Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue302/784/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)........ "ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు బాబూ! బంగారు పంజరంలో ఉన్నాను. నా మేనకోడలు ' మహాశ్వేత ' పోయిందని విన్నప్పుడే ఇల్లు వదిలి దూరంగా నా కొడుకుల దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నాను. అంతలోనే మా ' మహాశ్వేత ' ఫోన్ చేసి అత్తా నేను బ్రతికే ఉన్నానని చెప్పింది. సంబరపడిపోయాను. అప్పుడే నిర్ణయించుకున్నాను. మా మహాశ్వేత తిరిగి ఇంటికొచ్చేవరకూ అక్కడే ఉండాలనుకొన్నాను, ఉంటున్నాను" బాధగా అంది శోభాదేవి.

" మీకు ఏం చెప్పాలనుంటే అదే చెప్పండి" అనునయంగా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

గుండెల్లోనుండి తన్నుకొస్తున్న దు:ఖాన్ని అదిమిపట్టి చెప్పడం మొదలుపెట్టింది శోభాదేవి.

మాది విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు. నాన్న ఉద్యోగం వెతుక్కుంటూ మద్రాసు చేరారు. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ సివిల్ కాంట్రాక్టరుగా అవతారం ఎత్తి చివరికి పెద్దపెద్ద అపార్ట్ మెంట్లు కట్టే స్థాయికి ఎదిగారు. మా నాన్నగారు ప్రారంభించినవే యలమంచిలి గ్రూప్ ఆఫ్ కమెనీస్ అన్ని. నాన్న వ్యాపారంలో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. అమ్మే నన్ను తమ్ముడిని కళ్ళల్లో పెట్టి చూసుకునేది. నలుగురం హాయిగా ఆనందంగా ఉండేవాళ్ళం.

నాకు పెళ్ళయింది. తమ్ముడు విజయవాడలో హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నాడు. తమ్ముడి చదువు పూర్తయితే తనకు తోడుగా ఉంటాడని మానాన్న ఎంతో ఆశపడ్డాడు.

ఓరోజు హఠాత్తుగా మానాన్న నన్ను ఇంటికి రమ్మని మద్రాసు పిలిపించాడు. నేను, మావారు పరిగెట్టుకు వెళ్ళాం. ఏం జరిగిందోనని భయపడిపోయాను.

తమ్ముడు ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుని మరీ ఇంటికి తీసుకువచ్చాడు. నాన్న అది సహించలేకపోయాడు. మానాన్న పట్టుదల గల మనిషి. దానికితోడు తాను ఏమనుకుంటే అదే జరగాలనే ఛండశాసనుడు.

తమ్ముడ్ని ఇంట్లోనుండి పొమ్మన్నాడు. నేనూ, అమ్మ ఎంత బ్రతిమాలినా మానాన్న మామాట వినలేదు.

అదిగో! అప్పట్నుండే నన్ను, మావారిని అక్కడే ఇల్లరికం ఉండిపొమ్మని నాన్న కోరాడు. కోరలేదు. ఆదేశించాడు. అప్పుడే ఆస్తంతా నాపేర రాసేస్తానని కోపంతో ఊగిపోయాడు మానాన్న.

అమ్మ, నేను తొందరపడవద్దని వారించాము. తమ్ముడ్ని మర్చిపోయి వ్యాపారాల్లో బిజీఅయిపోయాడు మా నాన్న. తమ్ముడు ఇంట్లోనుండి వెళ్ళిపోయి ఏడాది దాటిపోయింది. తమ్ముడికి కూతురు పుట్టిందని తెలిసింది. చూడ్డానికి వెళ్దామంటే నాన్న ససేమిరా అంగీకరించలేదు. నేను, అమ్మ వెళ్ళి చూసాము.

ఉద్యోగం చేసుకుంటూ ఉన్నంతలో మా తమ్ముడు, మరదలు హాయిగానే ఉన్నారు. పాపకి ' మహాశ్వేతాదేవి ' అని పేరు పెట్టరు. మా తమ్ముడి జ్ఞాపకాలను ...దగ్గరకు రానివ్వకుండా రకరకాల వ్యాపారాల్లో తలమునకలై కోట్లు గడించాడు మానాన్న. దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ ప్రారంభించాడు. మూడుపువ్వులు ఆరు కాయలుగా యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు.; మావారికి యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్ధిక లావాదేవీలన్నీ చూసుకోమని బృహత్తర బాధ్యత అప్పగించాడు మానాన్న.

అయిదేళ్ళు గడచిపోయాయి. ఒకరోజు హఠాత్తుగా భయంకరమైన వార్త మాకు చేరింది. తమ్ముడిభార్య పచ్చకామెర్లతో మంచానపడి చనిపోయిందని. అమ్మ, నేను, మావారు అందరం పరిగెట్టుకు వెళ్ళాము. ఆ వార్త తెలిసి నాన్న కూడా ఆందోళనగా వచ్చారు. తండ్రి-కొడుకులు ఒకర్నొకరు పట్టుకుని ఏడ్చారు. అది చూసి అమ్మ, నేను పోనీలే ఇప్పటికైనా తండ్రీకొడులు కలిసారనుకున్నాము.
పదోరోజు నాన్నే తమ్ముడిని వాడి కూతురు అయిదేళ్ళ మహా శ్వేతని తీసుకుని ఇంటికి వచ్చాడు.

అమ్మ,నేనూ మావారు ఎంతో సంబరపడిపోయాము.

ఆ తర్వాత మా ఇంట్లో రోజూ సంబరమే. నా ఇద్దరు కొడుకులు, మహాశ్వేత ముగ్గురూ కలిసి ఆడుకొంటూ ఆనందంతో గెంతుకుంటూ తిరుగుతుంటే నాన్న, అమ్మ ఎంతో సంబరపడేవారు.

' అన్నా...అన్న...' అంటూ నా ఇద్దరు కొడుకుల్ని వదిలేదికాదు మహాశ్వేత.

నాన్నతోబాటు మాతమ్ముడు వ్యాపారాల్లో తలమునకలై తిరిగేవాడు. రాత్రిపగలూ వ్యాపారమే వాడిలోకం మరోధ్యాస ఉండేదికాదు.నాన్నం అమ్మ వాడ్నిచూసి బాధపడేవారు. భార్యనిపోగొట్టుకున్న తమ్ముడికి మళ్ళీపెళ్ళి చెయ్యాలని నాన్న ఎన్నోప్రయత్నాలు చేసాడు.
తమ్ముడు ససేమిరా కాదని మొండికేసాడు. వాడూ నాన్నలాంటివాడే. మొండిపట్టుదల. వాడిమాటే నెగ్గాలనుకునే చండశాసనుడు. తండ్రికితగ్గ కొడుకు. పెళ్ళిపెళ్ళని అట్టే విసిగిస్తే కూతుర్ని తీసుకుని ఇంట్లోనుండి వెళ్ళిపోతానని బెదిరించాడు. అమ్మానాన్న ఇక ఆ ఊసే ఎత్తడం మానేసారు.

మహాశ్వేతాదేవి యుక్తవయసుకు వచ్చింది. కూతురు యుక్తవయసుకు వచ్చేసరికి అచ్చం తనభార్యలానే ఉందని మురిసిపోయేవాడు మా తమ్ముడు. తల్లీకూతుళ్ళు అచ్చుగుద్దినట్టు ఒక్కలాగే ఉన్నారనుకునేవారందరూ.

మహాశ్వేతాదేవిని చదువుకోసం విదేశాలకి పంపించాడు తమ్ముడు. అమ్మానాన్న వద్దురా ఆడపిల్లని విదేశాలకి పంపి చదివించడమెందుకురా అంటే వినలేదు. అది తనభార్య కోరిక అని చెప్పాడు.

ఆ తర్వాత ఏడాదిలోనే అమ్మానాన్నా ఒకరి తర్వాత ఒకరు ఆరునెలల వ్యవధిలోనే చనిపోయారు. ఆ తర్వాత యలమంచిలి గ్రూప్ కంపెనీల వ్యవహారాలన్నీ తమ్ముడే బాధ్యతగా చూసుకొనేవాడు.

ఆరునెలలకొకసారి మమ్మల్నిచూడడానికి ఇండియా వచ్చివెళ్ళిపోయేది మహాశ్వేత.

రెండేళ్ళు గడచిపోయాయి. చదువు పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసిందివచ్చేసింది మహాశ్వేత. అది ఇలా ఇంటికి వచ్చిందో లేదో ...పెళ్ళి ఏర్పాట్లు ప్రారంభించాడు తమ్ముడు. నేనూ-మావారూ అంత తొందరెందుకురా అన్నా వినలేదు. తనకెంతో ఇష్టమైన బుద్ధిమంతుడైన కుర్రాడ్ని చూసానని తన తదనంతరం వ్యాపారాలని అంత దక్షతగ చూసుకోగలడని మాతో వాదించి మరీ ముహూర్తాలు పెట్టించాడు.

ఓరోజు రాత్రి మహాశ్వేత తండ్రితో నాకీ పెళ్ళి ఇష్టం లేదని వాదించి వాదించి ఎంతకీ తండ్రి తనమాట వినటం లేదని నిద్రమాత్రలు మింగేసింది.
అదృష్టవశాత్తూ వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం వలన బ్రతికి బయటపడింది.

ఆ వారంలోనే మహాశ్వేతని తీసుకుని మా తమ్ముడు అరకు వ్యాలీకి వెళ్ళాడు. ఎందుకంత అర్జెంటుగా అరకువ్యాలీ వెళ్ళాడో నాకు అర్థం కాలేదు. ప్రతీఏడాది ఎండల్లో అరకువ్యాలీ వెళ్ళడం తమ్ముడికి అలవాటే.

మా తమ్ముడు పెళ్ళయిన దగ్గర్నుండి భార్యాభర్తలిద్దరూ ప్రతి ఏడాది అరకువ్యాలీ వెళ్ళేవారట. తనభార్య పోయాక కూడా ప్రతి సంవత్సరం కూతుర్ని తీసుకుని వెళ్ళి నెలరోజులు అక్కడే ఉండివచ్చేవాడు.ఆ అలవాటు ఇన్నాళ్ళయినా..ఇన్నేళ్ళయినా వదలలేదు. ఆ నెలరోజులు ఫోన్ మీదే వ్యాపారలావాదేవీలన్నీ నడిపేవాడు. తమ్ముడు ఉన్నా-లేకపోయినా అంతా మేనేజర్లే పనులన్నీ చేసుకుపోయేవారు.

నాన్న పదింతలు ఆస్తి కూడబెడితే మా తమ్ముడు దాన్ని అంతకు పదింతలు పెంచాడు. తమ్ముడే ఓరోజు మావారిని, నన్ను పిలిచి ఆస్తిలో పావలావాటా నీపేర రాస్తానక్కా అన్నాడు. నాన్న రాస్తానన్నప్పుడు వద్దన్నాను. ఇప్పుడు అదే అన్నాను. " వద్దులేరా! జీతాలిస్తున్నావు. ఏం కావాలంటే అది అడక్కుండానే ఇస్తున్నావుగా అంటే ...అక్కా ఇది నా ఆనందమక్కా" అన్నాడు తమ్ముడు.

అయ్యో! ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నాను కదూ!" ఏం చెప్పాను...ఆ...! మా మహాశ్వేతని తీసుకుని అరకు వెళ్ళాడన్నాగా నెలరోజుల్లో వస్తార్లే అనుకున్నాను. నెల రెండునెలలు...మూడునెలలు..ఆరునెలలు దాటాక ఏడోనెలలో మహాశ్వేతని వెంటబెట్టుకుని వచ్చాడు. ఏమైందిరా అని అడిగినా వాడికి కోపం. మా తమ్ముడి మాటకి ఎవరూ ఎదురుచెప్పేవారు కాదు.

మధ్యమధ్యలో ఎప్పుడో వాడికి నచ్చినప్పుడు మద్రాసు వచ్చివెళ్ళేవాడట. ఇంటికి వచ్చేవాడు కాడు. ఆ విషయం ఎప్పుడో అదీ నేనడిగితే మావారు చెప్పేవారు.

సన్నగా నాజూగ్గా తయారైన మహాశ్వేతని వెంటబెట్టుకు వచ్చాడు తమ్ముడు. ఇన్నాళ్ళూ ఏమైపోయావే తల్లీ అనిమహాశ్వేతని ఎన్నిసార్లు అడిగినా ఏడుపే సమాధానంగా చెప్పేది....ఏం జరిగిందో..ఏడునెలలు అరకులోయలో ఏం చేసారో?! ఎందుకున్నారో? మాకెవరికీ అర్థం కాలేదు. ఈ విషయం ఇంట్లో మాకుతప్ప బయట ప్రపంచానికి ఎవరికీ తెలీదు....తెలియనివ్వలేదు....

(అరకు లోయలు అసలేం జరిగింది? శోభాదేవి చెప్పబోయే మరిన్ని నిజాలకోసం వచ్చేశుక్రవారం ఒంటిగంటదాకా ఎదురుచూడల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్