Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.. http://www.gotelugu.com/issue304/788/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)..... "పక్క ఊరిలో అమ్మవారి దేవాలయం ఉంది. మా బాబాయ్ సోమయాజులుగారే దాని నిర్వహన కర్త, పూజారి. నువ్వక్కడికి వెళ్లిపో తల్లి. ఆయనకి నేను ఫోన్ లో అన్ని విషయాలూ చెబుతాను. పరిస్థితులు కాస్త కుదుట పడ్డాక నువ్వు మళ్లీ వద్దువు గాని. నీ అదృష్టం బావుందమ్మా! ఇంకాస్సేపట్లో నెలకు సరిపడా గుళ్లకి పూజా ద్రవ్యాలు సప్లై చేసే వ్యాన్ వస్తుంది. అది ఇక్కడ కొన్ని ద్రవ్యాలు దింపి సరాసరి అక్కడికి వెళుతుంది. అందులో క్షేమంగా వెళ్దువు"అన్నాడు.

ఆయన కాళ్ల మీద పడిపోయింది.

"పిచ్చితల్లీ లేమ్మా! సీతమ్మ తల్లి లాంటి దానివి. నీకు సహాయం చేస్తే నాకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి"అన్నాడు.

"వ్యాన్ రాగానే ఆమెని వెనక సామాన్ల దాన్లో ఎక్కించి, నీ విషయం ఎవ్వరికీ చెప్పను. అలాగే అక్కడ నీకెంత కాలం ప్రశాంతంగా ఉండాల్సి వస్తే అంతకాలం ఉండు. అది నీ తండ్రి ఇల్లే అనుకో. స్వేచ్ఛగా ఉండు." వ్యాన్ బయలుదేరింది.

వ్యాన్ అమ్మవారి గుడికి చేరగానే, దాని కోసమే ఎదురు చూస్తున్న సోమయాజులు గారు వ్యాన్ దగ్గరకు వచ్చి తలుపు తీసి "రామ్మా.."అన్నారు. ఆయన భార్య వరాలమ్మ కాత్యాయనికి వ్యాన్ దిగడానికి చేయందించి దింపి, "అచ్చం ఆయన గుళ్లో కొలిచే కాత్యాయని అమ్మవారి లాగానే ఉన్నావు. నువ్వు మా ఇంట్లో ఉండడం మా పూర్వ జన్మ సుకృతం తల్లి"అంది కాత్యాయనిని జాగ్రత్తగా తమ ఇంట్లోకి తీసికెళుతూ.

ఆమె నిర్లిప్తంగా ఆవిడ వంక చూసింది.

*****

మరుసటిరోజు తండ్రికి ఫోన్ చేసి జరిగిందంతా క్లుప్తంగా చెప్పి, ‘కొన్నాళ్లపాటు అజ్ఞాతంలో ఉంటానని, తన గురించి బాధ పడొద్దని, తల్లిదండ్రులకు భారం కాకూడదనే పుట్టింటి గుమ్మం తొక్కలేదని, తను ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకోననని, మంచి రోజులొచ్చి అజ్ఞాతంలోంచి తప్పకుండా బయటపడే రోజు వస్తుందని అంతవరకూ సంయమనం పాటించాలని"చెప్పింది.

ఆయన భారంగా నిట్టూర్చాడు. జరిగినదాంట్లో తప్పొప్పులు ఎంచడం చాలా కష్టం. అది ఆయా వ్యక్తిత్వాలపై ఆధారపడి ఉంటుంది. కూతురు తెలివైంది. తన జీవితం తనే చక్కదిద్దుకుంటుందన్న నమ్మకం ఆయనకు ఉంది.

******

మరుసటిరోజు ఉదయమే లేచి, స్నానం చేసింది. అప్పటికే సోమయాజులుగారు ఆయన ధర్మ పత్ని స్నానాలు చేశారు. ఆయన మడిబట్టలతో పూజాధికాలు నిర్వహించడానికి గుడికి వెళ్లిపోయారు. వరాలమ్మ వంటింట్లో అమ్మవారికి నైవేద్యం సిద్ధం చేస్తోంది.

సోమయాజులుగారు గుడి యాజమాన్యం, గుడికి ఓ పక్కగా కట్టిచ్చిన ఇంట్లోనే ఉంటారు. చుట్టూ పూల, పళ్ల మొక్కలు మధ్యలో పర్ణశాలల ఉంటుంది ఆ ఇల్లు. ఆమె కాసేపు మొక్కల మధ్య కూర్చుని జరిగిన జీవితాన్ని పునశ్చరణ చేసుకుంది.  

మధ్యలో వరాలమ్మ కాఫీతెచ్చి ఆమెకోసం ఓ పక్కగా పెట్టి నవ్వి వెళ్లిపోయింది. పదకొండు గంటలు. సోమయాజులు గారు అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతిచ్చి గుడి తలుపులు మూసి ఇంటికొచ్చారు. కాళ్లు కడుక్కుని ఇంట్లోకొచ్చి తూగుటుయ్యాలలో కూర్చున్నారు. ఆయన్ని చూడగానే కాత్యాయని వచ్చి గోడకు ఓ పక్కగా నుంచుంది.

"చూడమ్మా కాత్యాయనీ, అక్కడ గర్భగుడిలో ఉన్న తల్లే నీ రూపంలో నాకు స్ఫురిస్తోంది. సమస్యలు కల్పించేదీ ఆ తల్లే, దూది పింజల్లా తొలగింపజేసేదీ ఆ తల్లే! నువ్వు ఇక్కడకు వస్తున్నట్టు అయ్యవారు చెప్పారు గాని, కారణమైన విషయమేమిటో నాకు చెప్పలేదు. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు. లేదంటే చెప్పొద్దు. ఇది నీ ఇల్లు స్వేచ్ఛగా ఉండు. నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టరు. మాకు పిల్లలు లేరు. అంచేత నువ్వు ఆ దేవత మాకిచ్చిన ఎదిగిన కూతురివి"అన్నాడు మంద్రంగా నవ్వుతూ.

కాత్యాయని అంతా వివరంగా చెప్పి.."నేను అజ్ఞాతంలో ఉండదలచాను.. సమయం గడవడానికి నాకేదన్నా పనిస్తే చేసుకుంటాను" అంది.
తల్లీ నువ్వు తప్పుగా అనుకోకపోతే మన గుడిలో కసువు ఊడ్వడం, కళ్లాపీ జల్లడం, ముగ్గేయడం, అమ్మవారి వస్తువులు శుభ్రపరచడం చేయగలవాతల్లీ, ఎంతో కాలం నుంచి ఎంతో మంది వచ్చారు, పోయారు. సరిగా కుదురుకోలేదు. ఆ తల్లికి సేవ చేసి పుణ్యం కట్టుకోమ్మా!"అన్నాడు చేతులు జోడించి.

"అయ్యో పెద్దవారు అలా చేతులు జోడించకండి. మంచి దారి చూపించారు. అమ్మకు సేవ చేయడం నా అదృష్టం. నాకేం ఇబ్బంది లేదు" అంది.

‘అలాగే తల్లి! అప్పుడప్పుడూ, అవసరమొచ్చినప్పుడు వరాలమ్మా నీకు సహాయ పడుతుందిలే..నీకు ఎప్పుడు ఇష్టం లేకపోయినా, లేక చేయలేకపోయినా నాకు నిరభ్యంతరంగా చెప్పు. మొహమాటపడకు. నువ్వు అజ్ఞాతంగానూ ఉంటావు ఎందుకంటే జనం వచ్చేలోపే నీ పనులన్నీ నువ్వు చేసేసుకోవచ్చు’ అన్నాడు.

కాత్యాయని మనసులోనూ, శారీరకంగానూ శాంకరికి దణ్నం పెట్టుకుంది.

కాత్యాయని తన బాధను దిగమింగుకొని అమ్మవారి సేవ చేయాలని నిశ్చయించుకుంది. దానికి ప్రతిఫలంగా ఆ అమ్మవారి కృపాకటాక్షాలు కాత్యాయని జీవితాన్ని ఎటు మలుపుతిప్పుతాయో వచ్చేశుక్రవారం ఒంటిగంటవరకు ఆగాల్సిందే...   

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana