గారి బ్యాంకు వివరాల కాపీ!’’ అన్నాడు ఎస్సై.

‘‘ఇది మీకెలా వచ్చింది?’’ మరింత ఆశ్చర్యంగా అడిగిందా అమ్మాయి.

(కాలేజ్ అబ్బాయిలా కనిపిస్తున్నారని అడిగిన ఆ అమ్మాయి మాటలు నిజమేనా? ఇంకేదైనా పథకమా?? బ్యాంకు వివరాల కాపీ చూసిన తర్వాత అక్బర్ ఖాన్ కి లోపలికి అనుమతి లభించిందా?? ఇవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా వేచి చూడాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్